|
| నా కళ్లల్లో ‘హుద్‌హుద్’ – ఆర్. నారాయణమూర్తి | |
ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచీ 12వ తేదీ రాత్రి వరకు విశాఖలో పెను తుపాను ‘హుద్‌హుద్’ సృష్టించిన బీభత్సానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. ఓ కార్యక్రమానికి హాజరై మధ్యలో విశాఖలో చిక్కుకుపోయిన ఆయన తన జీవిత కాలంలో ఇలాంటి పెను తుపానునూ, ఇంతటి బీభత్సాన్నీ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ‘హుద్‌హుద్’ తుపాను రోజు విశాఖలో తను చూసిన, ఎదుర్కొన్న అనుభవాలను చిత్రజ్యోతితో ప్రత్యేకంగా పంచుకున్నారు నారాయణమూర్తి. ఆ విలయ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ నెల 11న కుల నిర్మూలనా పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగిన సభకు హాజరై, బస్సులో ఆ రాత్రికి విశాఖపట్నం చేరుకున్నాను. అక్కడ రైలు ఎక్కాలనేది నా ఆలోచన. అయితే టైమ్ దాటిపోయింది. రైలు అందే పరిస్థితి లేదు. వర్షం పడుతోంది. అప్పటికి ఐదు రోజుల ముందునుంచీ హుద్‌హుద్ తుపాను గురించి మీడియాలో వస్తున్న విస్తృత ప్రచారం చూసి, జనాన్ని ఇంతగా భయపెట్టాలా, వారికి మానసిక ప్రశాంతత లేకుండా చేయాలా అనుకున్నా. వర్షం రాను రాను పెరుగుతూ పోతోంది. ఆ రాత్రి విశాఖపట్నంలో ఉండి, మర్నాడు బయలుదేరదామని విశ్వభవన్ లాడ్జిలో దిగాను. గత ముప్పై ఐదేళ్ల నుండీ నెనెప్పుడు విశాఖపట్నం వెళ్లినా ఆ లాడ్జిలోనే నా మకాం. ఆ రాత్రి గాలి, వాన హోరు అంతకంతకూ ఉధృతమవుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఊగిపోతున్నాయి. అర్ధరాత్రికి భయం మొదలైంది. పక్కనే సముద్రం ఉన్నదాయె. ‘భగవంతుడా. ఇది మరో దివిసీమ ఉప్పెన కాకూడదు, మరో కోనసీమ ఉప్పెన కాకూడదు, మరో సునామీ కాకూడదు’ అని ప్రార్థించా. హోరుగాలి ఉధృతం పెరుగుతున్నదే కానీ తగ్గలేదు. అప్పటికే కరెంటు లేదు. చిమ్మచీకటి. ఆ రాత్రంతా కలత నిద్రే. పొద్దున లేస్తే.. ఏ వైపు చూసినా బీభత్సమే. భయానకమే. రాత్రి ఊగుతూ కనిపించిన పచ్చని చెట్లన్నీ ఽనేలమట్టమైపోయాయి. ఽపెద్ద పెద్ద బిల్డింగుల అద్దాలన్నీ పగిలిపోయి బీభత్సమైపోయాయి. కరెంటు స్తంభాలు విరిగి, ధ్వంసమయ్యాయి. రోడ్లు రోడ్లులా లేవు. లాడ్జిపైకెక్కి చూస్తే విశాఖ అంతా కల్లోలమైపోయి కనిపించింది. మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. హుద్‌హుద్ తుపాను గురించి ముందే హెచ్చరించిన శాస్త్రవేత్తలకూ, ప్రజలనూ, యంత్రాంగాన్నీ అప్రమత్తం చేసిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలనూ ఈ సందర్భంగా ప్రశంసించి తీరాలి. అప్పట్లో ఈ సైంటిఫిక్ నాలెడ్జి లేకపోవడం వల్లే దివిసీమ ఉప్పెనలో చాలామంది చనిపోయారు. జనం సురక్షిత ప్రాంతాలకు తరలింపబడలేదు. జనాన్ని ఉప్పెన కబళించేసింది. దాని ప్రభావం సంగతి ప్రభుత్వానికీ తెలీదు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో, తుపానును ముందే అంచనా వేయగలిగారు. దానికి తగ్గట్లు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోగలిగింది. ఎవర్నీ బయట తిరగవద్దని హెచ్చరించింది. అందువల్లే ప్రాణనష్టం బాగా తగ్గింది. ఇది సాంకేతిక పురోగతి సాధించిన విజయం. నలుగురితో పాటు నారాయణమూర్తి ఇక నా విషయానికి వస్తే 13వ తేదీ ఉదయం ఆకలి వేస్తుంటే టిఫిన్ చేద్దామని లాడ్జి నుంచి బయటకు వచ్చాను. అంతే. ఏం గాలి! ఏం హోరు! ఎటు చూసినా కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు. అడ్డదిడ్డంగా, వెల్లకిలా పడిపోయిన కార్లు, బైకులు. అక్కణ్ణించి రెండు ఫర్లాంగుల దూరంలో ఉంది గ్రీన్‌పార్క్ హోటల్. అక్కడకు వెళ్లాలి. ముందుకు అడుగులు వేశానో, లేదో తుపాను గాలికి నేనూ బ్యాలెన్స్ తప్పి ఎగిరాను. ఓ కాలికి భూమ్మీద పట్టుదొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కొట్టుకుపోయేవాణ్ణే. చివరకు దేవుడి మీద భారంవేసి, ఆ తుపాను ఉధృతిలోనే గ్రీన్‌పార్క్ హోటల్‌కి చేరుకున్నా. ఆ హోటల్ వాళ్లు తుడుచుకోవటానికి టవల్స్ ఇచ్చి, టిఫిన్ పెట్టారు. మీరు నమ్మాలి. ఉదయం తొమ్మిది గంటలకు ఆ హోటల్‌కు వెళ్లినవాణ్ణి, మళ్లీ విశ్వభవన్‌కు రావడానికి రాత్రి ఎనిమిదయ్యింది. ఓ మహానుభావుడు ప్రేమగా అక్కడ కారులో దింపారు. అప్పటికీ ఉధృతం తగ్గలేదు. ఎటుచూసినా గాఢాంధకారం. ఎక్కడకీ కమ్యూనికేషన్ లేదు. 61 సంవత్సరాల నా జీవితంలో ఊహతెలిశాక ఇలాంటి బీభత్సాన్ని కళ్లతో ఎప్పుడూ చూడలేదు. దివిసీమ, కోనసీమ ఉప్పెనలను మించి ఈ హుద్‌హుద్ తుపానులో గాలి చేసిన బీభత్సం ఎక్కువ. అయినప్పటికీ ఈ బీభత్సం నుంచి బయటపడేందుకు అహర్నిశలూ కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికీ, ప్రధాని నరేంద్రమోదీగారికీ, ప్రభుత్వ యంత్రాంగానికీ, స్పందించి విరాళాలు అందజేస్తున్న దాతలకూ, స్వచ్ఛందంగా బాధితులకు సాయపడుతున్నవారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కూడా నా కళ్లముందు పడిపోయిన చెట్లను నలుగురితో కలిసి అక్కణ్ణించి ఓ మూలకు జరిపాం. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాం. అంటే ‘నలుగురితో పాటు నారాయణమూర్తి’నయ్యా. బోడిగా మారిన విశాఖ ఈ సందర్భంగా నేను చాలా బాధాపడిన విషయం.. ఇంత తుపాను బీభత్సం జరుగుతుంటే చాలామంది దొంగలు చీకట్లో ఇళ్లలోకి జొరబడి అందిన వస్తువునల్లా దోచుకుని పారిపోయారు. నా కళ్లారా ఓ సంఘటనను చూశాను. ఏడుపొచ్చింది. ఇంత కష్టకాలంలోనూ మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటివాళ్లను ఏం చేసినా పాపంలేదు. ఇంకోవైపు ఇదే అదనుగా పెట్రోల్ ధరను పెంచేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేశారు. విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే జనానికి మేలు చేస్తారో వాళ్లే దేవుళ్లు. ఎవరైతే లూటీ చేస్తారో వాళ్లే దెయ్యాలు. ఆ దెయ్యాలను పట్టుకుని కాల్చిపారెయ్యాలన్నంత కోపం వచ్చింది. దేశానికి ముంబై ఎలానో ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ అలాగా. చాలా అందమైన నగరం. ఓ వైపు సముద్రం, మరోవైపు పచ్చని ప్రకృతి. అలాంటి నగరంలో ఇప్పుడు మచ్చుకి కూడా పచ్చదనం లేకుండా అంతా ధ్వంసమైపోయింది. సుందర విశాఖ బోడిగా మారింది. ఏడుపొచ్చింది. ఒక ప్రాణం పోయినా పోయినట్లే. అయినప్పటికీ వీలైనంత తక్కువగా పాతికమందిలోపునే మరణించడం చాలా నయం. నాకు నిజంగా ఆనందమేసిన సందర్భం.. జనం ప్రభుత్వ సిబ్బంది కోసం ఎదురుచూడకుండా, తమ ఇళ్లముందు, రోడ్ల మీద చెల్లాచెదురుగా పడిపోయిన చెట్లనీ, చెత్తనీ, పగిలిపోయిన వస్తువుల్నీ తీసి, ఆ ప్రాంతాల్ని శుభ్రం చేసుకోవడం. ధనిక, పేద తేడాలేకుండా కలిసి పనిచేసిన వాళ్ల సమష్టితత్వానికి హ్యాట్సాఫ్. వాళ్లలో నేనూ ఒకడిని కావడం నాకు ఆనందదాయకం. తుపాను తగ్గిపోవడంతో జనమంతా రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్ని శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఒకాయన నన్ను కారులో కత్తిపూడిలో దింపారు. అక్కణ్ణించి సామర్లకోట వచ్చి, అక్కణ్ణించి 14వ తేదీ ఉదయం గుంటూరుకు చేరుకున్నా. నాగార్జున యూనివర్శిటీలో చల్లపల్లి స్వరూపరాణి ఆధ్వర్యంలో అక్కడి దళిత విద్యార్థి సంఘం ఏర్పాటుచేసిన కవి పైడి తెరేశ్‌బాబు సంస్మరణ సభలో పాల్గొన్నా. సక్రమంగా అందాలి ఇప్పుడు చేయాల్సింది ఒకర్నొకరు విమర్శించుకోడం కాదు. హుద్‌హుద్ బీభత్సానికి అతలాకుతలమైన ఉత్తరాంధ్రను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి అహర్నిశమూ శ్రమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికీ, ఇంతటి విపత్కర స్థితిలోనూ ఎంతో మనోనిబ్బరాన్ని ప్రదర్శించిన అక్కడి ప్రజానీకానికీ వందనాలు. అక్కడివాళ్లను ఆపద్బాంధవులుగా ఆదుకొంటున్న గుర్తుతెలియని స్వచ్ఛంద సేవకులకు హ్యాట్సాఫ్. అలాగే మన తెలుగువాళ్లు ఎప్పుడు ఏ కష్టాన్ని ఎదుర్కొన్నా ఆదినుంచీ సినీ పరిశ్రమ వాళ్లకు చేయూతనందిస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా మన సినిమావాళ్లు ప్రదర్శిస్తున్న దాతృత్వాన్ని ప్రశంసించి తీరాలి. పవన్‌కల్యాణ్ నుంచి సంపూర్ణేష్‌బాబు దాకా ఎవరికి తోచింది వాళ్లు దానం చేస్తున్నారు. అయితే ఈ విరాళాలు, ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారాలు అర్హులైనవారికే చేరాలనీ, అవి దుర్వినియోగం కాకుండా చూడాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నా. |

