సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

హనుమ ద్వారా సీత పంపిన చూడామణిని హృదయానికి హత్తుకొని రాముడు విపరీతంగా దుఃఖించాడు .కన్నులనిండా నీరు గ్రమ్మిన రాముడు  సుగ్రీవునీతో  ‘’దూడ పై వాత్సల్యం గల ఆవు దాన్ని చూడగానే పాలను కార్చినట్లు ,ఈ  మణి రత్నాన్ని  చూడగానే నా హృదయం ద్రవిస్తోంది .మా వివాహ సమయంలో మామామగారు జనకమహారాజు దీన్ని సీతకిచ్చాడు .దాన్ని ఆమె తన శరీర శోభ పెరిగేట్లు చక్కగా అలంకరించు కొన్నది .-

‘’యథైవ దేనుః స్రవతి స్నేహా ద్వత్సస్యవత్సలా –తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్ ‘’

‘’మణిరత్నమిదం దత్తం వైదేహ్యాఃశ్వశురేణ మే –వధూ కాలే యథా బద్ధ మధికం మూర్ధ్నిశోభతే ‘’

‘’ఈ మణి సముద్రాన పుట్టింది .సజ్జన పూజితమైనది .జనకుని యజ్ఞానికి సంతోషించి దేవేంద్రుడు ఇచ్చిన కానుక .శ్రేష్ట హనుమంతా !ఈ మణిని చూసి మా తండ్రి దశరథుని,మామామగారు విదేహ దేశాదిపతిని చూసినట్లైంది.ఈ మణి నా సీత శిరసుపై బాగా శోబిల్లింది .ఇవాళ ఆ మణిని చూడగానే ఆమెను సంపాదించి నట్లైంది .

‘’అయం హి జల సంభూతోమణిస్సజ్జనపూజితః –యజ్ఞే పరమ తుస్టేన దత్త శ్శక్రేణ ధీమతా –ఇమాం దృష్ట్వామణి శ్రేష్టం యథా తాతస్య దర్శనం –ఆద్యాస్మ్వ్యవగత స్సౌమ్య వైదేహస్య తథా విభో ‘’

‘’అయం హి శోభతే తస్యాః-ప్రియాయా మూర్ధ్నిమే మణిః-అస్యాద్యదర్శనే నాహం –ప్రాప్తాంతామివ చింతయే’’

హనుమా !వైదేహి ఏమి చెప్పిందో ఆ మాటలను మళ్ళీ మళ్ళీ చెప్పి దప్పిక గొన్న వాడికి నీటితో సంతృప్తి చెంది౦చినట్లు చెప్పి ఆ మాటల నీటితోనాకు సంతృప్తి కలిగించు .లక్ష్మణా !సముద్ర౦ లో పుట్టిన మణిని చూశానుకానీ ,సీత రావటం  మాత్రం చూడ లేకపోయాను ఇంతకంటే నాకు దుఖం ఏముంటుంది ?’’

‘’కిమాహ సీతా వైదేహీ బ్రూహి సౌమ్య పునఃపునః –పిపాసు మివ తోయేన సిందంతీ వాక్య వారిణః’’

ఇతస్తు కిం దుఖతరం యదిమం వారి సంభవం –మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతాం వినా ‘’

సీత ఇంకొక్క నెల  బతికి ఉంటె చాలు, కలకాలం జీవి౦చినట్లే .ఆనల్లకలువల కనుల సీత లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను .సీతను ఎక్కడ చూశావో అక్కడకు నన్ను తీసుకొనిపో .ఆమె క్షేమవార్త తెలిసి౦దికనుక ఇక ఒక్క క్షణం కూడా నిలవలేను హనుమా .రాక్షసులమధ్య బెదురూ దైన్యం భయంతో ఆమె ఎలా ఉండగలుగు తోందో ?-

‘’’’చిరం జీవతి వైదేహీ యది మాసం’ధరిష్యతి ‘’-క్షణం సౌమ్య న జీవేయం వినా తా సీతేక్షణాం ‘’  

‘’నయ మామపి తమ్ దేశం యాత్ర దృష్టామమప్రియా –న తిష్టేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్యచ ‘’

‘’కథం సా మమసుశ్రోణీభీరుభీరు స్సతీ సదా –భయావహానాం ఘోరాణాంమధ్యేతిష్టతిరాక్షసాం’’

శరదృతువులో చీకటే లేకుండా   వెన్నెల కాసేచంద్రుడిని మేఘాలు కమ్మినట్లు ,రాక్షస్త్రీలమధ్య ఉన్న సీతముఖానికి  సుఖం అనే వెన్నెల లేకుండా పోయింది  .హనుమా !సీత ఏయే మాటలు నాకు చెప్పమని నీకు చెప్పిందో ఒక్కమాట కూడా వదిలిపెట్టకుండా నాకు చెప్పు .అప్పుడు ఔషదాలవలన రోగి బతికినట్లు ఆ మాటలతో నేను బతుకుతాను .నన్నుఎడ బాసి ఉన్న సీత ఏమన్నదో సవివరంగా చెప్పు చెప్పు చెప్పు ‘’అని దుఃఖ వివశుడయ్యాడు రామయ తండ్రి .

‘’శారద స్తిమిరోన్ముక్తోనూనం చంద్ర ఇవాంబుదైః-ఆ వృతం వదనం తస్యా న విరాజతి  రాక్ష సైః’’

‘’కిమాహ సీతా హనుమం స్తత్వతః  కథ యాద్య మే –ఏతేన ఖలు జీవిష్యే భేషజే నాతురో యథా’’

‘’మధురా మధురాలాపా కిమాహ మమ భామినీ – మద్విహీనా వరారోహా హనుమన్ కథ యస్వ మే’’

ఇది 15శ్లోకాల 66వ సర్గ .

దుఃఖ వివశత్వంతో రాముడు పిచ్చివాడై ఉన్మత్త రాఘవుడిగా మాట్లాడాడు .ఇదంతా చూడా మణి మహాత్మ్యం .దాన్ని చూడగానే పాతగాథలన్నీ తవ్వి తీశాడు తన తండ్రి, మామ గుర్తుకొచ్చారు. సీత జ్ఞాపకం వచ్చి ఆమె దాన్ని అల౦క రించు కొనికోతన అందాన్ని ఎలా పెంచుకున్నదో మనకు హనుమద్వారాతెలిపాడు .మణి ఉత్కృష్టతను సీత ద్వారా మనం విన్నదే .ఇక్కడ తమ వివాహ సమయం లో ఆమె తండ్రి ఇచ్చిన కానుక గా గుర్తు చేశాడు చేసిన యజ్ఞానికి సంతృప్తి చెంది ఇంద్రుడు ప్రసాదించిన అమూల్య మణి అది. సజ్జనుల చేత పూజి౦ప బడిందని  చెప్పి దాని గౌరవాన్ని మరింత పెంచాడు .దూడను చూడగానే సంతోషంతో ఆవు పాలను చెపినట్లు ,శరత్ చంద్రుని మేఘం కప్పిట్లు వెన్నెల మసకబారటం ,రోగికి  ఔషధాలతో రోగం తగ్గట౦  మ౦చి ఉపమానాలు .మణిలో సీత దర్శనం చేశాడు రాముడు .కనుక ఇక ఆగలేకపోయాడు .ప్రతిబి౦బ౦తో లేక ఫోటోతో సంతృప్తి ఉండదు .అసలు విషయం చూస్తేనే పరమ తృప్తి . అది సీతను తాను  స్వయ౦గా చూస్తేనే కలుగుతుంది .ఇక ఆగలేడు .అందుకే హనుమను  సీత ఉన్న చోటుకు తీసుకొని పొమ్మని త్వర పెట్టాడు .ఆమె ఇంకో నెల బతికుంటే చాలు శాశ్వతం గా జీవి౦చేట్లు తాను  చేయగలను అనే ధీమాను   చెప్పకనే చెప్పాడు .అంటే ఇక ఆలస్యం చేయకుండా లంకకు వెళ్లి రావణ సంహారం చేసి సీతను దక్కి౦చు కొంటాడు అన్న భావం వ్యక్తమౌతోంది .

  దేనికైనా దోహదం ఒకటి ఉండాలి .రామునికి ఇక సీత పలికిన మాటలే దోహదం అన్నమాట. కనుకనే హనుమను ఆమె పలికిన ప్రతిమాటా తనకు తెలియజేయమన్నాడు .అవి కేటలిస్ట్ ల్లాగా  అంటే ఉత్ప్రేరకాల్లాగా వాటిని మరింత వేగవంతం చేసే ప్రమోటర్స్ లాగా  పని చేస్తాయి అన్నమాట .అప్పుడే రియాక్షన్ అత్యంత వేగంగా జరుగుతుంది .రావణ సంహారం అనే రసాయన ప్రక్రియ వేగవంతం చేయటానికి సీత పలుకులు కేటలిస్ట్ ల్లాగా ఆమె దుఖం బాధ దీనత్వాలు ప్రమోటర్లులాగా సహకరిస్తాయని రాముడి మనోభావం .దివ్యమణి దర్శనం దివ్య ప్రభావాన్నే అత్యంత శీఘ్రంగా కలిగిస్తుంది .అందుకే రాముడి తహతహ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-20-ఉయ్యూరు

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.