ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7

  తరువాత తరం లోలార్డ్  బైరన్ షెల్లీ ,కీట్స్ కవులు కాల్పనిక కవిత్వాన్ని కొత్త సొగసులతో నింపారు .ఫ్రెంచ్ విప్లవ జ్వాలలు చల్లారాక యూరప్ లో ఆవరించిన నిరాశా వాతావరణాన్ని బైరన్ తన కవితల్లో ప్రతిఫలింప జేశాడు .మనసులో ఏర్పడిన ఆధ్యాత్మిక సంఘర్షణ ‘’చైల్డ్ హెరాల్డ్స్ పిల్గ్రిమేజ్‘’,డాన్ జువాన్ ‘’కావ్యాలలో ,’’మాన్ ఫ్రెడ్’’,’’కెయిన్ ‘’నాటకాలలో కనిపిస్తుంది .తనకావ్యాలలో తప్పులు చూపిన విమర్శకులను బైరన్ ‘’ఇంగ్లీష్ బార్డ్స్ అండ్ స్కాచ్ రెవ్యూయర్స్ ‘’అని అధిక్షేపించాడు మన తిట్టుకవి భీమన ,వికటకవి తెనాలి రామలింగనిలా .

  ఈ నిరాశ లో విప్లవం సుస్థిర వ్యవస్థకు దారి తీస్తుందని ,మానవులకు మహోజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని ఎలుగెత్తి చాటిన ఆదర్శ వాదకవి పి.బి .షెల్లీ .లిరిక్ కవిత్వం లో షెల్లీ కి మించినవాడు మళ్ళీ పుట్టలేదు .’’దిస్కైలార్క్ ,’’ది క్లౌడ్ ‘’,ది సెన్సిటివ్ ప్లాంట్ ‘’,’’ఓడ్ టు ది వెస్ట్ విండ్’’,’’ఎ లామెంట్ ‘’గీతాలలో ఉన్న రస స్పూర్తి నాన్యతో దర్శనీయం .’’ది రివోల్ట్ ఆఫ్ ఇస్లాం ‘’కావ్యం లో మానవుని మంచితనంపై షెల్లీ కున్న విశ్వాసం చిరస్మరణీయం .’’ప్రొమీథియన్ అన్ బౌండ్ ‘’అనే గేయ నాటకం లోనూ ఇది ప్రతిఫలించింది .కీట్స్ కవి మరణం పై ‘’ఎగొనీస్’’అనే కలకాలం నిలిచిపోయే విషాద గీతిక రాశాడు .కావ్య ప్రయోజనం పై తన సిద్ధాంతాన్ని ‘’డిఫెన్స్ ఆఫ్ పొయెట్రి’’ గొప్పగా చర్చించాడు .కృష్ణ శాస్త్రి జ్ఞాపకమొస్తాడు .అందుకే శ్రీశ్రీ కృష్ణశాస్త్రి మరణానికి స్పందించి ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అన్నాడు .

  ‘’సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యం ‘’అని జీవితం లోనూ కవిత్వం లోనూ నమ్మి సౌందర్యాన్ని ఆరాధించిన మధుర హృదయ కవి జాన్ కీట్స్ .’’ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్’’,’’ఇసబెలా ‘’,అనే సుందర రసబంధుర కావ్యాలు ,’’టు ఆటం’’,’’టు ఎ నైటింగేల్’’’’,ఆన్ ది గ్రీషియన్ ఆర్న్’’,’’టు మెలాంకలి’’ వంటి భావ గీత కర్త కీట్స్ .మన తిలక్ గుర్తుకొస్తాడు .

బైరన్, షెల్లీ ,కీట్స్ లు అవినాభావ సంబంధమున్న  ఆధునిక ఆంగ్ల కవిత్రయం .

  19 వ శతాబ్ది ‘’ఎడింబరో రివ్యు ‘’,క్వార్టర్లీ రివ్యు ‘’,బ్లాక్ వుడ్స్ మేగజైన్ ,లండన్ మాగజైన్ వంటి ప్రసిద్ధ పత్రికలు సాహిత్య సమాలోచనలకు బాగా తోడ్పడ్డాయి .మొదటి మూడూ స్కాట్ లాండ్ నుంచి వచ్చినవే కాని కాల్పనిక ,కవిత్వాన్ని వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని దుమ్మెత్తి పోసి చివరకు వ్యక్తీ దూషణదాకా వెళ్ళాయి .అప్పటి వచన రచయితలలో టామన్ డీక్వెన్సి ,చార్లెస్ లాంబ్ ,విలియం హాజ్లిట్ , లే హంట్ లు ముఖ్యులు ఆల౦కారిక శైలి డీక్వెన్సీ ది.’’కన్ఫెషన్స్ఆఫ్ యాన్ ఇంగ్లీష్ ఓపియం ఈటర్ ‘’ (మత్తు మందు భాయి )ఆత్మాశ్రయ వచన రచనకు గొప్ప ఉదాహరణ .మృదుహాస్య శైలిలో లాంబ్ ‘’ఈలియా ‘’అనే మారుపేరుతోచాలా వ్యాసాలూ ,షేక్స్ పియర్ నాటక రంగస్థల అభినయ ఔచిత్య అనౌచిత్యాలపై రాసిన సాహిత్య విమర్శ శిఖరాయమానం .షేక్స్పియర్ నాటక కథలను ‘’టేల్స్’’రూపంగా అతని సోదరి అందించింది ఇందులో లాంబ్ కూడా భాగస్వామి .షేక్స్పియర్ తో ఏర్పడిన వైరుధ్యాన్ని ఇలా మాన్పుకొనే ప్రయత్నం చేశాడు .  విలియం హాజ్లిట్ ను ‘’విమర్శకులకు విమర్శకుడు ‘’అంటారు .ఆయన వ్యాసాలు స్పూర్తి దాయకాలు .కీట్స్ కవి హృదయాన్నీ కాల్పనిక కవిత్వాన్ని ఆవిష్క రించిన వాడు  కీట్స్ స్నేహితుడు లే హంట్ .తామస్ లవ్ పీకాక్ అనే నవలారచయిత ‘’హెడ్ లాంగ్ హాల్ ‘’,నైట్ మేర్ ఎబ్బీ ‘’,క్రోచెట్ కాజిల్ ‘’నవలలలో ఆ నాటి సమాజాన్ని వ్యంగ్య ధోరణిలో విమర్శించాడు .నవలమధ్య భావగీతాలూ రాశాడు మన ‘’అడివి బాపి బావ’’ లాగా .

  1832నుండి 19వ శతాబ్దిలో మిగిలినకాలాన్ని ‘’విక్టోరియా యుగం ‘’అంటారు .విక్టోరియారాణిపాలనకాలం లో దేశం అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లింది .కాని సాంఘిక ,ధార్మిక ,వైజ్ఞానిక రంగాలలో గొప్ప సంచలనం కలిగింది .చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు .ఇది బైబిల్ లోని సృష్టి విధానానికి విరుద్ధం .దీనితో ప్రకృతి శాస్త్రం మత సిద్ధాంతాలమధ్య  ఘర్షణ ఏర్పడింది  .హెర్బర్ట్ స్పెన్సర్ ,ధామస్ హగ్లీ వంటిమేదావులు సైన్స్ ను సమర్ధించారు .కొందరు ఈ రెండిటిమధ్య సమన్వయ౦  కోసం పాటు బడ్డారు .యంత్రావిర్భావం తో పారిశ్రామిక విప్లవం వచ్చింది .దీనితో మళ్ళీ కొత్త సమస్యలేర్పడి,సైన్స్ లో ప్రకృతి శాస్త్ర ప్రాధాన్యం,రాజకీయంగా ప్రజాస్వామ్య సిద్ధాంత వికాసం ,,మత విశ్వాసాలలో అనిశ్చిత స్థితి గా ఈ యుగ లక్షణాలను విశ్లేషకులు భావించారు.ప్రజలకు భోగ లాలసత పెరిగి ,మనో వికాసం కలిగించే కళలను మర్చి పోయి అనాగరకులౌతున్నారని కొందరి భావన .సంస్కృతీ వికాసానికి సంస్కర్తలు నడుం కట్టారు .ఇవన్నీ ఆనాటి సాహిత్యంలో స్పష్టంగా ప్రతిఫలించాయి .

 ఆ నాటి మేటి కవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ కావ్యాలలో అప్పటి జిజ్ఞాసువుల సందిగ్ధ మానసిక స్థితిని స్పష్టంగా చూపించాడు .పదలాలిత్యానికి అతడు గొప్ప ఉదాహరణ .మన సంస సంస్కృతకవి దండి లాగా .ఆర్ధర్ రాజు గురించిన ప్రాచీన గాథలను సేకరించి ,అసమాన శిల్పం తో ఆనాటి మనోజ్ఞ వాతావరణాన్ని కళ్ళముందు ఉంచుతూ ‘’ది ఇడిల్స్ ఆఫ్ ది కింగ్ ‘’కావ్యం రాశాడు .తనమిత్రుని స్మృతి చిహ్నంగా ‘’ఇన్ మెమోరియం’’కావ్యం రాసి తన ఆధ్యాత్మిక వేదనకు వేదిక చేశాడు .ఈయన లఘుకావ్యాలన్నీ కమ్మచ్చు తీసిన కళాఖండాలే .రాబర్ట్ బ్రౌనింగ్ అల్పాక్షరాలతో అనల్పార్ధాలు సృష్టించి ఆడర్శవాదంతో ప్రేమ దివ్యమైనదనీ ,ఆత్మ వికాసం కలిగించి స్వర్గానికి చేరుస్తుందని తనకావ్యాలన్నిట్లో చెప్పాడు .అతని రచనలలో ‘’హిప్పా పాసెస్ నాటకం ,ఆండ్రియా డెల్ సార్టో’’,ఎజ్ట్ వాగ్లర్ ,రబ్బీ జెన్ ఎజ్రా ఖండకావ్యాలు ,’’హోమ్ థాట్స్ ఫ్రం ఎబ్రాడ్ వంటి రసవత్తర ఆత్మాశ్రయ గీతాలు ఉన్నాయి .హిరణ్య కశిపుడు లాగా దేవుడు కలడో లేడో అనే సందిగ్ధంతో ఊగుతుండే ఆనాటి మనుషులకు ‘’దేవుడు స్వర్గం లో ఉన్నాడు ప్రపంచమంతా సవ్యంగానే ఉంది ‘’అని భరోసా ఇచ్చాడు బ్రౌనింగ్ .భార్య ఎలిజబెత్ బార్రెల్ బ్రౌనింగ్ గొప్ప కవితా శక్తితో ‘’క్రై ఆఫ్ ది చిల్డ్రన్ ‘’,ఆరోరాలే ,వంటి కరుణ రసకావ్యాలు ,అనేక సానెట్లూ రాసి అర్ధాంగి అనిపించింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.