గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74
113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే
బహుభాషా వేత్త ,సంస్కృతానేక భాషా రచయిత ,ధర్మ శాస్త్ర నిధి శ్రీ గుండేరావు హర్కారే 13-3-1887 నహైదరాబాద్ లోరామారావు ,సీతా బాయి దంపతుల కు జన్మించారు .అరబ్బీ పారశీక భాషలను నేర్చి ,మెట్రి క్ చదివి ,హైదరాబాద్ న్యాయ స్థానం లో గుమాస్తాగా ఉద్యోగం ప్రారంభించారు .తర్వాత తెలుగు ,మరాఠీ సంస్కృతం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పాండిత్యాన్ని సాధించారు .వృత్తిని అంకిత భావం తో నిర్వహించటం గమనించి వీరిని అనువాదకునిగా చేసి పిమ్మట ఉన్నత న్యాయ స్థాన మండలి ప్రధాన న్యాయ మూర్తి ఆంతరంగిక కార్య దర్శిగా ప్రభుత్వం నియమించి వారి బహుభాషా పాండిత్యానికి సరైన గౌరవాన్ని కలిగిం చింది .న్యాయ రాజస్వ ,గణాంకశాఖలలో ఉన్నత పరీక్షలు ఉద్యోగం సక్రమంగా నిర్వహిస్తూనే వ్రాసి ఉత్తీర్ణులయ్యారు .
సాహిత్యం లో గుండెలు తీసిన బంటు
భట్టు మూర్తి వసుచరిత్ర లోని మొదటి ,రెండు ఆశ్వాసాలను మరాఠీ లోకి అనువదింఛి ,అందులోని కావ్య సౌందర్యాన్ని గొప్పగా వివరించారు గుండారే హర్కారే గారు .గద్వాల సంస్థానం లో 1919లో మున్సిఫ్ మేజిస్ట్రేట్ గా హర్కారే నియమింప బడ్డారు .క్రమంగా పదోన్నతి పొందుతూ ,జిల్లా న్యాయా దీశునిగా ,కలెక్టర్ గా ,సెషన్స్ జడ్జి గా ఎదిగి పదవీ విరమణ చేశారు .
న్యాయాదీశులుగా ఉంటూనే తీరిక వేళల్లో న్యాయ ,వ్యాకరణ ,పూర్వ మీమాంస మొదలైన శాస్త్రాధ్యయనం చేసి లోతైన పరిశోధన చేసి,మద్రాస్ విశ్వ విద్యాలపు న్యాయ శిరోమణి ,సాహిత్య శిరోమణి పరీక్షలు రాసి,ఉత్తీర్ణులైనారు .ధర్మ శాస్త్రం లో ,తులనాత్మకసాహిత్యశాస్త్రాలలో పి. ఒ.ఎల్. పరీక్షనిచ్చి అత్యద్భుత ప్రతిభతో పాసైనారు .
ప్రతిభా పురస్కారం
హర్కారే గారి న్యాయ శాస్త్ర కోవిదత్వానికి మెచ్చి న్యాయ శాస్త్ర కేంద్రమైన నవ ద్వీపం లో పండిత పరిషత్తు మెచ్చి ‘’వాచస్పతి ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించింది . అయోధ్య ,బెల్గాం నగర పండిత సభలు ‘’విద్యా భూషణ ‘’నిచ్చి గౌరవించాయి .ఆలివర్ గోల్డ్ స్మిత్ఆంగ్లం లో రాసిన ‘’ట్రావెల్’’ను సంస్కృతం లో పద్యాను వాదం చేశారు .దీనికి మైసూరు ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని ప్రదానం చేసి సమ్మానించింది.పూనా తిలక్ విద్యా పీఠం వీరిని పూర్వ మీమాంసా శాస్త్ర పరీక్షకులు గాను ,మైసూర్ విద్వత్ పరీక్షకు సాహిత్య శాస్త్ర పరీక్షకులుగా సగౌరవం గా నియమించి వారి విద్వత్తును వినియో గించుకోన్నాయి .
వైవిధ్య భరిత రచనలు చేయటం లో హర్కారే గారు సర్వ సమర్ధులని పించుకొన్నారు .ఆంగ్లం లో ధామస్ గ్రేరాసిన ‘’ఎలిజీ’’,గోల్డ్ స్మిత్ రచించిన ‘’ద డిజర్తెడ్ విలేజ్ ‘’వర్డ్స్ వర్త్ రచన ‘’ఇంటి మేషన్ టు ఇమ్మోర్టా లిటి ‘’షేక్స్ పియర్ హేమ్లెట్ మిడ్ సమ్మర్ నైట్స్’’ లను సంస్కృతం లోకి శ్లోకానువాదం చేశారు . ,పార్శీ లోని ‘’మస్నావీ షరీఫ్’’,అరబ్బీ భాషలో ఉన్న ‘’ఖురానే షరీఫ్ ‘’ను సంస్కృతం లోకి అనువాదం చేసి తన పాండిత్య సామర్ధ్యాలను నిరూపిం చారు .యాజ్ఞ వల్క్య స్మృతికి ‘’మితాక్షారా’’అనే వ్యాఖ్యానం ,ఖురాన్ కు ‘’ఖురానే మితాక్షరా’’పారిభాషిక పద వివరణలతో ఉర్దూ భాష లోకి అనువదించారు .యాస్కుని నిరుక్తం ను కొంత వరకు రాశారు .మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులోకి అనువదించారు .శబ్ద బోధ ప్రక్రియకు న్యాయ మీమాంస లను ఆధారం గా సులభ వివరణ రచించారు .తెలుగు విజ్ఞాన సర్వస్వం ,సంగ్రహ ఆంద్ర విజ్ఞాన కోశం లలో హరారే రచిం చిన ‘’ఉర్దూ భాషా చరిత్ర’’ ‘’కుమరిల భట్టు ‘’వ్యాసాలు చోటు చేసుకొన్నాయి .
అఖిల భారత ప్రాచ్య విద్మన్ మహా సభ లో ‘’అభినవ గుప్త పాదుని రస వివరణ’’ పై ప్రత్యభిజ్నా సిద్ధాంత ప్రభావాన్ని గూర్చి రాసి న విమర్శనా వ్యాసం అత్యుత్తమమైనదిగా,తలమానికమైనదిగా గుర్తింపు పొందింది .ఇలాంటి పరిశోధనావ్యాసాలు గుండే’రావు గారి లేఖిని నుంచి ఎన్నో ప్రవహించాయి .’’ప్రత్యయ కోశం ‘’,వీరు రచించిన వ్యారణ గ్రందాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత శాఖ ప్రచురించి గౌరవించింది .’’సంస్కృతం ‘’,’’భారతి ‘’ ‘’మధుర వాణి’’,ఎడ్యుకేషనల్ రివ్యు ‘’,’’ఇస్లామిక్ కల్చర్ ‘’మొదలైన పత్రికలో వీరి రచనలు వెలువడటం ఆ పత్రికలు చేసుకొన్న అదృష్టం .రేడియోలో అనేక భాషలలో శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలపై సూఫీ-బారతీయ వేదాంతాల తులనాత్మక పరి శీలనపై హర్కారే గారు మాట్లాడిన ప్రసంగాలు దాదాపు ఎనిమిది వందల పేజీల పైనే ఉన్నాయి అంటే అమితాశ్చర్యమేస్తుంది .
చెన్నై కుప్పుస్వామి శాస్త్రి పరిశోధనా సంస్థ ,ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వం ,తెలుగు రచయితల సంఘం ,వీరిని సగౌరవం గా ఆత్మీయం గా సన్మానిం ఛి తమను తాము సన్మానం చేసుకొన్నాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వీరిని విశిస్టసభ్యులుగా స్వీకరించింది .భారత రాష్ట్ర పతి’వీరి శాస్త్ర నిస్టకు ప్రతీక గా ’మాన్యతా ప్రమాణ పత్రం ‘’(సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ ) అందజేసి సత్కరించారు .పాణినీయ సంస్కృత వ్యాకరణం ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వంటిదే నని నిరూపిస్తూ ,రూప నిష్పత్తి ప్రక్రియ ను సులభం గా బోధించటానికి వీలుగా ‘’వ్యాకరణ యంత్రం ‘’ను నిర్మించిన సాంకేతిక విజ్ఞాని హర్కారే .దీనికోసం ఒక పరిశోధనా విభాగాన్ని ఏర్పరచి ,కంప్యూటర్ విధానం లో ఆ యంత్రాన్ని ప్రవేశ పెట్టాలని కోరుకొన్నారు .ఆ కల సాఫల్యం కా కుండానే మహా శాస్త్ర విజ్ఞాన కవిపండిత బహుభాషా మర్మజ్న న్యాయాదిపతి శ్రీ గుండూరావు హర్కారే తొంభై వ ఏట 3-12-1979న కైవల్యం పొందారు .వారు లేని లోటు పూరింప రానిది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-14-ఉయ్యూరు