గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

56-సిద్ధ యోగి పుంగవుడు   –అప్పయ్య దీక్షితులు

పౌండరీక ,వాసుదేవాది యజ్ఞయాగాదులను నిరంతరం చేస్తూ వైదిక ధర్మాన్ని అద్వైతమత ప్రచార దీక్షగా జీవితాన్ని గడిపి మూడు అలంకార శాస్త్రాలను రాసి ,బహుముఖ ప్రజ్ఞాశీలి ,అపర శివావతారం అనిపించుకొన్న అప్పయ్య దీక్షితులు 1520-1593కాలం వాడు .తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా (ఉత్తర ఆర్కాడు )ఆరణి దగ్గర ఆడయ పాలెం లో గణపతి సుబ్రహ్మణ్యశర్మ  గా ప్రమాదీచ సంవత్సరం కన్యా మాసం కృష్ణపక్షం లో ఉత్తరా నక్షత్రం లో జన్మించాడు .తండ్రి రంగ రాజాధ్వరి .భరద్వాజ గోత్రీకుడు .గణపతికి అప్ప అనే పెరున్దికనుక నామకరణ మహోత్సవం లో అప్పయ్య దీక్షితులు అనిపేరు పెట్టారు .తమ్ముడు అచ్చన్ దీక్షితులు .రామకవి అనే గురువువద్ద అప్పయ్య వేదం వేదాంగాలు అభ్యసించాడు .చాలా చిన్నతనం లోనే పద్నాలుగు విద్యలలో అపార పాండిత్యాన్ని సంపాదించాడు .కృష్ణ దేవా రాయల గురువు తాతా చార్యులు వైష్ణవాన్ని బాగా ప్రచారం చేస్తున్న సమయం లో కాశీ లో ఉన్న అప్పయ్య దీక్షితులకు తెలిసి విజయ నగరం చేరి ఆచార్యులను తనతో వాదానికి రమ్మన్నాడు .అప్పయ్య ప్రతిభ తెలిసిన రాయలు ఆచార్యులను వాదానికి దిగవద్దన్నాడు.కానీ రెచ్చిపోయిన తాతాచార్యులు వాదానికి దిగి ఓడిపోయి చేసుకొన్నా ఒప్పందం  ప్రకారం శైవాన్ని స్వీకరించేందుకు సిద్ధపడ్డాడట .అప్పయ్య లేక పొతే అందరూ నిలువు బొట్టు వాళ్ళే అయ్యేవారన్నమాట .ఆ ప్రమాదాన్ని తప్పించిన వాడు అప్పయ్య దీక్షితులు .

దేశాటన చేస్తూ వేద విరోధులను వాదం లో ఓడిస్తూ వైదిక మత ప్రచారం చేశాడు .వెల్లూరు ,తంజావూరు ,విజయ నగర ,వెంకట గిరి రాజుల ఆస్థానాలలో పండిత స్థానాన్ని అలంకా రించి  గౌరవ సన్మానాలు అందుకొన్న విదుషి అప్పయ్య దీక్షితులు .వాదనలో అపర రుద్రుడిలా విజ్రుమ్భించి ప్రతిపక్షులను గడగడ  లాడించే వాడు .దీనితో అతనిని ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్రలు కూడా తెర వెనుక జరిగినా మొక్క వోని ఆత్మా విశ్వాసం తో అప్రతిహతం గా ముందుకు సాగాడు దీక్షితార్ .రాజులు మహారాజులు ఎందరో అప్పయ్య అప్రతిహత విద్యా నైపుణ్యానికి దాసోహం అన్నారు .వారికి ధర్మ ప్రబోధం చేసి ఆత్మ మార్గాన్ని తెలియ జేశాడు .ఆశువుగా శ్లోకాలు గంగా ప్రవాహం గా చెప్పి అప్రతిభులను చేసే నేర్పు అప్పయ్యా దీక్షితుల సొమ్ము .తన వాక్ చాతుర్యం తో యుక్తితో ,సంయమనం తో ,విశాల హృదయం తో ,అల్ప మనస్కుల ను ఎదిరించి పరివర్తన తెచ్చిన ఘనత అప్పయ్య దీక్షితులది .

అప్పయ్య కవితా దీ(ద)క్షితీయం

కవిత్వం ,శైవాద్వైత ప్రచారం ,యజ్న యాగాదులతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతూ ఒక ‘సిద్ధ యోగి పుంగవుడు ‘’గా గడిపాడు .సాధించిన ఎన్నో మంత్ర విద్యలను ప్రదర్శించాడు .చివరికి వాటివల్ల ఆరోగ్యానికి భంగం కూడా కలిగింది .కొందరు ఆయనపై ప్రయోగాలు చేసి దుస్టశక్తులను ఆయనపైకి పంపేవారు ..ధ్యానం లో మునిగి ఉన్నప్పుడు సమాధి స్తితిలోకి చేరేటప్పుడు తనముందు కొన్ని తువ్వాళ్ళను ఉంచేవాడు .ఆ యోగ శక్తితో ఆయన లోని దుస్టశక్తులు ,వ్యాధులు  ,తువ్వాలళ్ళలో చేరేవి .అప్పుడు అవి పిచ్చెక్కి నట్లు నాట్యం చేయటం  శిష్యులు గమినించే వారు .సమాధినుండి బయటికి రాగానే ఆ తువ్వాళ్ళను మళ్ళీ మీద వేసుకొనేవాడు .

‘ఆత్మార్పణ స్తుతి ‘’కావ్యం రాశాడు . దీనికి ఒక  కధ ప్రచారం లో ఉంది .ఇది యాభై శ్లోకాల కావ్యం .ఒక్కొక్క శ్లోకం తో లోపలి ఆత్మను కర గించి వేశాడు .మరి ఈకావ్యం ఎలా రాశాడు ?తన ఆత్మ శక్తిని భగవంతునిపై తనకున్న వీర భక్తిని  పరీక్షించుకోవాలనే కోరిక కలిగిందట .అందుకని ‘’దాతుర ఫల రసం ‘’(ఉమ్మెత్త కాయల రసం )తాగాడు .అది తీవ్రమైన మత్తు పిచ్చి ఎక్కిస్తుంది  .పిచ్చి ఎక్కి మత్తులో తన నోట వచ్చిన ప్రతి వాక్యమూ రాయమని శిష్యులకు ముందే చెప్పాడు .ఇలాంటి స్తితిలో లోపల అణచ బడిన భావాలన్నీ ఒక్క ఉదుటున దూసుకు బయటికి వస్తాయి .ఈ స్తితిలో అప్పయ్య దీక్షితుల నోటి నుండి ఆశువుగా వెడలిన కావ్యమే ‘’ఆత్మార్పణ స్తుతి ‘’.దీనికి అప్పటి నుంచి ‘’ఉన్మత్త పంచ దశి ‘’అనే పేరొచ్చింది .అదీ ఆ మహా సిద్ధుని ప్రతిభ .

అప్పయ్య దీక్షితులు సంసృతం లో చిన్నా పెద్దా  నూట నాలుగు రచనలు చేసినా అందులో ముఖ్యమైనవి 60 రచనలు . .ఇందులో వేదాంత ,శివాద్వైత ,వ్యాకరణ ,మీమాంస  కావ్య వ్యాఖ్యాన , అలంకార ,భక్తీ స్తోత్రాలున్నాయి .శివాద్వైతులు అప్పయ్యను తమ వారిగా భావిస్తారు .యెంత శివ భక్తుడో అంతటి వైష్ణవ  పారమ్యం ఎరిగిన వాడు .బ్రహ్మ సూత్రాలలో చెప్పబడిన విషయాలను ‘’చతుర్మత సారం ‘’గా రాశాడు .నయ మంజరి లో అద్వైతాన్ని ,నయ మణిమాల లో శ్రీకాంత మతం గురించి చెప్పాడు .నయ మయూఖ మాలిక లో రామానుజుని విశిష్టాద్వైతం గురించి ,నయ ముక్తావళి లో మధ్వాచార్యుల వైష్ణవ మతాన్ని గూర్చి చెప్పాడు .ఇలా బ్రహ్మ సూత్ర రహస్యాలను అన్ని మతాలకు అన్వయిన్చేట్లు చెప్పిన మహా విద్వాంసుడు అప్పయ్య దీక్షితులు .ఇవన్నీ ఆయ మతాలకూ ఆధార గ్రంధాలుగా రిఫరెన్స్ పుస్తకాలుగా పూజనీయ స్థానం లో ఉన్నాయి .

దీక్షితులు రాసిన వేదాంత గ్రంధాలలో ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’ప్రముఖ స్థానాన్ని పొందింది .వివిధ ఆలోచనా ధోరణులను ఏకం చేసి అద్వైత ముఖ్య ప్రవాహం లో కలిపిన అతని వైదుష్యం హర్షణీయం .ఏక జీవ వాదం నానా జీవ వాదం ,బింబ ప్రతి బింబ వాదం ,సాక్షిత్వ వాదం మొదలైన వాటిని ప్రశ్నించి ఉన్నది. ఒకటే బ్రహ్మం అయితే ఇన్ని వాదాలేమిటన్నాడు .అందరూ మూల సూత్రాన్ని ఒప్పుకుంటూ భిన్న మార్గాలలో నడిచి దూరమైపోయారన్నాడు .అమలానంద రాసిన ‘’కల్ప తరు వు ‘’కు ‘’పరిమళ ‘’అనే అద్భుత వ్యాఖ్యానాన్ని రచించాడు .వాచస్పతి మిశ్ర రాసిన ‘’భామతి ‘’కి కల్పతరువు ఒక వ్యాఖ్యానమే .ఇది ఆది శంకరాచార్యుల సూత్ర భాష్యానికి వివరణం .

బ్రహ్మ సూత్రాలకు ‘’శివార్క మణి దీపిక ‘’అనే అమోఘమైన భాష్యాన్ని అప్పయ్య దీక్షితులు రాయటం మన అదృష్టం .ఇందులో శివ వైష్ణవాద్వైతాన్ని స్తాపించాడు .ఈ గ్రంధమూ ,పరిమళ గ్రంధము అప్పయ్య దీక్షితుల మేధో సర్వస్వం గా (మేగ్నం ఓపస్ )గా భావిస్తారు .ఇవి విషయం లో, గ్రంధ రూపం లో అతి విశిష్టమైన  ఉద్గ్రంధాలు .వెల్లూరు రాజు చిన్న బొమ్మ దేవర అప్పయ్య దీక్షితులతో శివార్క దీపిక ను  బోధింప జేయటానికి   500మంది విద్యార్ధులతో ఒక కళాశాల  నెలకొల్పాడు .వీరందరికీ నేర్పి అద్వైత భావాలలో నిష్ణాతులను చేసి భావ వ్యాప్తి చేయించాడు .

దీక్షితుల దృష్టిలో ద్వైతం కింది మెట్టు .విశిష్టాద్వైతం మధ్య మెట్టు ,శివాద్వైతం అద్వైతం ఒకటే అయిన ఆఖరి మెట్టు .శ్రీ కాంత శివాచార్యుని శివాద్వైతాన్ని అప్పయ్య అనుసరించి బ్రహ్మ సూత్రాలకు ఈ ధోరణిలో వ్యాఖ్యానం రాశాడు .దీక్షితులు వేదాంత దేశికుల మెప్పు పొందాడు .కువలయానందం లో ముకుందుని కీర్తించాడు .హరిహర అభేదాన్ని అప్పయ్యదీక్షితులు చెప్పినంత గాఢం గా అంతకు ముందెవరూ చెప్పలేదు .మీమాంస శాస్త్ర వ్యాప్తికి అప్పయ్య చేసిన కృషి అద్వితీయం .కౌస్తుభం అనే వ్యాఖ్య రాశాడు .విది రసాయనం  ,కువలయానందం లను విజయ నగర ప్రభువు పెనుగొండ రాజు వెంకట పతి రాయలు గుర్తించి ఆస్తానాన్నికి సగౌరవగా ఆహ్వానించి సన్మానించాడుఅంకితం పొందాడు  .సిద్ధాంత కౌముది రాసిన భట్టోజి దీక్షితులు అప్పయ్యను రాజుకు పరిచయం చేశాడు .అప్పయ్య రాసిన కువలయానందం చిత్ర మీమాంస ఎందరో విద్యార్ధులకు పఠనీయ గ్రందాలయ్యాయి .ఆయన రాసిన దుర్గా స్తుతి ,ఆదిత్య స్తవ రత్నం భక్తికి పరాకాష్టగా నిలిచాయి .వరద రాజ స్తవం లో అలంకారాలన్నీ వాడి శోభకల్పించాడు .

అరుణాచలం లోని అమ్మవారు ‘’ఆపీత కుచాంబ’’ పై చెప్పిన ‘’ఆపీత కుచాంబ స్తవం ‘’రచించాగానే అప్పయ్య కున్న జ్వరం తగ్గిపోయిందట .దానికి అంత ప్రభావం ఉంది .మానసోల్లాసం మానసిక ఆందోళన ఉన్న వారికి వర ప్రసాదమే .సౌభాగ్య క్షేమాలకు ,ప్రయాణం లో మంచి జరగటానికి ‘’మార్గ బంధు సూత్రం , ఆరోగ్యం కోసం ‘’ఆదిత్య స్తవ రత్నం రాశాడు .

చిదంబరం లో ఉండి నిత్యం నటరాజ స్వామి దర్శనం తో పులకిన్చేవాడు .అక్కడేఅప్పయ్య జీవిత పరిసమాప్తి డెబ్భై మూడవ ఏట  ‘జరిగింది ’.చనిపోయే రోజున రోజూ వెళ్ళే మార్గం గుండాకాక ‘’పంచాక్షర మెట్లు ‘’మీదుగా నటరాజ స్వామిని దర్శించడం అందరూ చూసి ఆశ్చర్య పోయారట .దర్శనం పూర్తీ చేసుకొని ఇంటికి వెళ్ళగానే అప్పయ్య దీక్షితులు తుది శ్వాస వదిలాడు .నటరాజ స్వామి అనుగ్రహం తో జన్మించిన అప్పయ్య ఆయన చెంతనే మరణించటం విశేషం .అప్పయ్య ఒక శ్లోకం లో ‘’నేనుపవిత్రమైన  చిదంబరం లో చనిపోవటానికి సంతోషిస్తున్నాను. నా కుమారులు బాగా చదువుకొని  గ్రంధ రచన చేసిన సంస్కారులు .నాకోరికలు  ఏవీలేవు .ఒక్కటే కోరిక .చిదంబరం లో నటరాజ సన్నిధిలో  మరణించ టమే నా కోరిక ‘’అన్నాడు .అలా కోరికను తీర్చుకొన్న ధన్య జీవి అప్పయ్య దీక్షితులు .

బహుముఖ ప్రజ్ఞా శాలి దార్శనికుడు అప్పయ్య దీక్షితులు రాసిన మూడు అలంకార గ్రంధాలు –వ్రుత్తి వార్తిక ,చిత్ర మీమాంస ,కువలయానందం .మొదటి దానిలో రెండు పరిచ్చేదాలున్నాయి అభిదా ,లక్షణా వృత్తుల భేదాలగురించి చెప్పాడు .వ్యంజనా వృత్తిని ఖండించాడు. ఇది అసంపూర్ణ గ్రంధం .చిత్ర మీమాంస అపూర్వ గ్రంధం అర్ధ చిత్ర కావ్యాలను గురించి చర్చించాడు ఇదీ  అసంపూర్ణమే .కువలయానందం లో అలంకారాలను గురించి వివరణ చేశాడు  అలంకారాలమీద వచ్చిన చివరిగ్రంధం గా దీన్ని భావిస్తారు .ఇతని సిద్ధాంతాలను జగన్నాధ పండితరాయలు ఖండించాడు .కువాలయనందానికి పది టీకలున్నాయి .ఇన్ని టీకా లుండటం దీని ప్రసిద్ధికి నిదర్శనం .పెనుగొండ రాజు వెంకట రాయలకు  అంకితమిచ్చాడు .విదేశీ  భాషల్లోకీ అనువాదం పొందిన గ్రంధం ఇది .అలంకార వివరణ తర్క బద్ధం గా శాస్త్రీయం గా చేశాడు .అలంకారాలు  విశ్వనాధుడి వరకు  ఎనభై తొమ్మిదికి పెరిగాయి .అప్పయ్య వీటి సంఖ్యను నూట పద్దెనిమిది పెంచాడు . అలంకారాల  గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జయదేవుడు రాసిన చంద్రాలోకం అప్పయ్య రాసిన కువలయానందం చదవాల్సిందే .ఇవే గతి .ధ్వనిలేక పోయినా అలంకా రాలతో ఉన్న కావ్యాలు సుందరం గా ఉంటాయన్నాడు .ధ్వనిలేకపోయినా కావ్యాన్ని ఆదరించాలన్నాడు .చిత్ర మీమాంసలో చిత్రకావ్యాల భేదాలను వివరించాడు .చిత్రకావ్యం కూడా ధ్వనికావ్యం లాగే మహత్వం ఉన్నదన్నాడు .కొద్దిగా కూడా ధ్వని లేని చిత్రకావ్యాల కొమ్ముకాసి ఉత్తమ స్తాయి కల్పించాడు ..దీన్ని ఖండించాడు పండిత రాయలు .అప్పయ్య దీక్షితుల సోదరుడి పౌత్రుడు నీల కంఠ దీక్షితుల సోదరుడైన మూడవ అప్పయ్య దీక్షితులు ‘’చిత్రమీమాంస దోష ధిక్కారం’’అనే గ్రంధం లో జగన్నాద పండిత రాయల అభ్యంతరాలన్నిటికి దీటైన సమాధానాలిచ్చి రాశాడు .

‘’ఆంధ్రత్వం ఆంధ్రభాష ,మధు మధురమైనవి .ఆంద్ర దేశం లో జన్మించటం పూర్వజన్మ  సుకృతం ‘’అని తెలుగును తెలుగు దేశాన్ని మనసారా మెచ్చుకొన్న అప్పయ్య దీక్షితుడు మనవాడే .మందరి వాడే .

మరోకవితో కలుద్దాం

Inline image 1  Inline image 2

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.