సార్ధక స్మృతి దినం
మాచిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ రెండేళ్ళక్రితం ఇదే రోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మరణించింది .ఇవాళ 20వ తేదీ సోమవారం ఆమె రెండవ వర్ధంతి రోజైన స్మృతి దినం . హైదరాబాద్ లో ఈ రోజు పెట్టాల్సిన ఆబ్దికం కరోనా లాక్ డౌన్ వలన సాధ్యపడలేదు ఆకుటుంబానికి .బ్రాహ్మణుడిని పిలిచి మా బావగారు శ్రీ వివేకానంద్ గారు ,పెద్దమేనల్లుడు ఛి అశోక్ కుటుంబం ఇంట్లో స్వయం పాకం ఇస్తున్నట్లు అమెరికాలో ఉన్న మా చిన్న మేనల్లుడు ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (Jay Veluri )ఈ 18శనివారం వట్సాప్ లో నా బాంక్ అకౌంట్ కు డబ్బు పంపించినట్లు ,దాన్ని ఉయ్యూరులో మా అబ్బాయి రమణ మిత్రబృందం నిర్వహిస్తున్న నిరుపేదల అన్నదానానికి ఉపయోగించమని కోరాడు .
మంచి సార్ధకమైన ఆలోచన అనిపించింది .రమణతో మాట్లాడి ఈ సోమవారం నాడు సరసభారతిద్వారా 100 మంది నిరుపేద ఎరుకలు ,ఏనాదులలైన ,పనులు లేక , ఇంట్లో పస్తు పడుకొంటున్న ,వంట చేసుకోవటానికి నిత్యావసర వస్తువులు కూడా లేని ప్రజలకు రిక్షాలున్నా,తొక్కే వీలులేని రిక్షా కార్మికులకు వారి కుటుంబాలకు ఆరోగ్యవంతమైన క్వాలిటి ఆహారం –ఒక స్వీటు ఒక హాట్ ,పప్పు కూరా పచ్చడి సాంబారు ,పెరుగు ,మంచినీళ్ళ పాకెట్ తో సహా పాకెట్లను కేటరింగ్ కోటేశ్వరరావు కుటుంబం తో తయారు చేయించి,ఉదయం 10గంటలనుంచి ఇళ్ళకు వెళ్లి పంచిపెట్టే కార్యక్రమ౦ నిర్వహించాం .రమణకు మా ఎమ్మెల్సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ఉన్న చనువుతో అతన్ని కూడా ఆహ్వానించి ఆతని చేతులమీదుగా ఇవ్వాలని భావించాం.సరిగ్గా 10కి రావాల్సిన అతను,ఇలాంటిదే ,వేరేకార్యక్రమ౦ ముగించుకొని వచ్చేసరికి 11దాటింది .అతని కారులో సిటీ కేబుల్ వాళ్ళూ, మందీ మార్బలంతో నేనూ కూడా కూర్చుని అనుకొన్నవార౦దరికి అనుకొన్నట్లు అందజేసి సంతృప్తి చెందాం .
ఈ విధమైన సేవను రోజుకు 100 మందికి మా రమణ,ఆంజనేయులు ,కోటేశ్వరరావు వాళ్ళ అబ్బాయిల , బృందం ఇవాల్టికి 26రోజులుగా కొనసాగిస్తున్నారు .దీనికి ఉదారులైన దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేస్తూ తోడ్పడటం అభినందనీయం .వారందరినీ అభినందిస్తున్నాను .ఇలాంటి నిరుపేదలు మనదేశం లో దాదాపు 10కోట్లమంది ఉన్నారు .దేశమంతటా ఇలాంటి సహృదయులు ఉంటే ,ఆకలితో అలమటించే నిర్భాగ్యులు ఉండరు .’’ఒక్క నిరుపేద ఉన్నంత వరకు ,ఒక్క మలినాశ్రుబిందు వొరిగినంత వరకు –ఒక ప్రేగు ఆకలి కనలి నంతవరకు –నాకు శాంతి కలుగదు నేస్తం ,నేను నిగర్వి నయ్యాను –ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను -ఈ గుండెగూడుపట్లు ఎక్కడో కదిలినవి –ఈకనులు వరదలై పారినవి –ఈకలలు కాగితపు పేలికలై కాలినవి ‘’అని ఆర్తిగా ‘’ఆర్తగీతం ‘’రాసిన అనుభూతి కవి స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలు మనందరికీ వేద వాక్యాలై కర్తవ్య బోధ చేయాలి .
నిజంగా మా చిన్నక్కయ్య తిది ఈ రోజు ఈ పేదలకు అన్నప్రసాద వినియోగం తో సార్ధకమైంది .ఇదే ఆమెకు అర్ధవంతమైన స్మృత్యంజలి . ఆకుటుంబం కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి ఆమె ఆశీస్సులు అనుక్షణం వారికి మార్గ దర్శనం చేయాలి.సమయజ్ఞత తో ఈ కార్యక్రమానికి ధనం పంపి సద్వినియోగం చేయించిన మా మేనల్లుడు శాస్త్రి బహుధా అభిన౦దనీయుడు .ఆ కుటుంబానికి శుభం భూయాత్ .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-20
,
—
