గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6
ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు
ముద్రా రాక్షస నాటకాన్ని రాసిన విశాఖ దత్త మహారాజు తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు .కాని తండ్రి భాస్కర దత్తుడు అని ,తాత గారు మహా రాజా వటేశ్వర దత్తు అని ముద్రారాక్షసం లో చెప్పుకొన్నాడు .అంతకు మించి ఏమీ లేదు .వీరిది దత్త వంశం అని దీన్ని బట్టి అర్ధమౌతోంది .ముద్రారాక్షసం లో చంద్ర గ్రహణ ప్రస్తావన ఉంది .దీన్ని ఆధారం గా యాకోబి అనే చారిత్రక పరిశోధక రచయిత 2-12-860న అలాంటి గ్రహణం ఏర్పడింది అని ,కనుక తొమ్మిదవ శతాబ్దివాడు అని నిశ్చయించాడు .కీత్ ,దాస్ గుప్తాలు కూడా దీనితోనే ఏకీభవించారు .ఇంకాకొందరు విశాఖ దత్తుడు గుప్తరాజు రెండవ చంద్ర గుప్తుని సామంతరాజన్నారు .ఈ చంద్రగుప్తుడు హూణులను జయించాడు .విశాఖ దత్తుడు ఈతనిని నాయకుడిగా చేసి ‘’దేవీ చంద్ర గుప్త ‘’నాటకం రాశాడు ఇందులో హూణులపై విజయమే కధాంశం .దత్తుడు చౌహాన్ రాజులకాలం వాడని కొత్త వాదం తీశాడు విల్సన్ పండితుడు .ఇంత గందర గోళం లో పడేశాడు కవి .కాని ముద్రా రాక్షస నాటకం లోని రాజకీయ సాంఘిక విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే విశాఖ దత్తుడు క్రీ శ నాలుగు –అయిదు శతాబ్దాల వాడని రూఢిగా చెప్పి వాదానికి ఫుల్ స్టాప్ పెట్ట వచ్చు .పై రెండు నాటకాలు కాకుండా ‘’అభిసారికా వంచితం ‘’అనే నాటకాన్ని కూడా రాశాడని అంటారు .ఒక్క ముద్రారాక్షసం తో విశాఖ దత్తుడు అసమాన నాటక నిర్మాణ శిల్పం తో రాజకీయ ఎత్తుగడలతో దేశ స్వాతంత్ర రక్షణ బాధ్యతతో , ఆర్య చాణక్యుని అసమాన ప్రతిభను సరిసమానమైన పాటవం గల రాక్ష మంత్రి గొప్పతనాన్ని నాటకం లో ఉంచి మేధో విలసిత నాటకం అని పించాడు .మానవీయ కోణాలనూ స్పృశించాడు .శౌర్యం ధైర్యమే కాకుండా గుండె తడినీ ,ఆర్ద్రతనూ ఇంత కఠిన ,కర్కోటక రాజకీయ నాటకం లో ప్రదర్శింప జేశాడు .
అనితర సాధ్యం –ముద్రా రాక్షసం
నాయిక లేని నాటకం ముద్రా రాక్షసం .రాజకీయ పరిజ్ఞానం విస్తరిల్లిన నాటకం ఇది .రాచకీయ ఎత్తులు ,పై ఎత్తులతో విస్తరిల్లింది .అడుగడుగునా సస్పెన్స్ .ఒకసారి చణక్యుడిది పై చేయి అనిపిస్తే మరో సారి రాక్షసామాత్యుడిది గెలుపు అని ఊరిస్తూ సాగే నాటకం .రాక్షసుడికంటే చణక్యునిది సునిసిత మేధ .పరిపక్వ ఆలోచన .అవతలివాడి కి నిద్రపట్ట నీయకుండా గుండెల్లో నిద్రపోతాడు మంత్రి చాణక్యుడు .అన్నిరకాల ఉపాయాలను ప్రయోగిస్తాడు .ఇదంతా దేనికి?తానేమీ బావుకోవటానికి కాదు .దుస్ట నంద వంశ నిర్మూలనం జరిపి చంద్ర గుప్త మౌర్యుని అభిషేకించి భారత మాత కస్టాలను దూరం చేయటమే ఆయన ధ్యేయం .ఇది ఏడు అంకాల నాటకం .కద అందరికి తెలిసిందే .అన్నిటా చణక్యునిదే విజయం .రాక్షసుడు అన్ని దశల్లో ఓడిపోయి తన వారెవరూ లేకుండా ఒంటరి గా మిగిలిపోతాడు .తాను అసమర్దుడినని విచారిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు .అప్పుడు మంత్రి చాణక్యుడు రాక్షసమంత్రి మంత్రాంగంమౌర్య చంద్ర గుప్తునికి ఏంతో అవసరమని తన పాత్ర రాజకీయం నుండి నిష్క్రమించటం శ్రేయస్కరం అని రాజ్య నిర్మాణం సమర్ధం గా చేయటానికి రాక్షసుడే తగిన వాడని భావించి రాక్షసుని ఒప్పించి చంద్ర గుప్తుని మంత్రిగా చేస్తాడు .ఆర్య చాణక్యుని అసమాన రాజనీతికి దాసోహం అంటాడు రాక్షసుడు .
నామ ఔచిత్యం
ముద్రా రాక్షసం అంటే ‘’ముద్రయో గృహీతం రాక్షస మది కృత్య కృతో గ్రంధః ముద్రా రాక్షసం ‘’అని వ్యుత్పత్తి అర్ధం చెప్పారు ముద్ర అంటే రాజ చిహ్నం అయిన ఉంగరం లేక అంగుళీయకం .ఇదే నాటకాన్ని నడిపిస్తుంది ఎత్తులతో జిత్తులతో ఎత్తుగడలకు సూత్రధారి చాణక్యుడు .పాత్ర దారి రాజముద్ర .ఈ అంగుళీయక ముద్ర రాక్షసుడి కొంప కొల్లేరు చేసి దాసోహం అనేట్లు చేసింది.కౌటిల్యుని అసమాన ధీ శక్తివలన. అందుకే ఈపేరు నాటకాని పరమ ఉచితం అని అందరూ సర్టిఫికేట్ ఇచ్చారు .
దత్తుడు నాటక కళలో అందే వేసిన చెయ్యి అని ప్రతి అంకం లోను రుజువు చేస్తాడు .ప్రతి సంభాషణా ఔచిత్యానికి పరాకాష్ట గా ఉంటుంది .రాజకీయాన్ని దృశ్య కావ్యం గా మలచిన తీరుకు జోహార్ అనక తప్పదు .మొదటి నుంచి చివరి సన్నివేశం వరకు కుతూహలాన్ని రేకెత్తిస్తాడు .తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని ఉత్కంత భరితం గా నాటకాన్ని నడిపించాడు .అతని రచనా పాటవాన్ని గమనిస్తే విశాఖుడైన కుమార స్వామి దేవ సేనాదిపత్యానికి యెంత అర్హుడో దత్తుడు కూడా ఈ నాటక నిర్మాణ ,గమన విజయాలకూ అంటే సమర్ధుడై అన్వర్ధ నాముడు అనిపిస్తాడు .లక్ష్య సాధనకు ప్రతి అంకం తోడ్పడింది .అతని వ్యూహానికి ఇది గొప్ప విజయం .
పాత్ర చిత్రణ
ఈ నాటకం వీరరస ప్రాధాన్యం కలది కాని ఇందులో వీరం భీభత్సం కాదు .ఉత్సాహ భరితం .అందుకే గుండెలకు తాకుతుంది .ప్రతి పాత్రను వ్యక్తిత్వం తో భాసింప జేశాడు .కౌటిల్యుడైన ఆర్య చాణక్యుని పాత్ర చిత్రణ అద్వితీయం అని పిస్తుంది .ఈయనకు సమ ఉజ్జీ గా నంద రాజ మంత్రి రాక్షసామాత్యుని తీర్చి దిద్దాడు .స్థాయి ఏ మాత్రం తగ్గించలేదు .అయితే చాణక్యుడు నిస్వార్ధ జీవి. దేశ రక్షణ శీలి .పండితుడేకాక కార్య శీలి ,సాహసి .వ్యూహ కర్త .అనుకొన్నది సాధించటానికి ఎంతదాకానైనా పోగల వాడు. చేపట్టిన పని మధ్యలో వదిలే రకం కాదు .కార్యం సానుకూలం కావాల్సిందే .దానికి ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్నీ ప్రయోగిస్తాడు . అతని బుర్ర పాదరసమే .
ప్రతి ద్వంద్వి రాక్షమంత్రి కొంచెం మెత్తటి వాడు .దేనికి విరుద్ధం చాణక్యుడు కార్య సాధన లో అతి కఠినం గా వ్యవహరిస్తాడు .తన మనసులోని ఆలోచనను రాజు చంద్ర గుప్తుడికీ తెలియ నివ్వని రహస్య మంత్రాంగం ఆయనది .రాక్షసుడూ ఏ పదవీకోరుకో లేదు .నంద వంశ సంరక్షణే ధ్యేయం గా జీవించాడు .ధర్మ పక్ష పాతి చణక్యుడైతే అధర్మానికి ఆసరాగా నిలిచి రాక్షసుడు దెబ్బ తిన్నాడు. కురుక్షేత్ర యుద్ధం లో భీష్మాదులు ఎలా ప్రవర్తించి దెబ్బ తిన్నారో ఇక్కడ రాక్షసుడు, ఆయనను నమ్మిన వారు సర్వం కోల్పోయారు .ధర్మానికి విజయం అన్నదే ఈనాటకం లో విశాఖ దత్తుడు చెప్ప కుండా చెప్పాడు .
ఈ రాక్ష రాజకీయం ఎవరికోసం అంటే మౌర్య వంశ స్థాపకుడిగా చంద్ర గుప్తుని అభిషేకించ టానికే .దీన్ని చంద్రుడిని ఆసరాగా చేసుకొని మొదటినుంచి చివర వరకు చాణక్యుడే ఆడించాడు నాటకాన్ని. సఫల మనోరదుదయ్యాడు. చేసిన ప్రతిజ్ఞా తీర్చుకొన్నాడు .కులం ,ఆభిజాత్యం ప్రధానం కాదు.గుణం ప్రధానం రాజుకు అని రుజువు చేసి చూపించాడు .ఆదర్శ చక్ర వర్తిని తీర్చిదిద్దాడు .మురఅనే నిమ్న జాతి స్త్రీ సంజాతుడు చంద్ర గుప్తుడు .కాని సకల సద్గుణ సంపన్నుడు .అందుకే చాణక్యుని ద్రుష్టి చంద్రునిపై పడింది రాజ్యానికి సర్వా సమర్ధుడని భావించి పావులు కదిపాడు .మన నాటకాలకు నాయకుడు క్షత్రియుడై ఉండాలి కాని ఇక్కడ’’ దృశ్యం’’ వేరు అయినా నాయకుడు చంద్రుడే .అలంకార శాస్త్రాను సారం ఇది తప్పుఅని పండితులు ఈసడించారు .కాని సూర్య కాంతిని అరచేతులతో ఆపలేరు కదా .నాటక భానుమండల తేజో పుంజం అయింది ముద్రా రాక్షసం .
కవితా గీర్వాణం
అర్ధ ,నాట్య న్యాయ రాజనీతి శాస్త్రాలలో మహా నిష్ణాతుడు అనిపిస్తాడు విశాఖ దత్త కవి .కవిత్వం గంభీర మూ శక్తి జలపాతమూ .స్రగ్ధర వ్రత్తాన్ని ఎక్కువ సార్లు ప్రయోగించాడు .ఇది గంభీరభావాల ఆవిష్కరణకు అత్యంత దోహదకారి .సందర్భాన్ని బట్టి ఛందో భేదం చూపించాడు .శ్లేష కూడా వాడాడు. కవిత్వం ప్రసన్న మధురమే .స్త్రీ పాత్రలు లేకపోవటం కోమలత్వానికి దూరం చేసిందేమో ?కాని విషయం అంతా ఘర్షణ మయం కనుక లేక పోయినా ఇబ్బంది ఏమీ ఉండదు .కొన్ని సుకుమార భావనలు చక్కగా వర్ణించాడు విశాఖ కవి –
‘’నామం బాహులతాం నివేశయ శిధిలం కంతే నివ్రుత్తాననా –
స్కందే దక్షణయా బలాన్నిహితయా ప్యాంకే పతంత్యాముహుః
గాఢాలింగన సంగ పీడిత సుఖం యస్యోద్య మాశంకినీ
మౌర్యస్యోరపి నాదునాపి కురుతే వామేతరం శ్రీః స్తనం ‘’
అమాత్య రాక్షసుడికి ఝడిసి మౌర్య రాజ్య లక్ష్మి చంద్ర గుప్తుడిని పూర్తిగా ఆలింగనం చేసుకోలేక పోతోందట .ఆమె ఎడమ బాహువు అనే లతను చంద్ర గుప్తుడి మెడలో వేసినా ,అది విరిగిపోయిందట .ముఖాన్ని అతని వైపు నుంచి పక్కకు తిప్పుకొందట .కుడి చేయిమాత్రం బలవంతం గా రాజు బుజం మీద పెట్టిందట .కాని అదిమాటి మాటికీ జారిపోతోందట .అందుకే చంద్ర గుప్తుడిని ఆలింగనం చేసుకోలేక పోతోందట .కాని ఆమె కుడి రొమ్ము రాజు వక్షస్తలాన్ని అంటుకొని ఉన్నప్పటికీ గాఢాలింగన సుఖాన్ని అతనికి ఇవ్వలేక పోతోందట .
చాణక్యుని ఆశ్రమ వర్ణన చూస్టే ఆయన యెంత దరిద్ర స్తితిలో జీవిం చే వాడో అర్ధమయ్యేట్లు ఉంటుంది
ఈ నాటకాన్ని ‘’రాక్షాసాస్ రింగ్ ‘’అనే పేరుతొ క్లే సాంస్క్రిట్ లైబ్రరి వారు ప్రచురించారు .
విశాఖ దత్తునిది అని చెప్ప బడుతున్న ‘’దేవీ చంద్ర గుప్త ‘’నాటకం లో కొన్న భాగాలు మాత్రమే భోజమహారాజు రచనలు శృంగార ప్రకాశ ,సరస్వతీ కంఠాభరణం లో ను,సాగర నంది రాసిన నాటక రత్న కోశం లోను ,రామ చంద్ర ,గుణ చంద్రులు రాసిన’’ నాట్య దర్పణం ‘’ లోను లభిస్తున్నాయి .ఇందులో ఇతి వృత్తం –రామ గుప్త రాజు తో శక రాజు చేసుకొన్నకపట ఒడంబడిక .దానిప్రకారం గుప్తరాజు భార్య ధృవా దేవిని శాకరాజు దగ్గరకు పంపాలి .గుప్తుని తమ్ముడు చంద్ర గుప్తుడికి ఈ విషయం తెలిసి ప్రతీకారం తీర్చుకొంటాడు .శకరాజును యుద్ధం లో చంద్ర గుప్తుడు చంపి అన్న రామ గుప్తుడికి పట్టాభిషేకం జరిపించి ధృవా దేవితో వివాహం చేయిస్తాడు .

మరో కవితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-9-14-ఉయ్యూరు

