గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34
32- సింహళ రాజ కవి -కుమార దాసు
మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన చిన్నతనం లో యుద్ధం లో చనిపోయాడని మేనమామలు మేఘ ,అగర బోధిలు తనను పెంచి పెద్దవాడిని చేశారని రాశాడు .క్రీ శ తొమ్మిది వందల కాలం వాడైన రాజ శేఖరుడు కుమార దాసు అంధుడు గా జన్మించాడని ‘’తన కావ్య మీమాంసలో ‘’మేఘా విరుద్ధ కుమారాదాసదయః జాత్యన్ధాః ‘’అని రాశాడు .కాని ఈ మాట రాసింది మహా కవి కాళి దాసు అని ,కాళిదాసు తర్వాత కుమార దాసు వచ్చాడని అంటారు .కనుక క్రీ .శ. అయిదు వందల నాటివాడని చెప్పారు .మాఘుడికి ముందు భవ భూతికి తరువాత కుమారదాసు ఉన్నాడని అంటారు .జానకీ హరణ కావ్యం రాసేముందు కుమార దాసు కాళిదాసు రాసిన రఘు వంశకావ్యం చదివి ఉంటాడని భావిస్తున్నారు .కుంహాన్ రాజ అనే పరిశోధకుడి పరిశోధనలో కుమార దాసు దక్షిణ దేశం లోని కంచి లో నివశించి ఈ కావ్యాన్ని రాశాడని ఉంది .ఈ కావ్యం కాళీదాస కృత రఘు వంశ స్తాయి ఉందనీ చెప్పాడు .సుభాషిత రత్న కోశం లో కుమార దాసురాసిన జానకీ హరణ కావ్య ప్రస్తావన ఉంది .’’జానకీ హరణం కర్తుం –రఘు వంశే పురస్తితే –కవిః కుమారా దాసోవా –రావణోవా యది క్షమః ‘’దీని అర్ధం –రఘువంశ అంటే సూర్య వంశ కావ్యం కాళిదాసు రాసింది ఉండగా జానకీహరణం అంటే కుమారదాసుకావ్యం సీతాపహరణం చేసే సామర్ధ్యం కుమార దాసుకు, రావణుడికి మాత్రమె ఉంది అని చమత్కరించాడు .
కుమార రామదాసీయం
కుమార దాసు కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు .ఇరవై సర్గల మహా కావ్యం ఇది .దశరదునిపై కమ్మని కవిత్వం చెప్పాడు .సందర్భాలను ఎన్నుకొని మహాకవ్యానికి తగినట్లు వర్ణనలు చేశాడు .బృహస్పతి మహా విష్ణువుతో రావణుడి దురాగతాలను అంతం చేయమని ప్రార్ధిస్తాడు . దాసు జలక్రీడల్ని, సూర్యోదయ సూర్యాస్తమయాలను నేర్పుగా వర్ణించాడు .తరువాత కద మిధిలకు చేరుతుంది .విశ్వామిత్ర ,జనకుల సమాగమం కమనీయం గా కాళిదాస మార్గం లో వర్ణించాడు .కవిత్వం లో ‘’వైదర్భీ రీతి ‘’ని వాడి కావ్య గౌరవాన్ని ఇనుమడింప జేశాడు .కుమార దాసు గొప్ప వ్యాకరణ పండితుడు .అనుకూలమైన ఛందస్సులను సందర్భాన్ని బట్టి వాడి కదాగమనానికి ,రామ ణీయతకు తోడ్పడ్డాడు .ద్రుత విలంబితం ,ప్రమితాక్షరం ,ఇంద్ర వజ్ర ఉపజాతులు బాగా వాడి సమర్ధతనిరూపించాడు .వంకస్త ,వైతాళీయ ,రదోద్ధత ,ఛందో భేదాలను సద్వినియోగం చేసుకొన్నాడు .శార్దూలం శిఖరిణి ,స్రగ్ధర ,పుష్పితాగ్ర , ప్రహర్శిణి వసంత తిలక ,అవితా మందాక్రాంత ,మాలిని లను అవసరాన్ని బట్టి ప్రయోగించాడు .వాల్మీకానికి పూర్తీ విదేయకం గా రామాయణ పాత్రల ఉదాత్తతకు ఉన్నత స్తానం కల్పించేట్లుగా మనో భావాలను,భావోద్వేగాలను పరిపూర్ణం గా స్పష్టం గా వ్యక్త్యం చేసేట్లు రాశాడు కుమార దాసు .అంతకు ముందు ఏకవీ వాడనికొన్ని పదాలను కుమార దాసు వాడి నూతనత్వానికి దారి వేశాడు .
‘’ మాక్డోవేల్ పండితుడి’’ దృష్టిలో కుమార దాసు మౌర్య రాజు ముద్గాలాయనుడికొడుకు .తండ్రి తొమ్మిదేళ్ళు రాజ్య పాలన చేశాడట .దాసుగురించి బౌద్ధ వాజ్మయం లో విస్తృతం గా ఉందట .సింహళ దేశం లో జానకీహరణ కావ్యాన్న్ని ప్రతిమాటనూ అనువాదం చేసి భద్రం గా దాచుకొన్నారు అంటే సింహలీయులపై అతని ప్రభావం జాస్తీగా ఉందని అర్ధం .
వాల్మీకి రామాయణం లోని కదనే తీసుకొన్నా దాసు కొన్ని మార్పులు చేశాడు .విశ్వామిత్రుడు అడిగిన వెంటనే దశరధుడు యాగ రక్షణకు రాముడిని పంపుతూ క్షత్రియ ధర్మాలు బోధిస్తాడు. మారీచుడు కూడా సుబాహు తో పాటు రాముడి చేతిలో చచ్చినట్లు చెప్పాడు .మాయ లేడి విషయాన్ని సంక్షిప్తం చేశాడు .సీతా స్వయం వరానికి ముందే జానకీ రాములు పరస్పరం కలుసుకొని అనురాగం పొందినట్లు మార్చాడు .తనకు నచ్చిన ఘట్టాల్లోని భారవి ,భవ భూతి కాళిదాసకవితలను స్పూర్తిగా తీసుకొని గొప్ప ప్రేరణ పొంది చక్కగా అనుకరించి కవిత్వం చెప్పాడు –‘’గగన సరసి చంద్ర రూప్య కుంభే-వ్యప సరతి స్మ నిపాతితే రాజన్యా ‘’అని, భారవి ఉపమానమైన ‘’హేమ కుంభ ఇవ పూర్వ పయోదేర్మున మజ్జ శనకైస్తు హిమామ్శుః ‘’ను అనుకరించి కుమార దాసు చెప్పాడు .
నఖ శిఖ పర్యంత సీతా సౌందర్యాన్ని వర్ణించి తరువాతి వారికి మార్గ దర్శి అయ్యాడు దాసు .అనుకరణను అవసరాన్ని కి తగ్గట్టు చేసిన స్వతహాగా మహా భావుకుడైన కవిగా దర్శన మిస్తాడు .అందరికంటే ఒక ఆకు ఎక్కువే చదివి సంభోగ శృంగారాన్నీ తనివి తీరా వర్ణించాడు .పరశురాముడు రాముడిని కలిసినప్పుడు .ఇద్దరి మధ్యా సంభాషణలను రౌద్ర వీర రసాలతో పుష్టి కల్గించాడు .దాదాపు అన్ని రసాలను కావ్యం లో పోషించాడు విశ్వామిత్ర్ ఆశ్రమ ప్రశాంతతను శాంత రసం తో నింపాడు .విభావాన్ని ,అనుభావాన్ని గొప్పగా ప్రదర్శించి రస పుష్టి చేకూర్చాడు .పద్దెనిమిదవ సర్గలో శబ్ద చమత్క్రుతీ వైభవాన్ని అనుభవైక వేద్యం చేశాడు .అనేక రకాలుగా బంధ కవిత్వం తో చెలరేగిపోయి రాశాడు .అందులో గోమూత్రిక ,మురజాదులు ముఖ్యమైనవి .నిర్యోస్త్య ,అనులోమ ,ప్రతిలోమ కవిత్వం లోను తన ప్రజ్ఞా ప్రదర్శనను అత్యద్భుతం గా చేశాడు .శ్లేషనూ సమాదరించాడు .
ప్రతిభ తో బాటు వ్యుత్పత్తికూడా సంపూర్ణం గా ఉన్నకవి కుమార దాసు .అందుకే సుప్రసిద్ధ ఆలంకారికులైన విద్యాకరుడు ,జల్హనుడు .శ్రీధరుడూ ,వల్లభ దేవుడు కుమార దాస కృత మహా కావ్యం జానకీ హరణం నుంచి శ్లోకాలను రాసి ఉదాహరించారు .అందుకే ఎవరి ప్రచారమూ అక్కర్లేకుండా కుమారుడు మహా కవికుమారుడై ,దాసు వాణీ దాసుడైనాడు .
మరో కవిని తర్వాత దర్శిద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-14-ఉయ్యూరు