ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2
స్వామి ,చిన్నస్వామి
ఈజవ కులానికి ప్రభుత్వ పాఠశాలలో స్థానం కల్పించాలనీ ,ఉద్యోగాలివ్వాలని 13వేల మంది ఈజవలు సంతకాలు చేసి 1896లో తిరువాన్ కూర్ మహారాజాకు ఒక అర్జీ సమర్పించారు .కానీ వారికి ఆ కోరికలేదనీ ఎవరో కావాలని సృష్టించి ఆ లేఖ పంపారని భావించి రాజు తిరస్కరించాడు .ఇలాంటి సమయం లో నారాయణ గురు అనే సంస్కర్త వారిని ఉద్ధరించటానికి ఆవిర్భవించాడు .ఆయన 1856లో పుట్టి 1928లో 72వఏటచనిపోయారు .ఆయన క్షేత్రం మతం ఒక్కటే కాదు విద్యా ,సాంఘిక విషయాలలోనూ ఆయనవి విశేష దృక్పధాలు .ఆయన ఈజవ కులానికి చెందినా, అణచబడిన అనేక కులాల ఉన్నతి కోసం శ్రమించాడు .హిందూమతంలో శూద్రులకు సన్యాస హక్కు లేదు .ఇంకా తక్కువ కులాల సంగతి చెప్పక్కర్లేదు .ఆయన ఈజవకులకు అనేక దేవాలయాలలో ప్రవేశం కల్పి౦పజేశాడు .పులయలకు, హరిజనులనే నిమ్న జాతులకూ ఆలయ ప్రవేశం కల్పించాడు .ఒక శివాలయం లో ఆయన శివ ప్రతిష్ట చేస్తే వ్యతిరేకించిన వారిని ‘’నేను ఈజవ శివుని ప్రతిష్టించాను బ్రాహ్మణ శివుడిని కాదు ‘’అని చెప్పి నోరు మూయించాడు .మానవుడికి ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు నారాయణ గురు .సంఘంలోని మూఢ నమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసిన సంస్కర్త .ప్రశాంతంగా నిరాడంబరంగా వ్యవహరించే క్రాంతి వీరుడు .మానవాకారం లో చెక్కి రూపొందించిన సౌమ్య స్వాభావం లాగా ఉండేవాడు .అందుకే అందరూ ఆయన్ను ‘’స్వామి ‘’అని మహా గౌరవంగా పిలిచేవారు .
15-5-1903లో ‘’శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం ‘’అనే సంస్థ ఆయన ఆశీస్సులతో ప్రారంభమైంది .చెల్లా చెదరైన నిమ్న జాతులను సమైక్యపరచి వారికీ సాంఘిక ఆర్ధిక విముక్తి కల్గి౦చటమే ఈసంస్థ ధ్యేయం .1928లో నారాయణ గురు సమాధి చెందేవరకు25ఏళ్ళు ఆయనే అధ్యక్షుడుగా ఉన్నాడు .సుమారు యాభై ఏళ్ళక్రితం ఈజవ కులం లో పట్టభద్రులు కనీసం అయిదు మంది కూడా లేరు .ఈ సంస్థ అనేక పాఠశాలలు కాలేజీలు నిర్వహించి న ఫలితంగా బాగా చదివి ఉన్నతోద్యోగాలలో ఉన్నవారు చాలామంది తయారైనారు. ఇదంతా నారాయణ గురు ప్రసాదమే .
నారాయణ గురు దక్షత దీక్షత కలవారిని ఎంపిక చేసి తన ఉద్యమానికి బలం చేకూర్చారు. అలాంటివారిలో ఆశాన్ ఒకడు .మొదటి సారి ఆయన్ను కలిసినప్పుడు ఈయన వయసు 18.ఆయనది 36.ఆశాన్ లో గోప్పవ్యక్తిత్వాన్ని ఆయన గమనించాడు .వారిద్దరూ రామకృష్ణ వివేకానందులవంటి వారు .ఈ కలయిక కేరళ అభ్యున్నతికి పలువిధాల తోడ్పడింది .కుమారన్ చదువు 18వయసులోనే ఆగిపోగా స్వంతంగా అధ్యయనం చేసి విద్యనేర్చాడు .సంస్కృతం పై పట్టు సాధించాడు .తమిళం లోనూ నిష్ణాతుడయ్యాడు .మలయాళం లో సుబ్రహ్మణ్య విలాసం భక్తవిలాపం వంటి భక్తిప్రధాన కావ్య ఖండికలు రాశాడు .కుమరన్ యవ్వనం లో రాసినవి చదివించుకొని గురు మహా సంతోషపడేవాడు.శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వద్దని హితవు చెప్పాడు .
కుమరన్ పిల్లలకు సంస్కృతం నేర్పేవాడు .అప్పుడే ‘’ఆశాన్ ‘’పేరు వచ్చింది .ఆశాన్ అంటే మాష్టారు .లేక ఆచార్యుడు .దీనితో’’ కుమారన్ ఆశాన్ ‘’అయ్యాడు .శిష్యుడిని చూడటానికి గురు అతని స్వగ్రామం వెళ్ళేవాడు అప్పుడప్పుడు .ఆశన్ ఏకాంతం కోరుకొని నిర్జన ప్రదేశాలలో ధ్యానమగ్నమయ్యేవాడు ‘ఆయన చామన చాయగా బలంగా పొట్టిగా తలలావుగా గుండ్రంగా,ఉంగరాలజుట్టు మెరిసే కళ్ళతోఉండేవాడు .నడక హుందాతనాన్నీ ,ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేది . స్వామి ఈయన్ను అరువిప్పురం లో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించగా అన్నీ వదిలేసి వెళ్లి మూడేళ్ళు ఆశ్రమంలో ఉన్నాడు ఆశాన్ .అరువిప్పుం అంటే నది వొడ్డు.జనావాసాలు లేని అరణ్యప్రాంతం .ప్రకృతి రామణీయకత మహాహ్లాదంగా ఉండి ఏకాగ్రతకు ధ్యానానికి అనువుగా ఉంటుంది .స్వామి వలన గోప్పతీర్ధయాత్రాస్థలం గా మారింది .స్వామి 1885లో ఇక్కడికి వచ్చినా మూడేళ్ళ తర్వాతకాని అరాధనాకేంద్రంగా మారలేదు .స్వామితో కలిసి ఆశాన్ గ్రామాలో పర్యటిస్తూ ,ప్రజలకు ఆధ్యాత్మిక సాంఘిక విషయాలు బోధించే వాడు .అక్కడక్కడ ఆరాధనా మందిరాలు నెలకొల్పారు .స్వామి వారి సాహచర్యంతో ఆశన్ లో యోగిలక్షణాలు ఏర్పడ్డాయి .’’చిన్నస్వామి’’ అని పిలువబడ్డాడు .ఒకసారి ఆయన అన్న, మేనమామ ఇక్కడికి వచ్చారు అది శివరాత్రి .స్వామి హాలులో గంభీరంగా కూర్చున్నారు .ప్రక్కనే కమారన్ ఉన్నాడు .తనవారిని తనకు పరిచయం లేనివారిగా చూశాడు .అతని తల్లి బెంగపెట్టుకొందనీ స్వామి అనుమతిస్తే అతడిని ఇంటికి తీసుకు వెడతామని చెప్పారు అతని ఇష్టం అన్నారు స్వామి .ఈయనలో స్పందన లేదు .చివరికి స్వామి ఓనం పండుగనాడు కుమరన్ ఇంటికి వస్తాడని వారికి నచ్చచేప్పిపంపించేశారు .అలాగేమిత్రునితో కలిసి వెళ్ళాడు .ఇద్దరూ ఇంటి బయటే కూర్చున్నారు లోపలి రమ్మంటే స్నేహితుడినికూడా ఇంట్లోకి అనుమతిస్తే వస్తానన్నాడు .తండ్రి సంతోషంగా ఆహ్వాని౦చి వారితోపాటు కూర్చుని భోజనం చేశాడు .తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు .
ఆశ్రమం లో ఉన్న మూడేళ్ళు కుమారన్ ఎంతోఅధ్యయనం చేసి శిక్షణ పొందాడు .వేదాంత గ్రంధాలన్నీ నేర్చాడు .యోగాభ్యాసం చేశాడు స్వామికి ఆంతరంగిక శిష్యుడయయాడు .ఇక్కడ ఉన్నప్పుడు శివస్తోత్రమాల రచించాడు ఆశన్ .
విశాల దృష్టి
విజ్ఞానమే మహత్తర శక్తి అన్నది నారాయణగురు మోటో.పెద్ద గుడులు కాక చిన్న గుడులు నిర్మిస్తూ ప్రజల్ని విద్యావంతుల్నిచేయాలన్నది ఆయన ధ్యేయం .అతడిని దీనికి ఉపయోగించుకోవాలని స్వామి భావన .ఈజవ కులం లో స్వామి చిన్నస్వామి అతి ముఖ్యులు .వీరిద్దరి నుండి విడదీయరాని మూడవ వ్యక్తీ డా పి.పల్పు.ఈయనా అదే కులస్తుడు తిరువనంతరపురవాసి .ఇక్కడికి వచ్చి స్వామికి తన శక్తియుక్తులు ధారపోసి ఆయన మహోద్యమంలో భాగస్వామి అయ్యాడు స్వామికంటే నాలుగేళ్ళు పెద్ద .తిరువనంతపురం ఇంగ్లీష్ స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్న ఇంగ్లీష్ వాడిద్వారా ఎఫ్.ఏ.పరీక్షకు సమానమైన పరీక్ష పాసై వైద్య పాఠశాలలో చేరటానికి ప్రయత్నించి యోగ్యతలున్నా ప్రవేశం పొందలేకపోయాడు .నిరుత్సాహపడకుండా మద్రాస్ వెళ్లి ఎల్ఎంఎ సి .డిగ్రీ పొంది ,తిరిగి వచ్చి ఉద్యోగ పొందలేక ,మైసూర్ స్టేట్ లో ఆరోగ్యశాఖాధికారిగా ,లింఫ్ ఇంష్టి ట్యూట్ డైరెక్టర్ గా చేశాడు .ఆకాలం లోనే నెలకు వెయ్యిరూపాయలు జీతం .అయినాస్వంతరాష్ట్రం కేరళలో ఆయనకు ఉద్యోగం రాకపోవటం ఆశ్చర్యమే కులాదిపతులు ఆయనను హీనకుల సంజాతుడుగా భావించటమే దీనికి కారణం .మేధావి కార్యసాధకుడు అయినా డా .పల్పు కు తగిన గుర్తింపు గౌరవం రాలేదు .ఈజవ స్మారక సంస్థకు బీజం వేసింది ఈయనే .నారాయణగురు సంస్థకూ పునాదులు వేసింది కూడా ఈయనే .అంతటి వ్యూహ రచనా నిపుణుడు డా పల్పు.స్వామిఅనే నారాయణ గురు , చిన్నస్వామి అనే కుమరన్ ,డా పల్పు త్రయం ఈజవ కులానికి చేసిన సేవ వారిని తీర్చిదిద్దిన తీరు చిరస్మరణీయం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-22-ఉయ్యూరు .