డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5
పన్నా
మధ్య పరగణాలు అంటే ఈనాటిమధ్య ప్రదేశ్ లో పన్నా చిన్న స్వతంత్ర సంస్థానం .పన్నాఅంటే పచ్చ ,మరకతం .ఈ ప్రాంతం లో పచ్చలు విచ్చలవిడిగా దొరుకుతాయి కనుక ఆపేరోచ్చింది .పచ్చల ఖని గా ఉన్న ఈ ప్రాంతం పూర్వం సామాన్య పట్టణమే.వానలకు వరదలకు పచ్చలు కొట్టు కొచ్చేవి .జనం ఏరుకొని దాచుకొనేవారు .బుందేల్ ఖండ్ రాజు చత్రపాల్ ఈ పట్టణాన్ని 1675లో రాజధాని చేసుకొని పాలించాడు .అప్పటినుంచి దీని ప్రాముఖ్యం పెరిగింది .పంటలకు ,పరిశ్రమలకు కేంద్రమైంది .చేనేత పరిశ్రమకు కేంద్రం. వస్త్రవ్యాపారం బాగా జరిగేది .చుట్టూ ఉన్న అరణ్యాలలో నాణ్యమైన కలప దొరికేది .
పన్నా లోని ప్రసిద్ధ కట్టడాలలో ‘’ప్రాణ నాథ’’దేవాలయం ,బలదేవ్ మందిరం ముఖ్యమైనవి.గోడలు స్తంభాలు గోపురాలు అన్నీ చలువరాతి నిర్మాణాలే .ఈ నిర్మాణం 18శతాబ్ది చివర్లో జరిగింది .ఆనాటిపన్నా రాకుమారుడు రాజ్యార్హత ఉన్నవాడు పినతండ్రితో తగాదా పడ్డాడు. మాటామాటా పెరిగి రివాల్వర్ తో కాల్చేశాడు .అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కనుక సంస్థానాధీశులు కాని వారి వారసులుకాని తప్పు చేస్తే శిక్షలు తీవ్రంగా ఉండేవి .కనుక పినతండ్రి చంపినా పన్నా రాకుమారుడిని బంధించి బళ్ళారి జిల్లా లో నిర్బంధం లో ఉంచారు .జిల్లాదాటి బయటకు పోకూడదని ,జిల్లాలో తిరిగితే ఎప్పటికప్పుడు సమాచారం కలెక్టర్ కు తెలియజేయాలని హుకుం జారీ చేశారు .రామచంద్రగారు వారి తండ్రిగారితో వెళ్లి ఒకరోజు పరిచయం చేసుకొని మాట్లాడారట .ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లాడాడట .1938లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాజకుమారుడి నిర్బంధాన్ని తొలగించింది .
బళ్ళారి ప్రాంతం లో చిరుతలు అడవిపందులు ఎలుగు బంట్ల భయం జాస్తి. అడవిపందులు చెరుకు తోటల్లో దూరి కరికి పాడు చేసేవి .ఎలుగు బంట్లు వయసులో ఉన్న ఆడవారిని ఎత్తుకు పోయి గుహలలో శృంగారం చేస్తూ కాపురాలు చేసేవట .అలాంటి ఆడవారికి రోమాలు పెరిగి ఎలుగు బంట్లుగా మారిపోతారని రామచంద్రగారి కాలం లో చెప్పుకొనే వారట .మనిషిపై పడి రక్కి ,గొంతుపిసికి చంపటం వాటికి సర్వ సాధారణమే.రామచంద్రగారి కమలాపురం జనం తుంగభద్రకు వెళ్లి నీళ్ళు తెచ్చుకొని తాగాల్సి వచ్చేది .లేక పొతే ‘’తురత కాలువ’’నుంచి నీరు తెచ్చుకొని తాగేవారు .తురతకాలువకు ఒక కథ ఉంది .హరిహర ,బుక్కరాయలిద్దరూ కాకతీయ సేనాపతులుగా ఉంటూ అల్లాఉద్దీన్ ఖిల్జీకి పట్టుబడ్డారు .వాళ్ళను ముస్లిములుగా మార్చి, వరంగల్ కు పంపి ,తనతరఫున రాజ్యం చేయమన్నాడు .వాళ్ళు తెలంగాణాకు వచ్చి రాజ్యస్థాపన ప్రయత్నం చేశారు .ప్రజలు తిరగబడ్డారు .భయంతో హంపీ కి పారిపోయి విద్యారణ్య స్వామికి మొరపెట్టుకొని శరణు వేడారు . .ఆయన శరణు ఇచ్చి ‘’మనఃపూర్వకం గా తీసుకొంటేనే మత౦ . బలవంత మతాంతరం చెల్లదు .మహావీరులైనమీరు వైదిక మతావలంబులే ‘’అని ధైర్యం చెప్పి ,ప్రాయశ్చిత్తం వగైరా చేయించి వేద మతోద్ధరణకు వారు జన్మించారని ప్రకటించి విద్యానగరానికి శంకు స్థాపన చేసి ,విజయనగర సామ్రాజ్యానికి మూల పురుషులను చేశారు విద్యారణ్యులు .
విద్యానగరం విస్తరించి విజయనగరమైంది .దానికి నీటివసతికోసం బుక్కరాయ సముద్రం లేక మల్లాపురం నుంచి బుక్కసాగరం అనే పెద్ద చెరువు తవ్వించారు హరిహరబుక్కరాయలు .దానిలోకి నీరు నింపాలంటే మల్లాపురం నుంచి కాలువ త్రవ్వాలి అని వాస్తునిపుణులు రాయలకు చెప్పారు .ఎలా అని ఆలోచిస్తూ నిద్రపోయిన బుక్కరాయలకలలో ఆది శేషుడు ప్రత్యక్షమై ‘’మల్లాపురం వద్ద ఆనకట్ట కట్టి కాలువద్వారా నీరు మళ్ళించు.శుచిగా వరుణ దేవుడికి పూజచేసి ,వెనక్కి తిరగకుండా పరిగెత్తు.నీ వెంట నేను వస్తాను .నేను వస్తుంటే నావెనక నేను వచ్చినంతదూరం ఒకపెద్ద గొయ్యి పడుతుంది .తిరిగి చూడకుండా వెళ్ళు తిరిగి చూస్తే కాలవ ఆగిపోతుంది అని హెచ్చరించి చెప్పాడు .మర్నాడు ఈవిషయం హరిహరరాయలకు విద్యారణ్యు లకు మంత్రి సామంతులకు తెలియ జేశాడు .అది ఆది శేషుని ఆనతి కనుక అందరికీ శిరోధార్యమే అన్నారు అందరూ .
బుక్క రాయలు ఒక శుభముహూర్తాన స్నాన సంధ్య పూజాదులుచేసి శుచయై ,మల్లాపురం మలుపు వద్ద పూజ చేసి ,అక్కడి నుంచి ఒంటరిగా బుక్క సాగరం వరకు పరిగెత్తుకొని వచ్చి శేషుడు వెనకవస్తున్నాడా లేదా అనే అనుమానం వచ్చి వెనక్కి తరిగి చూశాడు .అంతవరకూ పడగవిప్పి కాలువ పడేలా జరజరా వస్తున్న ఆది శేషుడు ముందే హెచ్చరించినట్లు అంతర్ధానమయ్యాడు .పశ్చాత్తాపం చెందిని బుక్కరాయలు తాను వెనక్కి తిరిగి చూడకపోతే, కాలువ మరికొంతదూరం చెరువుదాకా పాకేదికదా అనుకొన్నాడు .మల్లాపురం నుంచి బుక్కసాగరం వరకు ఉన్న ముప్ఫై మైళ్ళ దూరం అంతా కాలువగండి పడటం చూసి ఆశ్చర్యపోయాడు .ఊరిజనం అబ్బురపడ్డారు .తరువాత చెరువు త్రవ్వించి మల్లాపురం దగ్గర ఆనకట్ట కట్టించి ,తుంగభద్ర నీరు కాలువకు మళ్ళించారు. దీనికి ‘’రాయకాలువ ‘’అని పేరు .ఎత్తునుంచి పల్లానికి త్వరగా పారడాన్ని ‘’త్వరిత కాలువ అంటారు అదే కాలక్రమంలో తురత కాలువ గా మారింది .
రామచంద్రగారి చిన్నతనం లో ఆకాలం లో ప్లేగు, మలేరియా తీవ్రంగా ఉండేవి ప్లేగు వస్తే ,జనం ఊరు వదిలేసి పాడుపట్నం అడవుల్లో కాపురాలు ఉండేవారు .అవి మిలటరికా౦పులు గా ఉండేవి .
తుంగభద్రానది రాతి గు౦డ్లపై ప్రవహిస్తుంది .ఆనీరు తాగితే మలేరియా ,కడుపులో బల్లలు ,వరుస జ్వరాలు వచ్చేవి .వరుసజ్వరాలవల్ల పేద ప్రజానీకం బాగా ఇబ్బందిపడేవారు .రెక్కాడితేకాని డొక్కాడని రోజులవి .ఆజ్వరాలతో విపరీతమైన నీరసం వచ్చి పనిపాటలకు వెళ్ళగలిగే వారుకాదు .రామచంద్ర గారింటికి వైద్యానికి వచ్చేవారు .వీరి తల్లిగారు ఆ జ్వరాలకు మంచి మందు కనిపెట్టారు .కుప్పెంటాకులో మిరియాలు సాలీడు గుడ్లు కలిపి నూరి ,తమలపాకులో పెట్టి ఎడమ మణికట్టు నాడిపై కట్టుకట్టేది .యిట్టె తీసేసినట్లు ఆవరుస జ్వరాలు తగ్గిపోయేవి .సాలీడు గుడ్లను ‘’బల్లి పోర ‘’అంటారు .కుప్పెంటాకు, సాలీడు విషం కలిస్తే జ్వరహరం అవుతుంది .నూరినముద్దనుదేవుడి గదిలో సాలగ్రామాలకు ఎదురుగా పెట్టి ‘’ఓం నమో నారాయణ’’ అని మూలమంత్రం జపించి ‘స్వామీ అనుగ్రహించు ‘’అని ప్రార్ధించి మణికట్టుకు తమలపాకులో పెట్టి కట్టేది .ఆవిడ మడిలో ఉంటె, రామచంద్రగారితో కట్టించేది .ఒకసారి ఈయన గుడ్లను నూరటం పాపంకాదాఅని అడిగితె ‘’నువ్వు పిల్లాడివి ధర్మ సూక్ష్మం తెలీదు. పెద్ద ప్రాణిని రక్షించటానికి చిన్నప్రాణిని ఉపయోగించుకోవచ్చు .శ్రేష్టమైన మనిషి జన్మ ను కాపాడితే లోకానికి మహోపకారం చేస్తాడు .కనుక మనిషిని రక్షించటం ముఖ్యం అందుకే ఇందులో దోషం లేదు ‘’అని చెప్పిందట .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-20-ఉయ్యూరు

