సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66
సుగ్రీవాజ్ఞ శిరసా వహించి,సంతోషం తో దదిముఖుడు ,ఆయనకు, రామసోదరులకు నమస్కరించి ,తనబృందంతో ఆకాశానికి ఎగిరి ,మధువనం ప్రవేశించాడు .అప్పుడు ‘’వానరగురువుల ‘’మత్తు అంతా దిగిపోయి ,మర్యాదగా లేచి నిలబడ్డారు .దధి కూడా వారందరికీ అంజలి ఘటించి అంగదునితో ‘’సౌమ్యుడా ! ఈ వనరక్షకులు మిమ్మల్ని వారి౦చారని కోపం వద్దు అజ్ఞా, తో వారు చేసిన పని అది .నువ్వు యువరాజువు కనుక మధువనానికి అధిపతివి .అజ్ఞానం తో చేసిన అపచారానికి క్షమించు .మీ పినతండ్రి దగ్గరకు వెళ్లి ,మీరంతా మధువనానికి వచ్చారని చెప్పాను .ఆయన, అక్కడి మిగిలినవారు మీరిక్కడికి రావటం, వనభంగం చేయటం విని సంతోషించాడే కాని కోపించలేదు .వెంటనే మిమ్మల్నందర్నీతనదగ్గరకు పంపమని నాకు చెప్పాడు ‘’అని చెప్పాడు –దదిముఖుడుకూడా రాజాజ్ఞకు బద్ధుడై జరిగిన దానిలో వానరుల తప్పేమీలేదని’’ సర్టిఫికేట్ ‘’ఇవ్వటమే కాక వనపాలురు వారి యెడల ప్రవర్తించిన తీరు అజ్ఞానం మాత్రమె అని క్షమించమనీ కోరటం రాజాజ్ఞను సంపూర్తిగా నెరవేర్చటం లో భాగమే .సుగ్రీవుడు వారందర్నీ క్షమించాడనే చల్లని వార్తకూడా తెలియ జేశాడు తనకర్తవ్యంగా .
‘’స తా సుసాగమ ద్వీరోబద్ధ్యాకరపుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణమిదం హృస్టవ ద౦గదం’’
‘’సౌమ్య రోషో న కర్తవ్యో యదేతి రభివారితః-అజ్ఞానా ద్రక్షభిః క్రోధాద్బవంతః ప్రతి షేదితాః’’
‘’యువ రా త్వమీశశ్చ వనస్యాస్య మహాబలః –మౌర్ఖ్యా త్పూర్వం కృతో దోషస్తం భవాన్ క్షంతు మర్హసి ‘’
‘’ఆఖ్యాతం హి మయా గత్వా పితృప్యస్య తవానఘః-ఇహోపయాత౦ సర్వేషా మేతేషాం వనచారిణ౦’’
‘’త త్వదాగమనం శ్రుత్వా సహైభి ర్హరి యూథపైః-ప్రహృస్టో సౌ వనం శ్రుత్వా ప్రధర్శితం ‘’
‘’ప్ర హృస్టో మాం పితృవ్యస్తేసుగ్రీవో వానరేశ్వరః –శీఘ్రం ప్రేషయ సర్వాం స్తానితి హోవాచ పార్థివః’’
ఈ శ్లోకాలలో హృష్ట ,ప్రహృష్ట శబ్దాలు పునరావృత్తం అయేట్లు మహర్షి రాశాడు .ప్రకృష్టమైన హర్షం అందరూ పొందారని ‘’సూపర్లేటివ్ డిగ్రీ ‘’ఉపయోగించి చెప్పటం సీతాదేవిని చూసిన వార్తకు కలిగిన మహోత్కృ స్ట ఆనందాను భూతి అన్నమాట ..
దదిముఖుని మాటలు విని అంగదుడు వానరులతో ‘’రాముడు ఈ వృత్తాంతం వినే ఉంటాడని అనుమానంగా ఉంది .కనుక శత్రుతాపక వానర మహా శయులారా,కార్యం సాధించాక ఇక ఆలస్యం చేయటం తగదు మా బాబాయ్ సుగ్రీవుడి దగ్గరకే అందరం వెళ్ళటమే మిగిలింది .మీ రంతా ఎలా చెబితే అలా చేద్దాం .కర్తవ్య విషయం లో నేను మీకు పరాదీనుడనే .యువరాజునైనా ,మిమ్మాజ్ఞాపించే సమర్ధత లేదు .కార్య సాధకులైన మీకు నేను అనాదరం చేయటం తగని పని ‘’అన్నాడు.బాధ్యత తాను తీసుకోకుండా సమష్టి నిర్ణయం చేయమని దానికి తానూ బద్ధుడనే ననీ ‘’యువర్స్ మోస్ట్ ఒబీడిఎంట్’’లాగా ‘’ప్రజాస్వామ్య పాలకుడు ‘’లా చెప్పాడు –ఇప్పుడుమనల్ని ఎలుతున్నాదినాయకులకు ఈ ఆలోచనే ఉంటే మూడుపూలు ఆరుకాయల్లాగా వర్దిల్లధా.వానర రాజుకున్న ఇంగితం కూడా మనల్ని యేలుతున్న మహా ప్రభువులకు లేకపోవటం సిగ్గుచేటు .అక్కడ రాజరిక వ్యవస్తలో ప్రజాస్వామ్యం పూసింది .ఇక్కడమనకు ప్రజాస్వామ్యంలో ఆటవికత ,మొనార్కీ వేరి తలలు వేస్తోంది .’’వాట్ ఎ పిటీ మై కంట్రీ మెన్ ?
‘’శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూథ పాః-తత్ క్షమం నేహ నః స్థాతుం కృతే కార్యే పరంతపాః’’
‘’కిం శేష౦ గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః’’
‘’సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియూథపాః-తథాస్మి కర్తా కర్తవ్యే భఃవద్భి పరవా నహం ‘’
అంగదుడు వానరులను చాలా సాభిప్రాయంగా హరియూథపాపరంతపాఅని వారి శౌర్య పరాక్రమ విక్రమాలకు తగినట్లు సంబోధించాడు .పరంతపుడు అంటే శత్రు సంహారకుడు ,అనీ సూర్యుడు అనీ అర్ధాలున్నాయి .వారు శత్రు సంహారకులైన పరాక్రమ శౌర్య సూర్యులని అతని భావం .
యువరాజు వచనాలకు ప్రీతి చెంది అందరూ ఏకగ్రీవంగా ‘’యువరాజా !ప్రభువు అయి కూడా ఇంత వినయంగా ఎవరు మాట్లాడుతారు ?అధికార మదం తో మత్తిల్లి ప్రతివాడూ అహంకారి అవుతాడు .నీ పలుకులు నీస్వభావ ,యోగ్యతలను తెలియ జేస్తున్నాయి .ఇంకోడు ఎవడూ ఇలా మాట్లాడడు.నీ వినయం ,నీకు రాబోయే శుభానికి సూచనగా, యోగ్యతగా ఉన్నది .మేమే౦తా మనరాజు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళే అవకాశం కోసమే నిరీక్షిస్తునాం.అయినా నీ ఆజ్ఞ లేకుండా అడుగుకూడా ముందుకు వేయ లేని ‘’అశక్తులం’’ .ఇది ముమ్మాటికీ నిజం .’’అనగానే ‘’సరే అలాగే వెడదాం’’అన్నాడు అంగద యువరాజు . ఇక్కడ అంగదుని సౌశీల్య వినయ గుణాలు ప్రస్ఫుటంగా గోచరి౦చటమేకాక ,పెద్దల యెడ ఉన్న గౌరవభావాన్నీ,ప్రజాస్వామ్య విలువను తెలియ ఇస్తోంది .వానరులుకూడా తక్కువ వాళ్ళేమీ కాదు –ఆయనకూ ‘’ధూపం ‘’బాగానే వేశారు .రాజుతో పని కదా-క్షణక్షణ చిత్తులు రాజులు .ఎప్పుడు ఆగ్రహం చూపిస్తారో యెప్పుదుఅనాదరణ చూపుతారో చెప్పలేం .అందుకే చాలా ఆలోచించి వీళ్ళుకూడా తమమీద భారం, నెపం వేసుకోకుండా చాకచక్యంగా నే సమాధానమిచ్చారు .ముందడుగు వేయాలని ఉన్నా,రాజాజ్ఞను కాదని కదలలేని ‘’అశక్తులం’’అని సాభిప్రాయంగా అన్నారు .అంగదుని మాటలు అతనికి భావి రామరావణ యుద్ధం లో రామవిజయాన్ని సూచించటమే కాక కిష్కింధకు తిరుగులేని యౌవ్వరాజ్య పట్టాభి షేక శుభవార్త కూడా ఇందులో ఊహించి అన్నారు .అతడు యువరాజు అయినా ఆశక్తుడను అంటే ,వీరు మహాబలశాలురు కార్యసాధకులు అయినా ‘’అశక్తులం ‘’అని వినయంవిజ్నత చూపారు ..అందరూ ఎవరి పరిధి మేరకు వారు చక్కగా ప్రవర్తించారు అందరిదీ ఔచిత్యమైన పలుకులే .సాభిప్రాయమైన సంబోధనలే చేశారుకూడా .
.’’ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానరర్షభ –ఐశ్వర్య మదమత్తో హి సర్వో హమితి మన్యతే ‘’తవ చేదం సుసదృశం వాక్యం నాన్యస్య కస్య చిత్ –సన్నతి ర్హితవాఖ్యాతి’’భవిష్య చ్ఛుభ యోగ్యతాం ‘’
‘’సర్వే వయమపి పాప్తా స్తత్ర గంతుం కృతక్షణాః-స యాత్ర హరి వీరాణాం సుగ్రీవః పతి రవ్యయః’’
‘త్వయ హన్యుక్తై ర్హరిభి’’ర్నైవ శక్యం పదా త్పదం—క్వచిద్గంతుం హరి శ్రేష్ట బ్రూమస్సత్య మిదం తు తే ‘’
అంగదునినితో సహా అనదరూ ఆకాశానికి యెగిరి ,యంత్రాలతో ఎగర గొట్టబడిన కొండల్లాగాఅంటే ఫిరంగుల్లోన్చిదూసుకు వెళ్ళిన ‘’తూటాలు’’లాగా ఆకాశం లో ఏ మాత్రం ఖాళీ లేకుండా ఆక్రమించి,సంతోషంతో అరుస్తూ కేకలు వేస్తూ వెళ్ళారు .శోకంతో కనుల నీరునిండిఉన్న రామునితో సుగ్రీవుడు ‘’రామా !కొంచెం తమాయించుకో .సీతాదేవి కనబడింది కార్య సాధన లేకుండా వానరులు ఆలస్యంగా రారు .యువరాజు అంగదుడు కార్యం చెడితే ,నా దగ్గరకు రానే రాడు.కార్యఫల సిద్ధి లేకుండా వస్తే మధువన భంజనం చేయడు.దీనం గా కలవరంగా ఉంటాడు . సీతను చూడకపోతే తరతరాల మా వనాన్ని పాడు చేయడు.సీత క్షేమం తెలిసింది. నువ్వు కుశలంగా ఉన్నందున మీ తల్లి కౌసల్య సత్సంతానవతి అయింది .శోకం వదిలి ఊరడిల్లు .హనుమ సీతా దేవి దర్శనం చేశాడు అనటం లో సందేహం లేదు అతడు తప్ప అంతఘనకార్యం సాధించేవారులేరు. సూర్యునిలోని తేజస్సులాగా హనుమలో సిద్ధి ,మతి ,పట్టుదల ,పరాక్రమం ఉన్నాయనటం నిశ్చయం .జాంబవంతుడు నాయకుడుగా, అంగదుడు సేనాపతిగా ,హనుమ సహాయకుడుగా ఉంటె చేబట్టినపని విజయవంతమే అవుతుంది ‘’అని దుఖం పోగొట్టే మాటలు ధైర్య వచనాలు సీతా సందర్శన శుభవార్త చేవిన వేశాడు మిత్ర సుగ్రీవ .హనుమపై ఉన్న అపారమైన నమ్మకం .’’జాంబవంత హనుమంత అంగద త్రయం ‘’సాది౦ప రానిది లేదని ‘’సర్టిఫికేట్ ‘’ఇచ్చాడు .అంగదుడి లక్షణాలు తెలిసినవాడుకనుక అతడూ కార్యసాధన కాకుండా తన ఎదుటకు రాడనీ చెప్పాడు .’అన్నీ మంచి శకునములే సీతా దర్శన ‘’శుభ వార్తలే ‘’అన్నట్లు మాట్లాడాడు –
‘’కౌసల్య సుప్రజా రామా సమాశ్వసి హిసువ్రత –దృష్టా దేవీ న సందేహో న ‘’చాన్యన్యేన హనూమతా-
‘’హనూ మతి హిసిద్ధి శ్చమతిశ్చమతి సత్తమ –వ్యవసాయ శ్చవీర్యం చ సూర్యేతేజ ఇవద్రువం’’
‘’జామ్బవాన్యత్ర నేతాస్యా దంగదశ్చ బలేశ్వరః –హనూమాం శ్చాప్యధిస్టితా న తస్య గతి రన్యథా’’
ఇంతలో ఆకాశం లో కిలకిల శబ్దాలు ఆనందోత్సవ కేరింతలు దగ్గరగా వినిపించాయి .వానరుల ఆ ‘’ఆనంద రవళికి ‘’సుగ్రీవుడు తనతోక పెంచి తలపై మాలలాగా చేసుకొని మహా సంతోష పడ్డాడు .ఆయనకు పట్టరాని సంతోషం వస్తే ఇలా చేస్తాడని వాల్మీకి శ్లోకం లో బొమ్మ గీసి చూపించాడు
‘’తతః శ్రుత్వా నినాదం తమ్ కపీంకపి సత్తమః –‘’ఆయతాంచితలాంగూల’’స్సోభవ ద్ధృష్టమానసః ‘’
అంగద,హనుమంతులను ముందుపెట్టుకొని వానరులు రాముని చూడాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారు .ఆనంద పులకితగాత్రులై, వారంతా రామ సుగ్రీవుల చెంతకు చేరారు .మహాభుజ హనుమ శిరసువంచి రామపాదాలకు నమస్కరించాడు ‘’సీతాదేవి పాతివ్రత్యమహిమతో క్షేమ౦గా ఉన్నది ‘’అని రామునికి విన్నవించాడు –
‘’హనూ మాం శ్చమహా బాహుః ప్రణమ్య శిరసా తతః –‘’నియతా మక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్ ‘’
హనుమ కార్యసాధకుడై తిరిగి వచ్చాడని సుగ్రీవుడు లక్ష్మణుడు కూడా నిశ్చయింఛి .సంతోషంతో హనుమను ఆదరంగా చూశారు..అప్పుడు శత్రు సంహార రామ గొప్ప ఆదరం తో హనుమంతుని చూశాడు .రాముడికి శత్రు సంహార శబ్దం ఇక్కడ చాలా ఔచిత్యంగా ప్రయోగించాడు మహర్షి వాల్మీకి .ఇక మిగిలిన కార్యం శత్రు సంహారమే అని తెలియ జేయటానికి .
‘’నిశ్చితార్ధ స్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే –లక్ష్మణఃప్రీతిమాన్ ప్రీతం బహుమానా దవైక్షత’’
‘’ప్రీత్యా చ రమమాణోథ రాఘవః వరవీరహా –బహుమానేన మహతా హనుమంత మవైక్షత ‘’
సుగ్రీవ రామ లక్ష్మణుల ఆదరపు చూపులే ప్రస్తుతానికి హన్మకు బహుమతులు .అంతకంటే ఆయనకు ఏమీ అక్కర్లేని నిమిత్తమాత్రుడు .అప్పగించిన కార్యం అనుకొన్నసమయంలో విజయవంతంగా నిర్వహించి ,వాడి పోయిన హృదయాలకు సంతోషపు వసంతాన్ని పంచిపెట్టాడు .అందరూ హనుమ గొప్పతనాన్ని బహువిధాలుగా మెచ్చారు .ఇలా ‘’మిషన్ హనుమ ‘’ గ్రాండ్ సక్సెస్ ‘’ అయింది .అందరికీ ఊరట లభించింది .
‘’ఇది39 శ్లోకాల 64వ సర్గ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-20-ఉయ్యూరు

