గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు

నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని తీర్ధుల వారు రాశారు .శ్రీకృష్ణుని చరిత్రకావ్యం ఇది .రుక్మిణీ కల్యాణం వరకు ఇందులో ఉంది .పన్నెండు తరంగాలున్నాయి .శ్లోకాలు సంగీతాత్మకం గా నాద వినోదాన్ని చేకూరుస్తాయి .సంగీత నాట్య శాస్త్రాలలో నిధి .చిన్నతనం లోనే సన్యాసి అయి భక్తీ సామ్రాజ్యాన్ని పాలించాడు .ముప్ఫై నాలుగు ప్రసిద్ధ రాగాలను ఉపయోగించాడు .త్రిపుట ,అది జంప ,ఏకఅట తాళాలను ఉపయోగించారు .హ్గాద్యం పద్యం మహా హృదయం గా రాశారు తీర్ధులు .అనుష్టుప్ భుజంగ ప్రయాతం ఆర్యా వసంత తిలక పృథ్వి వృత్తాలు విరివిగా వాడారు .పదాల లాగా పాడుతుంటారు .నాట్యం చేస్తూ అభినయించే వీలు ఉన్న తరంగాలు .ఆంద్ర దేశం లో బాగా ప్రచారం లో నారాయణ తీర్ధుల తరంగాలు ఉన్నాయి .లీలా తరంగిణి లో పన్నెండునూట యాభై పాటలు ,మూడు వందల రెండు శ్లోకాలు ,ముప్ఫై ఒక్క చూర్నికలు ఉన్నాయి . తరంగాలు ,తీర్ధుల వారు ‘’హరి భక్తీ సుదార్నవం ‘’అనే మరో రచనా చేశారు భాగవత దశమ స్కంద ఇతి వృత్తం .మొత్తం పదిహేను రచనలు చేశారు బెనారస్ హిందూ యూని వర్సిటిలో అవి లభ్యమవుతాయి .

72   ‘’నాయన ‘-’-కావ్య కంఠ వాసిష్ట గణపతి

రమణ మహర్షి చేత’’ నాయన ‘’అని పించుకొన్న మహా భక్తుడు, దేశ భక్తుడు అయిన అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి .విద్వత్తు వలన పొందిన బిరుదే వాశిష్ట గణపతి .ఉత్తరాంధ్ర దేశం లో బొబ్బిలి దగ్గర కలువ రాయి లో 1878లో జన్మించారు ,పండిత కుటుంబం .పడవ ఏటనే ‘’పాండవ దార్త రాష్ట్ర సంభవ ‘’అనే ఖండకావ్యం రాసిన ప్రతిభా శాలి .వ్యాకరణం జ్యోతిషం ,ఆయుర్వేద దర్శన  విద్యల్లో మహా పండితుడు .మహా మంత్రం శాస్త్ర వేత్త .ఇంద్రాణీ సప్త స్తుతి ,చండీత్రిశతి ,వివిధ చందస్సులతో రాసిన ‘’ఉమా సహస్రం ‘’మొదలైన సంస్కృత కావ్యాలు రాశారు. మహా ఉపాసకులు .విశ్వ మీమాంస ,సదా చార బోధిని ,గాయత్రి వ్యాఖ్యానం రాశారు ‘’పూర్ణ ‘’నవలను సంస్కృతం లో రాశారు .మొత్తం మీద డెబ్భై అయిదుకు పైగా రచనలు చేశారు .గణపతి మునిగా ప్రసిద్ధులు .ఆత్మా విచారం లో అద్వితీయంగా ముందడుగు వేశారు భారత స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు .

73కావ్య శాస్త్ర కర్త–హేమ చంద్రా చార్యుడు

పదకొండవ శతాబ్దికి చెందిన వాడు హేమ చంద్రుడు .కవి ,వ్యాకరణ వేత్త ,అలంకారికుడు గుజరాతు రాజు ‘’అన్హిల వాడ చాళుక్య రాజు కుమార పాలుడి చరిత్రను ‘’కుమార పాల చరిత్ర’కావ్యం ’గా రాశాడు .సంస్కృత ,ప్రాకృత వ్యాకరణాలను రచించాడు .కుమార చరిత్ర ఇరవై ఎనిమిది సర్గల కావ్యం .మొదటి ఇరవై స్సంస్క్రుతం లో మిగిలిన ఎనిమిది సర్గలు ప్రాకృతం లో రాసిన సవ్య సాచి .ఇందులోతన వ్యాకరణ పాండిత్యాన్ని అంతా గుప్పించాడు .అందుకే ఇది కావ్య శాస్త్రం అయింది ..ద్వాశ్రయం  ‘’అన్నారు .ఈ కావ్యం లో సంస్కృత భాగానికి ‘’అభయ తిలక గణి’’వ్యాఖ్యానం రాస్తే ప్రాకృత భాగానికి ‘’పూర్ణ కలశ గణి’’వ్యాఖ్యానం చేశాడు కావ్యం వీర రస ప్రధానం .ఒక సర్గ అంతా రాత్రినే వర్ణించటం విశేషం .సోమనాధజ్యోతిర్లింగ మహా భక్తుడు కవి .జైన హిందూమత సామరస్యాన్ని గుజరాత్ లో సాధించిన ఘనత హేమ చంద్రుడిది .

హేమ చంద్రుని విజ్ఞానం అపారమైనది .అతని శబ్ద భాండారం అంతులేనిది .కొత్త కొత్త శబ్దాలను సృష్టించి ప్రయోగించి గౌడీ రీతిలో కావ్యాన్ని రాశాడు .వ్యాకరణాన్ని కావ్య లక్షణాలపై జోడు గుర్రాల సవారీని సమర్ధ వంతం గా చేసి సుభాష్ అని పించుకొన్నాడు .అన్ని రకాల అలంకారాలు వాడాడు .చాళుక్యులు మూడు వందల ఏళ్ళు గుజరాతు లోని కదియ వాడును పాలించారు .చాళుక్య మూల పురుషుడడి తో ప్రారంభించి కుమార పాలుని చరిత్ర తో ముగించాడు .కుమారుడు  ముసలి సలితనం లో హేమ చంద్రుని ప్రోద్బలం తో జైన మతాన్ని స్వీకరించటం తో ముగింపు పలికాడు  .రాజు  జీవించి ఉండగానే  హేమ చంద్రా చార్యుడు 1172 లో మరణించాడు . .

74-పృధ్వీ రాజ చరిత్ర కర్త-జయాంకుడు

అజ్మీరు ధిల్లీ రాజ్యాలను పరిపాలించిన పృధ్వీ రాజ్ చోహన్ చరిత్రను కావ్యం  రాసిన వాడు జయాంకుడు .కాశ్మీర దేశం లో శిధిలావస్థ లో ఉన్న ఈ కావ్యాన్ని ‘’బ్యూలర్’’కనుగోన్నాడు . అసం పూర్తీ కావ్యమే .పన్నెండు సర్గలున్నాయి .పృధ్వీ రాజు మహమ్మదీయ రాజులను జయించే వృత్తాంతం తో బాటు ఆయన పట్టాభిషేకం ఉంటుంది .జయాంకుడు  పృధ్వీ రాజు ఆస్థాన కవి .కనుక కాశ్మీరీ అని అనుకో వచ్చు .బిల్హనుడి శైలితో రాసిన కావ్యం ఇది జాన రాజు అనే కాశ్మీర కవి దీనికి  వ్యాఖ్యానం రాశాడు .1193కు పూర్వమే కావ్యాన్ని రాశాడు .కారణం 1191లో పృధ్వీ రాజు షహబుద్దీన్ ఘోరిని ఓడిస్తే 1193లో గోరీ ఇతన్ని ఓడించి చంపాడు .

కవితా జయాంకం

జయాంకుడి కి వేద,పురాణ ,మహా కావ్య ,న్యాయ ,వ్యాకరణ జ్యోతిస్శాస్త్రాలలో నిష్ణాతుడు .కావ్యం లో రామాయణ మహా భారత గాధలను ఉటం కించాడు  .పూర్వ కవుల ప్రభావం బాగా ఉన్న వాడు .పాంచాలీ గౌడీ రీతుల్లో అలంకార యుక్తం గా కావ్యం రాశాడు .చౌహాన్ రాజ వంశ చరిత్ర గురించి తెలియ జెప్పే చారిత్రిక కావ్యం ఇది ఈ వంశం లో పృధ్వీ రాజు మూడవ రాజు .అవి ఇతన్ని విష్ణువు అంశం గా భావించాడు .చివరీ ఘోరీతో జరిగిన యుద్ధ ప్రస్తావన ఇందులో లేక పోవటం ఆశ్చర్యమే .

75- హోయసల రాజ చరిత్ర రాసిన -సకల విద్యాచక్ర వర్తి

కర్నాటక  హోసల రాజు రెండవ నరసింహ సోమేశ్వరుని ఆస్థాన కవి ‘’సకల విద్యా చక్ర వర్తి ‘’.ఇది అతని పాండిత్యానికి పొందిన బిరుదు .ఇతడిని రెండవ విద్యా చక్ర వర్తి గా గుర్తించారు .మూడవ చక్ర వర్తి రుయ్యకుడి అలంకార సర్వస్వ గ్రంధానికి సంజీవిని టీక రాశాడు .మనకవి గద్యం లో ‘’గద్య కర్ణామృతం ‘’రాశాడు .హోయసల వంశ రాజుల చరిత్రను ఆవిష్కరించే గ్రంధం ఇది .చారిత్రిక సత్య సమన్వితం .హోయసల రాజులకు చాళుక్య రాజులకు మధ్య జరిగిన యుద్ధాల వివరాలున్నాయి .సోమేశ్వర రాజు  చాళుక్య రాకుమారి దేవిక ను పెళ్లి చేసుకోవటం ముఖ్య వృత్తాంతం .బాణుడు రాసిన హర్ష చరిత్రను  స్పూర్తిగా దీన్ని రాశాడు .ఇందులో శైలి అర్ధ పౌరాణికం అర్ధ ఐతిహాసిం . వాల్మీకి కాళిదాసాదుల ధోరణిలోకావ్యం రాశాడు  .

76- హమ్మీర చరిత్ర కర్త-నయ చంద్ర సూరి

చౌహాన్ రాజు ‘’హమ్మీరు’’ని చరిత్రను ‘’హమ్మీర కావ్యం ‘’రాశాడు సూరి .జయ సింహ సూరి మనవడు .ఇది 1456లో రాసిన కావ్యం .తండ్రి జయ సింహ సూరి ‘’హమ్మీరమద మర్దనం ‘’అనే నాటకాన్ని రాశాడు .దీనిలో వస్తుపాల ,తేజ పాల చరిత్రలున్నాయి .పద్నాలుగు సర్గల కావ్యం ..అవి మహా పండితుడు. శాస్త్రాలన్నీ నేర్చి పండిపోయి సూరి అయ్యాడు రాజనీతి యుద్ధ రీతి తెలిసిన వాడు .వైదర్భీరీతిలో ప్రసన్న మాధుర్యం గా రాశాడు జలక్రీడలు యుద్ధాలు ఋతువులు వర్ణించాడు అపహ్నుతి ,యమా అలంకారాలను సందర్భాన్ని బట్టి వాడాడు .వీర రస ప్రధాన కావ్యం .అల్లాఉద్దీన్ తన సైన్యాలను హంమీరుడి సోదరుడి మీదకు పంపితే వారు అతన్ని ఓడిస్తే రాజు స్వయంగా యుద్ధానీకి దిగాడు . అతని సైనికులే నమ్మక ద్రోహం చేశారు .తెలిసిన హమ్మీరుడు రాణి వాస స్త్రీలను అగ్ని ప్రవేశం చేయమని కబురు చేసి ఘోర యుద్ధం లో పాల్గొని ప్రాణాలు వదిలి వీర మరణం పొందాడు .ఇది పదమూడవ సర్గలో వర్ణించాడు .పద్నాలుగవ సర్గలో హంమీర పరాక్రమాన్ని వంశ చరిత్రను రాసి కావ్యాన్ని ముగించాడు .

77-రాణికవయిత్రి -గంగా దేవి

విజయ నగర రాజు రెండవ బుక్క రాయల రెండవ కొడుకు కంపరాయల భార్య గంగా దేవి .1361-1374లో యువరాజుగా ఉన్నాడు .మధురమీద దాడి చేసి తురుష్కులను ఓడించి1371లో  విజయం సాధించాడు .ఈ ఇతి వృత్తాన్ని తీసుకుని గంగా దేవి ‘’మధురా విజయం ‘’కావ్యం సంస్కృతం లో రాసింది .దీనికి  ‘’వీరకంప రాయ చరిత్ర ‘’అనే పేరూ ఉంది .ఏడవ సర్గలో తానూ కంపరాయల భార్యనని చెప్పుకొన్నది .

కవితా గంగాలహరి

విదుషీమణి అయిన గంగాదేవి కావ్యాల అధ్యాయాన్ని క్షుణ్ణం గా  చేసింది .ఆ ప్రభావం కావ్యం మీద ప్రసరించింది .తెలుగు సాహిత్యం తో పరిచయం కూడా బాగా ఉన్నట్లు గోచరిస్తుంది .ఇది కూడా వీరరస కావ్యం .పుర ఋతు ,జలక్రీడ ,సూర్యాస్తమయ ,చంద్రోదయాలను కావ్య రీతిలో వర్ణించింది .అయిదవ సర్గ వర్ణనా మయం .గణేశ ప్రార్ధన చేసి కావ్యం ప్రారంభించి మిగిలిన దేవతలనూ స్తుతించింది .ముఖ్యం గా ‘’క్రియా శక్తిని ‘’ ని వర్ణించటం విశేషం .ప్రతి సర్గ లో రాబోయే సర్గలోని విషయాలను చెప్పింది .

మొదటి సర్గలో విజయ నగర వర్ణనను సహజ సుందరం గా చేసింది .కావ్యం లో వైదర్భీరీతి కనిపిస్తుంది .భాష పరిపక్వం గా ఉంటుంది ,

‘’హిమ భర విహతః కమలా కరో మృదిత కాంతి రభూన్మ్రుగ లామ్చనః-వాదన మేవ నరేంద్ర నాథ భ్రువాను భజత శ్రియమ ప్రతి శాసనః ‘’అని వసంత రుతువును గంగా దేవి వర్ణించింది –భావం –కమలాలు మంచుతో కప్పు బడ్డాయి చంద్రుడుకాంతి  పోగొట్టు కొన్నాడు .రాజు గారి ప్రియురాలు ముహం ఒక్కటే కాంతి తో ఉంది ‘’అలాగే సూర్యస్తమయాన్నీ మనోహరం గా వర్ణిస్తుంది –

‘’ప్రతి బింబ పరం పరామ్బుదే పవనోద్భూత తరంగా సంగినః –నభాసో వాతారిష్య తో  రవేర్మణిసోపాన ధియం వ్యభావయత్ ‘’-అంటే ఆఆశం నుంచి దిగుతూ ఉన్న సూర్యుడి నిశ్చలమైన బింబం కదిలే అలల్లో ప్రతి బిమ్బిమ్చి రత్నాల మెట్లు లాగా ఉంది ‘’.క్లిష్టం అనేది లేని కవిత్వం రాసింది .

కంపరాయలు ఉదయగిరికి రాజుగా ఉండేవాడు .తండ్రి బుక్క రాయల కంటే ముందే కంపరాయలు చని పోవటం తో విజయ నగర ప్రభువు కాలేక  పోయాడు  బుక్క కు చాలా మంది రాణులుఉన్నా గంగా దేవి  కంపరాయల తల్లిని మాత్రమె పేర్కొంది .కంపరాయలు రెండవ కంపరాయలుగా పేరొందాడు .మహా మండలేశ్వరుడు అనే బిరుదు ఉంది యుద్ధ కళల లోనే కాదు లలిత కళల్లోనూ మంచి ప్రవేశం ఉన్న వాడు .తండ్రి బుక్క రాయల అనుమతితో మధుర , తుండీర రాజ్యాలను జయించి వాటిని తురుష్కులఅధీనం నుండి విముక్తి చేసిన శౌర్య శాలి .ఇక్కడే కొంతకాలం ‘’మరకత నగరం ‘’రాజ దానిగా చేసుకుని మూడేళ్ళు పరిపాలన చేస్తూ పరిస్తితుల్ని చక్క బరచాడు .1374లో అతడొక్కడే పాలన చేసి నట్లు శాసన  ఆధారాలాలున్నాయి .హిందూమత పునద్ధరణకు కంప రాయలు చేసిన సేవలు చరిత్ర ప్రసిద్ధాలు 1371లో కంపరాయలు మధుర ,శ్రీరంగా పట్నాలను లొబరచుకుని తురుష్కులను పార ద్రోలాడు .ఈ చారిత్రక సంఘటనలను గంగా దేవి తన మధురా విజయం కావ్యం లో కమనీయం గా ఆవిష్కరిం చింది .కనుక ఈ  కావ్య కాలం 1371-1374అని భావింప వచ్చు .

78-కంచు ఢక్కల-గౌడ డిండిమ భట్ట కవి సార్వ భౌముడు

విజయ నగర రాజు రెండవ ప్రౌఢ దేవా రాయల ఆస్థానం లో డిండిమ భట్టు ఆస్థానకవి .అరుణ గిరి కుమారుడు .ఈ డిండిమపండితుడినే శ్రీనాధుడు వాదం లో ఓడించి అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు .దీనితో కవి సార్వ భౌముడు అనే తనకున్న బిరుదాన్నికోల్పోయి శ్రీనాధుడికి అప్పగించాడు .డిండిమ వంశం లో వారందరికీ కవి సార్వ భౌమ,డిండిమ  బిరుదు ఉండేది .సాల్వ నరసింహ రాయలు చరిత్రను రాజనాధుడు అనేకవి ‘’సాళువాభ్యుదయం ‘’అనే కావ్యం గా రాశాడు .సాల్వ నరసింహ రాయలు 1486లో విజయనగర రాజు కాని సాల్వాభ్యుదయం లో ఎక్కడా ఈమాట చెప్పబడలేదు. చంద్రగిరి రాజు అనే  ఉంది .కనుక ఈ కావ్యం అతడు మహా మండలేశ్వరుడుగా ఉన్నప్పుడే 1486లో రాయబడింది. ఈ కావ్యం ప్రచురితం కాలేదు .ఇందులో పదమూడు సర్గ లున్నాయి .

ఈ కావ్యం లో నరసింహ దేవరాయల యుద్ధాలు ధర్మ కార్యాలూ ఉదాత్తం గా వర్ణించ బడ్డాయి .సుందర కావ్య శైలి ఉంది .నరసింహ రాయలు సంస్కృతాంధ్రాల ను పోషించాడు .మూడు నుంచి ఏడు సర్గల దాకా అతని విజయాలు ,ఎనిమిదిలో వేట ,పదిలో ఋతు వర్ణనలు ,పదకొండులో  శివరాత్రి ఉత్సవాలు పన్నెండులో రాజ దానికి రావటం ,పదమూడవ సర్గలో దాన ధర్మాలు ,సాహిత్య పోషణ ఉన్నాయి .

మరోకవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-14-g

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.