గౌతమీ మహాత్మ్యం-69
99-భాను తీర్ధం
భాను తీర్ధం త్వాస్ట్రం ,మాహేశ్వరం ,ఐంద్రం ,యామ్యం ,ఆగ్నేయం గా ప్రసిద్ధం .అభిస్టుడుఅనే రాజు మంచి సుందరాకారుడు. దేవప్రీతికోసం అశ్వమేధయాగం సంకల్పించాడు .వసిష్ట అత్రి మున్నగు రుషి శ్రేస్టులు ఋత్విక్కులు .అక్కడ ‘’క్షత్రియుడే యజమానిగా ఉంటె యజ్ఞభూమి ఎలాఉంటుంది ?బ్రాహ్మణుడే దీక్షితుడైతే రాజు యజ్ఞ సంబంధ భూమిని ఇవ్వగలడు.మరి రాజే యజ్ఞ దీక్షితుడైతే ఎవరు యాచిస్తారు ?అలాంటి యాచన అమంగళకరం .క్షత్రియుడు యజ్ఞం చేయకూడదు ‘’అని బ్రాహ్మణులు చర్చిచు కొన్నారు .అప్పుడు వసిష్ట మహర్షి ‘’రాజే యజ్ఞ దీక్ష వహిస్తే భూమిని గూర్చి సూర్యుడిని ప్రార్ధించాలి ‘’అని చెప్పి రాజుతో సూర్యుని ప్రార్ధించి యజ్ఞోచిత భూమిని ఇవ్వమని ప్రార్ధించు అని సలహా చెప్పాడు .వెంటనే బ్రహ్మ విష్ణు ,శివాత్మక రూపుడైన ఆదిత్యుని ప్రార్ధించి ‘’దేవా !దేవతలకు యజ్ఞభూమి నివ్వు ‘’అని కోరాడు .క్షత్రియ కులదైవమైన సూర్యుడు వెంటనే ప్రసన్ను డై ఇచ్చేశాడు .ఏ భూమి ని భానుడు ఇచ్చాడో అక్కడికి రాజు ,ఋత్విక్కులు చేరుకొన్నారు .అదే భాను తీర్ధం అయింది .
యజ్ఞ విఘ్నానికి దానవులు బ్రాహ్మణ వేషాలతో అక్కడికి సామగానం చేస్తూ చేరటం తోఎవరూ అడ్డు చెప్పలేదు .లోపలి వెళ్లి యజ్ఞపాత్రాలు సోమం ,యూపస్తంభం యజ్ఞకుండాలు హవిస్సు చివరికి రాజు ను కూడా వాళ్ళు నిందించారు ,పీకిపారేశారు .వాళ్ళ ఆగడాన్ని విశ్వ రూపుడు తప్ప ఎవరూ గుర్తించలేరు.అతడు తండ్రితో ‘’వారంతా దైత్యులు ‘’అని చెప్పాడు .అప్పుడు త్వష్ట ‘’దర్భలతో పవిత్ర జలాలను చేతిలో తీసుకొని యజ్ఞ, యజ్ఞ పాత్రలను నిందించేవారు నా చేత నశి౦ప బడుదురు గాక ‘’అని చెప్పి చల్లి, నేలను తడపండి ‘’అన్నాడు .దేవతలు, త్వష్ట అలానే చేశారు .దానవులలో కొందరు అందులో భస్మమైపోయారు,కొందరు భయంతో పారిపోయారు .త్వష్ట నీరు చల్లినదే త్వాస్ట్ర తీర్ధం .ఇది సర్వపాప హరణం. యమునిచే దైత్యులు సంహరి౦పబడిన చోటు కనుక ‘’యామ్యం ‘’అయింది .అమృతం అగ్నిలో పూర్ణాహుతి చేయబడింది కనుక ‘’అగ్ని తీర్ధం ‘’ అయింది .
మరుత్తులతో సహా ఇంద్రుడు వచ్చి రాజుతో ‘’నువ్వు రెండు లోకాలకూ సామ్రాట్టువు .నాకు మిక్కిలి సఖుడవు అవుతావు ‘’అన్నాడు .ఇక్కడ మాహేశ్వర శివ దేవుడు ఉండటం వలన ‘’మాహేశ్వర తీర్ధం ‘’అయింది .శివ కేశవులు అభిస్టు మహారాజుకు భక్తీ ,ముక్తి కలగజేశారు .ఈ తీర్ధం శైవ వైష్ణవులకు సమాన ప్రాధాన్యం కలది .భాను తీర్ధం లో చేసిన ప్రతి మంచిపని అభీష్టాలను సిద్ధింప జేస్తుంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-19-ఉయ్యూరు