విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ
సరసభారతి 71వ సమావేశం గా కవిసామ్రాట్ ,తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కళాప్రపూర్ణ ,పద్మ భూషణ్ స్వర్గీయ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 38వ వర్ధంతిని విశ్వనాధ వారి స్వగ్రామం ఉంగుటూరు మండలం లోని నందమూరులో ,వారి తండ్రిగారు శోభనాద్రి గారు నిర్మించిన శ్రీ గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం లో 19-10-14ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించింది . అతిధులను వేదికపైకి సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ఆహ్వానించగా ఛి బిందు దత్తశ్రీ దైవ ప్రార్ధనతో సభ ప్రారంభ మైంది .విశ్వనాధ చిత్రపటానికి పూలమాల వేసి ,పుష్పాలను సమర్పింఛి ,ఇటీవల హుదు హుదూద్ తుఫాన్ లో అసువులు కోల్పోయిన వారికి ,ప్రఖ్యాత రచయిత్రి ,రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకీ రాణి గారి మరణానికి అందరు లేచి నిలబడి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాము .
సభాధ్యక్ష స్థానం లో ఉన్న నేను ముందుగా ఈ సమావేశానికి నరసరావు పేటనుండి రావలసిన అతిదులలో లెక్చరర్ శ్రీమతి యడవల్లి మనోరమ గారికి నిన్న సాయంత్రం కాలేజి నుండి ఇంటికి ఆటో లో వస్తూండగా యాక్సిడెంట్ జరిగి తీవ్రగాయాలైనాయని ,ఆమె కదిలే స్తితిలో లేదని రాత్రి ఫోన్ వచ్చిందని ,ఆమెను అలా వదిలి తాము రాలేక పోతున్నామని నరసరావు పేట నుండి రావలసిన మరోఅతిధి శ్రీ ప్రసాద్ తెలియ జేశారని చెప్పి అనుకోకుండా జరిగిన ఈ అవాంతరానికి బాధ పడుతున్నానని సభకు వచ్చిన వారికి తీవ్ర నిరాశ కల్గిన్చినందుకు మన్నించమని తెలియ జేశాను .
తరువాత విశ్వనాధ స్వగ్రామం లో వారి వర్ధంతి సభను ,వారిదైన ఆలయం లో నిర్వహించటం చాలా ఆనందం గా ఉందని గ్రామస్తులిచ్చిన సహాయ సహకారాలకు అభినందనలు తెలియ జేశాను .పింగళి లక్ష్మీకాంతం గారి జయంతిసభను జనవరిలో వారి స్వగ్రామం చల్ల పల్లి దగ్గర చిట్టూర్పు లోను,ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి వర్ధన్తిసభను స్వగ్రామం కాటూరులోను ఇప్పుడు ఈ సభను ఇక్కడ , సరసభారతి నిర్వహించటం సరసభారతి అదృష్టమని మూడు చోట్లా స్పందన బాగా వచ్చిందని దీన్ని నిలబెట్టుకోవాలసిన బాధ్యత గ్రామస్తులదేనని చెప్పాను .విశ్వనాధ నేను బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు తెలుగు బోధించారని ,ఆయన కాలం లో నా లాంటి వారు ఉండటం మా లాంటివారికి గొప్ప అదృష్టం అన్నాను .విశ్వనాధ గొప్ప మార్గ దర్శకులని వారి మార్గం వేదమార్గమని ,వారి రచనలు హితోపదేశాలని అన్నాను .రామాయణ కల్ప వృక్షం ,వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలని వాటికి విలువ పెరిగేదేఆని తరిగేది కాదని చెప్పాను .ఆయన ఊహలు వాటిని పోషించేతీరు అనన్య సదృశం అన్నాను . Sarasabharathi 71 141019_0001 
‘’ఆకృతి రామ చంద్రు విభవాకృతి –కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి –కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు రామ దేహాక్రుతి –సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి –కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై ‘’అన్న పద్యం లో రాముడికి సీతకు అభేదాన్ని గొప్పగా సృస్టించారని అన్నాను .రాముడు దయామూర్తి .ఈ విషయం సీత కళ్ళు చెబుతున్నాయి. మించిపోతే ఏం జరుగుతుందో విల్లులాంటి కను బొమ్మలు చెబుతున్నాయి .రాముడు ధర్మ ప్రతిజ్ఞకలవాడు .ఆయన శృంగారం ధర్మ బద్ధం .ఇదంతా సీత కూర్చున్న తీరులో స్పష్టం చేశాడు విశ్వనాధ ..ఇంతటి గొప్ప భావం అద్ద్వైతభావం నిక్షిప్తం చేశాడు విశ్వనాధ .అందుకే ఈ భావనలను ఆపోసన పట్టిన శ్రీ కేతవరపు రామ కోటి శాస్త్రి అంటే కాకతీయ యూని వర్సిటి లో తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి కాత్యాయినీ విద్మహే తండ్రి గారు తనకు ముక్తికంటే విశ్వనాధ సాహిత్య స్నానమే ముక్తి అన్నారు .
‘’పోరాపాటై జని యించితిని ప్రభూ !సరే పోనీ మరీ జన్మకున్ –పరమోపజ్ఞాన నిధాన ,దివ్య దిషణాభ్రాజిష్ణువౌ ,విశ్వనాధ రాసోదంచిత -సాహితీ విమల తీర్ధ స్నాన పూతాత్మగా కరుణిం పం దగు ముక్తి మాట అటుపై –కాశ్మీర నేత్రచ్చవీ ‘’ .విశ్వనాధకు కల్ప వృక్షం లో అంతా యజ్నమయం గా దర్శన మిస్తుంది అదీ అయన గొప్పదనం .
చిన్ననవలలో విశ్వనాధ‘’విశ్వ నాదం ‘’వినిపించాడు .వీరవల్లడు నవలలో వల్లడు హరిజనుడు వల్లప్పా అని అందరూ పిలుస్తుంటే తల్లిని తన పేరు మార్చమని అడుగుతాడు .ఇది తండ్రివిని ఒక కద చెబుతాడు అదే నవల .వల్లడు పాలేరు తాత తండ్రి తాన తరం దాక హరిజనుడు .దొర చనిపోతే కుటుంబాన్ని ఆడుకొంటాడు మళ్ళీ దొర ఇంట్లో దీపం పెట్టె దాక విశ్రమించను అని ప్రతిజ్ఞ చేస్తాడు .అలా చేసి చూపించి తన్ను ప్రేమించిన వారితో సహా సర్వం కోల్పోతాడు .కులం కంటే మానవత్వం గొప్పదన్న సంస్కారం ఉన్నవాడు వల్లడు .ఇందులో ధార్మిక ప్రవ్రుత్తి ఔదార్యం కనిపించి వాటికి వల్లడు ప్రతీకగా చూపాడు విశ్వనాధ .
మా బాబు నవల హింసకు ,పరిహాసానికి గురైన బాబు లో కారుణ్యం ,జీవిత పరిమళం వికసింప జేయటం ఉంది .తనను చంపాలనుకొన్న పాముల వాడికి ప్రాణ భిక్ష పెట్టటం పరాకాష్ట.కుశాలమ్మ గొప్ప పాత్రకూడా .కుణాలుని శాపం నవలలో స్నేహ మాధుర్యం గొప్పతనం వివరణ ఉంది. అధికారదుర్వినియోగం ,పదవీకాంక్ష పనికి రాదనీ చెప్పాడు వీటన్నిటికంటే స్నేహం ,ధర్మ రక్షణ ,మానవత ,మంచితనం అవసరం అని చెప్పెనవల .
హాహా హూ హూ నవలలో మానవుని అల్పత్వాన్ని తెలియ జేశాడు విశ్వనాధ .-లండన్ ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద ఒక వింత జంతువు పది ఉంటే చూడటానికి చాలా మందివస్తారు భాషా వేత్తలూ ,మతపెద్దలూ చేరతారు .ఆ జంతువూ మెడవరకు మనిషి. తల గుర్రం తల .జూలు ,నిక్కించిన చెవులు .చేతులకు కాళ్ళకు కడియాలు .ఒళ్ళంతా గాయాలు మూర్చలో ఉంటుంది .పది హీను రోజుల తర్వాత ‘’కిం గతోస్మి ‘’ అంటుంది అంటే నాకు ఏమైంది ?అని .ఇదివిన్న భాషా పండితుడు దానికి సంస్కృతం వచ్చు అని గంతులేస్తాడు .ఒక బిషప్ వచ్చి దాన్ని ఏ కులం అని అడిగితె ‘’ఆహా అల్పతామనుష్యాణాం’’అంటుంది అంటే యెంత అల్ప బుద్ధి మానవులది అని అర్ధం .భారతీయ సంస్కృతీ భారతీయత ,భాష గోప్పతనాలను ఇందులో చెప్పాడు .
కడిమి చెట్టు చారిత్రాత్మక నవలలో కదంబం అనే వంశం కదా .ఆ చెట్టు తో బాటు శుక్ల పక్ష చంద్రుని గా పెరుగుతాడు మయూర శర్మ అనే కుర్రాడు.శాత వాహన రాజ్యం లో స్తానా కోడూరు పల్లవుల వశమౌతుంది పల్లవులు పాశవికం గ మయూరుని తల్లి తండ్రి అక్క తాతలను చంపేస్తారు .వారిపై పగ తీర్చుకోవాలనుకొంటాడు శర్మ .అతన్ని రామ శర్మ పెంచుతాడు .నిద్రలో కూడా శత్రువును చంపుతున్నట్లే కలకనే వాడు.ఈ బాలుడిలో మహా పురుష లక్షణాలు గుండెలో శౌర్య రేఖ ఉన్నాయని వైద్యుడు గమనిస్తాడు .చివరికి పగ తీర్చుకొంటాడు మయూర శర్మ .ఇందులో జాతిని సంరక్షించుకోవటం ,తెగువ సాహసం సంస్కృతీ పరిరక్షణం ఉన్నాయి .
ఇప్పుడు మనం తెలుసుకొన్న నవలలో –వీరవల్లుడు లో మానవత్వం ,మా బాబులో కృతజ్ఞత ,కడిమి చెట్టులో పట్టుదల హాహా హూహూ లో భారతీయ సంసృతి విశిష్టత ప్రతిస్తితమైంది .ఇవే చిన్ననవలలో విశ్వనాధుని విశ్వ నాదం .ఏ యిజమూ గట్టేకించదు .వేదిజం ఒక్కటే శరణ్యం .భారతీయ మందిరానికి ఎన్నో దారులున్నాయి .అందులో తెలుగు దారిపేరు విశ్వనాధ ‘’అన్నారు ప్రముఖ కధకులు శ్రీ వాకాటి పాండురంగా రావు .దేశ కాలాలకు అతీతం గా ఉన్న భారతీయ సంసృతి క్షీణిస్తోందని ,తన రచన నిండా కన్నీరు కార్చిన మహానుభావుడు విశ్వనాధ –ఆ తపస్వి అన్నీటి ధారలోంచి ఘనీభవించిన మహోజ్వల రత్నమే రామాయణ కల్ప వృక్షం .కల్ప వృక్షం ,వేయి పడగలు రెండూ ఆధునిక ఇతిహాసాలే అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నా చార్య .వేయిపడగలలో విశ్వ లయఉంది మూల చైతన్యం లో అనంత చైతన్యాన్నిమానవీయ విలువలను నెలకొల్పాడని వాల్మీకి సుందర కాండలో సుందర హనుమంమంత్రం నిక్షేపిస్తే విశ్వనాధ కల్ప వృక్షం లో ‘’ఆపదుద్ధారక హనుమంమంత్రం ‘’ను నిక్షేపించాడని యుద్ధ కాండ అంతా రావణుడి ఈశ్వర అన్వేషణ మేనని రాముడు నారాయణ స్వరూపం అని తెలిసుకోగానే రావణ వధ జరిగిందన్ దైత్య ప్రవ్రుత్తి నశించి దివ్య ప్రక్రుతి అతనీలో విజ్రుమ్భించిందని ,భారతీయ సారస్వతం లో కైలాస శిఖరం కల్ప వృక్షమని మని ,వేయిపడగలులో కుండలినీ విద్య ఉందని ధర్మారావు మనీషి ,రామేశ్వర శాస్త్రి భూమిక ,అరుంధతి ఆరోహణ చైతన్యం గిరిక హృదయం అన్నారు సుప్రసన్న .విశ్వనాధ ది హరి హరాద్వైతం .ఆయనకు శివుడిలో విష్ణువు విష్ణువు లో శివుడు కనిపిస్తారు .తిరుమల శ్రీనివాసుడి చేతిలో చక్రం శివుడి చేతికి చుట్టుకొన్న చేతికి వాసుకిగా ,శంఖం గజముఖు డైన వినాయకుడుగా ,నిలువు బొట్లు త్రిశూలం గా దర్శించాడు విశ్వనాధ .మున్నంగి వేణు గోపాల శతకం లో వేణుగోపాలుడి నెమలి పించం సురగంగ తరంగాలుగా ,పిల్లన గ్రోవి శివుడి ఆయుధం ఖట్వాంగం గా ,రత్న హారాలు పాకే పాముల్లా కనిపించాయి విశ్వనాధకు .వేయిపడగల పాము సుబ్రహ్మన్యేశ్వరుడు సృష్టికి మూల ద్రవ్యం కు ప్రతీక సకల ఊహల సనాధుడు విశ్వనాధ .అయన కధల్లో మాక్లీ దుర్గం లో కుక్క .ఏమి సంబంధం రెండూ భారతీయ భాషల్లో మోగిన మాణిక్య వీణలు .
శ్రీ శ్రీ ,విశ్వనాధలవి భిన్నమార్గాలైనా ఒకరిపై మరొకరికి గౌరవం ఉన్నవారు .ఒక సారి శ్రీ శ్రీ ‘’మదరాసు నగర వీధుల్లో ఆకలితో మాడుతూ తిరుగుతున్న రోజుల్లో నా ప్రాణాన్ని నిలబెట్టినవి రెండే –ఒకటి కార్పోరేషన్ కుళాయి నీళ్ళు రెండవది ,విశ్వనాధ సత్యనారాయణ కవితా ‘’అని రాసుకు న్నాడు .అలాగే విశ్వనాధపై రాసిన ఒక గీతం సుప్రసిద్ధమైనది –
‘’మాటలాడే వెన్నెముక –పాట పాడే సుషుమ్న –నిన్నటి నన్నయ భట్టు –ఈ నాటి కవి సమ్రాట్టు –గోదావరి పలక రింత –కృష్ణా నది పులకరింత –కొండవీటి పొగమబ్బు –తెలుగు వాళ్ళ గోల్డు నిబ్బు –అకారాది క్షకారాంతం –ఆ సేతు మిహికావతంశం –అతగాడు తెలుగు వాడి ఆస్తి –అనవరత తెలుగునాటి ప్రకాస్తి –ఛందస్సులేని ఈ ద్విపద –సత్యానికి నా ఉపధ ‘’.
ఇంతటి విశిష్ట వ్యక్తిని ఇక్కడ వారి స్వగ్రామం లో స్మరించు కోవటం మనందరి అదృష్టం .దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ‘’అని చెప్పాను
ఇక్కడ ఈ సభ జరుగుతుందని తెలిసి విని గన్నవరం శాసన సభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారి తండ్రి గారుశ్రీ రమేష్ చంద్ర ఆత్మీయ అతిధులుగా విచ్చేసి తనకు విశ్వనాధపై ఉన్న ఆరాధనా భావాన్ని చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ చదివానని సంస్కారం మూర్తీభవించిన వ్యక్తీ విశ్వనాధ అని మంచి హాస్య ప్రియులని ,ఆయన రచనలో జీవం ఉంటుందని అదే అందరికి ఆకర్షణ అని ,ఇంత వివిధ్యం తో ఇన్ని ప్రక్రియలలో అసమాన పాండిత్యం తో రచనలు చేసిఉన వారు అరుదని, వారు నందమూరులో జన్మించటం మనందరి అదృష్టమని ప్రముఖ సినీ దర్శక నిర్మాత గూడవల్లి రామ బ్రహ్మం గారిది కూడా నందమూరు అని చెప్పారు .
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ మాటల్లో విశ్వనాధ మనుమలం అని చెప్పుకోవటం తమకు గర్వం గా ఉందని ,అయన పేరిట ట్రస్ట్ ఏర్పరచి ఆర్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్ని రచనలు రెడీగా ఉన్నాయని చెప్పారు వేయిపడగలలోని సుబ్బన్న పేట నందమూరు అని గిరిక తిరగటం ,స్వామి ఉత్సవ వైభవాలు ,జమీందారు దేవిడీ ఈ గ్రామంలో ఉన్నట్లు చదివితే గొప్ప అను భూతి కలుగుతుందని ,సరసభారతి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం హర్షణీయమ న్నారు . సత్యనారాయణ తమ్ముడు కూడా తాతగారి పద్యాలుపాడి స్మరించాడు .విశ్వనాధ మునిమనవడు ,సత్యనారాయణ కుమారుడు చిరంజీవి శ్రీ పావని చాలా బాగా శ్రావ్యం గా విశ్వనాధ పద్యాలను గానం చేసి అందరిని అలరించి వారసత్వాన్ని నిలిపాడు .సరసభారతి ఈ చిన్నారికి అతని తండ్రిశ్రీ సత్యనారాయణకు ,శ్రీ రమేష్ చంద్ర కు శాలువాలు కప్పి సత్కరించి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి జ్ఞాపికలను ప్రదానం చేసింది .మిత్రులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు నాకు పట్టు బట్టలు పెట్టి సత్కరించారు .
సభ ప్రారంభానికి ముందు శ్రీ గుడిసేవ భాస్కర దాసు గారు సుందరకాండ పారాయణ చేస్తే ,బిందు దత్తశ్రీ భగవద్ గీతా పారాయణ చేసింది .సుమారు యాభై మంది పాల్గొన్న ఈ సభ జయ ప్రదయమై అందరికి ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది .ఊహించని స్పందన ఇది .ఉయ్యూరు నుంచి మాతో పాటు కారులో ఇక్కడికి శ్రీ ఆంజనేయ శాస్త్రి ,శ్రీమతి మల్లికాంబ ,శ్రీ వి బి జి రావు వచ్చారు. రావు గారు ఏంతో గొప్పగా సహకరించి ఫోటోలు ,వాయిస్ రికార్డ్ పనులను చూసి కార్యక్రమ నిర్వహణ కు తోడ్పడ్డారు .శ్రీమతి శివలక్ష్మి వందన సమర్పణ ,జనగణ మణ తో కార్యక్రమం సమాప్తమైంది .ఒక గొప్ప అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చిన కార్యక్రమగా నిలిచిపోయింది ఇది .అప్పటిదాకా వాన భయ పెట్టినా ,దోబూచులాడినా కార్యక్రమం మొదలవగానే మంచి ఎండ వచ్చి వరుణుడూ దీవించి సహకరించాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-14-ఉయ్యూరు

