నదికి వందనం -చాగంటి

నదికి వందనం

కార్తిక మాసంలో నదీస్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తికంలో నదీస్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నపుడు మీరొక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. నేను వేదంలో నుంచి చెపుతున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను. నేను గంగా స్నానానికి వెళ్లాలనుకున్నాననుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకు వెళ్లాలి. గోదావరి స్నానం చేయకుండా నేను కాశీ పట్టణానికి వెళ్లకూడదు. నేను మొన్న కాశీ పట్టణం వెళ్లినపుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్లాను. ఎందుకని? 
మీ పక్కన ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మీకన్నం పెడుతోంది. ఆ నది వల్ల నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అంశం.
మీరెప్పుడైనా నది ఒడ్డులో వెళుతుంటే ఆ నదీ ప్రవాహంలో ఉండే విచిత్రం తెలుస్తుంది. అది చిత్ర విచిత్రములైన శబ్దాలు చేస్తూ సూక్ష్మంగా తిరుగుతూ రాళ్లకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెళుతుంది. ఆ వెడుతున్నపుడు అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోయే నది చంద్రుని యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికా లక్షణం ఉంది. చంద్ర కిరణాలు పడతాయి. అవి అమృతతుల్యం. ఆ అమృతధార వల్ల నీరు శక్తిని పొంది ఉంటుంది. ఆ నీటిలో అభిముఖంగా నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లే వాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణాల వల్ల. కలిగి మీకు శారీరకమైన ఆనారోగ్యం కలగకుండా, ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. ఇంకనూ చంద్రస్పర్శ కలిగింది కాబట్టి, సోముడు, మనస్సుచ మనస్సు సాత్త్వికమై, పరమేశ్వరారాధనయందు సాత్త్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ రెండు సాఽధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తిక మాసంలో తప్పకుండా నదీస్నానం చేయండి అని శాస్త్రం విధించడానికి కారణమిది.
ఎలా చేయాలి?
కార్తిక మాసంలో నదీస్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించరు. నదీస్నానం చేసేటపుడు ఒంటిమీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటపుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. నేను స్నానం చేసేటపుడు ఎప్పుడైనా చూడండి, సంకల్పం తప్పకుండా ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి, పూజ చేస్తున్నాను, ఈశ్వరునికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటపుడు ఏ పేరెత్తితే నీ పాపనాశనం అవుతుందో అది నీతో పలికిస్తాడు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైలం పేరు పలికిస్తారు. శీశైలస్య, ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నందుల మధ్యలో ఉన్నానో చెప్పిస్తాడు. గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్యదేశస్థే అని చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నీవు నిలబడి ( నదికి కాలం, దేశం గొప్పవని మీకు మొదటే మనవి చేశాను) దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తిక మాసంలో సంకల్పంతో నదీస్నానం చేస్తే, అది నిన్ను రక్షిస్తుంది. ఆ నదియందు స్నానం చేసి వెళ్లిపోవడం కాదు. నదీ స్నానం చేసేవాడు తప్పకుండా బయట నుంచి పుణ్యకర్మాచరణ చేయాలి. అంటే ఓ దానమో, ధర్మమో ఏదో ఒకటి చేయాలి.
తీర్థస్నానం అంటే అర్థమేమిటి? 
తీర్థయాత్ర అన్నమాటకు అర్థమేమిటంటే, స్నానం వల్ల పుణ్యమును మూటకట్టుకోవటం, ఈశ్వర దర్శనం చేత కాదు. యథార్థమునకు స్నానం చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానది ఉందనుకోండి. అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తూ ఉన్నా, మణికర్ణిక మహా అద్భుతమైన తీర్థం. వేంకటాచల పర్వతం నందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్నమాట ఎందుకొచ్చిందంటే, అంగీరస అన్న మహర్షులు, ఆయా తీర్థములందు ప్రత్యేకమైన యజ్ఞయాగాదులు క్రతువులు చేసి వాళ్లు ఊర్థ్వలోకాలకు వెళ్లిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం. ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వారికి ఈ యజ్ఞం చేసిన ఫలితం కలుగుగాక! అందుకని వెళ్లి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ల ఖాతాలో వీళ్లు యజ్ఞం చేశారు అని వేస్తాడు. అంటే సోమయాజి అవుతాడు. తేలికమార్గం ఏది అంటే తీర్థయాత్ర స్నానమే! అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండీ అంటారు. కానీ కళ్లతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగిన మహాపురుషులను తీర్థ స్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్లండి అని ఎందుకంటారంటే, నదీ స్నానానికి వెళ్లిన తర్వాత నువ్వు తీర్థ స్నానం కూడా చేస్తావు తప్పకుండా! కాబట్టి ఆ తీర్థ స్నానం చేత అందునా ఆ దక్షిణాయనంలో అప్పుడు చేయవలిసిన పని కాబట్టి. విశేషంగా ఇటువంటివి చేయగలుగుతావు. అందులోనూ కలియుగంలో ఉండే లక్షణమేమిటండీ అంటే 
అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు మందభాగ్యులు సకర్మము లెవ్వియుఁజేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్య మై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే.

(భాగవతం 1- 44) అంటారు భాగవతంలో.
 – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.