గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

51- భక్తిరస స్థాపకుడు – రూప గోస్వామి

గౌడీయ వైష్ణవ మతానికి చెందిన రూప గోస్వామి 1489-1564కాలానికి చెందిన వాడు .ఆరుగురు గోస్వాములలో పెద్దవాడు .సోదరుడు సనాతన గోస్వామి .వీరందరూ బృందావనం కేంద్రం గా ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ప్రభువు శిష్యులు .కలియుగం లో శ్రీకృష్ణుని అవతారమే చైతన్యప్రభువు అని వీరందరి నమ్మకం .రూపగోస్వామి పూర్వీకులు కన్నడ దేశానికి చెందినసారస్వత బ్రాహ్మణులు . లఘు తొషిని రాసిన జీవ గోస్వామి మాటలను బట్టి రూప గోస్వామి యజుర్వేద శాఖకు చెందినవారు .భారద్వాజ గోత్రీకులు .ఈ  వంశం లోని పూర్వీకుడే సర్వజ్ఞ రాజు విద్యా వేత్త .జగద్గురు బిరుతాంకితుడు .  ఈయన కుమారుడు అనిరుద్ధుడు .ఈయనకు హరిహార ,రూపేశ్వరులు కుమారులు .రూపేశ్వరుడు వేదం వేదాంగాలలో నిష్ణాతుడు .హరి హరుడు ధనుర్విద్యలో ,రాజకీయాలలో ఆరి తేరిన వాడు .తండ్రిమరణం తర్వాత రాజ్యం వీరిద్దరికీ విభజింప బడింది .కాని దుర్మార్గుడైన హరిహరుడు రూపేశ్వరుడు రాజ్యాన్ని లాక్కొని అతన్ని దేశ బహిష్కారం చేస్తే దేశాటనం చేస్తూ గంగా తీరం చేరాడు .పద్మనాభుడు ఈయనను ఆదరించాడు .పద్మనాభుడికి పద్దేనిమిదిమంది కుమార్తెలు ,అయిడుగురు  కుమారులు చివరికొడుకు ముకుందుడు .

ఆ ప్రాంతం లో మత సంఘర్షణలు చోటు చేసుకొంటే ముకుందుని కుమారుడు కుమార దేవుడు జేస్సూర్ చేరాడు .కుమార దేవుని కుమారులే రూప ,అమర,(సనాతన ) శ్రీవల్లభ ,(అనుపమ).కుమార దేవుని మరణం తర్వాత అన్నదమ్ములు ముగ్గురు గౌడ దేశం అని పిలువ బడే బెంగాల్ చేరి విద్యాభ్యాసం చేశారు .న్యాయ శాస్త్రాన్ని సార్వ భౌమ భట్టా చార్య వద్ద నేర్చారు .సంస్కృతం తో బాటు ఆరేబిక్ పర్షియన్ భాషలనూ నేర్చుకొన్నారు .వీరి తెలివి తేటలకు ,విద్యా గరిమకు మెచ్చి అప్పటి బెంగాల్ పాలకుడు అల్ల్లాఉద్దీన్  హుసేన్ షా వీరిని బలవంతం గా ప్రభుత్వాధికారులను చేశాడు .రూపను ముఖ్య కార్య దర్శిగా ,సనాతనుడిని రెవిన్యు మంత్రిగా చేశాడు సుల్తాన్ .

సుల్తాన్ రాజ దాని రామ కేళి లో వీరు ఉన్నారు .అప్పుడు చైతన్య మహా ప్రభువు 1514లో అక్కడికి వచ్చినప్పుడు మొదటి సారిగా దర్శించారు .చైతన్య ప్రభావం తో సన్య సించి రాజీనామా చేసి స్వంత గ్రామం జేస్సూర్ లోని ఫతియా బాద్ చేరుకొన్నారు .రూప ,అనుపమ లు చైతన్యునికోసం పూరీ కి పంపగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసి బృందావనం చేరటానికి ప్రయత్నించి తమ వద్ద ఉన్న పదివేల బంగారు నాణాలు సనాతనునికోసం అక్కడ ఉంచామని తెలియ జేసి బృందావనం చేరుకొన్నారు .

సోదరులు బృందావనం లో చైతన్యుడు కనిపించకపోయేసరికి ప్రయాగలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లి దర్శించారు .చైతన్యుడు వీరిద్దరికీ గౌడీయ వైష్ణవ ధర్మాలన్నీ బోధించాడు .బృందావనం లోని సనాతన ప్రదేశాలను గుర్తించి ,వైష్ణవ మత వ్యాప్తి చేసే బాధ్యతను చైతన్యుడు రూప గోస్వామిపై పెట్టాడు .బృందావనం లోనే జీవితాలను గడిపారు సోదరులు .శ్రీ క్రిష్ణుని ముని మనవడు వజ్రనాభ మహారాజు స్తాపించి అర్చించిన భగవాన్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని శోధించి కనుగొని బృందావనం లో రూప గోస్వామి ప్రతిస్టించాడు .వీరికి శిష్య పరంపర పెరిగింది అందులో లోక నాద ,భూ గర్భ ,గోపాల భట్ట ,రఘునాధ భట్ట ,రఘునాధ దాస గోస్వాములు .రూప గోస్వామి కూడా ఇక్కడికి చేరి వైష్ణవాన్ని పొందాడు .లలితాదేవి ఆధ్వర్యం లో రాదా క్రిష్ణులను భక్తితో సేవించిన చిన్న గోపిక ‘’రూప మంజరి ‘’యేరూప గోస్వామిగా మరల అవతరించారని వారి నమ్మకం .నిత్యం శ్రీ కృష్ణ భజనలతో బృందావనం మారు మోగింది అప్పటినుండి .ఇప్పటికీ అలానే జరుగుతోంది ,

రూప గోస్వామీయం

రూప గోస్వామి   సంస్కృతం  లో అనేక గ్రంధాలు రచించాడు అందులో వేదాంతం అలంకార శాస్త్రం ,నాటక శాస్త్రాలున్నాయి .రూప గోస్వామి రాసిన భక్తీ రసామృత సింధు గ్రంధం గౌడీయ వైష్ణవానికి ప్రామాణికం .ఉజ్వల నీలమణి అనేది మాధుర్య రసాన్ని గూర్చి తెలిపేది .లఘు భావామృత అనేది సనాతన గోస్వామి రాసిన బృహత్ భాగమృతం కు సంక్షిప్తం .విదగ్ధ మాధవ అనేది రెండు కృష్ణ నాటకాల సంపుటి .రెండు గా చేయమని సత్యభామ కలలో కన్పించి చెప్పిందట .ఇవే లలితా మాధవ ,విదగ్ధ మాధవ నాటకాలు .స్తవమాల లో అనేక స్తోత్రాలున్నాయి .దాన కేళి కౌముది లో  ఏకాంకిక ఉన్న భాణం .శ్రీ రాదా కృష్ణ గనోద్దీపిక  -లో రాధ కృష్ణుల పాత్ర స్వరూప స్వభావాలను వర్ణించాడు .మధుర మహాత్మ్యం లో మధురా నగర విశేషాలున్నాయి .ఉద్దవ సందేశం భాగవతం ఆధారం గా రాసింది ఇందులో కృష్ణుని ఆదేశం పై ఉద్ధవుడు బృందావనానికి రావటం తెలియ జేయ బడింది .హంస దూతం అనేది రాధ కృష్ణునికి హంస ద్వారా సందేశాన్ని పంపటం వృత్తాంతం .శ్రీ కృష్ణ జన్మ తిది విధి లో శ్రీకృష్ణ జన్మాష్టమి వివరణ చేయాల్సిన విధి విదానాలన్నీ వివరించాడు .నాటక చంద్రిక లో గౌడీయ వైష్ణవ నాటక విధానాలను వివరించాడు .ఉపదేశామృతం లో శ్రీకృష్ణుని చేరుకోవటానికి తేలికైన పదకొండు పద్ధతులను పదకొండు శ్లోకాలలో చెప్పాడు .

భక్తీ రస  స్థాపకుడుగా రూప గోస్వామి నిలిచాడు .ఉజ్వల నీల మణి, భక్తీ రసామృత సింధు అనే అలంకార శాస్త్రాలలో రస చర్చ చేశాడు .శృంగార రసాన్ని విపులంగా వివరించాడు .భక్తిలో ఉండే విభావ ,అనుభవాలను వివరిస్తూ వాటినీ రసం గానే చెప్పాడు .భగ వంతునిపై ప్రీతిని ప్రేయో రసంగా చెప్పాడు .దీన్ని మధుసూదన సరస్వతి సమర్ధించాడు .భక్తీ మధురం ఉజ్వలం అని రెండు రకాలన్నాడు .శ్రీ కృష్ణ గోపీకల మధ్య ఉన్నది శృంగార రసమన్నాడు .దీనికి చిత్త ద్రవం స్తాయీ భావంగా చెప్పాడు .కృష్ణ గోపీ విషయకమైన రతి ఉపాదేయం అని అదే భక్తీ రసమని వివరించాడు .శృంగారం మొదలైన రసాలు క్షుద్రమైనవని ,భక్తీ రసం ఒక్కటే సర్వ శ్రేష్టమైనదని స్తాపించాడు .భగవద్భక్తి రసాయనం అనే గ్రంధం లో భక్తీ కి సంపూర్ణం గా రసత్వాన్నిచ్చి ఉదాత్తత కల్పించాడు .భగ వంతుడు ఆలబన విధానం ,ఆయన చరిత్రలు విభావాలు ,భగవద్రతి స్తాయీ భావం ,నేత్ర వికారం మొదలైనవి అనుభవాలు ,నిర్వేదం ,శంక ,హర్షం మొదలైనవి వ్తభిచారీ భావాలు అని రూప గోస్వామి వివరించాడు .భక్తీ రసం అందరి ఆమోదాన్ని పొందింది .

నాటక చంద్రిక లో నాటక లక్షణాలు వివరణ లిచ్చాడు .

 

మరో కవితో కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.