| ఎవుర్ని పలకరించూ, యేడుపే.. |
|
నాచిన్ననాటి నుంచి నాకు అక్టోబర్, నవంబర్ మాసాలంటే భయమేస్తాది! ఈ రెండు మాసాల గండం గడనీయి, దేముడా అని మొక్కేది మాయమ్మ! ఆకాశానికీ, భూమికీ దండం బెట్టీవోడు, మా బాపు! గుండెలరచేతిల పెట్టుకొని ఇంటికీ, పొలానికీ తిరుగాడేవోరు వొరదో, వొరుపో యిరుసుకుపడ్తాదని, అరవయ్యేళ్లనాటి భయం… ఇప్పటికీ పోలేదు. ఇంత పెద్దయ్యాను. నేనూ, నా పిల్లలూ పల్లెనీ, పంట భూముల్నీ వొదిలీసాం. నాగల్నీ, నాగేటి చాలునీ వొదిలీసాం. మట్టి, చేతికి మాత్రమే కాదు మరిదేనికీ అంటకుండా బతికేస్తన్నాం. మార్కెట్ చల్లగా వుంటే మా కడుపులో చల్లకి ఢోకా లేదన్నట్టగ, లోకంతోపాటు బతికీడం నేర్చుకున్నాం. లోకమా, యింత మారిపోయింది. కాదు కాదు ఎదిగిపోయింది. (మారడమే యెదగడమనుకుంటున్న మిత్రుల భావనలో కూడా), ఆధునికులమ్మాత్రమేకాదు అత్యాధునికులమయ్యాం. ఆటో ఛార్జీలకంటా తక్కువ ఛార్జీలకి అంతరిక్షంలోకి యెళ్లోస్తన్నాం. సృష్టికి సేస్తన్నాం. ప్రకృతిని యెలగ కావొలిస్తే అలాగ మలుసుకొని మార్కెట్లలోన పెట్టి యాపారం సెయ్యగలగతన్నాం… అయినా, అక్టోబర్, నవంబర్ మాసాలంటే భయం పోలేదు. ఇంకమరి పోదే టో?
మా తల్లిదండ్రులు పంటలు పోతాయేమోనని మాత్రమే భయపడేవారు, గానీ నేడు బతుకులు పోతాయేమోనని భయపడుతున్నం. హుద్‌హుద్ తుఫాను యీ భయాన్ని కలిగించడమేగాక, ప్రకృతికి యెంత దూరంగా బతుకుతున్నామో కూడా తెలయిజేసింది. మన పూర్వీకులు, విద్యుత్ లేకుండా, మోటార్లూ, బోర్లూ లేకుండా, చివరికి వేగవంతమైన రవాణా సౌకర్యం గూడా లేకుండా… ప్రకృతి ప్రసాదించిన దానితో జీవించేసేవారు. ప్రకృతిని స్వాధీనం చేసుకొని యేర్పాటు చేసుకున్న ఆధునిక సౌకర్యాలమీద యింతగా ఆధారపడేవారుగాదు. ఈ ఆధునిక సౌకర్యాలేవి అందుబాటవకపోయినా, జీవితమెంత దుర ్లభమో హుద్‌హుద్ విలయంతో అనుభవంలోకొచ్చి భయమేస్తాంది. విద్యుత్.. ఒక్క దీపాల వెలుగుకే తొలిసారిగా, నా చిన్నపుడు పరిచయమైంది. ఇవ్వాల జీవితంలోని అనేక అవసరాలకు విద్యుత్ తప్పనిసరయ్యింది. (ఈ కారణంగానే ధర్మల్, అణువిద్యుత్ కర్మాగారాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రజా పోరాటాలకు సామాజిక మద్దతు కరవవుతోందేమో!) హుద్‌హుద్ దాడికి కూలినవి విద్యుత్ స్తంభాలే గానీ ఫలితంగా పల్లెలనుంచి నగరాల దాకా రోజువారీ జనజీవితం కుప్పకూలిపోయింది. వెలుగు కోసం మాత్రమే కాదు (కొవ్వొత్తితో సరిపెట్టుకోగల్రు), కర్మాగారాలూ కార్ఖానాలకే గాదు, నీళ్ళ కొరకు మేడలమెట్లు యెక్కి దిగేందుకు, వాహనాల రవాణా కొరకు, కొసకు చేతుల్లో మోగే సెల్ కొరకు విద్యుత్ కావాలి. కళింగాంధ్రా కవరేజీ యేరియాలో లేకుండా పోయిందిపుడు! ఈ ఆధునిక సదుపాయాల మీద ఆధారపడడమెంత తప్పనిసరో, యిటువంటి విపత్కాలంలో అంతకెక్కువ నిరాధారులమై విలపిస్తాము.. నీళ్ల కోసం, పాలకోసం, పెట్రోల్ కోసం, నిత్యావసర సరకుల కోసం… యెంత విలవిల లాడేం కళింగాంధ్రులు (ఒక్క విశాఖవాసులే కాదు) మీడియాసాక్షిగా అందరూ చూసి వుంటారు. ఈ ఆధునిక సదుపాయాలనేవి, యెంతగా మార్కెట్ సృష్టిస్తున్నవో, మార్కెట్ యెలా మనుషుల జేబుల్ని చిల్లులు పోడుస్తుందో గూడా, యీ నాల్రోజులూ మీడియా చూపించింది.
చట్టం ముందు అందరూ సమానమే గానీ, కొందరు యెక్కువ సమానమట! ప్రకృతి విలయం ముందు కూడా! హుద్ హుద్ విలయానికి కళింగాంధ్ర దుంపనాశనమై పోయింది. కాదు, విశాఖపట్టణం యెక్కువ నాశనమై పోయిందంటా! గాజు మేడలు, మేడలవారి కార్లూ, ఎత్తయిన షాపింమాల్లూ, ఎత్తయిన హోర్డింగులూ, అంతస్తు అపార్టుమెంట్లు, రోడ్లూ, రోడ్ల మీది చెట్టూ చేమలూ, విమానాశ్రయం, కైలాసగిరి కొండ, యారాడ కొండ (రాచకొండ లేదులెండి), కలెక్టేరు బంగ్లా కొసకి కళింగాన్ని దుంపనాశినం చేస్తాదేటో సుమా అని ముందుగా యెచ్చరించిన రాడార్ ఆఫీసూ.. ప్రకృతి విలయం ముందు – సాదాసీదా సజ్జుతో సమానంగా, కాదు కాదు యెక్కువ సమానంగా దుంపనాశనమైపోయింది.
కళ్ళముందర -పడవలూ, బోట్లూ, గుడిసెలూ, గుడిసెల్లోని గిన్నేముంతా, గుడ్డా పాతలూ సంద్రంలోకి కొట్టుకు పోతే కడపు (పోనీ గుండెలు) కొట్టుకొని కళ్లంట జాలారోళ్లు (మత్స్యకార్లు మర్యాదపదం); ఆపాటీపాటి చినుకులుకే సిటీలోని మురికినీటికాల్వలన్నీ ప్రవహించే మురికిపేటల ఇళ్లల్లోని సర్వమూ జగన్నాధమై పోగా కన్నీరు మున్నీరై యేడ్చే మురికివాడల పేదలూ; చిన్నా చితకా కోలనీలూ, కోలనీలలోని చిన్నా చితకా మనుషులూ; అటు పాయకరావుపేటవతల నుంచీ యిటూ భోగాపురమివతలదాకా గుడిసెలు, పెంకుటిల్లు, డాబాలు, దాబాలూ… అందలి ఆటోవాలాలు, తాపీ పనివాళ్ళు, కలాసీలు, చిన్న ఉద్యోగులు, కూలీలు, పనిమనుషులు, పనిదొరకని మునుషులు, పట్నానికి పాలూ, నీళ్లూ, పల్లూ, పూలూ, కాయగూరలూ, తిండిపదార్థాలు, అలంకారాలు, అవసరమైనవన్నీ అమ ర్చే యాపారుస్తులూ – వాళ్లేటి వీళ్లేటియెందరి బతుకులో హుద్‌హుద్ ధాటికి బదాబదలైపోయాయి! ఎవర్ని పలకరించూ, యేడుపే…! ఓలప్పా, యేటలగ యేడస్తావు? నీకేనేటే?? వందరికీ ఒకటే రేవు యెట్టీసింది తుఫాను తల్లి. నీకు తెల్దుగానీ సియ్యమ్మారోడి వద్దాల షాపయితే.. చిరిగిన చింకిచాప అయిపోనాది. ఓలప్పా, అల్లా సోనీ కంపినీవోడి బిల్డంగయితే అద్దాలతోటి, ఏసీల్తోటి తళతళ్లాడీదా, అలాపింటిది-అప్పడుకోడె రంకెలేసి కుమ్మేస్తే, కుమ్మరోడి కుండలు చిల్లి పెంకులయిపోతాయి సూడూ అలాగయి పోనాది. అల్లా జోయల్లూకాసూ, స్పెన్సారూ, రిలయిన్సూ, ఒకటేటి వందం వొలకబోసీ షాపులన్నీ వల్లకాడులయిపోనాయి. నీలాగ, ఆళ్లు గానీ యేడిస్తే, సెంద్రబాబుగానీ, మోడీ బాబుగానీ .. ఓదార్సగల్రా? అళ్ల వొసిమా?? నికిచ్చినట్టగ, కోటా బియ్యిమూ, కిరసనూనే, ఉప్పూపప్పూ ఆళ్లగ్గానీ యివ్వగల్డా, యిస్తే ఆళు తీసకుంతారా, ఆళ యేడుపు ఆపతారా? సెప్మీ, సేన, మరేడకు, అంతటోళికే ఆపదొచ్చింది. మనమేపాటి? యేడకని తప్పకా ఓదార్సేవోడు, మా రావిశాసి్త్ర గారి రాకెట్టప్పారావు (బతికిలేడుగానీ).
హుద్‌హుద్ దాడికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా యెన్నడెరగని రీతిలో ధ్వంసమైనాయి. కళింగ ప్రాంతం – మూడు విభిన్నప్రాంతాల సమాహారం. సముద్రతీరం, అడవీ ఆడవినానుకొని ఉన్న ఆదివాసీ ప్రాంతం, మైదాన ప్రాంతం. ఈ మూడు ప్రాంతాలూ విలయానికి గురయినాయి. ఎన్నడెరగని రీతిలో వీచిన గాలికి అరణ్యం గూడా విధ్వంసమైంది. సాధారణ రోజుల్లోనే ఆదివాసీ ప్రాంతానికీ, యితర ప్రాంతానికీ అనుసంధానం అంతంత మాత్రమే, అటువంటిది, యీ విలయ సందర్భాన ఆదివాసీప్రాంతంలోని జీవుల కడగండ్లు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. వాగులు పొంగిపోతాయి, వృక్షాలు కూలిపోతాయి, దారీతెన్నూ వుండదు. తాగే నీరు, తినేందుకు తిండి, వుండడానికి గుడిసె.. యేమీ వుండదూ, యెవరో వస్తారని, ఆదుకుంటారని ఆశ గూడా వుండదు. ఆదివాసీ ప్రాంతంలో యే నిధి నిక్షేపాలున్నవో తెలిపే, వెలికి తీసే శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలు వారి కనీస అవసరాలు తీర్చాల్సినపుడు మాత్రం అక్కరకు రావటం లేదు. (అన్నలీ అవసరాలను తీర్చతున్నారని పోలీసుల ఆగ్రహం).
ఇక కళింగ మైదాన ప్రాంతాన సారవంతమైన పల్లపు భూములున్నవి. వరి, చెరకు, జొన్న, పత్తి (ఒకప్పుడు చోడి, గంటెలు, చామలు వగైరా తిండిగింజల పంటలు) పంటలు పండుతాయి. పట్రాలు రారమ్మని పిలవగా, యెందరో వలసబోగా – కిట్టుబాటు ధరలు లేకపోయినా పంటలు పండించడమొక వ్యవసనమైన రైతులూ; వారినాధారం చేసుకు అర్థాకలితో, అరాకొరా ఉపాధితో బతికే వృత్తి జీవులూ, చేతివృత్తులవారూ, చాకలీ, మంగలీ వగైరా సేవక కులాల జనాలూ, మైదాన ప్రాంతాన నేడు మిగిలినవారు! ఇక్కడి అరటితోటలు యెవరో పగబట్టి తెగనరికినట్టయినాయి. వరిచేలు నీళ్లల్ల తలకిందులుగా మొలకెత్తుతున్నాయి. చెరకులు నడుములు విరిగినాయి. కొబ్బరి తలలు నేలకేసి కొట్టుకున్నాయి. మునగ చెట్ల ముప్పయి ముక్కలుగా విరిగినాయి. నట్టింట దీపమెలిగించ చమురు లేదు (కరెంటు మామూలు రోజుల్లోనే యే జాము రాతిరికో వుండేది) రైతు వెన్నుపూసలు ఫటా ఫటా తెగిపడినాయి! కళ్లంట నీళ్ళుగాదు, నెత్తురు గారుస్తున్నాడు మైదాన ప్రాంతీయుడు!
సముద్రతీరం సరే, మీడియా విశాఖను చూపినట్లే, సుమారు ఇచ్ఛాపురం దాకా తీరంలోని మత్స్యకారులంతా మునుపెన్నడూ లేనంతగా భయభ్రాంతులయినారు. తుఫానుతీరం తాకేదాకా కొట్టుకునే గుండెలు, తీరం తాకింతరాత ఆగి పోయాయి. సంద్రాన్ని చూస్తే భయపడిపోతున్నారు. వల లేదు, బోటు లేదు, గుడిసె లేదు, బతుకు భరోసా లేదు. తెర చాప చిరిగినా, తెడ్డు చేజారినా, గుండె జారనీకు.. ఓ జాలరన్నా… అని యెవరు ధైర్యం చెప్తారు వాళ్లకు?
ఈ తుపాను సందర్భాన రాజకీయ విభేదాలు పక్కన బెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఐక్యంగా విపత్తునుంచి ప్రజలు బయటపడే కార్యక్రమాలను చేపట్టాలి. సినిమా రంగం ముందుకు వచ్చి విరాళాలందించడం మనకు ఆనవాయితీయే, గానీ కళాకారుల మీదా, సాహిత్యవేత్తలూ, సామాజికవేత్తలూ, మేధావులమీదా.. యింకా ముఖ్యమైన బాధ్యతలుంటాయి. అవేమిటంటే, శాశ్వత ప్రాతిపదికన ప్రకృతి విలయాలను తట్టుకునే స్వావలంబనా శక్తీ, మానసిక ధైర్యం, సమష్టితత్వం, సహకార గుణం మనుషుల్లో కలిగించడం, సామూహిక కార్యాచరణ మార్గాలను ఎరుక పరచడం. సమాజాన్ని ఆ మేరకు చైతన్య పరచడం. నదులను మళ్లించడం, ఇళ్లను ముంపులకు గురికాని యెత్తయిన ప్రాంతాల్లో నిర్మించడం, రహదార్లను ఎప్పటికప్పుడు రిపేరు చేయించడం, సముద్రతీరం ప్రాంతంలో తుఫాను షెల్టర్లు నిర్మించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను దీర్ఘకాల ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలి. అలా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రాతిపదిన చర్యలు చేపడితే ఇటువంటి విపత్తులు వచ్చినపుడు ప్రజలు తమనాదుకోమని ప్రభుత్వాల వేపు చూడరు. ప్రభుత్వం కూడా ఆదుకోమని దాతలను వేడుకోనక్కరలేదు.
అట్టాడ అప్పల్నాయుడు
|
వీక్షకులు
- 1,107,447 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

