మన హీరోలు మారుతున్నారా?!

మన హీరోలు మారుతున్నారా?!

ఇప్పటికే విడుదలై మంచి టాక్‌నీ, కమర్షియల్ విజయాన్నీ సొంతం చేసుకున్న ‘మనం’, ‘దృశ్యం’, ‘లెజెండ్’ సినిమాలు ఒక రకంగా తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసాయని చెప్పాలి. ఇదిలా ఉండగానే ‘గోపాల..గోపాల’ సినిమా అరుదైన కాంబినేషన్‌తో అనౌన్స్ అవడం ఒక ధోరణికి అలవాటుపడ్డ సగటు ప్రేక్షకులనేకాక, సినీ ప్రేమికులను, మేధావులను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఈ పరిణామాలు ప్రామాణికం కాకపోయినా, మారిన, మారుతున్న మన హీరోల దృష్టికోణానికి అద్దంపడుతున్నాయా? ఇమేజ్ చట్రంలో బిగుసుకుపోయి, అదే ‘సింహాసనం’అనే భ్రమలో మునిగితేలుతున్న మన హీరోల వైఖరిలోని మార్పుకు ఇది ఏమైనా సంకేతాలుగా నిలుస్తున్నాయా? కొంపదీసి మన హీరోలు మారారా? అనే చర్చను లేవనెత్తుతున్నాయి. ======================== 1980 దశకం అనంతరం తెలుగు తెరపై దూసుకొచ్చిన హీరోల విషయంలో చాన్నాళ్ళుగా ఒక విమర్శ ఉంది. ‘ఈ హీరోలు బాలీవుడ్ హీరోలలా ఒకరితో ఒకరు కలవరు. ఎవరి ఈగో జోన్‌లలో వాళ్ళుంటారు. స్టార్‌డమ్ విషయంలోనూ, నెంబర్స్‌గేమ్ విషయంలోనూ ఒకరితో ఒకరికి సరిపడవు’అనేవే ఆ విమర్శలు. ఆ తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల విషయంలో గత కొంతకాలం వరకూ ఈ వ్యాఖ్యానాలు నిజం అని చెప్పడానికి తగిన ఉదాహరణలే ఉండేవి. కానీ ఇటీవలి కాలపు పరిణామాలను, సినిమాల పరంగా కాంబినేషన్‌ల పరంగా వస్తున్న మార్పులను గమనిస్తే, ఈ హీరోల వైఖరిలో మార్పు వచ్చిందేమో! అసలు ఈ హీరోలు మారారేమో! అనే ఆలోచనలు సాధారణ ప్రేక్షకుడి మనసులో చెలరేగుతున్నాయి. హీరోల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు, వైరుధ్యాలను ఆసరాగా చేసుకుని ఇంతకాలం తమలో తాము శత్రువులుగా భావించుకున్న ఫ్యాన్స్‌ల మనసులలో కూడా ఇప్పుడు ఈ రకపు ఆలోచనలే పొడసూపుతూ, అందరిమధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనే సానుకూల దృక్పథం రూపొందుతోంది. ఇది ఆహ్వానించదగిన అంశం అనడంలో సందేహం లేదు. ‘మనం-దృశ్యం-లెజెండ్’ త్రయం మన సీనియర్ తెలుగు హీరోల వైఖరి మారింది అనడానికి ఇటీవలి తాజా ఉదాహరణలుగా నిలుస్తున్న సినిమాలు- మనం, దృశ్యం, లెజెండ్ అని చెప్పాలి. ‘మనం’ సినిమాలో నాగార్జున చూపించిన చొరవ, చేసిన ప్రయోగం మూడుతరాల అక్కినేని నటులను ఒక్క కథలో ప్రత్యక్షమయ్యేలా చేసింది. కథ, కథనం, మానవ భావోద్వేగాలు, అనుబంధాల విషయంలో పరిణతిని ప్రదర్శించి నాగార్జునలోని నిజమైన నట నిర్మాతను వెలికి తీసింది. మరోవైపున ‘కేడి’, ‘రగడ’, ‘్భయ్’వంటి మాస్ ఇమేజ్ నుంచి రియలిస్టిక్ తరహాలో నాగార్జున సహజ నటనను ప్రదర్శించగలడని ప్రూవ్ చేసాయి. అలాగే ‘దృశ్యం’కూడా! మలయాళ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాని మహిళా దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ నటించడానికి అంగీకరించడం ఒకవైపు, ఈ సినిమాలోని పాత్రపరంగా ఆయన ఇద్దరు టీనేజ్ ఆడ పిల్లలకు మధ్యవయసు తండ్రిగా నటించడం వెంకటేష్ దృష్టికోణంలోని మార్పుకు సంకేతాలే అని భావించాలి. బాడీగార్డ్, షాడో, మసాలా వంటి సినిమాలలోని యాక్షన్ హీరో ఇమేజ్‌నుంచి దృష్టి మరల్చి ఫ్యామిలీ పర్సన్‌గా మధ్యతరగతి కుటుంబీకుడి పాత్రని పోషించడం తన వాస్తవిక వయోరీతికి దగ్గరగా తన పాత్ర ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. ఇక, ‘లెజెండ్’లో జగపతిబాబు మొదటిసారిగా విలన్‌గా నటించి, ఇంతకాలంగా తనకు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్‌నుంచి క్యారెక్టర్ పరంగా కొత్తగా ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఇదే ఊపులో వెంకటేష్- పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కలిసి ‘గోపాల… గోపాల’ సినిమాలో నటిస్తుండటం మరింత ముచ్చటగా భావించడంలో తప్పులేదు. మొన్నామధ్య వెంకటేష్- మహేష్‌బాబు ఇద్దరూ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో నటించి, ఆ సినిమాని ఏ రేంజ్‌లో హిట్ చేసిందీ చూసాం. ఇప్పుడు ఈ ‘గోపాల… గోపాల…’కూడా ఆ దారిలోనే వెళ్తుందనే ఊహలు నిజం అవుతాయనే చెప్పొచ్చు. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’ సినిమాకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా రానున్న కాలంలో మరిన్ని అరుదైన కాంబినేషన్ సినిమాలకి తెర తీసే అవకాశం ఉంది. సీనియర్ హీరోల దృష్టి మారిందా? ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరూ తమనితాము సరికొత్తగా తెరపై ఆవిష్కరించుకోవాలనే తాపత్రయంలో ఉన్నారనే విషయాన్ని, వారు ప్రస్తుతం నటించిన, నటిస్తున్న సినిమాలు తేటతెల్లం చేస్తున్నాయి. వీరు ఇప్పుడు చేస్తున్న సినిమాలు, ఎంపిక చేసుకుంటున్న కథలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ లెక్కన మన తెలుగు సీనియర్ హీరోలు మారారు అనడానికి ఈ సప్త సూత్రాలను కారణాలుగా చెప్పవచ్చు: 1.ఇదివరకటిలా కథను దాటేసి, కథాతీతంగా ప్రవర్తించే హీరోలా కాకుండా కథల్లో ఒదిగిపోయే కథానాయకుడిగా మారడం. 2. పాత్రోచితంగా, పాత్ర స్వభావం- పరిధుల మేరకు నటించడం, ఆ పాత్ర తరహాలోనే సహజంగా ప్రవర్తించే ప్రయత్నం చేయడం. 3. ఇమేజ్ పేరుతో కథని నేలమీద నడవకుండా చేసే ధోరణికి గుడ్‌బై చెప్పడం. 4. వయసుకు తగిన పాత్రలను, కథలను ఎంపిక చేస్కోవడం. 5. తమ శారీరక, వయోపరమైన పరిమితులను గమనించి, ఆ లోపాలను అధిగమించడానికి కంటెంట్‌ను ఆశ్రయించడం. 6. యంగ్ హీరోలతో పోటీపడటంకోసం కథలలో యంగ్ హీరోల కథలనే సెలెక్ట్‌చేసుకోవడానికి స్వస్తిపలకడం. 7. ఇప్పటి యంగ్ హీరోలతో రేస్‌లో పోటీపడటానికి పకడ్బందీ స్క్రిప్ట్‌లనే సాధనంగా గుర్తించడం. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలందరూ (ఒకరిద్దరు మినహా) ప్రస్తుతం ఈ ‘సప్తసూత్ర నియమాల’నే తమ ‘బాటమ్‌లైన్’గా మార్చుకున్నారని, ఇటీవలి వారి సినిమాలు- కథలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆలెక్కన చూస్తే మన హీరోలు మారారనే విషయం కూడా సులభంగానే వెల్లడవుతుంది. ‘సైకాలజీ’ ఏం చెబుతోంది? సీనియర్ హీరోలలో పొడసూపుతున్న ఈ మార్పు సగటు సినీ ప్రేమికునికి కొత్త తరహా వినోదాల విందును, కొత్తతరం సినిమాలను అందిస్తున్నది కనుక ఈ మార్పును అందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’ విషయంలో సైకాలజీ ఏం చెపుతుందో ఒకసారి గమనిద్దాం. సైకాలజీలో వ్యక్తుల ప్రజ్ఞ (ఇంటెలిజెన్స్)ను కొలవడానికి ఆల్‌ఫ్రెడ్ బీనె వంటి మనోవైజ్ఞానిక శాస్తవ్రేత్తలు ఒక కొలమానాన్ని తయారుచేసారు. అదే 1) శారీరక వయస్సు 2) మానసిక వయస్సు. అంటే, పుట్టినప్పటినుంచీ వయస్సుపరంగా భౌతికంగా మనిషిలో వచ్చే శారీరక, జైవిక, దైహిక మార్పులను ‘శారీరక వయస్సు’ అంటారు. అలాగే ఉద్వేగాలు, మేధాశక్తి, జ్ఞానం, స్మృతి, అవధానం వంటి అంశాలపరంగా వయసుతోపాటు వచ్చే పరిణామాలను ‘మానసిక వయస్సు’ అంటారు. ఈ శారీరక-మానసిక వయస్సుల మధ్య పెరుగుదల సమాన స్థాయిలో ఉన్నస్థితినిబట్టి వ్యక్తి మేధాశక్తిని, ప్రజ్ఞాపాటవాలను అంచనా వేస్తారు. అయితే, సినీ రంగంలో ఈ సూత్రంలో చిన్న మార్పుచేసి, ఈ అంశాన్ని విశే్లషణ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే, 1) శారీరక వయస్సు 2) తెరమీది పాత్ర వయస్సు (స్క్రీన్ ఏజ్). చాలా సందర్భాలలో తెలుగు సినిమా హీరో వాస్తవిక వయస్సుకు, తెరమీది వయస్సుకు మధ్య ఏమాత్రం పొంతన లేని వ్యవహారమే అనూచానంగా వస్తోంది. చిత్తూరు నాగయ్య కాలంనుండీ మొదలైన ఈ అపసవ్య ధోరణి, ఆ తర్వాత ఎన్టీఆర్-అక్కినేని-కృష్ణ- శోభన్‌బాబు- కృష్ణంరాజులతో పరాకాష్టను అందుకొంది. ఇదే తరహా వాస్తవిక స్థితిని అంగీకరించలేని స్థితి, ప్రస్తుత సీనియర్ హీరోలలో కూడా అంటువ్యాధిలా ఇంకా కొనసాగుతోంది. అందుకే ఐదు పదుల వయసున్న స్టార్ హీరో కూడా, తెరమీద కాలేజ్‌కెళ్ళే కుర్ర హీరో పాత్రలకే మొగ్గుచూపే స్థితి తెలుగు సినీ పరిశ్రమలో రాజ్యమేలుతోంది. హీరోలను ఆశ్రయించే, నడుస్తున్న పరిశ్రమ, అనివార్యంగా కథలని కూడా వారికి అనుగుణంగానే రూపొందించుకోవలసి వస్తోంది.. ఈ విధానాన్ని మనం, దృశ్యం సినిమాలు, రానున్న ‘గోపాల… గోపాల’ సినిమా ఒక రకంగా బ్రేక్ చేసాయ. దీనివల్ల హీరోల శారీరక వయస్సు, తెరమీద వారు పోషించే పాత్రల వయస్సు మధ్య సమన్వయం కుదిరి, వారి నటనలు, హావభావాలలో అసహజత స్థానంలో సహజత్వం, హీరో స్థానంలో వారి పాత్ర స్వభావం ప్రేక్షకులకు సాక్షాత్కారం అవుతుంది. సైకాలజీ సూత్రాలు చెప్పినట్లుగా సీనియర్ హీరోలు ఇలాగే తమ శారీరక- తెర వయసు పాత్రలను సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళడం హీరోల మారిన తీరుకు సూచికగా మారుతుంది. ఈ మార్పుకు కారణాలేంటి? తెలుగు సీనియర్ హీరోలలో ఇపుడు కనిపిస్తున్న ఈ ‘మార్పు’వెనుక అసలు కారణాలేంటి? హీరోలలో జ్ఞానోదయం కావడమా? తెలుగు సినిమాని ఉద్ధరించే లక్ష్యమా? అని ఆలోచిస్తే, ఇవేవీ కావు అని కొంచెం లోతుగా ఆలోచిస్తే అవగతమవుతుంది. సీనియర్ హీరోలకు ప్రస్తుతం క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గతంలో ఉన్నంతగా లేదు. కొత్త తరం హీరోల వైపే యువ ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఈ సీనియర్ హీరోల మార్కెట్ వాల్యూ, క్రేజ్ తగ్గిపోయాయి. ఈ వాస్తవాన్ని గమనించిన ఈ హీరోలు ఇంకా ‘కుప్పిగంతులు’ ఎందుకులే అని గుర్తించి, దానిని బాహాటంగా అంగీకరించడానికి మనసొప్పక, తమలోని మార్పుకు అందమైన కారణాలను చెపుతున్నారు. వారి మార్పుకు వారిలోని సంస్కరణవాదాన్ని, సంస్కారాన్ని కొత్తగా హైలైట్ చేసుకుంటున్నారు. అంతేతప్ప తెలుగు సినిమాని ఉద్ధరించాలని కాదు అనే విమర్శ వినిపిస్తోంది. ఒకవేళ, మన తెలుగు హీరోల ఆలోచనాధోరణి, వైఖరి మారింది నిజమే అయితే ‘దృశ్యం’లాంటి ప్రయోగాలు నవతరం హీరోలెవరైనా చేస్తే నమ్మొచ్చు. కానీ సీనియర్ హీరోలు చేస్తున్న ఈ సినిమాల ఆధారంగా మొత్తం తెలుగు హీరోల ఆలోచనలోనే మార్పు వచ్చిందనడం తప్పని, గత్యంతరం లేని స్థితిలోనే సీనియర్ హీరోలు ఈ ప్రయత్నాలను, ప్రయోగాల పేరుతో చేస్తున్నారని, ఇదంతా వారి అస్తిత్వం, ఉనికికోసం చేస్తున్నవే తప్ప, వాటికి ఎలాంటి లోక కళ్యాణపు ఆశయాలని అంటగట్టడం సరికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, సీనియర్ హీరోలు తమ ‘సీనియారిటీ’ని గుర్తించి, దానికి తగినట్లుగా తెరమీద కనిపించాలని కోరుకోవడం వల్ల ప్రేక్షకులకు ఎంత మంచి సినిమాలను వారు అందించారో ‘మనం’, ‘దృశ్యం’సినిమాలు నిరూపించాయి. ఈ మార్పునుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా సీనియర్ హీరోలు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటే అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు ఇద్దరూ ఆనందపడతారనడంలో సందేహం లేదు. నవతరం హీరోలు కూడా మళ్ళీ సీనియర్ హీరోలు అయ్యేంతవరకూ కాలం వెళ్ళబుచ్చకుండా ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన తరుణం కూడా ఇదే! *

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.