మా ఇంటి’’ రాంబంటు’’ ‘పెద్దాడు ‘

మా ఇంటి’’ రాంబంటు’’ ‘పెద్దాడు ‘

        మా ఇంటి’’ రాంబంటు’’ ‘పెద్దాడు ‘

‘’ఒరే పెద్దాడా అరటి గెల కొట్టాలి రేపు శుక్రవారం ఇవాళ వచ్చి కొట్టేసేయ్యి’’ ‘’అలాగే బాబూ ‘.అంతే.గెలకోట్టటం హస్తాలు కోసి జాగర్త చేయటం .క్షణం లో చేసేవాడు .’’అరటి చెట్టు  ఒరిగింది ,వచ్చి గడలు పోటీపెట్టాలి’’అని ఫోన్ చేస్తే చాలు ఆపని అయిపోయేది .’’దొడ్లోకాలువ పూడి పోయిందిరా .తూముపోడిచి నీరు పారేట్టు చేయాలి ‘’ అని ఫోన్ చేస్తే ‘’పనికి బయటూరికి వెళ్లాను బాబూ సాయంత్రం పెందలకడ వచ్చి చేస్తా’’అని సమాధానం .ఆసాయంత్రం ఆపని పూర్తీ .’’దబ్బకాయలు ముదురుతున్నాయిరా’’  .’’అంటే వెంటనే వచ్చి కోసి జాగ్రత్తచేసేవాడు .’’హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చారు ఉసిరికాయలు కోసి పంపించాలిరా ‘’అనగానే క్షణాలమీద వాలి ఇనుపకొంకె తో కోసి  అందించేవాడు .’’కొబ్బరికాయ తీసుకురావటం మర్చాను .మీ బడ్డీ లో ఒక కాయ అర్జెంట్ గా తెచ్చి పెట్టు ‘’అనిఫోన్ కొడితే సైకిల్ మీద రంయి న తెచ్చిచేవాడు .మాబామ్మర్ది20 కొబ్బరిబొండాలుపంపాడు వాటి పీచుతీయాలి అంటే కమ్మరిదగ్గర పట్కారా  తెచ్చి పీచుతీసి కాయలు సంచీలో పెట్టిపోయేవాడు .మంగళవారం సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు కానీ ,ఫోన్ చేసి చెప్పినప్పుడు ‘’మామ్మ గారు సంక్రాంతి గొబ్బెమ్మలకు ఆవుపేడ తెచ్చి పెట్టమన్నార్రా ‘’అంటే సిమెంట్  సంచీ లో ఒకమూట తెచ్చి అందించేవాడు .’’మన దొడ్లో వేపపువ్వు పూయలేదు.ఎక్కడైనా ఉగాదికి మంచి పూవు కోసి తీసుకురా .అమ్మాయి వస్తే అమెరికా కు తీసుకువెడుతుంది మరికాస్త ఎక్కువ తే ‘’అంటే మర్నాటికి రెడీ .ఉగాదిపచ్చడికి చెరుకుముక్క కావాలి అంటే అన్ సీజన్ అయినా ఎవరితోటలోనో అడిగి తెచ్చేవాడు .తుఫానుకు పడమటి వైపు సిమెంట్ రాళ్ళ గోడ కూలిపోతే  మనుషులనుపెట్టి పిల్లర్స్ వేసి గోడ నీట్ గా కట్టేవాడు .మా ఇంటికి మా దక్షిణాన ఉన్న మా మరోయింటికి మధ్య సందులో నాప రాళ్ళు అన్నీ పందికొక్కులు తవ్వి కు౦గి పోయాయని కబురుచేస్తే  వెంటనే అన్నిపనులు మాని వచ్చిఇసుకపొసిఎత్తుపె౦చి మొత్తం బాగు చేసేవాడు .మా వాకిలి అష్టా వంకరాలతో ఉంటె లెవెల్ చేసి నాపరాయి వేసి ముచ్చటగా తీర్చిదిద్దాడు .పడమటి గోడకు  ఇంటికి మధ్య ప్రదేశం కుంగిపోకుండా కాంక్రీట్ వేసి జాగరత్త చేశాడు .’’పెద్దాడా !ఉసిరిచెట్టు కొమ్మలు విరిగాయి కరెంట్ తీగలున్నాయి కేబుల్ వైర్లున్నాయి జాగ్రత్తగా కొట్టాలి ‘’అంటే మనుషులతో వచ్చి అత్య౦తజాగ్రత్తగా వాటిని కొట్టి గోడవతలపారేసి ఆరొట్ట అంతా అరటి చెట్లలో మామిడి చెట్లలో పోసి వాటికి బలం వచ్చెట్లు చేశాడు .సందు చివరిదాకా కాలువ తీసి వర్షాలకు ,వాడకం లో వచ్చిన నీరంతా వాకిట్లో నిలువకుండా ,ఇబ్బంది పడకుండా చేశాడు .మా రేకుల షెడ్ పైకప్పు లో బొక్కలుపడితే కారకుండా కప్పేవాడు .మా ఫస్ట్ ఫ్లోర్ ముందు భాగం నీరు కారుతుంటే అదంతా మెషీన్ తో కొట్టించి లెవెల్ చేసి కారకుండా సిమెంట్ పని చేశాడు .మామూలు లెట్రిన్ లను మార్చి  వెస్ట్రన్ టైప్ కమోడ్స్ బిగించమంటే క్షణాల్లో చేశాడు .చిన్న చిన్న రిపెర్స్ వస్తే పదికిలోలో పదిహేను కిలోలో సిమెంట్ తీసుకువచ్చి పని పూర్తీ చేసేవాడు .మ స్కూటర్ పై అవసరమైటీ ఇసుకమూటలు సిమెంట్ బస్తాలు తెచ్చేవాడు .మా ఉత్తరం వైపు గోడ మా పక్కింటి వారి వైపు రావిమొక్కలు జువ్వి మొక్కలు మొలిస్తే కొట్టి యాసిడ్ పోసేవాడు .వాకిట్లో ఉసిరి చెట్టు దగ్గర గచ్చు సరిగ్గాలేకపోతే కొట్టేసి నాపరాళ్ళు తెప్పించి సరి చేశాడు .మా రమణ ఇంటిసిమెంటు పనులు మా రాంబాబు ఇంటి సిమెంట్ పనులూ కూడా అంటే శ్రద్ధగా చేసేవాడు .

  మా సరసభారతి ఉగాదికార్యక్రమాలకు ,రేపల్లెలో జరిగిన పుస్తకావిష్కరణసభలకు  మాతోపాటు ఉండి బల్లలు కుర్చీలు సర్ది కార్యక్రమాలు విజయవంతం కావటానికి తోడ్పడేవాడు  .మా రమణ పెళ్ళికిగుంటూరుకు మా మనవడు సంకల్ప్ వివాహానికి హైదరాబాద్ వచ్చి మాతో ఉంటూ అన్ని రకాల సేవలూ చేసేవాడు .తనకు సాయంగా అవసరమైతే  సందీప్  ను అప్పలరాజులను  తెచ్చుకోనేవాడు .ఇలా ‘’పెద్దాడా పెద్దాడా ‘’అంటూ మా నోళ్ళలో నానాడు సుమారు 16 ఏళ్ళనుంచి .మా ఇంట్లో, గుడిలో ప్రతిచిన్నపనికి పెద్దపనికి పెద్దాడు ఉండాల్సిందే. వాడు ఉంటేమాకు ఒక పెద్ద భరోసా .పనిలో, డబ్బులో కక్కుర్తి లేని మనిషి .పనికి పిలిస్తే ఉదయం 9 గంటలకే మనుషులతోవచ్చి ఒంటి గంటదాకా పనిచేసి మళ్ళీ మధ్యాహ్నం 2-30కె పనికి వచ్చి సాయంత్రం 6గం ల వరకు పనిచేసేవాడు ,చేయించేవాడు .అలాంటి పెద్దాడు ఆగస్ట్ 31 రాత్రి సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు .మా ఇంటి’’ రాం బంటు’’ దూరమయ్యాడు .ముగ్గురాడపిల్లలను డిగ్రీదాకా చదివించి  పెళ్ళిళ్ళు చేశాడు .మూడేళ్లక్రితం సడన్ గా ఒక అమ్మాయి చనిపోయింది .చివరమ్మాయికి పురుడుకూడా పోశాడు ఈమధ్యే .

  ఇంతకీ  ఎవరు ఈ పెద్దాడు ?మా శ్రీ సువర్చలా ఆంజనేయస్వామి దేవాలయం బయట ఒక బడ్డీ కొట్టు మమ్మల్ని అడిగి పెట్టుకున్నారు ‘’చౌడాడ ‘’కుటుంబం ‘’సుమారు 16ఏళ్ళ క్రితం .అందరిపేర్లు అప్పల నాయుడు అనే .తండ్రి ,తల్లి లక్ష్మి .పెద్దకూతురు బెజవాడలో ఉంటుంది కుటుంబంతో .ఈ కుటుంబానికి  ఆమె మంచి అండా దండా .పెద్దకొడుకే ఈపెద్దాడు .చిన్నకొడుకు ను ‘’బుడ్డీ ‘’అంటాం .  ఈబడ్డీ బుడ్డి కుటుంబం బడ్డీ నడుపుకొంటూ  మాగుడి కాపలా కాస్తూ స్వామి సేవలో ఉంటారు .పెద్దాడు తాపీమేస్త్రి .మంచిపనివాడు .బిల్డింగులు కడతాడు .బుడ్డి విలేజ్ వాలంటీర్ గా పని చేశాడు .ఇద్దరాడపిల్లలు ఒక మగ పిల్లాడు .వీరిదిఆదర్శ ఉమ్మడి కుటుంబం .పెద్దాడు ఉదయం 7 గంటలకు బడ్డీ దగ్గరకు వచ్చి 9  గంటల దాకాఉండి తలిదండ్రులకు సాయం చేసి తర్వాత తనపనికి వెళ్లి ,సాయంత్రం పనినుంచి తిరిగివచ్చి రాత్రి 7 నుంచి 8-30 దాకా బడ్డీ పనులలో గుడిపనులలో సాయం చేస్తాడు. ఇది రెగ్యులర్ డ్యూటీ .తలిదండ్రులకు మంచి ఆసరాగా ఉంటారు అన్నదమ్ములు .వీళ్ళ భార్యలుకూడా చాలా ఓర్పున్నవారు .పెద్దాడికి తమ్ముడిపిల్లలంటే మహా ముద్దు .ఎప్పుడూ ఒకరు చంకలో ఉండాల్సిందే .మంచితనానికి ,కష్ట సహిష్ణతకు పెద్దాడు పేరుపొందాడు .మాకు తలలో నాలుక .అతని మరణం మాకు పెద్దలోటు .అతని ఆత్మకు శాంతి కలగాలని ,ఆకుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాను .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ –13-9-26-ఉయ్యూరు .–

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.