డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

గొడుగు పాలుడు

విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకు నిత్య౦ గొడుగు పట్టే వాడు ‘’గొడుగు పాలుడు ‘’అనే బోయ .ఒకసారి రాయలు వేసవి విడిది పెనుగొండ నుంచి విజయనగరానికి అడ్డదారిలో సుమారు 80 మైళ్ళదూరం గుర్రం, మీద వస్తుంటే గొడుగు పాలుడు అదే   వేగంతో గొడుగు పడుతూ పరిగెత్తు కొచ్చాడట .రాయలు చాలామెచ్చి అతడి కోరిక ప్రకారం ఒక రోజు రాజ్యపాలన ఇచ్చాడు .ఆ రోజంతా పగలూ రాత్రీ క్షణం తీరికలేకుండా  అర్హులైన వారందరికీ దానాలు చేసి కలం దించాడట .దీనికి నిదర్శనంగా కృతజ్ఞతగా ఈనాటికీ బళ్ళారి ,అన౦తపురం జిల్లాల లో అనేక పొలాలలో ‘’గోడుగుపట్టుకొని నిలుచున్న ఒక వ్యక్తి బొమ్మ ఉన్న భూమిలో నాటబడిన  బండలు కనిపిస్తాయి ,ఈ భూములకు ‘’గొడుగుపాలుని భూములు’’ అంటారు .ఈభూములు  కవిలకట్టేలలో ‘’గోడుగుపాలుని భూముల పత్రాలు’’అని కాయితాలు రికార్డ్ లుగా లభ్యమౌతాయి .ఎప్పుడూ బాణాకట్టె ధరించి గొడుగుపాలుడు రాయలకు  అంగరక్షకుడుగా  ఉండేవాడు .అతనిపేర వెలసిన ఊరే ‘’దొణ్ణే నాయకపురం ‘’ దొణ్ణే అంటే బాణాకర్ర.క్రమ౦గా డణాపురంగా పేరు మారింది

రాఘవమ్మ పల్లె

విజయనగరం సామ్రాజ్యం లో తాడిమర్రు సంస్థానాధీశులు బ్రిటిష్ వారి నెదిరించిచేసిన  పోరాటం లో తిరుమల రామ చంద్ర గారి పూర్వీకులు గురువులుగా ఉంటూ మంత్రతంత్రాలతో ప్రోత్సహించేవారు .సంస్థానం కూలిపోగానే హోస్పేట తాలూకా కమలాపురానికి వెళ్ళారు .

తాడిమర్రు పాలకుడు ఒక రోజు వేటకు వెళ్లి  సాయంకాలం దాకా వేటాడి అలసిపోయి ఆకలి దహించి వేయగా, సహచర అనుచరులు దూరమైపోగా నడుచుకుంటూ  ఒకబ్రాహ్మణ పల్లె శివారు చేరి ,ఒక ఇంటిముందు ఆగి ఆకలిగా ఉన్నాను అన్నం పెట్ట౦డమ్మాఅని ఆర్తిగా అడిగాడు .ఇంట్లో ఉన్న ఇల్లాలు రాఘవమ్మబయటికివచ్చి వేటదుస్తులతో అతడినిచూసి గొప్ప ఇంటివాడని గ్రహించి ,ఒకపంచే ఇచ్చి దిగుడుబావి నీటి లో స్నానం చేసి రమ్మని అన్నం వడ్డిస్తానని చెప్పింది .వెళ్ళాడు .అన్నదే కాని ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు’’ గా ఉంది .రాచిప్పలో కొద్దిగా మజ్జిగ మాత్రం ఉన్నాయి .దొడ్లోకెళ్ళి’’అటకమామిడాకు’’పోచలు కొన్ని లాగి కడిగి బాణలి లో కాల్చి  చింతపండు బెల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి రోట్లో వేసి నూరి పచ్చడి చేసింది .మోదుగాకులు కోసి శుభ్రం చేసి విస్తరికుట్టి ,ఉన్న అన్నానికి మరికొంతతోడుగా ఎసరు పెట్టి వండి వార్చి అతడిని భోజనానికి రమ్మంది .

స్నానం చేసి బట్టకట్టుకు వచ్చిన అతడితో ‘’నాయనా !పచ్చడీ మజ్జిగా తప్ప ఏమీలేవు ఎలాఉంటుందో ఎమీఅనుకోకు ‘’అని చెప్పి ,స్థలశుద్ధి చేసి  నీళ్ళగ్లాసు చెంబు పెట్టి . విస్తరేసి పచ్చడి వేసి అన్నం వడ్డించింది .రాజు భోజనానికి కూర్చుని పచ్చడి మహాద్భుతంగా అమృతోపమానంగా ఉందని రెండుసార్లు కలుపుకు తిన్నాడు ,మజ్జిగ పోసుకొని అన్నం తిని తృప్తి గా లేచి ,విస్తరి తీసి బయట పడేసి ,తిన్న చోట  ఆవు పేడతో  శుద్ధి చేశాడు .కాసేపు కూర్చుని , ‘’అమ్మా !అమృతంగా ఉంది ఆ పచ్చడి ఏమిటమ్మా ‘’?అని అడిగాడు ఆప్యాయంగా .సంకోచపడుతూ ఆమె ‘’నాయనా !నువ్వెవరోనాకు తెలీదు. వేళకాని వేళ వచ్చావు .పచ్చడిమెతుకులు పెట్టినందుకు బాధగా ఉంది ‘’అన్నది రాఘవమ్మ గారు .రాజు వెళ్ళబోతూ ‘’అమృతం లాంటి భోజనం పచ్చడితోపెట్టారు .పచ్చడి ఇంకోసారి కలుపుకోనేవాడినే కడుపులో ఖాళీ లేదు ‘’అని కృతజ్ఞతలు చెప్పి సాగిలపడి నమస్కరించి ఆశీర్వదించమని కోరగా ,’’శ్రియః పతి రంగనాయకుడు,యదు గిరీశుడు సకలకల్యాణాలు నీకు అనుగ్రహించు గాక ‘’అని ఆశీర్వదించగా   రాజు  వెళ్ళిపోయాడు .

ఒక వారం తర్వాత రాజభటులు వచ్చి ‘’రాఘవమ్మ గారిల్లు ఇదేనా ?’’అని అడగగా ఇంటిల్లిపాదీ భయపడి పోయి ,తర్వాత రాఘవమ్మ గారు తెప్పరిల్లి లోపలి రమ్మని చెప్పగా వాళ్ళు ‘’తాడిమర్రి దొరగారు తమరిని పెద్దలతోపాటు రెండు మూడు రోజుల్లో తీరిక చూసుకొని ఆస్థానానికి రమ్మన్నారు ‘’అని చెప్పారు .ఆవిడ ‘’మాతో రాజుగారికి పనేమిటి నాయనా ‘?మా పనుల్లో మేముంటాము .రాజకార్యాలు మాకేముంటాయి’’అన్నారు .వాళ్ళు తమకు తెలీదని వార్త అందజేయటమే తమపని అని చెప్పి వెళ్ళిపోయారు .భర్త ఇంటికి  వచ్చాకవిషయం చెప్పింది  చ. ఆయన సాదాసీదా వైష్ణవుడు .రాజాజ్ఞ తప్పదు కనుక మర్నాడే ఇద్దరూ బయల్దేరి వెళ్లి  .,లోపలి అధికారులు వివరం తెలుసుకొని లోనికి పంపారు .రాజు వారిని చూడంగానే లేచి నుంచుని ఎదురొచ్చి స్వాగతం పలికి సుఖాసీనుల్ని చేశాడు .

రాజు దగ్గరకు వచ్చి ‘’అమ్మగారూ !నన్ను గుర్తుపట్టలేదా “”?అని అడిగితె ‘’నాయనా !ఎప్పుడూ చూసినట్లు లేదు .రాజుగారు రమ్మంటే వచ్చాం .ఏం అపరాధమో ఆయన్ను కలుసుకోవటం ఎలాగో ?’’అన్నది ,రాజు ‘’నేను వారం క్రితం మీ ఇంటికొచ్చి మీరు వడ్డించిన పచ్చడితో హాయిగా భోజనం చేశాను .ఆపచ్చడి చాలాబాగుంది .అప్పుడే నన్ను మర్చిపోయారా ??’’అని నవ్వగా ఆమె ఆశ్చర్యపోయి ‘’సంతోషం నాయనా !తెలిసినవాడివి కనిపించావు రాజుగారు ఎందుకు పిలిపించారో కనుక్కొని చెప్పు ‘’అన్నది .కాసేపు ఆటపట్టిద్దాని రాజు ‘’ఎందుకు పిలిపించారబ్బా !నాకు చెప్పనే లేదే .శిస్తుబాకీ ఉన్నారా ఆస్తులకోసం పోట్లాడుకున్నారా. అయినా నేనెంత చెబితే అంత రాజుగారు ‘’ అని బుజాలెగరేశాడు  .ఆమెభర్త  ‘’రామ రామ ,మాకు ఆస్తులా పోరాటాలా పంపకాలా ?కొద్దిపోలం ఉంటె మేమిద్దరం ,పిల్లాడు పెరుమాళ్ళ ధ్యానంతో కాలక్షేపం చేస్తున్నాం ‘’అన్నాడు .ఆమె మధ్యలో కలగజేసుకొని ‘’నాయనా మాకు ఆస్తులే ఉంటె ఆనాడు నీకు పచ్చడి మెతుకులు పెడతానా ?’’అంది .రాజు వాళ్ళను విశ్రాంతి తీసుకోమని ,సాయంత్రం రాజుగారి కొలువుకు పంపే ఏర్పాటు చేస్తానని చెప్పాడు .

సాయంకాలం రాజభటుడు వచ్చి దంపతులను కొలువుకు తీసుకు వెళ్ళాడు .అక్కడ ఏర్పాటు చేసిన ఆసనాలపై కూర్చున్నారు .రాజు రాజలాంచనాలతో ప్రవేశించగానే రాఘవమ్మగారికి అతడిని ఎప్పుడో చూసిన అనుమానం  వచ్చింది .ఆతడే రాజు అనే జ్ఞాపకం రాలేదు .రాజు సభలోని వారికి వారం క్రితం జరిగిన సంఘటన అంతా వివరించాడు .రాఘవమ్మగారి ఆతిధ్యానికి కృతజ్ఞతగా ఒక పల్లెను సర్వహక్కులతో దానమిస్తున్నట్లు ప్రకటించాడు .అందరూ జయజయధ్వానాలు చేశారు .ఆనాడు పచ్చడి మెతుకులు తిన్నవాడే రాజు అని దంపతులు ఆశ్చర్య సంతోషాలతో ఉక్కిరిబిక్కిరవగా, రాఘవమ్మగారు స్థాణువే అయ్యారు .ఆ పల్లె శ్రోత్రియులకు, వేదాధ్యయన పరులకు యజ్ఞయాగాదులు చేసేవారికి ఇచ్చే గ్రామం .తాడిమర్రికి 12మైళ్ళ దూరం.రాఘవమ్మ గారి కుటుంబం ఈ గ్రామానికి మారారు .వీరికోసం రాజు ఎనిమిదిగదుల భవంతి కట్టించి ఇచ్చాడు .జ్ఞాతులు ఉండటానికి ప్రక్కన మరో ఇల్లు కట్టించాడు .ఆవూరికి ‘’రాఘవమ్మ పల్లె ‘’అని పేరొచ్చింది .కాలక్రమలో అదే’’ రాగం పల్లె ‘’అయింది .ఈ రాగం పల్లె వారే తిరుమలరామచ౦ద్ర గారి మాతామహులు .మాతామహునిపేరు వెంకట రాఘవాచార్యులు. ఆయన మూడవ కూతురు  జానకమ్మ రామ చంద్ర గారి తల్లి .ఈమె అక్క గారు ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారి పెద్దకోడలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-20-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.