నరకచతుర్దశి
భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు ధరించడం,పిండి వంటలు భుజించడం ఇవన్నీ ఈ పండుగనాడు మనకు పైకి కనిపించే ఆర్భాటాలైనా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడం వెనుక అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే గొప్ప అంతరార్థం ఇమిడి ఉంది.
వెలుగులేక జగతి లేదు అన్నారు. అంటే వెలుగులేని ప్రపంచం ఊహించలేం. ఆ వెలుగును కలిగి ఉన్న భగవంతుడే పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అవిద్య, అజ్ఞానం, అవివేకం లాంటి అన్ని రకాల చీకట్లను పారద్రోలగల సమర్థుడు జ్ఞాన ప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలు సాధ్యమవుతాయి.
ఇక ఈ పండుగ జరుపుకోవడానికి కారకుడైన నరకాసురుడు భూదేవి కుమారుడు. నరకుడు అంటే హింసించేవాడని అర్థం. బ్రహ్మ వరప్రసాద గర్వితుడైన ఇతడు ప్రాగ్జ్యోతిష పురమనే రాజ్యాన్ని పాలించేవాడు. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. మణిపర్వతమనబడే మేరు పర్వతాన్ని వశపరచుకున్నాడు. సదా మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలమీదికి పదే పదే దండెత్తేవాడు.
నరకుడు పెట్టే హింసలు భరించలేక మునులు, దేవతలు అందరూ కలిసి శ్రీకృష్ణుని వద్దకొచ్చి మొరపెట్టుకున్నారు. నరకాసుర సంహారం లక్ష్యంగా శ్రీకృష్ణ భగవానుడు గరుడ వాహనారూఢుడయ్యాడు. సత్యభామ కూడా ఆయన వెంట బయలుదేరింది. నరకాసురుని ప్రాగ్జ్యోతిషపురం సమీపిస్తూ- మురాశురుని పాశాలచే చుట్టబడిన అయిదు దుర్గాలను చూసి ఆశ్చర్యచకితురాలైంది.
కృష్ణ్భగవానుడు మొదటి దుర్గాన్ని గదతో పగలగొట్టాడు. రెండవ దుర్గాన్ని బాణపరంపరలతో ఛేదించాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను సుదర్శన చక్రాలతో నిర్మూలించాడు. అటుపిమ్మట తనతో తలపడిన మురాసురుని, అతని కుమారులను కొంతమంది సైన్యాన్ని సంహరించాడు. అలసిన కృష్ణుడు అలసట తీర్చుకుంటుండగా, నరకాసురుడు యుద్ధ రంగంలోకొచ్చాడు. వస్తూనే ఆదమరుపుగా ఉన్న కృష్ణుడిని చంపబోయాడు. అది గమనించిన సత్యభామ చటుక్కున లేచి నిలబడి చీర చెంగుతో నడుం బిగించింది. వాల్జడ ముడివేసింది. తానే స్వయంగా విల్లందుకొంది. ఆమెలో వీరావేశం పరవళ్ళు తొక్కింది. అమ్ముల పొదినుంచి బాణాలు ఎప్పుడు తీస్తుందో, ఎప్పుడు సంధిస్తుందో ఎలా వేస్తుందో తెలియకుండా మెరుపు వేగంతో వాటిని వర్షింపసాగింది. ఆ ఎడతెగని బాణవర్షానికి, యుద్ధ విన్యాసాలకి తట్టుకోలేక శక్తి నశించిన రాక్షస సైన్యం నరకాసురుని వెనక దాగాయి. అంతకంతకూ ఆవేశపడిపోతున్న ఆమె చేతినుండి వింటిని గ్రహించి, నరకాసురునితో తను యుద్ధానికి తలపడ్డాడు. కొంతసేపటి తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుణ్ణి సంహరించాడు.
లోకకంటకుడైన నరకాసురుడు చనిపోయినది ఆశ్వయుజ బహుళ చతుర్దశి కాగా మరుసటి రోజు అన్ని లోకాలవారూ పండగ జరుపుకున్నారు. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళినాడు ఇంచుమించు అందరూ దీపాలను వెలిగిస్తారు. లోకంలోని కారు చీకట్లను పారద్రోలి కాంతిరేఖలతో నింపే పండుగ ఇది.
దీపాలను వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్ర్తిలదైతే, ఉన్నంతలో పేదసాదలకు దానధర్మాలు చేసి సాయపడే బాధ్యత స్ర్తిపురుషులిద్దరిది. బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం చిన్నపెద్దా తేడాలేకుండా అందరిది. అందుకే దీపావళి ఆనందోత్సాహాల పండుగగా ప్రసిద్ధి పొందింది. అంతేగాక ఈ పండుగ ఆరంభించిన తరువాత వచ్చే కార్తిక మార్గశిర మాసాలు రెండూ భగవత్ ప్రీతికరమైన మాసాలు. ఆధ్యాత్మిక సాధనకు అనువైన రోజులు కనుకనే దీపావళి పండుగకు ఎంతో వైశిష్ట్యం చేకూరింది.

