హాస్యానందాన్నిచ్చే కథలు
- -కూర చిదంబరం
నాకొక శ్రీమతి కావాలి
హాస్య కథలు
రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు
పేజీలు: 135, వెల: రూ.120/-
కాపీలకు: రచయిత,
విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు నవోదయా బుక్‌హౌజ్‌లు
‘‘నవ్వు నాలుగిందాల చేటు’’ అన్నది పాత నానుడి. ‘నవ్వు నాలుగు విధాల బెస్ట్’’ అని ఇప్పుడు అనుకోవాలి. నవ్వువల్ల ఎంతో మంచి చేకూరుతుంది. బరువెక్కిన ‘‘మూడ్’’ తేలికవుతుంది. ‘ఈసురోమంటూ ఇరవయ్యేళ్ళకంటే, నవ్వుతూ నాలుగేళ్ళు బ్రతుకుతే చాలు’ అనుకునే రోజులివి. వైద్యరీత్యా కూడా, నవ్వు ఆరోగ్యాన్ని చేకూర్చి రోగాల్ని దూరంగా ఉంచుతుందట! అందుకే మనం ‘అంతర్జాతీయ నవ్వుల దినం’ అని లాఫింగ్ క్లబ్బులు అని పెట్టుకుని, నవ్వు కరువవుతున్న ఈ రోజుల్లో, పనిగట్టుకుని మరీ నవ్వుతున్నాము.
ఈ సంకలనంలో 24 హాస్య కథలున్నాయి. ఇవన్నీ లోగడ వేర్వేరు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఏకధాటిగా, మనం నవ్వుకునేందుకు ఇప్పుడు వీటినన్నింటినీ సంకలనంగా మన ముందుంచారు డా.రాజుగారు. బోధన వీరి వృత్తి. కనుక చెప్పదల్చుకున్న విషయాన్ని అందంగా, పఠనీయత పెంచి మన ముందుంచటం వీరికి వృత్తితో పెట్టిన విద్య.
ఆనాటి రోజుల్లో మాత్రమే కనబడే వారాలబ్బాయి గురించి (్భక్త కుంకలు) వ్రాసినా, ఈనాటి దాలిబాబు కార్ఖానాలో పనిచేస్తూ, ఆయన కూతుర్ని లేపుకువచ్చి రైలు ప్రయాణం చేస్తున్న నర్సింహులు (బంగాళాఖాతంలో వాయుగుండం) గురించి వ్రాసినా, రంభా ఊర్వశిల్లాంటి అందగత్తెలతో సరసాలు సాగిస్తున్నానని చెబుతూ జోళ్ళషాపులో ఊడ్చి కళ్ళాపి చల్లే అప్పలమ్మతో గ్రంథం నడిపించబోయే బుచ్చిబాబు (రంభతో రాం. రాం) గురించి వ్రాసినా, మనం నవ్వుకోవాల్సిందే!
ఇక చొక్కావేసుకోని, నక్కిన చొక్కారావు (శ్రీమతి వౌనవ్రతం) అడ్వకేటు, వౌనవ్రతం పట్టే ఆయన శ్రీమతి ప్రతిభాదేవి గురించి వ్రాసినా, సర్వమంగళ మెడలో తాళికట్టి ‘్భర్త వత్సలం’ అయిన భక్తవత్సలం గురించి వ్రాసినా, అద్దె భార్య ప్రమీలను కుదుర్చుకుని అవస్థలు పడే పెంటారావు అనబడే గంటారావు (అద్దె భార్య అలిగితే) గురించి వ్రాసినా మనం హాయిగా నవ్వుకోవలసిందే! ఇప్పుడు కనబడటం లేదు కాని ఆ రోజుల్లో ‘నశ్యం’ పీల్చటం ఉండేది. ముక్కుపొడుం (నశ్యం) పీల్చే లంబోదరం లాంటి వేలువిడిచిన బంధువులు, (బేలు బిడిచిన బందుబు) అధ్యాపక వృత్తిలో తరుచూ తారసపడేవారు, వీళ్ళంతా మన నిత్య జీవితంలోని పాత్రలే! వీరితో నవ్వులపువ్వులు పూయించారు రాజుగారు.
వీరి కథల్లో ‘‘పన్’’ (-ఖశ) ఉంది. ‘‘పంచ్’’ ఉంది. అయితే సంకలనంలోని అన్ని కథల్లోనూ ఇవి ‘యూనివర్సల్’గా కానరావు. ఒక్కో కథలో ‘స్మైల్ ప్లీజ్. నవ్వండి’అని అంటున్నట్లవుపిస్తుంది. ‘కంటిన్యుటీ’ కనిపించక, ఘఇఖఔఆ గా కథ ముగించినట్లనుపిస్తుంది.
‘బ్నిం’ (బి.నరసింహమూర్తి) గారి ముఖ చిత్రంలో మనం బోలెడంత మంది నిన్నా, నేటి సినిమా తారలను చూసుకోవచ్చు. గృహస్తు అవాలని, శ్రీమతి కావాలని కలలుగనే లంబోదరమూర్తికి శ్రీమతి దొరకటం ‘అందని ద్రాక్ష’ కాగూడదని, త్వరలోనే పెళ్ళవుతుందని ఆ పెళ్ళి విశేషాలు, ఆ తర్వాతి కబుర్లు, ముందుముందు డా.మంతెన సూర్యనారాయణరాజు మనకందిస్తారని ఆశిద్దాం.

