| జీతం లేని పని గీత చెబుతుందా? | |
భగవద్గీత మీద ఎంత ప్రేమ, భక్తి ఉన్నవాళ్లకైనా ‘నీవు కర్మ మాత్రమే చేయి, కర్మ ఫలాన్ని ఆశించకు’ అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట గొంతులో వెలక్కాయ పడినట్లు అనిపిస్తుంది. మేము ఏ మైక్రోసాఫ్ట్‌లోనో, డెల్లాయిట్‌లోనో పొద్దుటినుంచి రాత్రివరకూ పనిచేసి జీతం తీసుకోవద్దా అని మిత్రులు అడుగుతూ ఉంటారు. ప్రపంచం పోటీతత్త్వంతో ముందుకు వెళుతుంటే మనం ఎలాంటి యాంబిషన్ లేకుండా, ఎలాంటి ప్రమోషన్ కోరకుండా, జీతం తీసుకోకుండా పనిచేయాలా? ఇది చాలా వింతబోధ అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కృష్ణుడు చెప్పిన మాటలకు మన సంప్రదాయం ప్రకారం ఎలాంటి అర్థం ఉందో చూడాలి.
కర్మ అంటే పని అని అర్థం. ఈ పనులు ఎన్ని విధాలో గమనిద్దాం. తినడం, తాగడం, నడవడం మొదలైనవి ఒకరకం పనులు. ఇవి అందరికీ సమానమే. వీటివల్ల శరీర నిర్వహణ తప్ప ప్రత్యేకమైన ఫలం ఏమీ లేదు. వీటిని ఎవరూ వదలలేరు. జీవనాధారం కోసం ఏదో ఒక పనిచేస్తూ డబ్బు సంపాదించి సంసారాన్ని నడపడం రెండోరకం పని. ఇది తప్పక చేసి తీరాల్సిందే. లేకుండా లోక వ్యవహారం నడవదు. కృష్ణుడే కాదు మరెవరూ దీన్ని కాదనలేరు. మన స్మృతులు కూడా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని నిర్దేశించాయి. కాబట్టి కృష్ణుడు చెప్పిన కర్మ అంటే ఇది కూడా కాదు. మరోరకం పనులు కూడా ఉన్నాయి. మనం తిరుపతికి వెళ్లి కోరికలు కోరుకుంటాం. లేదా పండితుల్ని పిలిచి యాగాలు, వ్రతాలు మొదలనైనవి చేస్తాం. లేదా దానధర్మాలు చేస్తాం. వీటివల్ల మనకు కంటికి కనపించని పుణ్యమనేది లభిస్తుందని మన విశ్వాసం. మనమే కాదు అన్ని మతాలూ ఇలాగే చెబుతాయి. మంచిపనులు చేస్తే పుణ్యం, దానివల్ల స్వర్గం లాంటి లోకాలు వస్తాయని, చెడ్డపనులు చేస్తే పాపం, దాని వల్ల నరకం లాంటి లోకాలు వస్తాయన్నది అన్ని మతాలూ చెప్పే విషయమే. పుణ్యం కోసం లేదా మరొక లాభం కోసం మనం చేసే పనులు మూడో రకానికి చెందినవి. కృష్ణుడు ఈ రకమైన కర్మ గురించే చె ప్పాడు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కదా, వీటిని ఎలా వదిలేస్తామన్నది ప్రశ్న. మన సంప్రధాయం ప్రకారం ఎన్ని మంచి పనులు చేస్తే అంత పుణ్యం. ఇదొక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. దీన్ని బట్టే స్వర్గంలో ఎంతకాలం ఉండవచ్చు అనేది నిర్ధారణ అవుతుంది. ఆ కాలం ముగిసిన తర్వాత భూమ్మీదికి రావల్సిందే. మళ్లీ కర్మలు చేసి, మంచి లోకాలకో, చెడులోకాలకో వెళ్లాల్సిందే. ఇదంతా ఒక అంతులేని చక్రంలో తిరగడం లాంటిది. మతపరమైన విశ్వాసం. వేదాంతం అన్ని విషయాల్నీ తర్కబద్దంగా ఆలోచిస్తుందని ఇదివరలో తెలియచేశాను. మరి కర్మగురించిన ఈ విశ్వాసం ఎలా వచ్చింది అంటే, సమాజమంతా ఒక మతసిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పుడు వేదాంతి కూడా ఆ స్థాయి నుంచే ప్రారంభించాలి. ప్రజల్ని మంచి మార్గంలో ఉంచడానికి, చెడు నుంచి దూరంగా ఉంచడానికి ఈ విశ్వాసాలు అవసరం. అందుకే తత్త్వానికి విరుద్ధంలేని మతవిశ్వాసాల్ని కొంతవరకు అంగీకరరిస్తూ తత్త్వవిచారం బోధించాలి. ఈ కర్మల విషయంలో కూడా ఇలాంటిదే మనం చూడగలం. వేదాంత సిద్ధాంతం ప్రకారం జీవుడు, అంటే ప్రతివ్యక్తీ మౌలికంగా బ్రహ్మ స్వరూపుడే. అయినా తనను తాను ఫలానా జాతికీ, కులానికీ, మతానికీ చెందిన వ్యక్తి అని అనుకుంటూ అనేక సామాజిక కట్టుబాట్లలో ఉంటాడు. వీటన్నిటికీ అతీతంగా ఎదిగి నేను కేవలం జ్ఞానస్వరూపుడిని అని గ్రహించడం మోక్షమని వేదం చెబుతుంది. ఈ స్థితిలో స్వర్గం, నరకం అనేవి అర్థంలేనివిగా మారుతాయి. ఉపనిషత్తులు ప్రతివ్యక్తికీ నేరుగా దీన్ని బోధిస్తే ఎవరూ అంగీకరించలేరు. అందువల్ల మతం స్థాయిలో స్వర్గం, నరకం అనే వాటిని అంగీకరిస్తూ వేదాంతస్థాయిలో వీటన్నింటినీ దాటి నీ స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతాయి. అంటే రిలిజియన్ అనేది ఒక స్థాయి. వేదాంతం అనేది రెండోస్థాయి. వ్యక్తి యొక్క ప్రవర్తనను, పవిత్రమైన మనస్సు, ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి ఉపనిషత్తులు ఈ రెండు స్థాయిల్లో చెబుతాయి. ఈ నేపథ్యంలో కర్మఫలాన్ని గూర్చిన మన ప్రశ్నను గమనిద్దాం. జీవితం – కర్మ – దాని ఫలంగా స్వర్గం పొందడం – మళ్లీ జీవితం అనే చక్రం నుంచి బయటపడటం ఎలా? మనం ఒక పని చేసి దాని ఫలితాన్ని ఆశిస్తున్నంత కాలం ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఈ చక్రం నుండి బయటపడటమే ఆత్మజ్ఞానం పొందడానికి మొదటిమెట్టు. ఈ చక్రం నుండి బయటపడాలంటే ఫలితాన్ని ఆశించకూడదు. కానీ, ఈ పరిష్కారం అందరికీ నచ్చదు. అందుకే అతి కొద్ది మంది మాత్రమే జ్ఞానానికి ప్రయత్నిస్తూ ఉంటారని, ఆ కొద్ది మందిని ఉద్దేశించి చెప్పిన విషయమే నిష్కామకర్మ – అన గా కర్మచేస్తూ దాని ఫలితాన్ని కోరకపోవడం. ఫలితాన్ని కోరేవాడు సంతోషంగా కర్మఫలాన్ని ఆశిస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉండవచ్చని కూడా గీత చెబుతుంది. మరి ఈ కర్మల్ని వదిలేయవచ్చు కదా అనే ఆలోచన రావచ్చు. కానీ, అలా చేయకూడదని ఉపనిషత్తులు చెబుతాయి. యజ్ఞం చేయడమంటే ఒక సమాజసేవ లాంటిది. అనేక వస్తువులను సమకూర్చుకోవాలి. చాలామందికి దానధర్మాలివ్వాలి. అన్నదానాలు చేయాలి. ఇదంతా సమాజానికి తోడ్పడేదే. ఇలాంటి పనులు మానేస్తే లోకంలో మంచిపనులనేవే లేని పరిస్థితి వస్తుంది. అందుకే కృష్ణుడు ‘నాకు ఎలాంటి అవసరం లేకున్నా అన్ని కర్మల్ని చేస్తున్నాను. నేను వదిలేస్తే అది ప్రజలకు సరియైున మార్గదర్శకం కాదు’ అని అంటాడు. అంటే ప్రతి వ్యక్తీ కర్మఫలాన్ని కోరేవాడైనా, కాకపోయినా కర్మల్ని చేస్తూనే ఉండాలి. ‘ శ్రేష్ఠుడైన వాడు ఏది ఆచరిస్తే ప్రజలందరూ దాన్నే ఆచరిస్తారు’ అంటాడు కృష్ణుడు. అతడు మిగతా వారికి ఆదర్శప్రాయుడు (టౌజ్ఛూ ఝౌఛ్ఛీజూ ) అవుతాడు అని అర్థం. ఇంట్లో ఆచారాలను వదిలేసి నేను రిలిజియస్ కాదండి, కేవలం స్పిరిచువల్ వ్యక్తిని అని చెప్పుకునేవాళ్లని చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు తమ పిల్లలకు సరైన ఆదర్శం చూపించడం లేదు. ప్రజాహితం కోసం ఏమీ చేయకుండా ఉత్తుత్తిగా స్పిరిచువల్ అనుకోవడం సరియైునది కాదని శ్రీకృష్ణుడిలాంటివాడే చెప్పడం మనం గమనించాలి. చివరికి తేలిన విషయం ఏమంటే, మనం ఆఫీసుకు వెళ్లి జీతం తీసుకోవడం అనే కర్మ గూర్చి కృష్ణుడు చెప్పడం లేదు. పుణ్యాన్నిచ్చే కర్మలు – శాస్త్రాల్లో చెప్పినవి – వ్రతాలూ, యాగాలూ, దానాలూ వీటిగూర్చే కృష్ణుడు చెప్పాడు. ఉపనిషత్తుల్లో ఉన్న మాటనే కృష్ణుడు చెప్పాడు. జ్ఞానమార్గంలో ఉండాలని అతికొద్దిమంది మాత్రమే ఆశిస్తారు. ఇలాంటివాళ్లు మాత్రమే నిష్కామకర్మ అనే మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొందరు ఆయా యాగాలూ, దానాలూ చేస్తూ పుణ్యాన్ని కోరుకునే వాళ్లే. మిగతా చాలామంది ఆధునికులు ఏమీ చేయనివాళ్లు. ఈ నిష్కామకర్మకే కర్మయోగం అని పేరు. దీన్ని గురించి మళ్లీ తెలుసుకుందాం. డాక్టర్ కె. అరవిందరావు |
|
| ఆమె పాత్రలు తెగని జ్ఞాపకాలు | |
ఆమె ఈ లోకాన్ని వదిలేసి ఇరవై ఏడేళ్లు దాటిపోయాయి. అయినా ఆమె స్థానాన్ని మరే తారా భర్తీచేయలేక పోయింది. ఓ వైపు ఆఫ్-బీట్ సినిమాల్లో, మరోవైపు కమర్షియల్ సినిమాల్లో రాణించి, విలక్షణ తారగా పేరుగాంచి, కేవలం 31 సంవత్సరాల వయసులోనే అర్ధంతరంగా మృతిచెందిన స్మితా పాటిల్ కళ్లు, గొంతు, నటన ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నటిగా స్మితను శిఖరాగ్ర స్థాయికి చేర్చిన కొన్ని సినిమాలను, ఆ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలను జ్ఞాపకం చేసుకుందాం.
కేవలం 22 సంవత్సరాల వయసులో స్మితను ప్రతిభావంతురాలైన నటిగా ప్రపంచానికి చాటిన పాత్ర ‘భూమిక’ (1977)లోని ఉష. ఆమె కెరీర్‌లోని గొప్ప ప్రదర్శనల్లో ప్రథమ స్థానం ఈ ఉష పాత్రదే. తొలిసారి ఆమెను జాతీయ ఉత్తమ నటిని చేసింది కూడా ఇదే. డైరెక్టర్‌గా శ్యామ్ బెనగల్ సృజనాత్మక సామర్థ్యానికి మెచ్చుతునక ఈ సినిమా. స్మిత అభినయం వెనుక ఆయన కృషి విస్మరించరానిది. 1940ల నాటి సినీ తార హంసా వడేకర్ ఆత్మకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు బెనగల్. ‘భూమిక’లోని ఉష ఓ నటి. తనను తాను తెలుసుకోవడానికి ఆమె చేసిన జీవన యానమే ఈ చిత్రం. అనేక విచ్ఛిన్న అనుబంధాల మీదుగా ఆయన జీవితం సాగుతుంది. తనకు తారసిల్లిన పురుషులందరూ (నసీరుద్దీన్ షా, అమోల్ పాలేకర్, అమ్రిష్‌పురి, అనంత్ నాగ్) తనను ఓ ‘వస్తువు’గా, లేదంటే, తమ కాల్పనిక లోకంలో భాగమైన ఓ ‘పాత్ర’గానే చూశారని ఉష గ్రహిస్తుంది. స్మిత అందాల తారగా ఎన్నడూ మనకు కనిపించలేదు. అయితే పాత్ర ఆత్మను ఒడిసి పట్టుకొని, ఆ పాత్రలో ఒదిగిపోవడం తెలిసిన ‘నటీమణి’ ఆమె. ఉష పాత్రలో ఆమె ఒదిగిన తీరు అపూర్వం. ‘భూమిక’ తర్వాత స్మితకు జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించిపెట్టిన చిత్రం ‘చక్ర’ (1981). ముంబై మురికివాడల్లోని లక్షలాది మంది జీవితాలను కళ్లకు కట్టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం ఆశ్చర్యకరం. ఎన్నో ఆశలతో ముంబైకి వలసవచ్చి, చివరకు ఓ మురికివాడలో ఆవాసాన్ని ఏర్పరచుకున్న అమ్మ అనే యువతి పాత్రను చేసింది స్మిత. భర్త మరణించడంతో అక్కడి బతుకు కూడా క్లిష్టమైపోతుంది. కేవలం బతకడం కోసం ఆమె నసీరుద్దీన్ షాతో, కుల్‌భూషణ్ ఖర్బందాతో సంబంధాలు పెట్టుకుంటుంది. కలలు కుప్పకూలిన చోట, బతుకు భయపెడుతున్న చోట ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకున్న సీ్త్ర అంతకంటే ఏం చేయగలదని మనమూ ఆమెపై సానుభూతి ప్రకటించేస్తాం. జీవిత వాస్తవికతను ఎంతో గ్రిప్పింగ్‌గా మన కళ్లముందు పరుస్తుంది ‘చక్ర’. అమ్మ పాత్ర పోషణ కోసం ముంబై తులసీ పైప్ రోడ్‌లో ఉన్న జోపడ్‌పట్టీస్ (మురికివాడ)కు వెళ్లి అక్కడి సీ్త్రల జీవితాన్నీ, అక్కడి వాతావరణాన్నీ స్వయంగా పరిశీలించింది స్మిత. బాలీవుడ్ గ్లామర్‌కు దూరంగా, పాత్రలో ఇమిడిపోయి ఎంతటి డీగ్లామరస్‌గానైనా కనిపించేందుకు వెనుతీయని నిజమైన తారగా ఈ చిత్రంతో మరోసారి ఆమె నిరూపించుకుంది. ఆమెకు ఈ చిత్రంలో ఓ స్నాన సన్నివేశం ఉంది. శోచనీయమైన విషయం ‘చక్ర’ పోస్టర్ల మీద స్నానం చేస్తున్న స్మిత ప్రధానంగా దర్శనమివ్వడం. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఈ సినిమా విడుదలైన సంవత్సరమే దాని దర్శకుడు రబీంద్ర ధర్మరాజ్ మరణించడం విచారకరం. స్మిత కెరీర్‌లోని గొప్ప పాత్రల్లో ‘నమక్ హలాల్’ (1981)లోని పూనమ్ కేరక్టర్ ఒకటి కాదు. అయినప్పటికీ, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన స్మిత సినిమా ఇదే. ఆమె నాయికగా నటించినవాటిలో బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ కూడా ఇదే. కారణం ఇందులో హీరో అమితాబ్ బచ్చన్. అంటే స్మిత మరపురాని చిత్రాల్లో ఈ చిత్రానికి తప్పకుండా చోటుంటుంది. ప్రకాశ్ మెహ్రా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నటిగా స్మితలోని విలక్షణతను తెలియజేసింది. ఆమె కూడా కమర్షియల్ హీరోయిన్‌గా రాణించగలదనీ, పాటల్లో డాన్సులు చేయగలదనీ, రెయిన్ సాంగ్స్‌లో తడి తడి దుస్తుల్లో అలరించగలదనీ నిరూపించిన సినిమా ఇది. అమితాబ్ ప్రేయసి పాత్రకు తనకే సాధ్యమైన సున్నితత్వాన్ని జోడించి అందరి మెప్పూ పొందింది స్మిత. నెగటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్లు చెయ్యడానికి ఆమె ఎన్నడూ భయపడలేదు. ‘అర్థ్’ (1982)లో ఆమె కుల్‌భూషణ్ ఖర్బందా ప్రేయసిగా, సినీనటిగా నటించింది. ఆమె వల్లే భార్య షబానా అజ్మీని వదిలేస్తాడు కుల్‌భూషణ్. వివాహితుడైన తన ప్రియుడు ఎక్కడ తనకు దూరమవుతాడోనని భయపడే కవిత పాత్రను గొప్పగా పోషించింది స్మిత. అభద్రత, అపరాధ భావన మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె నటనను చూసి తీరాల్సిందే. షబానాది సానుభూతి చూరగొనే పాత్ర. స్మితది ఎన్నో నాటకీయ సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పిందే పాత్ర. షబానా మాటలు వెన్నాడుతుంటే అద్దం ముందు నిల్చొని స్మిత ప్రదర్శించే హావభావాలు మనల్ని ఓ పట్టాన వదలవు. కూల్‌భూషణ్‌కు కొట్టి, ఆ వెంటనే తనను తానే కొట్టుకొనే సన్నివేశాన్ని మరచిపోలేం. నటిగా స్మిత విశ్వరూపాన్ని చూడాలనుకొనేవాళ్లు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘అర్థ్’. ఎనిమిదో దశకం మధ్యలో ‘తరంగ్’, ‘గిద్ధ్ దేబ్‌శిశు’, ‘రావణ్’ వంటి ఆఫ్‌బీట్ సినిమాలు చేసినా, అవి థియేటర్లలో సరిగా విడుదల కాకపోవడంతో ఆమె నటన చాలామందికి చేరలేకపోయింది. ఆ టైమ్‌లోనే కమర్షియల్‌గా విజయవంతమైన కొన్ని సినిమాలు చేసింది స్మిత. వాటిలో జె. ఓంప్రకాశ్ రూపొందించిన ‘ఆఖిర్ క్యోం?’ చెప్పుకోదగ్గది. ఇందులో ఆమె రాకేశ్ రోషన్ భార్య పాత్ర చేసింది. తన కజిన్ టీనా మునిమ్‌తో రాకేశ్ సంబంధం పెట్టుకోవడంతో, ఇంట్లోంచి బయటకు వచ్చేసి రాజేశ్ ఖన్నా స్నేహంతో, సొంత అస్తిత్వంతో నవలా రచయిత్రిగా ఎదిగిన నిషా పాత్రలో స్మిత ప్రదర్శించిన హావభావాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే నిషా పాత్రను మలచడంలో ఆఖరున దర్శకుడు తికమకపడి ఔచిత్య భంగం చేయకుండా ఉండినట్లయితే ఈ పాత్ర మరింత గొప్పగా వచ్చి ఉండేది. చాలా మంది ‘మిర్చి మసాలా’ స్మిత చివరి చిత్రమని పొరబడుతూ ఉంటారు. నిజానికి 1986 డిసెంబర్‌లో స్మిత మరణిస్తే, ఆమె నటించిన పలు చిత్రాలు 1989 వరకు విడుదలవుతూ వచ్చాయి. అయితే ఆమె మరణించాక వచ్చిన మొదటి ప్రధాన చిత్రం మాత్రం ‘మిర్చి మసాలా’. కేతన్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఓ మిర్చి ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేసే సోంబాయి పాత్ర చేసింది స్మిత. ఆ ప్రాంతాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకొని సమాంతర రాజ్యం నడిపే నసీరుద్దీన్ షా తనను లొంగదీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగదు స్మిత. తోటి మహిళా కార్మికులను సమీకరించి, అతడిని ఎదుర్కొన్న ఆమె, ఆపత్కాలంలో సీ్త్రకి కారం ఎలా ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందో చూపిస్తుంది. కేవలం పన్నెండేళ్ల కెరీర్ (1974 – 1986)లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో భారతీయ సినిమాకు గర్వకారణమైన తారగా పేరుపొందిన స్మితా పాటిల్‌ను కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. భారతీయ సినిమాకు వందేళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని తపాలా శాఖ 2013 మే 3న ఆమె పేరిట ఓ పోస్టేజ్ స్టాంపును విడుదల చేయడం నటిగా ఆమెకు లభించిన గౌరవం. (నేడు స్మితా పాటిల్ జయంతి) |




