ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’
……………..
ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ వచ్చే నెల
జ్ఞానపీఠ అవార్డు స్వీకరిస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేంద్రీయ
విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో
ఈ నెల 20,21 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా…
……………….
2013వ సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌ను జ్ఞానపీఠ అవార్డు కోసం ఎంపిక చేయడం దేశంలోని అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులను గౌరవించడంగా భావించాలి. కేదార్‌నాథ్ సింగ్ ప్రతి రచనలో ఒక ఆత్మీయ ఆర్ద్రత కనబడుతుంది. ఆ ఆర్ద్రత ఈ దేశంలోని కోట్లాది గొంతులకు ఒక వేదికగా మారుతూ స్వతంత్ర భారత వైరుధ్యాలను ముందుకు తెస్తుంది. 1934లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన కేదార్‌నాథ్ సింగ్ చుట్టూ ఉన్న ప్రపంచానే్న తన కవిత్వానికి వస్తువుగా మలచుకుని అనేక కావ్యఖండాలను చెక్కారు. తన చుట్టూ ఉన్న పదజాలానే్న కవితా భాషగా స్వీకరించి ప్రజల భాషను సజీవంగా నిలబెట్టారు. నిజానికి వారి కవితాయాత్ర 1950 నుంచే మొదలవుతుంది. సమకాలీన హిందీ కవిత చరిత్ర రచనా రీతుల మీద చర్చకు తెరలేపిన కవి ఆజ్ఞేయ్ సంపాదకత్వంలో 1950లో వెలువడిన ‘తార్ సప్తక్’ లో స్థానం పొంది అప్పట్లోనే శక్తివంతమైన యువకవిగా పేరొందారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను లోతుగా పరిశీలిస్తూ తమదైన శైలిలో గొంతు కలిపిన కవి కేదార్‌నాథ్ సింగ్. వారి కలం నుంచి వెలువడిన కవితా సంకలనాల శీర్షికలను చూడగానే కవి తృష్ణ అవగతమవుతుంది. ‘అభిబిల్కులే అభి’, ‘జమీన్ పక్ రహీ హౌ’, ‘అకల్ మే సారస్’ (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన) టాఘ్ (పులి) ల్లాంటి అత్యంత శక్తివంతమైన రచనలు ఈ రోజు జ్ఞానపీఠ అవార్డు రావడానికి పునాదులుగా పనిచేశాయి. మిగతా కవితా సంకలనాల కన్నా ‘పులి’ కవితా సంకలనం విశిష్ట రచనా ప్రక్రియను ప్రవేశపెడుతుంది. ‘పులి’ కవితా సంకలనం కొన్ని కావ్యఖండికల సమాహారం.
నిజానికి మానవ చరిత్రలో అత్యధిక ప్రయాణం చేసింది కవిత్వమొక్కటే. అత్యధిక విశ్వాసాన్ని ప్రకటించబడింది కూడా కవిత్వం పట్లనే. ‘నాగరికత దినదినాభివృద్ధితో పాటు కవిత్వం పతనమవుతుంది’ అని మిల్టన్ గురించి రాసిన ఒక వ్యాసంలో మెకాలే అన్నప్పటికీ కవిత్వ ప్రయాణం అజరామరంగా కొనసాగుతూనే ఉంది. దానిపట్ల విశ్వాసం సన్నగిల్లలేదు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో కవిత్వం అనేక మలుపులను, ఒడిదుడుకులను చూసింది. తన రూపాన్ని, వ్యాకరణాన్ని మార్చుకుంది. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అధమం వైపు మళ్లిన సంఘటనలూ ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలంటే కవిత్వం యొక్క ఈ సుదీర్ఘ చరిత్ర ఆత్మ సంఘర్షణల చరిత్రే. మానవ నాగరికత, సంస్కృతితో బాటు సమానాంతరంగా నడుస్తున్న చరిత్ర. అప్పుడప్పుడు ముందుగా నడుస్తూ మార్గాలను, మలుపులను అడ్డగిస్తున్న చరిత్ర కవిత్వానిది.
హిందీ కవిత్వం, ముఖ్యంగా నేటి హిందీ కవిత చరిత్ర ఆత్మ సంఘర్షణతో కూడుకున్నదని చెప్పక తప్పదు. ఈ ఆత్మ సంఘర్షణను గమనంలో ఉంచుకోకుండా ఇప్పుడు వస్తున్న కవిత్వాన్ని గాని, కవులను గాని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే కవిత్వంలో కనబడే ఆత్మసంఘర్షణ కవి యొక్క ఆత్మసంఘర్షణ కాబట్టి. ఈ సంఘర్షణని ప్రతిభావంతంగా, శక్తివంతంగా వ్యక్తం చేసిన కవులలో కేదార్‌నాథ్‌సింగ్ అగ్రగణ్యులు. సమకాలీన సంఘర్షణని, ఆత్మ ఘర్షణని అతని కవిత్వం ఆవిష్కరిస్తుంది.
‘నా వీపుమీద కాలపు పంజాల సంతకాలు ఎన్ని ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు’ అంటూ ‘పులి’ కవిత్వం ఆరంభంలోనే నేడు విస్తరిస్తున్న ఉద్యమ స్ఫూర్తిని, ఆర్తిని, సంఘర్షణ లోతులను కేదార్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. ‘పులి’ కవిత్వం ‘మనిషి’ని కుదిపివేసే కవిత్వం. చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనల నడుమ నిలబడి అస్తిత్వం, అభివృద్ధి కోసం పరితపించే ‘మాయావి సమయం’లో మనిషి అంతరంగంలో నుంచి పుట్టుకువచ్చే అనేక రూపాల ఆకారం – ‘పులి’. పులి కవిత్వం అనేక దృశ్యాలు, చిత్రాలు, రూపకాలుండే ప్రతీకా? లేక ప్రతిబింబమా? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ‘మనిషి’ అంతర్గత పరిస్థితిని సృజనాత్మక దృష్టితో పరిశీలించే గొప్ప కావ్యం ‘పులి’. కాల ప్రవాహంలో, చీకటి మలుపులతో కొనసాగుతున్న మానవ విధ్వంసానికి పోరాట జీవన గాథ ‘పులి’. మనలోని చైతన్యాన్ని, ప్రేమను, అమాయకత్వాన్ని, నిరాశను అర్థం చేసుకునే విశ్వాసాన్ని, అవకాశాన్ని ‘పులి’ కల్పిస్తుంది. ‘పులి’ నగరమంతటిని తిరస్కారంగాను, అసహ్యంగాను చూస్తుంది. అంటే మానవ నైజంలో చోటుచేసుకున్న వికృతాన్ని అసహ్యించుకుంటుందన్నమాట. మానవ జీవితంలోని వికృతాన్ని, విపరీత పోకడలను తిరస్కరించడమంటే మనిషిలోని ప్రేమను బ్రతికించడమే.
అనారోగ్యం, అంధవిశ్వాసాలు, నిరక్షరాస్యత, దారిద్య్రం మీద పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు భయంకరమైన వౌన సంస్కృతికి అలవాటుపడ్డారు. ప్రశ్నించే స్వభావాన్ని ఇంకా అలవరుచుకోలేదు. తమ గురించి ఆలోచించే వారున్నారని, వారే అన్నీ చేసి పెడతారని ఆలోచించే ‘మాట్లాడని సంస్కృతి’లోకి నెట్టివేయబడ్డారు. అందుకేనేమో ‘పులి’ ఓచోట ‘మనుషులు ఈమధ్య వౌనంగా ఎందుకుంటున్నారు’ అని ప్రశ్నిస్తుంది. కాని సంతృప్తికరమైన జవాబు దొరకదు. అయోమయంలో పడిపోతుంది. మన పల్లెసీమలు పట్నం వైపు కదులుతున్నాయి. ‘కోరికలతో నిండిన ఎద్దుల బండ్లు కదిలిపోతున్నాయి’ అంటాడు కవి. అయితే అవి ‘పల్లె నుంచి పట్నానికి ఏదో ఒకటి మోస్తూ తన వంతు భూమిని కోల్పోతూ సాగుతుంటాయి’ అంటాడు. ఎంత నిజం. ఇలాంటి అనేక వాస్తవాలతో సమకాలీన భౌతిక, భౌతికేతర పరిస్థితులను, సమస్యలను స్పర్శిస్తూ, సృజిస్తూ పాఠకుడిలో ఒక లోతైన ఆలోచనను నాటి అర్థవంతమైన ప్రయత్నం ‘పులి’.
హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ కవితలు రెండు
- 20/10/2014
కవిత – 1
ఏదో
ఓ రోజుకి
ఈ నేల మీద
పులులు ఉండవని
అవి పిల్లల పుస్తకాల్లోకి
చేరిపోతాయని
పులి భయం
పులికన్నా ఎక్కువగా
నాకూ భయమే
అప్పుడు
చేతులు ఎక్కడ ఉంటాయి
పుస్తకాల్ని చదివేందుకు
కళ్ళెక్కడుంటాయి
ప్రెస్‌లు ఉండవు
పట్టణాలూ ఉండవు
‘‘క’’ తర్వాత
‘‘ల’’ లేక ‘‘శ’’
గెంతుతూవచ్చి
పడే పుట ఉండదు
దానిని గాలి
తన జ్ఞాపకాల్లో
పాతుకుంటుంది
పూర్తి పదాన్ని ఆకులు నెమరువేస్తాయి
నేలమీది
కనపడని తారల గుండా
ఆసుపత్రి కిటికీ క్రింద
చనిపోయే మనిషి
పెదవుల్లో
బ్రతికే గీతం అవుతుంది
నాకు భయం
మామూలు సీదా సాదా భయం
భయం ఎక్కడ ఉంటుంది!
కవిత – 2
గోధూళి వేళ
నగరం గోపురం నుండి
ఓ మనిషి
అరుస్తున్నాడు
గాలిమరల రెక్కలు
నేత చేతులు
నడిచే కాళ్ళు
అన్నీ గతించిపోతున్నాయి
కానీ
మనం బ్రతకాలి
పులితోబాటు బ్రతకాలి
పులి లేకుండా బ్రతకాలి
నీళ్ళలాగా
రాళ్ళలాగా
బ్రతక గలగాలి
ఉరి కంబమెక్కి
తిరిగి లేవగలగాలి
సమయం లేకున్నా
స్థలం లేకున్నా
సైకిల్ ట్యూబులో ఉండేంత
గాలి నగరంలో మిగిలినా
బ్రతకాలి
బ్రతకాలి
ఈ నేలపైన బ్రతకాలి
ప్రతి మనిషి బ్రతకాలి
అంగుళం అంగుళం బ్రతకాలి
నిజానికి
నగరంలో ఆ మనిషి లేడు
ఆ గోపురం లేనే లేదు

