మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

ఎం.ఎ.కరందికర్ రాసిన దాన్ని శ్రీ మొదలి నాగభూషణ శర్మగారు ‘’ హరినారాయణ ఆప్టే ‘’గా తెలుగు అనువాదం చేయగా  నేషనల్ బుక్ ట్రస్ట్ 1973లో ముద్రించినది .వెల-రెండు రూపాయల పావలా .

‘’ మరాఠీ నవలా సాహిత్యం హరి నారాయణ ఆప్టే వల్లనే  సక్రమ మర్గాన నడిచింది.సాహిత్యజీవితపు తొలి రోజుల్లోనే మధ్యతరగతి ప్రజలగురించి జీవితాలగురించి రాశాడు .తర్వాత చారత్రక కాల్పనిక కధలు తీసుకొన్నాడు ‘’అన్నారు బివి కేస్కర్ .

             బాల్యం

మహారాష్ట్ర చిత్ పవన కుటుంబాలలో ఆప్టే ఒకటి .హరినారాయణ ఆప్టే తాతగారు మహారాష్ట్ర ఖాందేశ్ తాలూకా అధికారి .ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ,నలుగురుకోడుకులు .అందులో నారాయణ్ కుమారుడే హరినారాయణ .కలవారి కుటుంబమే .తల్లి యాము లక్ష్మి .బయటకు వెళ్లి పై చదువులు చదివే స్తోమతలేక నారాయణ్ ఇండోర్ లో నెలకు పది రూపాయలకు చిన్న ఉద్యోగం లో చేరాడు .వదిలేసే నాటికి జీతం 30 రూపాయలు .ఇండోర్ లో ఉండగానే నారాయణ్ ,లక్ష్మీ దంపతులకు హరి నారాయణ్ 8-3-1864 మాఘ అమావాస్య నాడు జన్మించాడు .తర్వాత కుటుంబం పూనా చేరింది .పోస్టల్ డిపార్ట్ మెంట్ లో నారాయణ్ బొంబాయి లో 1867లో చేరి ,సోదరుడు మహాదేవ్కు  ఉపయోగపడటానికి బొంబాయి చేరాడు .అప్పుడే మహాదేవ బిఎ ఫస్ట్ క్లాస్  లో పాసయ్యాడు .మరుసటి ఏడాది మూడో బిడ్డను ప్రసవించి లక్ష్మి చనిపోయింది .ఆడపిల్ల కూడా రైలు ప్రమాదం లో చనిపోయింది .హరి బాగోగులు తాను  చూస్తానని లక్ష్మి మరణ శయ్య మీద ఉన్నప్పుడు మహాదేవ హామీ ఇచ్చి నిలబెట్టుకొన్నాడు .ఈ విషయాలను హరి తన నవలలలో చిత్రించాడు .

  తల్లి మరణం తర్వాత హరి నాయనమ్మ,పెత్తల్లి లకు బాగా మాలిమి అయ్యాడు .దీపావళి రోజున పోలీస్ ఆజ్ఞలకు వ్యతి రేకం గా టపాసులు కాల్చినందుకు హరి ని అరెస్ట్ చేస్తే పెదనాన్నే విడిపించాడు .చిలిపితనం తో అందర్నీ అనుకరించేవాడు హరి .1870లో తండ్రి  మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు సవతి తల్లి హరిని  అమిత ఆప్యాయంగా చూసేది .1871 అన్నా సాహెబ్ అనే మహాదేవ్’’ లా’’పాసై ,సబ్ జడ్జిగా పని చేశాడు .నాలుగేళ్ళతర్వాత బొంబాయి హైకోర్ట్ లో న్యాయవాదిగా చేరగా భార్య క్షయతో చనిపోయింది .భార్య పోవటం తో అతడు కుటుంబ బాధ్యత పట్టించుకోలేదు .

  తండ్రి బొంబాయి ఫణస్ వాడీ లో వేరే ఇల్లు చూసుకొని కాపురం మార్చాడు .కానీ బాంబే జీవితం ఖర్చుతో కూడినదని భావించి పూనాకు పంపాడు .పెత్తల్లి మరణానికి ముందే ఆమె ఒత్తిడితో హరి ఉపనయనం 1872లో జరిగింది .పొరుగింటి శ్రీమతి రాధాభాయి గోఖలే  నూతన వటువు చురుకు దానాన్ని చూసి ముచ్చటపడి ,తనకుమార్తె మధును అతనికిస్తానని చెప్పింది .ఆమె భర్త విశ్వనాధ గోఖలే పూనాలో న్యాయవాది .హరి అక్కడే చదువుతున్నాడు .బొంబాయిలో మూడవ తరగతి దాకా చదివి పూనాలో బిషప్ హై స్కూల్ లో చేరాడు .ఇక్కడ మరాటీ సంప్రదాయం వాతావరణం నచ్చాయి .ఉత్తమ ఉపాధ్యాయులు దేశభక్తులు,ఆదర్శ వాదులు  ఉన్నారు .విద్యార్ధులకు మార్గదర్శకం చేసేవారు .

  హరి తండ్రి 1880లో సతారాకు బదిలీఅయ్యాడు .అప్పటి ఆప్టే కుటుంబం లో హరే పెద్దవాడు .గారాబంగా పెరిగాడు కనుక  చిలిపితనం హద్దులు మీరేది .సంస్కృతం బోధించే ఉపాధ్యాయుడి బట్ట తల నిమిరితే తప్ప పాఠం వినేవాడు కాదు .శ్రద్ధగా చదివి రఘువంశం శాకుంతలం ,విక్రమోర్వశీయం నేర్చి స్వయంగానే సంస్కృత  ఉద్గ్రంధాలు చదివే విద్వత్తు సంపాదించాడు .మరాటీ సాహిత్యాన్నీ మధించాడు .మంచి పరిశీలనా శక్తి ఉండటం తో కధలు ,పద్యాలు రాసేవాడు అప్పుడే .ఐదవ తరగతి లోనే ‘’పూరీ హౌస్ ఫిటలి’’అంటే ఉత్సాహం పూర్తిగా మందగించింది కధ రాశాడు .నాట్య కధార్ణవ మాసపత్రిక ఉత్సాహంగా చదివే వాడు .అది అతని ఊహా శక్తిని ప్రేరేపించింది .మెడోస్ టేలర్ రాసిన ‘’పాండు ర౦గ్ హరి ‘’ఉద్గ్రంధాన్ని ‘’అనాధ పాండురంగ’’గా అనువదించాడు .తారా అనే గ్రందాన్నీ అనువాదం చేశాడు.అయితే ఈరెండూ అలభ్యాలు .

  1-1-1880న విష్ణు శాస్త్రి చివ్ లూణ్ కర్  ‘న్యు ఇంగ్లీష్ స్కూల్ ‘’స్థాపించాడు .ఆయనతో దక్కన్ కాలేజి గ్రాడ్యుయేట్స్ అయిన తిలక్ ,కరందికర్ ,భగత్ లు చేరారు .యువతకు జాతీయభావనతో కూడిన విద్య బోధించటమే వీరి లక్ష్యం .హరి కొందరు విద్యార్ధులతో కలిసి ఇందులో చేరాడు .మొదటి రోజున 150 మంది మాత్రమె విద్యార్ధులు .మహారాష్ట్ర చరిత్ర పరిశోధకుడు వాసుదేవ శాస్త్రి ఖరి ,ఇంగ్లీష్ భాషా బోధనా ప్రవీణ్ హరి కృష్ణ దామ్లె ,ప్రముఖ సంస్కృత పండితుడు ,పత్రికాధిపతి నన్ దర్గీ కర్ శాస్త్రి ,మాధవరాం నాం జోషీ లు అతి తక్కువ జీతాలతో పని చేశారు .ఆగస్ట్ లో మహా సంస్కృత పండిట్  వామన్ శివరాం ఆప్టే వచ్చి చేరాడు .మూడు నెలలలో మూడు వందలమంది విద్యార్ధులతో కళకళ లాడింది విద్యాకేంద్రం .ఆ రోజుల్లోనే హరినారాయణ్ ‘’నేను బ్రిటష్ ప్రభుత్వం లో పని చేయను ‘’అని ప్రతిజ్ఞ చేశాడు .స్వాతంత్ర్యం ,పాండిత్యం తో ఆస్కూల్ మెరిసిపోయింది .హరి మెట్రిక్ క్లాస్ కు రాగానే మిల్టన్ ,షేక్స్ పియర్ స్కాట్ షెల్లీ కీట్స్ జేన్ ఆస్టిన్,డికెన్స్ ధాకరే గ్రంధాలను ,మోలియర్ నాటకాలను అర్ధం చేసుకొనే స్థాయికి ఎదిగాడు .స్థాపకుడు విష్ణు శాస్త్రి 1882మార్చి 17 అకస్మాత్తుగా చనిపోతే ,వెంట స్మశానానికి వెళ్ళిన హరి ఉత్తేజితుడై ‘’’’శిష్యజన విలాపం ‘’అనే 89పద్యాల స్మృతి  గీతం  రాశాడు .అచ్చయిన రెండు రోజుల్లో వెయ్యికాపీలు అమ్ముడయాయి .దీనితో హరి పేరు విశేషంగా వ్యాప్తి చెందింది .

  తర్వాత అగార్కర్ ,తిలక్ లకు ‘’కొల్హాపూర్ దివాన్ బార్వే ‘’అనే అభియోగంతో 1882జులై 17న నాలుగు నెలలు కఠిన కారాగార వాస శిక్ష పడింది .వారి విడుదలకోసం హరి నిధిని వసూలు చేసి వారి పట్ల గౌరవం ప్రదర్శించాడు .చదువుకు భంగం కలిగింది మెట్రిక్ పరీక్షకు పంపలేదు .కానీ 1883లో పాసయ్యాడు హరి .

  సశేషం

రేపు శివరాత్రి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.