పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

‘మీరు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు. మీరు చిన్నతనంలో బాలకార్మికుడిగా టీ అమ్మారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పనొకటుంది. బాల్యంలో చిన్నారులు పనిచేయాల్సిన దుస్థితిలో ఉండకూడదు. ఆ వయసులో వారికి చదువే ముఖ్యం. ఉచితంగా వారికి అది అందాలి.. మీరు ఈ విషయంపై దృష్టిపెట్టాలి.’ – పనె్నండేళ్ల వయసులో చిన్నారుల చదువు కోసం పరితపించి.. ఒక్కో అడుగేస్తూ వచ్చిన 60 ఏళ్ళ కైలాష్ సత్యార్థి నరేంద్రమోదీకి పంపిన ట్వీట్. ‘మా అమ్మ చేసిన టిఫిన్ పట్టుకుని స్కూలుకు బస్సులో బయలుదేరా.. దగ్గరగా వచ్చిన కొందరు నీ పేరేంటి? అని అడిగారు…మలాలా అన్నాను…అంతే బుల్లెట్లవర్షం కురిపించారు… రెండేళ్లుపట్టింది బతకిబయటపడటానికి…ఇప్పుడు తాలిబన్లు ఎదురై చంపేస్తామన్నా.. భయమేం లేదు. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో వారికి చెబుతా… వారు చేస్తున్న పని తప్పని చెబుతా, బాలలు తమ హక్కుల కోసం పోరాడాలని చెబుతా…’ -ఇది 17 ఏళ్ల మలాలా మాట. పనె్నండేళ్ల వయసులో పలకరించిన మృత్యువుతో పోరాడి గెలిచిన చిన్నారి మాట… * * * ఆడపిల్లలకు చదువెంత అవసరమో వివరిస్తూ ప్రచారం చేస్తోంది మలాలా. చిన్నారులంతా పనిలోకి కాదు.. బడిలోకి వెళ్ళాలంటారు కైలాష్.. ఈ ఇద్దరూ కేవలం అలా చెప్పి ఊరుకోలేదు. ప్రాణాలకు తెగించి పోరాడారు. అందుకే వారు పిల్లల దేవుళ్లయ్యారు. అవిరళ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది నోబెల్‌శాంతి బహుమతి వరించింది. ఎవరీ కైలాశ్ సత్యార్థి మధ్యప్రదేశ్‌లోని విదిషలో పుట్టిన కైలాస్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్ట్భద్రుడు. భోపాల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని, చిన్నారులకు చదువుకునే అవకాశాలు కల్పించాలని, అక్రమ రవాణా, వెట్టిచాకిరీ నుంచి పిల్లలను రక్షించాలని భావించారు. అందుకోసం ఒంటరిగా పోరాటం ప్రారంభించిన ఆయన ఇప్పిడు దాదాపు 140 దేశాల్లో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. న్యూఢిల్లీలో భార్య, ఇద్దరు పిల్లలు, తాను విముక్తి కల్పించిన పిల్లలతో కలిసి ఉంటున్న ఆయన ప్రస్థానం ఇది. బుక్‌బ్యాంక్‌తో మొదలు పాఠశాల విద్య చదివేటప్పుడు తనతోసహా చాలామంది పిల్లలకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడం పెద్దసమస్యగా మారింది. కొంతమంది స్నేహితులతో కలసి పుస్తకాల సేకరించాలనుకున్నారు. ఓ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన కైలాష్‌సత్యార్థి అందులో సభ్యత్వం కావాలంటే ఒక విద్యార్థికి కావలసిన పుస్తకాలు కొనివ్వాలని షరతు పెటారు. కేవలం ఒక్కరోజులో వారు 2వేల పుస్తకాలు సమకూర్చారు. దానిని బుక్‌బ్యాంక్‌గా మార్చి పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఇది అతడి చిన్ననాటి పని. ఉన్నత చదువు పూర్తయిన తరువాత 1980లో మరో అడుగువేశారు. బచ్‌పన్ బచావో ఆందోళన్ పిల్లలను చదివించాలని, పనిలోకి నిర్బంధంగా దించడం, బాండెడ్ లేబర్‌గా పనిచేయించడం తప్పని, దానిని అడ్డుకోవాలని భావించారు. దేశంలోని తివాచీలు, కంబళ్ల పరిశ్రమల్లో పిల్లలతో ఎక్కువగా పనిచేయిస్తున్నారని గమనించారు. దీనిని అడ్డుకునేందుకు కలసిరావాలంటూ పిలుపునిస్తూ బచపన్ బచావో ఆందోళన్ పేరిట ఓ సంస్థను 1980లో ప్రారంభించారు. స్నేహితులు, సంస్థ సభ్యులతో కలసి బాలలతో పనిచేయిస్తున్న పరిశ్రమలు, కార్యాలయాలపై దాడులు చేసి వారిని రక్షించేవారు. 2004లో ఓ సర్కస్ కంపెనీ, 2011లో ఓ బట్టల పరిశ్రమల్లో బాలకార్మికులను విడిపించినప్పుడు యాజమాన్యాలు దాడులు చేయించడంతో తీవ్రంగా గాయపడినా మొక్కవోని దీక్షతో అడుగుముందుకేశారు సత్యార్థి. తరువాత ఆయనతో పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. దక్షిణాసియాలో 750 ఎన్‌జీఓలు ఇప్పుడు చేదోడుగా ఉన్నాయి. గ్లోబల్‌మార్చ్‌తో విశ్వఖ్యాతి బాలబాలికల హక్కుల సంరక్షణ, ఉచితవిద్య కోసం ఉద్యమించిన ఆయనకు యునెస్కో బాసటగా నిలిచింది. అదే లక్ష్యంతో 1998లో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌మార్చ్ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. 103 దేశాలు, 20 వేల పౌరసంస్థలు, 72 లక్షల మంది పౌరులు ఆయనతో నడిచాయి. జెనీవాలో జరిగిన సదస్సులో చిన్నారుల హక్కుల రక్షణకోసం ఓ తీర్మానం చేస్తే 140 దేశాలు సంతకం చేశాయ. బాలమిత్ర గ్రామ్ పిల్లలకు చదువుతోపాటు వారి హక్కుల రక్షణ, వారికి నచ్చిన వాతావరణం సృష్టించడం, పాఠశాలల్లో బాలబాలికలకు వౌలిక వసతులు ఏర్పడేలా చూడటం కోసం బాలమిత్ర గ్రామ్ కార్యక్రమాన్ని 2001లో ప్రారంభించారు. చురుకైన విద్యార్థులతో బాలపంచాయతీ పేరుతో ఓ కమిటీని వేయడం, ఆ గ్రామంలో, పాఠశాలల్లో మార్పులపై చర్చించి, ఉద్యమించి, సాధించడం వారి పని. ప్రజలూ వారికి అండగా నిలిచారు. ఇప్పటికి ఇలా 11 రాష్ట్రాల్లో 317 గ్రామాల్లో బాల పంచాయతీలు పనిచేస్తున్నాయి. మరో 8 గ్రామాలను ఇప్పుడు దత్తత తీసుకున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకోవడమే తప్ప పనుల్లోకి వెళ్లరు. వెళ్లనివ్వరు. ఆ ఇద్దరు.. ఇలా బాలమిత్ర పంచాయతీ సభ్యులుగా ఉన్న ఇద్దరు చిన్నారులకు దక్కిన గౌరవమేమిటో తెలుసా… జైపూర్‌కు చెందిన 14 సంవత్సరాల ఓం ప్రకాష్‌కు ఇంటర్నేషనల్ చైల్డ్ పీస్ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసే న్యాయనిర్ణేతల బృందంలో సభ్యుడిగా (జ్యూరీ) బాలమిత్ర గ్రామ్ విద్యార్థి, పనె్నండేళ్ల రాకేశ్‌కుమార్‌కు అవకాశం దక్కింది. * రగ్‌మార్క్-గుడ్‌వీవ్ కైలాష్ సత్యార్థికి ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన ప్రయోగం ఇది. 1994లో ఇది ప్రారంభించారు. బాలకార్మికులతో పనిచేయించకుండా తయారు చేసిన కంబళ్లు, తివాచీలకు ఇచ్చే సర్ట్ఫికెట్ ఇది. ఆయా ఉత్పత్తులపై ఈ రగ్‌మార్క్ ఉంటే వాటికి విలువ ఎక్కువ. ఈ సర్ట్ఫికెట్ కోసం ఆయా సంస్థలు తగుమాత్రం ఫీజు చెల్లించాలి. ఎగుమతి చేసే రగ్గు లేదా కంబళి విలువలో 0.25 శాతం, దిగుమతి చేసుకున్నప్పుడు ఆయా వస్తువుల షిప్‌మెంట్ విలువలో 1.75 శాతం ఫీజు చెల్లించాలి. ఆ మొత్తాలను చిన్నారుల చదువు, శిక్షణ, సంస్థల నిర్వహణకు వెచ్చిస్తారు. మొదట ఆసియా దేశాలకే ఈ రగ్‌మార్క్ పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపు 115 దేశాలు కావాలనడంతో దానిని గుడ్‌వీవ్‌గా మార్చారు. కేవలం రగ్గులు, కంబళ్ల పరిశ్రమలకే గాక ఫుట్‌బాల్, కోకోకోలా, గార్మెంట్ పరిశ్రమల్లోనూ పధ్నాలుగేళ్లలోపు పిల్లలతో పనిచేయించకూడదని ఇప్పుడు పోరాడుతున్నారు. 83525 కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వ చ్చిందని తెలిసిన వెంటనే బచపన్ బచావో ఆందోళన్ కార్యాలయానికి మీడియా ప్రతినిధులు పోటెత్తారు. అభిమానులు పెద్దసంఖ్యలో చేరిపోయారు. హాస్పిటల్‌కు వెళుతూండగా సమాచారం అందుకున్న కైలాష్ సతీమణి సుమేధ శరవేగంగా భర్తకు అభినందనలు చెప్పేందుకు కార్యాలయానికి వచ్చారు. అయితే, లోపలికి వెళ్లేందుకు ఆమెకు గంటపైగానే పట్టింది. ఈలోగా నింపాదిగా బయటకు వచ్చిన కైలాష్ ప్రత్యర్థి, ఆయన సిబ్బంది ఓ కాగితం తీసుకొచ్చి నోటీస్ బోర్డుపై అతికించారు. ఆ కాగితంపై ఓ నెంబర్ రాసి ఉంది. అది 83525. ఆ క్షణం వరకు వెట్టిచాకిరీ, నిర్బంధం నుండి బిబిఎ రక్షించినవారి సంఖ్య అది. తొలిచూపులోనే…. కైలాష్ సత్యార్థి సుదీర్ఘపోరాటం వెనుక సతీమణి సుమేధ మద్దతు ఉంది. స్థానిక పత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమెను కైలాష్ చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ మేగజైన్‌కు తరచూ ఆర్టికల్స్ రాస్తూండే సత్యార్థి ఓరోజు సుమేధ తండ్రితో అసలు విషయం చెప్పారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. 36 ఏళ్లక్రితం అక్టోబర్ 8న వారికి వివాహం అయింది. ఆ తరువాత ఏడాదికి బచపన్ బచావో ఆందోళన్ సంస్థను ప్రారంభించారు. ఏడాది పిల్లాడికి పాలు కూడా కొనే పరిస్థితిలో లేం. అయినా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు అంటారు సుమేధ. మేం తొలిసారిగా కలుసుకున్నది ఆక్టోబర్‌లోనే. మా పెళ్లి అయింది కూడా అదే నెలలోనే. మావారికి నోబెల్ వచ్చింది కూడా ఈ నెలలోనే అంటూ ఆనందం వ్యక్తం చేసిన సుమేధ ఆనందానికి ఎంతో అర్థం ఉంది. ఆయన సుమేధను దేవీజీ అని ప్రేమగా పిలుస్తారు. కైలాష్‌ను ఆమె సాబ్‌జీ అని పిలుస్తారు. అది వారిమధ్య అనురాగబంధాన్ని బలోపేతం చేసే సంబోధన. వారి కుమారుడు భువన్‌రిభు లాయర్. బచపన్ బచావో ఆందోళన్ సంస్థలోనే పనిచేస్తున్నారు. కైలాస్ తనయ అస్మిత. ఆమె ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేట్. ఆమె కూడా చిన్నారుల కోసం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకుంటున్నారు. మా నాన్నకు నోబెల్ వస్తుందని ఐదేళ్లక్రితం అనుకున్నాం, అప్పుడు రాలేదు. ఇప్పుడు అనుకోకుండా వచ్చింది. ఇది పిల్లలకు దక్కిన గౌరవం అని అస్మిత అంటోంది. ఆర్యసమాజ్‌లో సభ్యుడైన తన మామగారి సూచనతో కైలాష్ పేరు మార్చుకున్నారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సత్యార్థి అసలు పేరు కైలాష్ శర్మ. అయితే కులమత బేధాలు ఉండకూడదన్న గాంధీజీ స్ఫూర్తితో ఆయన పేరును కైలాష్ సత్యార్థిగా మార్చుకున్నారు. ముక్తిఆశ్రమ్-బాల ఆశ్రమ్ బచ్‌పన్ బచావ్ ఆందోళన్ సభ్యులు, తాను, మీడియా ప్రతినిధులు, పోలీసులు కలసి బాలకార్మికులు ఉన్న వ్యవస్థలపై పక్కాప్లాన్‌తో దాడులు చేసి చిన్నారులను రక్షించేవారు. ఆ తరువాత వారిని ముక్తి ఆశ్రమ్‌కు చేర్చేవారు. ఇది ఢిల్లీలో ఉంది. బట్టలు, ఆహారం, మందులు అందించి వారికి ధైర్యం నూరిపోసేవారు. వారి బంధువుల ఆచూకీ తెలుసుకుని వారిదగ్గరకు చేర్చేవారు. అనాథ బాలకార్మికులుంటే వారిని రాజస్థాన్‌లోని విరాట్‌నగర్‌లో ఉన్న బాల ఆశ్రమ్‌కు తరలించేవారు. వారిని దీర్ఘకాలంగా అక్కడే ఉంచి చదువు చెబుతారు. వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.