రేడియో బావగారి కబుర్లు -2

రేడియో బావగారి కబుర్లు –2

బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు  చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి

బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ

2-అలాగైతే ఇవాళ బోలెడు విశేషాలున్నాయన్నమాట .అక్షయ తృతీయ అంటే ఏమిటి బావగారు

1-తెలుసుకోవలసినవిషయమే అడిగారు బావగారు .అక్షయం అంటే క్షయం అంటే నాశనం లేనిది లేక అనంతమైనది అని అర్ధం .ఈ రోజును ‘’సర్వ సిద్ధి ముహూర్తం ‘’గా  దైవజ్ఞులు చెప్పారు .అంటే ఈరోజు ఏ మంచి పని మొదలుపెట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని నమ్మకం .మనవాళ్ళు ఎప్పుడు ఆశీర్వది౦చినా  ‘’అక్షయ పుణ్యలోక ప్రాప్తి రస్తు ‘’అక్షయ ధనధాన్య భోగ సమృద్ధి రస్తు ‘’అని ఆశీర్వదిస్తారు అందుకే

2-మరి ఈనాడు ఎలాంటి మంచి పని చేయాలి బావగారు

1-సంప్రదాయ సిద్ధంగా ఈ రోజు కనీసం ఒక చిన్నం అయినా బంగారం కొంటారు .ఇవాళకొంటే అది అక్షయ వృద్ధి చెందుతుందని నమ్మకం .భూములు ,ఇళ్ళూవగైరా కోనేవారూ ఉన్నారు .బావగారూ ఏమైనా ఒకకిలో బంగారం కొని దాచారా

2-సరేలెండి బావగారు .ఏదో రేడియో లో పని చేస్తున్నారు .వీళ్ళకు డబ్బు లెక్కేమిటి అనుకొంటుంది లోకం .మన జీతాలెంత ,మనకుతుంబ భారమెంత .నా వల్ల కానే లేదుబావగారూ .మీరు బాగానే కూడబెట్టినట్లు తోస్తోంది మీముఖం చూస్తె

1-మనం ఇద్దరం ఒకే తాను  గుడ్డలం బావగారూ .ఎలా సాధ్యమౌతుంది .అదీగాక గత 6ఏళ్ళుగా మనకేంద్రప్రభుత్వం  ప్రభుత్వ సంస్థలైన పోస్ట్ ,టెలిఫోన్ ,టివి,రేడియో వంటి వాటి గురించి అస్సలు పట్టించుకోవటం లేదు .ఎంతసేపూ ప్రైవేట్ వాళ్ళకే అ౦బా నీలకూ ఆదానీలకే వత్తాసు కాస్తోంది ,దోచిపెడుతోంది కదా బావగారు

2- నిష్టూరం  అనిపించినా నిజం చెప్పటం లో మీకు సాటి లేరు బావగారు .మనగొడవ ఎప్పుడూ ఉండేదే అనంతం .అక్షయ తృతీయ విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా బావగారూ

1-లేకేమి చాలా ఉన్నాయి .ఈ రోజే విష్ణువు ఆరవ అవతారమైన పరశురామ జయంతి .ఈ రోజే త్రేతాయుగం ప్రారంభమైందని నమ్మిక .దివినుండి గంగానది భువిపై ఉద్భవి౦చి౦దీ  ఈరోజే .వ్యాసమహర్షి మహాభారత రచన ప్రారంభించిందీ ఈరోజేనండి .అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై ‘’అని మనం పూజించే అన్నపూర్ణా దేవి జన్మదినమూ ఇవాళే.ఈ రోజే కుబేరుడు శివుని పూజించి లక్ష్మీదేవి  అనుగ్రహం తో  అక్షయ సంపద పొంది దానికి సంరక్షయ్యాడు  .ద్రౌపదీ మానసంరక్షణ అక్షయ వస్త్రాలతో శ్రీకృష్ణుడు  చేసిన రోజు ,తనను సందర్శించిన బాల్యమిత్రుడు కుచేలుడుప్రేమగా తెచ్చిన అటుకులు గ్రహించి శ్రీ కృష్ణుడు అక్షయసంపద ఇచ్చిన రోజుకూడా అక్షయ తృతీయే బావగారు

2-అక్షయ పాత్ర పేరేదో లోకం లో ఉన్నట్లు, విన్నట్లు జ్ఞాపకం

1-బాగా గుర్తు చేశారుబావగారూ –అజ్ఞాతవాసం లో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు ‘’అక్షయ పాత్ర ‘’ప్రదానం చేసినరోజుకూడా అక్షయతృతీయే .శంకర భగవత్పాదులు బాల్యం లో మొదటిసారిగా పేద ఇల్లాలి ఆమలకం భిక్షగా గ్రహించి ‘’కనకదారా స్తవం ‘’ ‘’చెప్పి,ఆమె ఇంటి ముందు అక్షయకనకధార కురిపించింది ఈరోజే  ,  బదరీనాద్ ఆలయం ద్వారాలు నాలుగు నెలలమూత తర్వాత ఇవాళే భక్తుల దర్శనం కోసం  తెరుచుకొంటాయి .పూరీ జగన్నాధ రధయాత్ర కు రధం నిర్మించే కార్యక్రమకూడా ఈ రోజే మొదలౌతుంది .బృందావనంలోని ‘’బ౦కే బిహారీ ‘’ఆలయం లో శ్రీ కృష్ణుని పాదదర్శనం ఈ అక్షయ తృతీయ ఒక్కరోజునే సాధ్యం .మన సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా అక్షయ తృతీయ నాడేబావగారు

2-ఇవన్నీ వింటుంటే ఒళ్ళు పులకిస్తోంది బావగారు .అక్షయ తృతీయ అంటే బంగారం కొనటం ఒక్కటే అనుకొన్నాను ఇన్ని విశేషా లున్నాయా బావగారు ధన్యవాదాలు .ఇంతకీ చందనోత్సవం కథా కమామీషు ఏమిటి బావగారూ?నరసింహస్వామి లక్ష్మీ నారసింహుడుగా ,యోగ నారసింహుడుగా విన్నాను కానీ ఈ వరాహ నరసింహం తిరకాసు ఏమిటి బావగారూ

1-అదీ జిజ్ఞాసువుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం బావగారూ .తండ్రి హిరణ్య కశి పుడినుంచి తనభక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించటానికి నృసింహావతారం దాల్చి హిరణ్యుని చంపి ,ప్రహ్లాదుని కోరికపై వరాహ నరసి౦హు డిగా సింహాచలం లో వెలశాడు కనుక ఆ పేరు వచ్చింది

2-అంటే రెండు అవతారాల సమ్మేళనం అన్నమాట కదా బావగారూ

1-అవును బావగారూ .వరాహావతారం  నరసింహా వతారం కలిసిన నూత్న అర్చామూర్తిగా స్వామి స్వయంభువుగా వెలసిన మహా పుణ్యక్షేత్రం సింహాచల దివ్యక్షేత్రం .మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఏకైక మహా దివ్యక్షేత్రం

2-వినటానికే మహా సంతోషంగా ఉంది అసలు అమూర్తి యెలాఉంటాడు  బావగారూ

1-ఇక్కడ స్వామివారు వరాహ వదనం తో ,మానవ శరీరం తో ,తెల్లని సింహంజూలు ,భుజం పై సింహపు వాలం అంటే తోక ,రెండు చేతులు ,భూమిలో దాగిఉన్న పాదాలతో   విలక్షణ మూర్తిగా దర్శనమిస్తాడు బావగారూ

2-వర్ణిస్తూంటే ఒళ్ళు పులకరిస్తోంది .చూస్తె ఎంత బాగుంటాడో?నిత్యం ఇలాగే దర్శనమిస్తాడా భక్తులకు బావగారూ

1-లేదండీ .సంవత్సరం లో ఒక్క అక్షయ తృతీయ నాడు తప్ప ,మిగిలిన 364రోజులూ ఇక్కడ ప్రసిద్ధమైన ,ప్రశస్తమైన పరిమళ సుగంధ దట్టమైన చందన౦ పూతతో ఒక శివలింగం  లాగా దర్శనమిచ్చి శివకేశవాద్వైత భావన కలిగిస్తాడు

2-మరి ఆచందనం ఎప్పుడుఎలా  తొలగిస్తారు బావగారూ

1-వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయతృతీయ నాడు చందనం ను బంగారు ,వెండి బొరిగలతో స్వామి శరీరం పై దట్టంగా ఉన్న చందనాన్ని గీకి తొలగిస్తారు  .తర్వాత  కొన్ని గంటలుమాత్రమే ‘’నిజ రూప దర్శనం ‘’అంటే వరాహ నరసింహ దర్శనం కలిగిస్తారు .దీన్ని వీక్షించటానికి తండోపతండాలుగా భక్తజనం చేరుకొని దర్శించి పులకిస్తారు

2-తొలగించిన చందనం ఏం చేస్తారు బావగారూ

1-భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దాన్ని నుదుట పెట్టుకోవాలి .తీర్ధంలో కలిపి కూడా ఇస్తారు .ఈ తీర్ధం దీర్ఘ రోగ నివారిణి గా భావిస్తారు

2-అసలు ఈ చందనం పూయమని ఎవరు చెప్పారు బావగారూ

1-మహా భేషైన ప్రశ్న సంధించారు బావగారూ .ఈ స్వామిని భక్త ప్రహ్లాదుడు మొదట పూజించాడు .తర్వాత చంద్రవంశరాజు పురూరవుడు విమానం లో ఆకాశమార్గాన ఇటుగా వెడుతుంటే ,ఈ స్థలప్రభావం వలన విమానం కిందకు ఆకర్షి౦ప బడింది .ఏమిటో అని దిగి చూస్తె ఒకపుట్టలో కప్పబడిఉన్న వరాహ నరసింహ స్వామి విగ్రహం కనబడింది .దాన్ని భక్తితో బయటికి తీయించగా ఆకాశవాణి పురూరవునితో ఒక సంవత్సరకాలం విగ్రహాన్ని చందనం తో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమె స్వామి నిజరూప దర్శం కలిగించేట్లు చేయమని చెప్పింది .ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్టించి పూజించాడు .అప్పటినుంచి అదే పద్దతి పాటిస్తున్నారు

2-ఇంకా కారణాలు ఉండి ఉండచ్చా బావగారూ

1-అక్షయ తృతీయ రోహిణి లేక కృత్తిక నక్షత్రం లో వస్తుంది .ఈ రెండూ అగ్ని నక్షత్రాలు .అసలేస్వామి ఉగ్రనారసి౦హుడు .కనుక శాంతపరచటానికి చందనలేపం తప్పని సరి

2-అవును బావగారు శివుడు కృత్తికా నక్షత్ర సంజాతుడు కనుక ఆయన్ను నిరంతరం చల్లబరచటానికే మహన్యాస పూర్వక అభిషేకాలు లు చేస్తారు

1-చాలా మంచి విషయం జ్ఞాపకం చేశారు బావగారూ

2-ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి బావగారూ  

1-విశాఖ పట్టణానికి అతి సమీపం లో సింహాచల క్షేత్రం ఉంది .ఇది పనసపంట కు , సంపంగి చెట్లకుప్రసిద్ధి . హిరణ్యకశిపుడు అన్నిరకాల దండనలతో కొడుకు ప్రహ్లాదుని బాధ పెడుతూ చివరికి సముద్రం లోకి విసిరి వేయమని భటులను ఆజ్ఞాపిస్తే ,అలానే చేస్తే విష్ణు మూర్తి ఇక్కడే రెండు చేతులుజాపి అతడిని సముద్రం లో పడకుండా కాపాడాడు అని అతిహ్యం కూడా ఉంది

2-వరాహావతారం తర్వాత నృసింహావతారం కదా బావగారు –ఆముచ్చట చెవిన వేయండి

1-మహా ప్రళయకాలం లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటె భూమి నీటిలో మునిగిపోయింది .భూమిని ఉద్ధరించటానికి బ్రహ్మ నాశిక నుంచి బొటనవ్రేలు ప్రమాణ౦ కల వరాహంగా శ్రీహరి ఉద్భవించి ,క్రమగా పెరిగి యజ్ఞవరాహ స్వామిగా విరాట్ రూపం పొందగా ,తనతో యుద్ధం చేయగలవాడు విష్ణువే అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షరాక్షసుడు హరిని వెతుక్కుంటూ రాగా ,ఆయన రసాతలం లో మునిగి ఉన్న భూమిని తన  దంతాగ్రాలపై నిలిపి  ఉండగా హిరణ్యుడు యుద్ధానికి వచ్చాడు .ఉపాయంగా భూమిని సముద్రపు నీటిపై ఉంచికాపాడి ,వాడితో భీకరయుద్ధం చేసి చంపేశాడు.

2-ఇవాళ సమయం చాలా సార్ధకమైంది బావగారూ వరాహ నరసింహ పై కవులేమైనా రాస్తే వినిపించండి

1-        రాయకేమి .దశావతార స్తుతి లో జయదేవమహాకవి –

‘’వసతి దశన శిఖరే  ధరణీ తవలగ్నా –శశిని కలంక కలేవ నిమగ్నా – కేశవధృత సూకర రూప –జయజగదీశాహరే  ‘’అని వర్ణించాడు  

2-శంకరాచార్యులవారు కూడా రాసే ఉంటారేమో బావగారూ

1-రాశారు .కరావలంబన స్తోత్రం ప్రసిద్ధమైనది

‘’శ్రీ మత్పయోనిది నికేతన చక్రపాణే-భోగీ౦ద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తీ –యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత –లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం’’

2-అక్షయ తృతీయను అక్షయ విశేషాలతో సార్ధకం చేశారు బావగారూ .వెళ్ళొస్తా

1-వెళ్ళిరండి బావగారూ మళ్ళీ కలుద్దాం  

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-20-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.