18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం
18ఏళ్ళక్రితం మా మనవడు -మా పెద్దబ్బాయి శాస్త్రి రెండవ కొడుకు ఛి భువన్ హనుమకొండలో పుట్టినప్పుడు వచ్చిన గోదావరి పుష్కారలకు నేను ,మా శ్రీమతి మా వియ్యపురాలు శ్రీమతి ఆదిలక్ష్మిగారు కలిసి ,హనుమకొండ నుంచి బస్సులోకరీం నగర్ జిల్లా ధర్మ పురి వెళ్లి ,గోదావరిలో పుష్కరస్నానం చేసి ,అప్పుడున్న పెద్ద రష్ లొ ఆపసోపాలు పడుతూ క్యూ లొ నిల్చోలేక దారిలో ఉన్న ఇంటి అరుగులపై సేద తీరుతూ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనాను భూతి పొందాము .అక్కడి బ్రాహ్మణ్యపు ఇళ్ళు,వారి ఆచార వ్యవహారాలూ చూసి మురిశాము .అవన్నీ మా ఆవిడ హృదయ ఫలకం పై గాఢ ముద్రవేశాయి .మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తూనే ఉంది .ఆ కోరిక ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఇవాళ మళ్ళీ 28-10-18ఆదివారం తీరింది .
గీర్వాణం రెండవ భాగం రాస్తూండగాహైదరాబాద్ లోని శ్రీ అందుకూరి శాస్త్రి గారు పరిచయమై శ్రీ కోరిడే రాజన్నశాస్త్రిగారు సంస్కృత మహాపండితులని,సంస్కృత గ్రంథ రచన చేశారని ధర్మపురి వాస్తవ్యులని వారికుమారులు డా విశ్వనాధశర్మగారు ధర్మపురి ఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ గారని ,మంచి రచయిత అనీ ,తండ్రిగారి గ్రంథాలు వారి వద్ద ఉంటాయని చెప్పి వారి ఫోన్ నంబర్ ఇవ్వగా వారితో మాట్లాడగా ,వారు నా ప్రయత్నాన్ని అభినందించి తండ్రిగారి పుస్తకాలు ,తాము వారిపై రాసిన వ్యాసం తో సహా ప౦పారు .అప్పటికే రాజన్న గారు పరమపదించారు .వారిగ్రంధాలు ఆధారం గా శ్రీ రాజన్న శాస్త్రి గారిపై రెండవ గీర్వాణం లొ రాసి వారి కుమారులకు ఒకకాపీ పంపాను .వారి కోరికపై మొదటి గీర్వాణమూ పంపాను .తదాది వారితో ఫోన్ సంభాషణ కొనసాగింది .వారి సౌజన్యం ముగ్దుడిని చేసింది .ఒకసారి వారు మెయిల్ లొ ధర్మపురికి ఆహ్వానించి తమి౦ట ఆతిధ్యం పొందాలని కోరారు .సరే అన్నాను .ఆకోరికా ఇవాళే తీరింది .
ఈ గురువారం రాత్రి ఉయ్యూరు లొ బయల్దేరి హైదరాబాద్ లొ మల్లాపూర్ మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి శుక్రవారం ఉదయం చేరాం . శుక్రవారం రాత్రి మావాడు కారు ,డ్రైవర్ అందుబాటులో ఉన్నారని అందరం ఆదివారం ధర్మ పురి వెడదామన్నాడు సంతోషించాం . ఆ రాత్రే శర్మగారికి మెయిల్ పెట్టి వారి సెల్ నంబర్ కోరాను . వారు వెంటనే ఫోన్ చేస్సి తప్పక రమ్మని ఆహ్వానించారు .శనివారం మా అన్నయ్యగారమ్మాయి ఛి సౌ వేదవల్లిని నల్లకుంట కు వెళ్లి పరామర్శించి మల్లాపూర్ చేరేసరికి రాత్రి సుమారు 10 అయింది. అందుకని శర్మగారికి ఫోన్ చేసి చెప్పలేకపోయా .
ఆదివారం ఉదయం నాలుగు గంటలకే లేచి స్నానం సంధ్య ,పూజ పూర్తి చేసి కాఫీతాగి అందరం కలిసి కారులో ఉదయం 5 -15 కు 130కిలో మీటర్లలో ఉన్న ధర్మపురికి బయల్దేరాం .కరీం నగర్ కు పావుతక్కువ 8 కి చేరి అక్కడి ఉడిపి హోటల్ లొ ఇడ్లీ వడ తిని కాఫీ తాగి 8-15 కు మళ్ళీ బయల్దేరి ఉదయం 10కి ధర్మపురి చేరాం .ఉదయం 6 నుంచి శ్రీ కోరిడే శర్మగారు ఫోన్ చేస్తూ మా ప్రయాణ ప్రోగ్రెస్ తెలుసుకొంటూనే ఉన్నారు .సరాసరి గోదావరీ తీరానికి చేరి కాళ్ళు కడుక్కొని పవిత్ర జలాలను తలపై చల్లుకొని సంతృప్తి పడ్డాం .దగ్గరలో ఒక ప్రాజెక్ట్ కడుతూ౦డటం తో బాక్ వాటర్ వచ్చి నదిలో కలుస్తోందట .అక్కడినుంచి ఆటోలో గుడికి చేరాం .అక్కడ ఉగ్ర నారసింహ మూర్తిని, వేణుగోపాల స్వామిని చూసి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం చేరిదర్శనం చేసుకొనే సరికి మాకోసం శ్రీ శర్మగారు శ్రమపడి వచ్చారు. ఆలయ విశేషాలు తెలియజేస్తూ గర్భాలయం లోకి తీసుకు కెళ్లే ప్రయత్నం చేస్తే నేను పాంట్ షర్ట్ తో ఉండటం తో కుదరదన్నారు. అత్తా కోడలు లోపలి వెళ్లి దర్శించారు .ఆలయం లొ బ్రహ్మ దేవుని విగ్రహం ఉంది .ఇలా ఉండటం అరుదైన విషయమని ,ప్రక్కనే బలరాముడు హలాయుధం తో ఉన్నాడని చూపించి వారి చుట్టూ దశావతారాలున్నాయని సాలగ్రామాలున్నాయని వివరించారు శర్మగారు . తమిళనాడుకు చెందిన శ్రీ ఆదినారాయణ రావు గారు ఇక్కడ ఆంజనేయ విగ్రహం లేదని గ్రహించి నరసింహ స్వామి ఆలయం బయట పెద్ద శ్రీ ఆంజనేయ విగ్రహం ప్రతిష్టించి నిత్య ధూప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు .ఈ స్వామి ఇక్కడ అదనపు ఆకర్షణ .ఇక్కడే యమధర్మ రాజు కు చిన్న దేవాలయం ఉన్నది .పూజారి శ్లోకం చెప్పి మనతో అక్కడున్న దీపం లొ నూనె పోయిస్తాడు .నరసింహాలయం చుట్టూ అనేక ఆ౦జనేయ విగ్రహా లున్నాయి. ఇవేకాక ఊరంతా హనుమవిగ్రహాలు ఎక్కడపడితే అక్కడ ఉండటం విశేషం .ఎందుకున్నాయని శర్మగారిని అడిగితే ‘’ఇక్కడి నృసింహ స్వామి ‘’ని శాంత పరచటానికి అన్నారు .దీనిప్రక్కనే ఉన్న వెయ్యేళ్ళనాటి శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి దేవాలయానికి శర్మగారు తీసుకు వెళ్లి అన్నీ చూపించారు .దీనికంటే ప్రాచీనమైనది నృసింహ దేవాలయమని చెప్పారు .ఈశివాలయం లోనే ఓరియెంటల్ పాఠశాల .ప్రారంభమైందని తానూ ఇక్కడే చదువుకున్నానని ఇక్కడే కాలేజీ ఉండేదని ,అందులో తానూ పని చేశానని చెప్పగా ,మా ఉయ్యూరువాడు నా సహాధ్యాయి వేమూరి దుర్గయ్య ఇక్కడ పని చేశాడు తెలుసా అని అడిగితే బాగా తెలుసు అన్నారు .ఆయనా ఇక్కడే బోధించాడు అన్నారు .దీనికి ఒకాయన మేనేజర్ గా ఉండేవాడని ,జీతాలు సరిగ్గా ఇచ్చేవాడు కాదని ,ఎవరైనా అడిగితే బియ్యం కావాలంటే షావుకారుకు చెబుతా, సరుకులుకావాలంటే షాపులో చెబుతా తెచ్చుకోమనే వాడేతప్ప రూపాయి ‘’చేపే’’వాడు కాదన్నారు .దీనితో దుర్గయ్యగారు మానేసి ఉయ్యూరు వెళ్లారన్నారు .ప్రభుత్వం తీసుకోన్నతర్వాత మంచి జీతాలు వస్తున్నాయని ,కొత్త బిల్డింగ్ లోకి కాలేజి మారిందని ,తానూ రెండేళ్లక్రితమే ప్రిన్సిపాల్ పదవి నుంచి రిటైర్ అయ్యానని చెప్పారు .స్ట్రెంగ్త్ బాగానే ఉందా అంటే 150మంది విద్యర్దులున్నారని, ,కాని తగినంత స్టాఫ్ లేదన్నారు .తాను తనకొచ్చే జీతం తో లెక్చరర్ లను అపాయింట్ చేసి కొరత తీర్చానన్నారు .ఇప్పుడు మళ్ళీ మామూలే అన్నారు . ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన చారిత్రకపరిశోధకులు ,బహు గ్రంథ కర్త డా సంగన భట్ల నరసయ్యగారు గారు తెలుసా ఇక్కడే ఉన్నారా అని అడిగితే బాగా తెలుసునని వారిదగ్గరే తానూ పని చేశానని ఆయన ప్రస్తుతం వేములవాడలో ఉన్న్నారని చెప్పారు .మాటల సందర్భం లో’’దువ్వాడ జగన్నాధం ‘’సినిమా డైరెక్టర్ సంగనభోట్ల ‘’హరీష్ శంకర్’’ది ధర్మపురేనని, తమ ఇంటి ఎదుటే ఉంటాడని చెప్పారు .నరసయ్యగారు ధర్మపురి చరిత్రరాశారని దాని ఆధారంగా నెట్ లొ ఏడెనిమిది ఎపిసోడ్ లు రాశానని రాసికూడా ఆరేళ్ళు దాటిందనీ చెప్పాను . ప్రసాసాదాలు కొని ,తిని శర్మగారింటికి వారితోపాటు వెళ్లాం . ఇప్పటికీ ఇక్కడ 400బ్రాహ్మణ కుటుంబాలున్నాయని ,ఒకప్పుడు వెయ్యి గడప ఉండేదని ,ఇప్పుడు కోరిడేవారి కుటుంబాలే పదికి పైన ఉన్నాయని,తామున్నది అంతా కోరిడే వారి ఆస్థానమంటారన్నారు . 18ఏళ్ళ క్రితం ఉన్న బ్రాహ్మణ వాతావరణం ఇప్పుడు మాకు కనపడలేదు .పాతైల్లస్థానం లొ ఆధునిక భవనాలు వచ్చేశాయి .తమ వదినగారు రామాయణ కావ్యం రాశారన్నారు .వారిని పరిచయం చేశారు .శర్మగారి తండ్రిగారు లక్ష్మీ నృసింహ సుప్రభాతం రాస్తే, తాము శ్రీ సీతారామ లింగేశ్వర సుప్రభాతం రాశామని చెప్పారు .ఇంకో దేవత సుప్రభాతమూ రాశామని చెప్పారు .తమ సంస్కృత రచనలగురించి తెలియజేస్తే, ఇప్పుడు రాస్తున్న గీర్వాణం -4లో వారిని గూర్చి రాసిన అదృష్టవంతుడనవుతానని చెప్పాను .తప్పక పంపిస్తానన్నారు .’’భూషణ వికాస ధర్మ పురినివాస –దుస్ట సంహార నరసింహ దురిత దూర ‘’మకుటం తో ప్రసిద్ధ శతకం రాసిన సముఖం శేషప్పకవి ధర్మపురి వాసి యే.
నడక భగీరధ
శర్మగారింటికి వెళ్లేదారి అంతా గోతులమయం .దీన్ని గురించి చెబుతూ శర్మగారు కేసి ఆర్ ’’మిషన్ భగీరధ ‘’కోసం ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చే నెపంతో రోడ్లు అన్నీ తవ్వి గొట్టాలు పెట్టారేతప్ప కనెక్షన్ ఇవ్వలేదు .ఆ గోతులలో నడవాలేము ద్విచాక్రవాహనం నడపనూ లేము ‘’అన్నారు .అప్పుడు నేను ‘’నడక భగీరధ ప్రయత్నంలాగా ఉందన్నమాట ‘’అన్నాను అందరూనవ్వారు .సిద్దిపేట లొ హరీష్ రావు నియోజకవర్గం కనుక అక్కడ భాగీరధ మిషన్ బాగానే ఉన్నట్లు కనపడింది. మిగతా ఎక్కడా ఆ జాడే లేదు .రోడ్లపరిస్థితీ అంతే.
అప్పటికే వారి అర్ధాంగి అన్నీ సిద్ధం చేసి ఉంచారు .నేను హైదరాబాద్ లొ ఉన్న శ్రీ అందుకూరి శాస్త్రిగారికి ఫోన్ చేసి కోరిడే వారి సంస్థానం లొ ఉన్నామని చెప్పాను .వారెంతో సంతోషించి వీరి తండ్రిగారున్నప్పుడు ధర్మపురి వచ్చి వారి ఆతిధ్యం పొందిన విషయం జ్ఞాపకం చేసుకొన్నారు .శర్మగారితో శాస్త్రి గారు మాట్లాడారు .పప్పు ,బీన్స్ కూర ,అరటి వేపుడు, కాబేజికూర , శ్రీకంఠ్ స్వీటు ,చారు ,పెరుగులతో కమ్మని తృప్తికరమైన భోజనం పెట్టారు .అందరం మెచ్చుకొంటూ తిని ధన్యవాదాలు చెప్పాం .83ఏళ్ళ శర్మగారి మాత్రుమూర్తి గారిని పలకరించి నమస్కరింఛి ఆశీస్సులు పొందాం .అందరి భోజనాలయ్యాక శ్రీ శర్మగారినీ ,విదుషీమణి శిష్యురాలు అయిన వారి అర్ధాంగి గారినీ కూర్చోపెట్టి హైదరాబాద్ లోకొన్న పంచ ఖండువా వారికి కప్పి ,చీర జాకెట్ ఆమెకు అందించి సరసభారతి పుస్తకాలు ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం’’ ,’’వసుధైక కుటుంబం కవితా సంకలనం ‘’పండ్లతో సహా అందజేసి ఆశీర్వాదాలు పొందాం .ఉత్తరాదిలాగా ఇక్కడ వీరికి ఆశ్వయుజ పౌర్ణమి నుంచే కార్తీకం ప్రారంభమవుతుందట .అందుకే ఈ పౌర్ణమిమినాడే పురాణం చెప్పటం మొదలు పెట్టారట .శర్మగారి దంపతులు నాకు చాల ఖరీదైన శాలువాకప్పి మా శ్రీమతికి కోడలికి జాకెట్ ముక్కలు మాబ్బాయికి తువ్వాల ,తాము రాసిన ‘’శ్రీ వేద వ్యాస కృత ‘’గౌతమీ మహాత్మ్యం ‘’-శ్రీ బ్రహ్మాండ పురాణా౦త ర్గతం’’ అనే విస్తృత గ్రంధాన్ని(దీనినే శర్మగారు ప్రస్తుతం పురాణంగా చెబుతున్నారు ) ,తమ తండ్రిగారు డా కోరిడే రాజన్న శాస్త్రి గారు రచించిన ‘’ధ్వని –మనుచరిత్రం ‘’అనే అపురూప రిసెర్చ్ గ్రంథాన్నీ అందజేశారు . ఆన౦దంగా స్వీకరించాము .సరసభారతి పురోగతి అడిగి తెలుసుకొన్నారు .తన ఇంట్లో తమకు సన్మానం ఏమిటన్నారు?’’ఇది సరసభారతి సత్కారం పండిత సన్మానం ‘’అని చెప్పాను . .దారిలో కనపడినవారందరికీ నన్ను గురించి చాలా పెదపెద్ద మాటలతో చెప్పి నేను సిగ్గుపడేట్లు చేశారు . వారింటికి వెళ్ళేదారిలో రెండు పుష్కరిణులు ఉంటే వాటి విశేషాలు తెలిపారు .ఇక్కడ స్వామివారి తెప్పోత్సవం డోలోత్సవం జరుగుతాయట .మొదటి దానిలోకి బయట ఎక్కడో ఉన్న చెరువు నీరు ఒక చిన్న రంధ్రం ద్వారా చేరి నిండి ,రెండవ దానిలోకి చేరుతుంది .వరదలు వస్తే వీటిలోని నీరు ఊళ్లోకి వచ్చి మునిగిపోకుండా అడుగున ఉన్న ద్వారం ద్వారా గోదావరిలోకి చేరుతుందట .ఇంతగొప్ప ప్రణాళికతో సుమారు రండు వేలసంవత్సరాలక్రితం ఈ పుష్కరిణులు ఏర్పాటయ్యాయట. మేము హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో రాయపట్నానికి దగ్గర ఒకప్పుడు బౌద్ధ ఆచార్యుడు , గొప్ప బౌద్ధగ్రంథకర్త ‘’దిగ్నాగుడు ‘’నివసించిన ఊరు ఉన్నదని చెప్పారు
శర్మగారి దంపతుల వద్ద సెలవు తీసుకొని అందరం మధ్యాహ్నం 2-15 కు కారులో బయల్దేరి ఆ ఊరిలోనే ఉన్న ‘’ధర్మాంగద’’ సినిమా చరిత్ర జరిగిన కథ ఉన్న మహా పతివ్రత పామును పెళ్ళాడి తన సత్యమహాత్మ్యాన్ని నిరూపించుకోవటానికి ఇసుక పైకి చల్లితే రాతి స్తంభంగా మారిన చోట ఉన్న ‘’సత్యవతి ‘దేవి దేవాలయం చూసి ,,హైదరాబాద్ మల్లాపూర్ కు సాయంత్రం 6 గంటలకు క్షేమంగా చేరాం. కారు డ్రైవర్ జగదీశ్ చాలా అనుభవమున్న వాడు .మా కోడలు పని చేసే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్ డ్రైవర్ .ఆదివారం కనుక మాకు వచ్చాడు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—