ప్రపంచ దేశాల సారస్వతం
41-ఫ్రెంచ్ సాహిత్యం -2
16వ శతాబ్దంలో తాత్విక రచనలు చేసిన తత్వవేత్తలూ ఉన్నారు .ఐతే అంత శ్రేస్టత వాటిలో లేదంటారు .వీరిలో రబేలే ,కెల్విన్ ,మా౦టేయిల్ ఉన్నారు .రబేలే రాసిన ‘’గర్గాన్టువా ఎట్పంటాగ్రుయల్ ను నవలగా భావిస్తారు .పాత్ర పోషణ శైలి లలో చాలాకాలం వరకు దీన్ని దాటింది లేదు .ఆకాలపు నవ్యాదర్శాలకు ,నూతనభావాలకు అది వేదికగా నిలిచింది .మైకేల్ డీ మాన్ టెయిల్ రాసినవి ఆత్మాశ్రయ వ్యాసాలు .తనా అనుభావాలను చక్కని విమర్శన దృ ష్టి తో పరిశీలించి ,మానవ జీవిత లోతుపాతులను అవగాహన చేసుకోవటానికి తోడ్పడుతుంది .ఉదాత్త శైలితో ఉత్తమస్థితి పొందింది .ప్రోటేస్టెంట్ మతానికి తన వాద చాతుర్యం తో బలం కలిగించినవాడు కెల్విన్ .క్రైస్తవ మత సువ్యవస్థపై ఇతడి గ్రంధం తాత్వికతతోపాటు సాహిత్య పరిమళమూ ఉన్నది .’’అల్పాక్షరాల్లో అనల్పార్ధాలను ‘’నిక్షేపించటం ఇతని ప్రత్యేకత .రెబేలే ,కాల్విన్ లు ఫ్రెంచ్ వచనాన్ని అందలం ఎక్కించిన మహాను భావులు .ఈ మార్గం లో సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాడు అమియోట్. గ్రీకులో ప్లూటార్క్ రాసిన జీవిత గాధలను యితడు వచనం లో ఫ్రెంచి భాషలోకి అత్యుదాత్తంగా మూలానికే వన్నెలు తెచ్చేట్లు అనువది౦చాడు..ఈకాలం లో వచ్చిన నాటకాలు ‘’నాం కే వాస్తి ‘’.
ఒక రకంగా ఫ్రెంచ్ సాహిత్య౦ కు 17వ శతాబ్ది గర్వకారణమైంది.కొత్తకవితా రీతులతో సాహిత్యానికి విశేష గౌరవం కలిగించారు కవులు ,రచయితలు .దీనికి ముఖ్యమైన రెండు కారణాలున్నాయి .అందులో మొదటిది ‘’ఫ్రెంచ్ అకాడెమి స్థాపన ‘’.రెండవది రాజాదరణం .1634లోఫ్రెంచ్ అకాడెమి ఏర్పడి పునరుజ్జీవ ఉద్యమానికి రాజుల బలం కూడా చేకూరింది .ఈ ఉద్యమ మూల పురుషులు నిర్ణయించిన కావ్యలక్షణాలు అనుల్ల౦ఘనీయాలై ,పరమ ప్రామాణికాలయ్యాయి.కావ్యాలను పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేయటానికి 40మంది సభ్యులతో ఉన్న అకాడెమి విశిష్ట కృషి చేసింది .రాజు 13వ లూయీ జాతీయ జీవనం లో ఏకత్వం సాధించటానికి సాహిత్య పోషణ ఒక మార్గం గా భావించి పోషించాడు .ఈకాలం లో వచ్చినవి మంచినాటకాలు .ఈశతాబ్ది మొదటి పాతికేళ్ళ లోనే 100 రూపకాలు వచ్చాయి .నాటక రచయితలలో –పియరీ కార్నియేల్,జీన్ రేసిన్,మోలియర్ అత్యంత ముఖ్యులు .కొత్తరచనా విధానంతో కార్నిఎల్ నాటకాలు రాశాడు .ఇతడి ట్రాజెడీ లలో ‘’సిడ్’’మోదా౦తాలలో’’మెన్ టోర్’’ప్రముఖమైనవి .ఈ రెండు తర్వాత నాటకాలకు ఒరవడి పెట్టాయి .ఫ్రెంచ్ ట్రాజెడీ కి పట్టాభిషేకం చేసినవాడు మాత్రం రేసిన్.ఇక మోలియర్ పేరు చెబితేనే హాస్యం రసప్రవాహమై కడుపుబ్బా నవ్విస్తుంది .ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయితగా మోలియర్ గుర్తింపబడ్డాడు .చతుర సంభాషణలు సన్నివేశాల రూపకల్పన లతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి ఎన్నెన్నో దేశాల నాటక రచయితలకు గొప్పప్రేరణగా నిలిచాడు మోలియర్ .తెలుగు లో భాకారా అంటే భమిడిపాటి కామేశ్వర రావు మాస్టారు హాస్య నాటకాలకు మోలియర్ నాటకాలే స్పూర్తి .పేర్లలో ,సన్నివేశాలలో డైలాగ్ లు కుట్టటం లో భాకారా మాస్టారు మోలియర్ ని మించిపోయారు అనిపిస్తారు .
ఈకాలం లో వచనం కూడా ప్రౌఢత చెందింది .ఈతరం గద్య రచయితలలో –జీన్ డీలాఫాన్టేన్ ప్రత్యేకత ఉన్నవాడు .రాసిన 12 సంపుటాలలో ప్రకటించిన కల్పనా కధలు,శైలీ రసపోషణ ,సంవిధాన నైపుణ్యం ప్రశస్తమైనవి .తత్వవేత్తలు డెకార్టె,పాస్కల్ వచనం లో రాసిన అమూల్య గ్రంథాలు తలమానికాలు .ఈకాలపు బొయిలో కావ్యరచయిత గా ,లాక్షణికుడుగా విశిష్ట స్థానం పొంది,ప్రామాణికుడు అని పించుకొన్నాడు .కావ్య లక్షణాలన్నీ సంక్షిప్తంగా చెప్పటం ఇతడి ప్రత్యేకత .కళయొక్క ముఖ్యోద్దేశం ,రస వివేచనా ,ప్రకటనా విధానం మొదలైన వాటిపై అతని అభిప్రాయాలు 18 వ శతాబ్దం చివర వరకు మార్గ దర్శకాలుగా ఉన్నాయి .ఆతడు సృస్టించిన 12 అక్షరాల పాదం ఉన్న ‘’అలెగ్జా౦డ్రియన్ ఛందస్సు’’అతని తర్వాతకవులకు కూడా ఆదర్శమై అనుసర ణీయమైంది .ఈ శతాబ్ది పూర్తి నాటికి వాక్య రచనలో కొత్తమార్పులు ,సంక్షిప్తత వచ్చాయి .ఇలాంటి వచనరచన చేసినవారిలో –లా బృయీరీ ,లా రాకీ ఫోకాల్డ్,సెయింట్ సైమన్ ముఖ్యులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-20-ఉయ్యూరు

