వివేక శీలి ,మంచి శిష్యుడు -వూర మహేష్ మరణం
సుమారు పదిహేను రోజులక్రితం వివేక శీలి ,నాకు మంచి శిష్యుడు వూర మహేష్ అమెరికాలో మరణించాడని ,అతని పార్ధివ దేహాన్ని స్వగ్రామం ఉయ్యూరు తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపినట్లు తెలిసి చాలా విచారించాను .మంచి తెలివిగల విద్యార్ధి మహేష్ .అతని అక్కయ్యలు సుజాత ,శ్రీ లక్ష్మి ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతూ ,నాదగ్గర ట్యూషన్ చదివి పాసయ్యారు .సుమారు 30ఏళ్ళక్రితం మహేష్ టెన్త్ క్లాస్ అదే హైస్కూల్ లో చదువుతూ కావాలని నాదగ్గరకు వచ్చి ట్యూషన్ చదువుతానని కోరాడు .అప్పుడు నేను పామర్రులో పని చేస్తూ రోజూ ఉయ్యూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను .నాదగ్గర పదవతరగతి చెదివే వారు లేరప్పుడు .ఆమాట వాడికి చెప్పి ,ఊళ్ళో చాలామంది ట్యూషన్ చెప్పే మేస్టార్లున్నారు .వాళ్ళదగ్గర ఎవరిదగ్గరైనా చేరితే బాగుంటుంది అని చెప్పాను .కాదు ‘’మీదగ్గరే చదవమని మా అక్కలూ చెప్పారు .నేనూ అలాగే చదవాలను కొంటున్నాను .మానాన్న కూడా మీదగ్గరే చేరమన్నారు .మీరు ఏ టైం కు రమ్మంటే ఆ టైం కు వస్తా .’’అన్నాడు .
వాళ్ళనాన్న వూర మోహనరావు ఉయ్యూరులో వూరా బ్రదర్స్ ఐన ఊర వెంకటేశ్వర్లు, ఊర తాతయ్య ,ఊర సుబ్బారావు లలో సుబ్బారావు గారబ్బాయి .వాళ్లకు ఉయ్యూరు సెంటర్ లో పచారీ కొట్టు ఉండేది .అక్కడే సరుకులు తీసుకు వచ్చేవాళ్ళం కనుక బాగా తెలిసిన కుటుంబం అయింది .మోహనరావు చాలామర్యాదస్తుడు .నిదానం మనిషి .హళ్ళూ పెళ్లూ లేనివాడు .ఇతని అన్నయ్య ను అందరూ ‘’బీకాం ‘’అనేవారు అంటే అతనే ఉయ్యూరులో మొదటిసారిగా బికాం చదివి డిగ్రీ పొందిన వాడన్నమాట .అసలు పేరు ఏదున్నా అందరికీ ఈపేరే అతని ఐడెంటిటి .వూరా బ్రదర్స్ కు మాచిన్నతనం లో మా ముందు బజారులో ఉమ్మడి కిరాణా కొట్టు ఉండేది .సోదరులు అంతా అందులోనే ఉండేవారు .తర్వాత వాళ్ళు భాగాలు పంచుకొని ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకొన్నారు .. సుబ్బారావు ను తెలిసినవారందరూ ‘’సాగరయ్య ‘’అని పిలిచేవారు .వీళ్ళకు మెట్ట, మాగాణీ పొలాలు బండీ ఎడ్లు, గోడ్లుగోదా, పాడీ పంటా పాలేళ్ళు ఉండేవారు వీటిని సాగరయ్యే చూసుకొనేవాడు .ఇతని ఇద్దరుకోడుకులు బికాం ,మోహనరావు లు జాయింట్ వ్యాపారం చేశారు .తర్వాత ఎవరి భాగం వాళ్ళు తీసుకొని వాళ్ళవాళ్ళ వ్యాపారం లో స్థిరపడ్డారు .సుబ్బారావు కు మా బజారులోనే పూర్వం ఠాణా గా ఉండే ఇల్లు ఉంది అందులోనే తండ్రి , కొడుకులుకాపురం .సుబ్బారావు చనిపోయాక మోహనరావు కూడా అందులోనే కుటుంబం తో ఉంటున్నాడు . తెల్లవారి లేస్తే మేము సెంటర్ కు వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి మీదనుంచే వెళ్ళాలి .కనుక బాగా పరిచయాలు౦డేవి.మాశ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మూలవిరాట్టుకు వెండి కవచం వాళ్ళ అమ్మాయి అల్లుడు పేరుమీద మోహనరావు చేయించి అమర్చాడు .ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో చేరాం .
వూర మహేష్ నాదగ్గర ట్యూషన్ కు చేరాడు .వాడి తమ్ముడు కూడా ఏక్లాసో గుర్తులేదుకానీ వాడూ చదివాడు .మహేష్ తెలివి తేటలు అపూర్వం అని చేరిన రెండు రోజుల్లోనే గ్రహించాను .వాడొక్కడే నాకు అప్పుడు టెంత్ క్లాస్ విద్యార్ధి .అ ఏడాదే లెక్కలు సైన్స్ టెక్స్ట్ బుక్స్ మారాయి .లెక్కల్లో కొత్త చాప్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు .సర్డ్స్ ,ప్రోగ్రేషన్స్ ,ట్రిగనోమెట్రి,,లాగరిధమ్స్ వంటి చాప్టర్లున్నాయి కాల్క్యులస్ కూడా ఉన్నట్లు జ్ఞాపకం .ఇవి ఇంటర్, డిగ్రీలలో నేను కొంత నేర్చినవే .కాని ఎన్నో ఏళ్ళు అయిపోవటం వలన అసలు ఏమాత్రం టచ్ లోలేవు .మరి మహేష్ కావాలని నాదగ్గర చేరాడు .వాడికి అర్ధమయ్యేట్లు బోధించి వాడిని స్కూల్ ఫస్ట్ వచ్చేట్లు చేయాలి అనే సంకల్పం కలిగింది .వాడికీ ఈమాట చెప్పి ‘’నేను నీకు బోధించటం కాదు ఇద్దరం కలిసి చదువుకోవటం ఇప్పుడు మనం చేయాలి .నామీద యెంత బాధ్యతఉందొ నీమీదా అంతే ఉందని గ్రహి౦చు’’అన్నాను. సరే అన్నాడు మహేష్ .అదొక సవాలుగా తీసుకొన్నాం ఇద్దరం .ఈ కొత్త చాప్టర్లు ముందు నేను మాస్టరీ చేయాలి అని ఇంటర్, డిగ్రీపుస్తకాలు తీసుకొని బాగా అవగాహనలోకి తెచ్చుకొని వాడికి బోధించాను .చెప్పటం ఆలస్యం యిట్టె అల్లుకు పోయేవాడు .కనుక టెన్త్ లెవెల్ చాలదు మహేష్ కు అనిపించి ,ఇంటర్ ,డిగ్రీ లలో ఆ చాప్టర్స్ లో ఉన్న ముఖ్యమైన లెక్కలు వర్కేడ్ అవుట్ ఎక్సామ్పిల్స్ చెప్పి చేయి౦చేవాడిని .నా శ్రమ చూసి వాడూ అంతేపట్టుదలతో అవన్నీ నేర్చుకొనేవాడు .అంటే చాలా అడ్వాన్సేడ్ గా వాడిని వాటిల్లో తయారుచేయించాను .కనుక క్వార్టర్లీ, హాఫ్ యియర్లీమొదలైన పరీక్షలలో ఎప్పుడూ వాడికే ఫస్ట్ మార్క్ వచ్చేది. ఎలావచ్చేవి అని ఇతర ట్యూషన్ మేస్టార్లు వాకబ్ చేసేవారట వాడిని అడిగితె ‘’మా మాస్టారి కోచింగ్ వలన’’అని చెప్పేవాడట . అలాగే సైన్స్ కూడా ఇంటర్ స్థాయి లో బోధించాను .ఇంగ్లీష్ లో మాట్లాడటం కూడా నేర్పించాను. సులభగ్రాహి కనుక తేలికగా వంట పట్టించుకోనేవాడు .ఒక మంచి సత్తాఉన్న విద్యార్ధికి బోధిస్తున్నాను అనే మహదానందం నాకు కలిగేది .శిష్యుడు గోప్పవాడైతే గురువుకు అంతకంటే కావాల్సింది ఏదీ ఉండదు .నాఎక్స్ పెక్టేషన్స్ కు తగినట్లుగా మహేష్ స్పందన ఉండేది .ఆ తృప్తి చాలు అనిపించింది .ఆ ఏడాది పబ్లిక్ పరీక్షలో మహేష్ అత్యంత విలువైన మార్కులు సంపాదించి స్కూల్ ఫస్ట్ గా వచ్చి నా ఆశయం నెరవేర్చాడు తన అమోఘమైన కృషితో .
టెన్త్ పాసయ్యాక ఎక్కడ ఏమి చదివాడో తెలీదుకాని ,ఆతర్వాత పదేళ్లకు మహేష్ బిటెక్ చేసి అమెరికాలో స్థిర పడ్డాడని తెలిసి సంతోషించాను .ఇప్పుడు అతని మరణ వార్త బాగా బాధించింది .అయిదారు రోజులక్రితం మహేష్ తండ్రి మోహనరావు కనిపిస్తే పలకరించాను .మహేష్ కు 46ఏళ్ళు మాత్రమె నని ,సంతానం ఒక ఆడపిల్ల అని ఇంకా చిన్నపిల్లే నని ,సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి మహేష్ చనిపోయాడని ,అంతకు ముందు తానూ, భార్యా అమెరికా వెళ్లి ఒక నెలగడిపి వచ్చామని చెప్పాడు మోహనరావు . అంతకు సుమారు ఇరవై ఏళ్ళక్రితం మోహనరావు పెద్ద కుమార్తె నా దగ్గర ట్యూషన్ చదివి, స్కూల్ ఫస్ట్ వచ్చి ,నాతోపాటు రేడియో సైన్స్ పాఠాలలో పాల్గొన్న నాకు అత్యంత అభిమానమైన విద్యార్ధిని సుజాత అకస్మాత్తుగా మరణించింది .ఇప్పుడు పెద్దకొడుకు మహేష్ .ఆకుటుంబానికి మనశ్శాంతి కలగాలని ,మహేష్ ఆత్మకు శాంతికలగాలనీ కోరుతున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-19-ఉయ్యూరు