మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు
ఇంటిపేరు గాలి .అసలుపేరు పెంచల నరసింహారావు – పెంచల నరసింహారావు) (1903 – 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.[1] ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు, పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి, చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.
1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం.
1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు, ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) – తెరతీయగరాదా దేవా ఆలాపించారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు.
1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరావా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే. ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. మాలపిల్ల (1938) చిత్రంలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. పెంచల నరసింహారావు 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న 62వ ఏట పరమపదించారు.
చిత్రసమాహారం
సీతాకళ్యాణం (1934)……….మొదటి చిత్రం
శ్రీకృష్ణ లీలలు (1935)
మాయాబజార్ (1936)
మైరావణ (1940)
గరుడ గర్వభంగం (1943)
కృష్ణ ప్రేమ (1943)
పంతులమ్మ (1943)
మాయలోకం (1945)
పల్నాటి యుద్ధం (1947)
బాలరాజు (1948)
ధర్మాంగద (1949)
అగ్నిపరీక్ష (1951)
సీతారామ కల్యాణం (1961)..........చివరి చిత్రం
ప్రముఖ సంగీత సాహిత్య విశ్లేషకులు శ్రీ వి ఎ కే రంగారావు ‘’ గాలి గారి మొదటి సినిమా సీతా కల్యాణం, చివరి సినిమాసీతారామ కల్యాణం అవటం విశేషం .సీతాకల్యాణం లో రావణ సభలో విష్ణు అంశ సంభూతుడు రాముడిని వెక్కిరిస్తూ ‘’శివదీక్షా పరురాలనురా ‘’జావళి అభినయం చేయించారు .చివరి సీతారామ కల్యాణం లో పాటలస్వరాలు దాదాపు ఆయన చేసినవే .అందులో ‘’శ్రీ సీతా రాముల కల్యాణం చూదము రారమ్మా’’సూపర్ డూపర్ హిట్ .రామారావు గారి సినిమాకు ప్రేరణ సాంగ్ అయింది ఈ రెండు సినిమాలమధ్య సుమారు 20 సినిమాలకు సంగీతం కూర్చారు ఆయన .సంగీతం లో శాస్త్రీయ ప్రభావం ఎక్కువ .’’కుటిల జన ధిక్కారము సైతునా ‘’అని గగ్గయ్య కంసుడిగా గర్జిస్తే ,పంతుఅలమ్మ సినిమాలో ‘’రాగ సుదారసమే ‘’,మాయలోకం లో ‘’చెలియా మనకేలనే ‘’జావళీ బెజవాడ రాజరత్నం పాడారు.బాలరాజులో ‘’పతి రూపము నీయరయా ‘’ అంటూ క్షేత్రాటనం చేసే ఎస్ వరలక్ష్మి పాడిన రాగమాలిక ,ధర్మా౦గదలో కృష్ణ వేణి పాడిన అలాంటిదే రాగమాలిక ,అగ్ని పరీక్షలో లీల పాడిన ‘’నిండు పున్నమి హాయి ‘’శాస్త్రీయ రాగ ఆధారాలైన సినిమా పాటలకు మణి మకుటాలు .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాటి కృష్ణ ప్రేమ సినిమాలో ఉన్న 20పాటలూ ఒక ఎత్తు .అన్నీ రామణీయమైనవే.శాంతకుమారి పాడిన ‘’ఇదే ఆనంద మహహా ‘’,’’ఊదుము కృష్ణా’’వింటే ఆనంద తాండవమే .సూర్యకుమారి పాడిన ‘’కృష్ణా జేజేలయ్యా గోపాలా ‘’,’’రారాధా ఆటలాటి పోరాడా’’ రసగుళికలు .భానుమతి పాడిన ‘’చెంగల్వ పూవులోన ‘’నిజంగానే చెంగల్వ పరిమళ శోభే .సంగీత దర్శకుడు చేసుకొన్నా అదృష్టం ఇది .తర్వాత వచ్చిన కృష్ణప్రేమలో ఆనాటి పాటలు రెండు ‘’రేపే వస్తాడట గోపాలుడు –మాపే వస్తాడటగోపాలుడు ‘’ ఎక్కడున్నావే పిల్లా ‘’ఉంచారు .
రెండు తమిళ సినిమాలకూ ఆయన సంగీతం కూర్చారు .సినిమాలలోకి రాక పూర్వం నాటకాలకు హార్మోనిస్ట్ గా ఉండేవారు .ఈ అనుభవం తో ‘’గాన కళ’’పుస్తకం రాశారు .ఇందులో తాను స్వయంగా రాసిన జావళీలు,పదాలు కీర్తనలు ,ప్రార్ధనలు స్వరపరచి ఇచ్చారు .కొన్ని హిందుస్తానీ తిల్లానాలు ,కాలేజ్ గరల్ ,సొరాబ్ రుస్తుం ,నారద వివాహం మొదలైన నాటకాలకు పాటలు కూర్చారు వీటికి మాత్రుకలైన ఇతర పాటల జాబితా కూడా ఇచ్చారు .’’సంగీత కళానిధి’’ అనే ఉద్గ్రంధం కూడా రాశారు .
మద్రాస్ తేనాం పేట స్వగృహం లో ఆయన మరణించారు ‘’అని రంగారావు గారు తమ ‘’సరాగామాల’’లో రాశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-22-ఉయ్యూరు