బక దాల్భ్యుడు -14
బృహదారణ్యక ,ఐతరేయ ఆరణ్యకాలలో గాలవ మహర్షి అసలు పేరు వస్తుంది .అతడు విశ్వామిత్రుని కొడుకు .ఒకసారి విశ్వామిత్రుడు చాలాకాలం ఇ౦టికిదూరంగా ఉండాల్సి వచ్చినపుడు ,తన పిల్లలను పోషించటానికి విశ్వామిత్రుడి భార్య పిల్లలో మధ్యవాడిని అమ్మి మిగిలిన వారిని పోషించాలి అనుకొంటుంది .దర్భలతో తాడు పేని ఆ దురదృష్ట వంతుడి మెడకు తగిలించింది అమ్మటానికి తీసుకు వెడుతుంటే దారిలో సత్యవ్రత మహారాజు(తర్వాత త్రిశంకు అయ్యాడు ) కనిపించి ఆకుటుంబాన్ని తాను ఆదుకొంటానని చెప్పిఆకుర్రాడి గళానికి ఉన్న దర్భతాడు తీసేయ్యమని చెప్పాడు .అప్పటినుంచి అతడు’’ గాలవుడు ‘’గా పిలువబడ్డాడు. అప్పటిదాకా అతని అసలు పేరు ఎవరికీ తెలియదు.మరో రకంగా కూడా దర్భ తాడు మెడకు ఉన్నవాడు కనుక దార్భ్యుడు లేక దాల్భ్యుడు అయి ఉండచ్చు .చివరగా వేదాలలో చెప్పబడిన గ్లవ లేక గాలవ కు పురాణాలలోని దాల్భ్యునికి మధ్య ఒక సన్నని తాడు లంకెగా ఉన్నట్లు అనిపిస్తుంది .
భగవదవతారం
మహాభారత ,పురాణ విషయాలవలన మార్కండేయ ,మహా వృద్ధ జంతుపువులు శివగణాలు అని తెలిసింది .శివ ,మార్కండేయులమధ్య మళ్ళీ ఒక కొంగ వచ్చి దూరిన విషయం తెలుసుకొందాం .స్కాందపురాణం ‘’ఆవత్య ఖండం ‘’3.8.లో బకకల్పం లయమయ్యే సందర్భంలో శివుడు ఒక కొంగ రూపం దాల్చాడు -3.8.53-‘’బకే పురాకల్పే’’.కల్పాల మధ్య చిరంజీవి మార్కండేయుడు తపస్సు చేస్తూ అనంత జలరాశిలో మునిగిపోయాడు .బయటపడటానికి ఈదుకొంటూ వస్తుంటే కంఠాభరణం లాగా తళతళ మెరిసే తెల్లని కొంగ ఒకటి ఆయనవైపు ఈదుకొంటూ రావటం చూశాడు .ఆకొంగ తానె శివుడు విష్ణు బ్రహ్మ అనీ తానె ఈప్రళయం సృష్టించానని చెప్పింది 3.8.7.ఆ మహాబకం మహర్షిని తనవీపుపై కూర్చోమని చెప్పి ,కూర్చోగానే ఆకాశం లోకి యెగిరి వెడుతుంటే ,నీటి అంచున పదిమంది స్త్రీలు కనిపించారు -3.8.14-16 .క్రమంగా అంతరిక్ష౦ లోకి ఎగురుతూ స్పష్టంగా స్వర్గ నగరాలను దర్శించాడు .అనేక వర్ణాల శివలింగాన్ని అవగతం చేసుకొన్నాడు -3.8.24-26.ఇప్పుడు మళ్ళీ ఆపదిమంది స్త్రీలు శివలింగాన్ని పూజించటం గమనించాడు ఆ స్త్రీలు నదుల మానవ రూపాలు .అందులో కల్ప వాహిని నర్మద అతడు చూసినవాటి అంతరార్ధం వివరించింది .3.8.39-47.మార్కండేయుడు ఆ స్త్రీలు నదీమతల్లులని ,ఆలింగం ,బకం,శివుని వేర్వేరు స్వరూపాలని అర్ధం చేసుకొన్నాడు-3-8.43 –‘’మహాదేవో లింగ మూర్తిర్’’.3.8.49-‘’దేవేశో బకరూపో మహేశ్వరః ‘’.నర్మదానది వృత్తాంతం తర్వాత ఆ దృశ్యం క్రమంగా అదృశ్యమైంది .వెంటనే మొదట్లో మార్కండేయుడు నదిలో స్నానం చేసి శివుని అభిషేకిస్తున్నట్లు అనిపించి కాసేపటికి అదీ అదృశ్యమై ఆయన స్థిరంగా భూమి మీదనే ఉన్నట్లు అనిపించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-20-ఉయ్యూరు
—