కాశ్మీర్ లో నిశ్శబ్ద విస్ఫోటనం

నిశ్శబ్ద విస్ఫోటనం..

ఇరాక్, సిరియాలలో రక్తపాతం సృష్టిస్తున్న ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీ ముఠావారి జెండాలు జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శ్రుకవారం మళ్లీ కనిపించాయట. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులు మన దేశంలో విశ్రమించలేదన్న వాస్తవానికి ఇటీవల జరిగిపోతున్న ఇలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. పెద్ద ఎత్తున బీభత్స ఘటనలు జరిపే దుస్సాహసానికి ఒడిగట్టకపోయినప్పటికీ చడీ చప్పుడూ లేకుండా జిహాదీ యంత్రాంగం కలాపాలు సాగిస్తూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పేలుళ్లు ఇప్పుడు బంగ్లాదేశీయ జిహాదీ హంతకుల డొంకను కదిలించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి చొరబడిన ముగ్గురు టెర్రరిస్టులను చొరబాటు వ్యతిరేక పోలీసు విభాగం వారు కాల్చివేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లోని వర్ధమాన్ జిల్లా ఖాగ్రాగఢ్‌లో జరిగిన బాంబు పేలుళ్లు జిహాదీల ఆక్రమ కార్యక్షేత్ర విస్తృతికి నిదర్శనం. వర్ధమాన్ జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రాజకీయ పక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ రాజకీయ ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ నుంచి చడీ చప్పుడు లేకుండా చొరబడుతున్న బీభత్సకారులు గొప్ప క్రియాశీలకంగా ఉన్నారన్నది బయటపడిన నిజం. ఈ పేలుడు ఫలితంగా హతులైన ఇద్దరూ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉత్ ముజాహిద్దీన్ బీభత్స సంస్థకు చెందిన వారని దర్యాప్తు చేస్తున్న భద్రతావిభాగాలవారు నిగ్గు తేల్చారు. అరెస్టయిన మరో నలుగురు అదే సంస్థకు చెందిన వారన్నది పోలీసుల నిర్ధారణ. వీరందరికీ బంగ్లాదేశ్‌కు చెందిన మరో జిహాదీ హంతక ముఠా హుజీతో కూడ చక్కటి సంబంధాలు ఉన్నట్టు భద్రతా దళాల వారు ధ్రువపరచారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగంగా చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ సంస్థవారి భారత వ్యతిరేక బీభత్స కాలాపాలలో ఈ పేలుళ్లు భాగం. పేలుళ్లు ప్రమాదవశాత్తు జరిగాయా లేక కావాలని ఈ జమాత్ ఉత్ ముజాహిద్దీన్ హంతకులు పేలుళ్లు జరిపారా అన్నది అప్రధానమైన అంశం. అంతమంది హంతకులు అంతపెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను నిలువ చేసి నిర్భయంగా నిర్వహిస్తుండడం ప్రధాన సమస్య. ఈ పేలుళ్లు జరిగిన తరువాత ఘటనా స్థలంలో సంచుల కొద్దీ పేలుడు పదార్ధాలు, సామగ్రి పట్టుబడ్డాయి. ఆ తరువాత బెంగాల్‌లోని పురూలియా జిల్లా రఘునాథ్‌పూర్ సమీపంలో 11 వేల చిన్న పెద్ద బాంబులు, 27వేల జిలిటెన్ విస్ఫోటక పదార్ధాల ముక్కలు పట్టుబడ్డాయట. పశ్చిమ బెంగాల్ అంతటా టన్నుల కొద్దీ పేలుడు పదార్ధాలు నిక్షిప్తమై ఉండడానికి ఇలా ఇదంతా నిదర్శనం.
జమ్మూ కాశ్మీర్‌లో ఐఎస్‌ఐఎస్ అన్న జిహాదీ బీభత్స సంస్థవారి, ఆనవాళ్లు లభించడం శుక్రవారం మొదటిసారి కాదు. గతంలో కూడ ఐఎస్‌ఐఎస్ కదలికలు శ్రీనగర్‌లోను కాశ్మీలోయ ప్రాంతంలోను ధ్రువపడినాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ హంతకులు లేరని ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అబద్ధాలు చెప్పడం బీభత్సకారులకు బలం కలిగిస్తున్న దశాబ్దుల వైపరీత్యం. 2001లో సిమి వంటి జిహాదీ ముఠాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తమ రాష్ట్రంలో సిమి ఉగ్రవాదులు ఎవరూ లేరని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ధ్రువపరచడం చరిత్ర. తమ రాష్ట్రంలో ఫలానా జిహాదీ ముఠాకు చెందిన టెర్రరిస్టులు పట్టుబడలేదని ముఖ్యమంత్రులు చెప్పవచ్చు. కానీ తమ రాష్ట్రంలో హంతక ముఠాలు లేనేలేవని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలడు? తెలియని విషయాన్ని తెలిసినట్టు అబద్ధాలు చెప్పడం ద్వారా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించడానికి కాక కప్పిపుచ్చడానకి యత్నించడం జాతీయ భద్రతా కుడ్యాన్ని ఛిద్రం చేయడానికి పదే పదే దోహదం చేసింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడదే పని చేస్తోంది. తమ రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ హంతకులెవ్వరూ లేరన్నది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా 14వ తేదీన చేసిన నిర్ధారణ. కొంతమంది దుండగులు ఐఎస్‌ఐఎస్ జెండాలను ఊపుతూ ఊరేగిన ఘటన గురించి ముఖ్యమంత్రి చేసిన స్పష్టీరణ ఇది. ఆ జెండాలను ఊపినవారు కేవలం మూర్ఖులని వారు ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లు కాదని ఉమర్ అబ్దుల్లా కనిపెట్టాడు. పైగా ఈ జెండాలు దురదృష్టవశాత్తు ప్రచార మాధ్యమాల వారి కళ్లలో పడ్డాయని కూడ అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. దురదృష్టం ఎవరిది? ఎవరిదైనప్పటికీ ఆయన ఇలా స్పష్టీకరణ ఇచ్చిన తరువాత మూడు రోజులు గడవకముందే 17వ తేదీన శ్రీనగర్‌లో మరోసారి ఐఎస్‌ఐఎస్ వారి జెండాలు, చిహ్నాలు దర్శనమిచ్చాయట.
ముఠాలు వివిధ పేర్లతో చెలామణి అవుతున్నప్పటికీ వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే. కార్యక్రమం ఒక్కటే, స్వభావం ఒక్కటే. బెంగాల్‌లో రెండవ తేదీన పేలుళ్లు జరిపిన జమాత్ ఉత్ ముజాహిద్దీన్ వారు హుజీతో అనుసంధానమై ఉన్నారు. ఈ హుజీ జమాత్ ముఠాలు కాశ్మీర్‌లోకి చొరబడిన జైష్ ఏ మహమ్మద్ ముఠాతోను, లష్కర్ ఏ తయ్యబాతోను, జమాత్ ఉద్ దావా తోను అనుసంధాన వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. వీటన్నింటికీ ఇండియన్ ముజాహిద్దీన్, సిమి వంటి ముఠాలతో చక్కటి సంబంధాలున్నాయి. ఇప్పు డు ఇరాక్‌లోని, సిరియాలోని ఐఎస్‌ఐఎస్ కూడ మనదేశంలోకి భారీగా చొరబడింది. ఈ ముఠా కూడ మిగిలిన జిహాదీ ముఠాల అనుసంధానంలో చేరిపోయింది. అనుసంధాన సమన్వయ వ్యవస్థను పాకిస్తానీ ఐఎస్‌ఐఎస్ ఏర్పాటు చేసిందన్నది జగమెరిగిన రహ స్యం. అందువల్ల హైదరాబాద్‌లో లష్కర్‌లు పట్టుబడినా, నేపాల్ సరిహద్దులలో జమాత్ ఉద్ దావా హంతకులు సంచరించినా, బెంగాల్‌లో హుజీ మద్దతుదార్లు పేలుళ్లు జరిపినా, కాశ్మీర్‌లోకి జైష్ ఏ మహమ్మదీలు చొరబడినా..ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌ఐఎస్ వారి విస్తృత పన్నాగంలో భాగం మాత్రమే. ముంబయికి చెందిన నలుగురు యువకులను ఐఎస్‌ఐఎస్ వారు ఇంటర్‌నెట్ వ్యవస్థ ద్వారా జిహాదీ హంతకులుగా తీర్చిదిద్దినట్టు గత జూలైలో బయటపడినప్పుడు మన నిఘా వ్యవస్థ ఉలిక్కిపడింది. ఈ నలుగురు హంతకులూ మనదేశం నుండి చల్లగా జారుకుని ఇరాక్‌లో తేలారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరారు. ఇలా చేరడం మళ్లీ మనదేశానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున బీభత్స చర్యలు జరపడానికై శిక్షణ పొందడంలో భాగం. వీరిలో ఒకడు ఇరాక్‌లో హతుడయ్యాడట. మిగిలిన ముగ్గురి జాడ లేదు. ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ అపహరించిన 39 మంది భారతీయ కార్మికుల జాడ ఇంతవరకు తెలియరాలేదు. భారత్‌ను బద్దలు కొట్టే తాలిబన్, అల్-ఖైదా, జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబాల బీభత్స వ్యూహంలో ఐఎస్‌ఐఎస్ ఇప్పుడు ప్రధాన పాత్రధారి…
హైదరాబాద్‌కు చెంది యువకులు కొందరు ఐఎస్‌ఐఎస్‌లో చేరి బెంగాల్‌లో కలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. మరో 15 మంది హైదరాబాదీలు కూడ ఐఎస్‌ఐఎస్‌లో చరిపోయినట్టు నిఘా అధికారులు అనుమానించినట్టు సెప్టెంబర్‌లో ప్రచారమైంది. వీళ్లంతా ఇప్పుడెక్కడ ఉన్నారు? బెంగాల్‌లో జరిగిన పేలుళ్ల నిర్వాహకులతో వీరికి సంబంధాలు ఏర్పడి ఉండినట్టయితే ఆశ్చర్య పోనక్కరలేదు. బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం!

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.