ఖగోళ కావ్యం మహాశున్యం- బండి నారాయణస్వామి

భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడు దీర్ఘాశి విజయభాస్కర్! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. ఈ వాస్తవిక స్పర్శనే వాస్తవిక దర్శనంగా ‘మహాశూన్యం’ కావ్యంలో కనిపిస్తుంది.
వాస్తవికత ఆధారంగా ఊహ చేసే ఈ కవి భక్తి కవిత్వాన్ని గానం చేస్తాడు. ప్రళయ తరంగాన్ని ఎదుర్కొంటూ ప్రయాణించే భూమికి ఒక కక్ష్య ఏర్పడగానే లక్ష్యం మారిపోతుందట. దాని సుదీర్ఘ గమనమంతా ఆత్మ భ్రమణంగా మిగిలిపోయి ఆ ప్రదక్షిణలతోనే పృధ్విపరిణతి చెందిందంటాడు కవి! అష్ట విధ భక్తులకు భిన్నంగా అస్తిత్వం పొందిన ఈ ఖగోళ భక్తికి ఏ పేరు పెట్టవచ్చో లాక్షణికులే పరిశీలించవలసి ఉంది.
తెలుగులో తాత్వికకథలు రాసిన రచయితల కంటే తాత్విక కవిత్వం రాసిన కవుల సంఖ్య తక్కువ. రాశిలోనూ వాసిలోనూ ఈ ఖాళీని పూరించే ప్రయత్నం చేసిన ఆధునికుల్లో దీర్ఘాశి విజయభాస్కర్ ఒకరు. అతడు రాసిన సరికొత్త కావ్యం ‘మహాశూన్యం’.
ఆరెస్ సుదర్శనం ‘నిశాంతం’ కావ్యం రాసినప్పుడు దానిని ధ్యాన కవిత అన్నారు. ఇప్పుడు ఈ మహాశూన్యాన్ని అనుభవ కావ్యమన్నారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ. మార్మిక కవితగా గుర్తిం పు పొందిన ఠాగూరు గీతాంజలి తెలుగు కవుల్నీ, అనువాదకుల్నీ ఎంతగా ప్రభావితుల్ని చేసిందో మనకు తెలుసు. ఏపువ్వునో ఆభరణాన్నో ప్రేయసికి కానుకగా ఇవ్వాల్సిన ప్రియుడు తన ప్రియురాలికి కత్తిని కానుకగా ఇవ్వడం భగవంతుడు భక్తుని ఐహిక బంధనాలను కోసివేసే క్రమమని, అది మార్మిక కవిత్వమని చెప్పుకుంటారు. మహాశూన్యంలో ఈ మార్మిక కవిత్వ లక్షణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ కావ్యాన్ని చింతనాత్మక కవిత్వంగానే చెప్పుకోవచ్చు. కాలమూ, ప్రకృతీ, జనన మరణాలూ, భగవంతుని స్వస్వరూపమూ గురించి అనేక చింతనలు చేసే ఈ కావ్యానికి కవితా సామగ్రి చాలా నవ్యమైనది. ఉమర్ ఖయ్యామ్ ఆకాశాన్ని బోర్లించిన మూకిటి మాదిరి ఉంది అని వర్ణించినట్లే ఈ మహాశూన్యం కవి కూడా ఆకాశంలో చందమామనీ, నక్షత్రాల్నీ, పాలపుంతల్నీ, తోకచుక్కల్నీ తన కవితా సామగ్రిగా స్వీకరించి కావ్యానికి కొత్తదనం జోడించినాడు.
బౌద్ధులు శూన్యం గురించి చెబితే అద్వైతులు ఏకం గురించి మాట్లాడతారు. శూన్యం అని చెబుతూ వస్తున్నప్పుడు ఆ అనేవాడు ఒకడు అక్కడ ఉనికిలో ఉన్నట్లే కదా! అప్పుడక్కడ శూన్యానికి ఉనికెక్కడుంది అనే తర్కమొకటి వినిపిస్తుంటుంది. ఏదిఏమైనా బౌద్ధానికీ అద్వైతానికీ వ్యక్తీకరణలో ఉన్నంత భేదం తాత్విక సారంలో కనిపించదు. శూన్యం నుంచీ ఏమీ పుట్టదు అంటాడు వివేకానందుడు. ఏమీలేనిది ఉనికిలో ఉండటం అసంగతమైనది. అక్కడ చెట్టులేదు అనడంలో వస్తుపరమైన అభావమే ఉంది గానీ, శూన్యానికి స్వంతమైన ఉనికి ఉండదు. ఈ కావ్యశీర్షికకు మహాశూన్యమని పేరు పెట్టడంలోనే అది వట్టిశూన్యం కాదనీ, అంతా ఉన్నది, అంతటా ఉన్నది అనీ అర్థమైపోతుంది. దేశ కాలాతీత చైతన్యాన్ని సూచించేదే ఈ మహాశూన్యం.
గుండెల్లో గడియారాలు పెట్టుకుని జీవులు బ్రతుకుతుంటే గ్రహాల్ని లోలకాలుగా చేసుకుని పనిచేసే విశ్వగడియారం గురించి ఈ కవి చింతనలు చేస్తాడు. ఇతని చింతనలో కాలమూ సృష్టీ పరస్పర సంబంధిత మవుతాయి. గ్రహాలు ఆకులు కోల్పోయిన వృక్షాలుగా మారినప్పుడు, నక్షత్రాలు కాంతి విహీనమైనపుడు, చెల్లాచెదురైన పదార్థమంతా ఇంటిదారి పట్టినప్పుడు ప్రస్తుత కాలమానానికి అస్తిత్వముండదు. సృష్టిలయిస్తే కాలమానానికి అస్తిత్వమెక్కడ? క్షణాలు, రోజులు, నెలలు, వత్సరాలు వీడని పొరలుగా అంటకుపోయే రోజును పాతకాలమానంతో ఎట్లా కొలవగలం?
కొత్త కాలమానాన్ని కూడా ఊహిస్తాడు కవి. మళ్ళీ విస్ఫోటనమై గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు కాలపురుషుని చెమటచుక్కలుగా విస్తరించు వరకు జీవశక్తితో పాటు కాలగర్భంలోనే దాక్కుని ఉంటుంది కాలం అంటాడు. నిజమే! జీవమే లేకపోతే పరిణామం లేదు. పరిణామం లేకపోతే కాలం గురించి లెక్కలే ఉండవు.
కాలం దాక్కుని ఉన్న ఈ కాలగర్భాన్నే కలకాలపు వృక్షమంటాడు మరోచోట. దీన్నే వేళ్ళులేని మహోన్నత వృక్షం అని కూడా అంటాడు. భూమికి కేంద్రం ఉంది గానీ, ఆత్మకు కేంద్రం లేదు అంటాడు అరుణాచల భగవాన్. నిర్దిష్టమైన పదార్థానికి కేంద్రం ఉంటుంది గానీ, స్థలకాలాతీత సత్యానికీ, అనంతవ్యాప్తికీ కేంద్రం ఉండే అవకాశం లేదు. అంతటా వ్యాపించి ఉన్న ఈ మహాశూన్యానికి కూడా ఒక కేంద్రం అంటూ లేదు. ఇదే వేళ్ళులేని మహోన్నత వృక్షం.
కమ్యూనిస్టులు సమసమాజ స్వేచ్ఛ కోసమూ, స్త్రీవాదులు జెండర్ వివక్ష నుంచీ స్వేచ్ఛ కోసమూ, దళిత బహుజనులు కుల వివక్ష నుంచీ స్వేచ్ఛ కోసమూ చేసిన పోరాటాలూ, సృష్టించిన స్వేచ్ఛా సాహిత్యమూ మనకు తెలుసు. దీర్ఘాశి విజయభాస్కర్ కలలుగనే స్వేచ్ఛ పై స్వేచ్ఛల నుంచీ పూర్తిగా భిన్నమైనది. ఇది సామాజిక పరిమితుల నుంచీ స్వేచ్ఛ కాదు. మనిషి అస్తిత్వపు మొత్తం పరిమితుల నుంచీ స్వేచ్ఛ. అట్లని ఇది భావకవుల స్వేచ్ఛాగానఝరుల వంటిది కూడా కాదు. భావకవుల స్వేచ్ఛ వెనక ఫ్రెంచి విప్లవమూ, రూసో తాత్వికతా ఉంటే, ఈ కవి కలలు గనే స్వేచ్ఛ వెనకాల అధి భౌతిక, అధి మానసిక తత్వసారముంది. చింతా దీక్షితులు, చలం, గోపీచంద్, ఆరెస్ సుదర్శనం, వసుంధర, జలంధర, రాసాని, రమణజీవి, బండి నారాయణస్వామి వంటివారు ఈ తరహా తాత్విక కథలు రాస్తే, వేగుంట మోహన ప్రసాద్ (చితీ చింతా) పల్వ హనుమయ్య (విభావరి), చలం (యశోదా గీతాలు) వంటి వారు తాత్విక కవిత్వం రాసినవారు.
ఈ కవి దర్శనంలో మనిషి మహోన్నతుడు. కాలాతీత స్థలాతీత చైతన్యం రూపీకరించుకున్న అపరిచితుడు. అట్టి జీవి కాల పంజరంలో బందీ అయింది. స్వకపోల కల్పిత ఐహిక భాండాన్ని బద్దలు కొట్టుకుని మళ్ళీ తనదైన అసలు సిసలు స్వేచ్ఛలోకి ఎగిరి పోవడమే ఈ కవి స్వేచ్ఛాన్వేషణ. కానీ ఐహిక వాసనలు తనను దిక్కులు దాటనీయకుండా కట్టడి చేస్తున్నాయంటాడు. స్త్రీవాదంలో పురుషుడు ప్రత్యర్థి. బహుజన వాదంలో అగ్రకులం ప్రత్యర్థి. వర్గ పోరాట వాదంలో రాజ్యం ప్రత్యర్థి. అట్లే ఈ తాత్వికునికి ప్రత్యర్థి తనలోని వాసనా భూయిష్టమైన అహంకారమే!
స్తబ్దంగా భూమ్మీద పడిన విత్తు నీటి చెమ్మతగిలి, పొట్ట ఉబ్బి ప్రాణమై చైతన్యమై విశ్వవ్యాప్తం కావాలనుకుంటుంది కానీ పెరుగుదలను వెంటాడుతూ తరుగుదల తరుముతోందని దానికి కాలప్రవాహంలో అర్థమవుతుంది. సృష్టికి గల కారణమే లయకూ కారణమని అవగతమవుతుంది. జీవితం వృథా అయినందుకు ఏడుస్తుంది. ఈ ఏడ్పులోనే కవి అన్వేషణాగ్ని ద్యోతకమవుతుంది. ఇట్లా కలలుగని నిస్సహాయతతో ఏడ్చే విత్తనం కవికి ప్రతీక. ఈ అన్వేషణాగ్ని చివరకు కవి తాత్విక దర్శనంగా పర్యవశిస్తుంది. మనిషి నుంచీ పంచ భూతాలు ఒక్కొక్కటి తప్పుకుంటున్నప్పుడు, మనిషిని మనిషిగా కూర్చిన పంచభూతాలే మనిషిని కూలదోసే క్రమాన్ని గుర్తిస్తాడు. దేహానికి దాస్యం చెయ్యడమే జీవికి పరమావధి అయిన సందర్భంలో; ఎన్నాళ్ళీ వాహనంపై స్వారీ చేస్తావ్ అని శకీరయాత్రను ప్రశ్నిస్తాడు. రౌతు గమ్యం దైవాంశ సాధించడం వైపే కదా అని సూచిస్తాడు. చైతన్యం జడాన్ని పొదుగుతుందా? లేక జడమే చైతన్యాన్ని పొదుగుతుందా అని సందేహం కలిగిస్తాడు. శాస్త్రీయ దృష్టికీ, ఆధ్యాత్మిక దృష్టికీ మధ్య మొలకెత్తే ఈ తర్కానికి అతీతంగానే ఉంటుందేమో అసలు సత్యం! ఆది అంతాన్ని నిర్ణయిస్తుంది అంతం ఆదిని నిర్దేశిస్తుంది; అనే ప్రాఫెటిక్ టోన్‌తో ఆద్యంతములు లేని సత్యం నువ్వే అని మనిషిని మేల్కొలుపుతాడు. ఏ ప్రళయాగ్ని తీవ్రతను వీడి, జీవి సంవర్తకంగా శీతలీకరించుకుంటుందో అని పంచభూతాల సూక్ష్మీకరణే మానవ రూపీకరణ అని ప్రకటిస్తాడు. అదే ‘ప్రపంచీకరణ’ అని కూడా అంటాడు.
భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడీ కవి! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. ఈ వాస్తవిక స్పర్శనే వాస్తవిక దర్శనంగా ‘మహాశూన్యం’ కావ్యంలో కనిపిస్తుంది. అవనికి అణువణువూ గర్భకోశమే అనినా, మట్టిలో పడింది మరుగుపడినా మెరుగుపడే బయటికి వస్తుంది అనినా ఇందులో వాస్తవికత ఆలంబనగానే భావం ఆకాశపుటెత్తులకు లేచి నిలబడుతుంది. పురుగు నుంచి పూర్ణ పురుషుని వరకు మట్టి ముద్దను రుచి చూడాల్సిందే కదా అని మట్టి మీద భక్తి చెందుతాడు. మరణించాకే మహా సామ్రాజ్యం నా కైవశమయింది అనినా, మనిషికి మట్టే తొలి సింహాసనమని ఆమోదిస్తాడు. మరణమందే మహావిస్తరణ అని తెలిసినా, చావును చంపి బతకాలన్నంత మమకారాన్ని పెంచుకుంటాడు జీవితం మీద.
మూలధాతువుల నుంచి మూర్తిమత్వం సాధించి ప్రకృతి శక్తులే వ్యక్తులుగా ఎదిగే జీవయాగ క్రియలో ఈ భూమ్మీద పాత వారెవరూ ఉండరు. కొత్తవారెవరూ రారు అంటాడు. భూమి ఆకాశాల మధ్య తిరగ్గొట్టబడే జలరాశికి కొత్త పాతలు ఏముంటాయి మరి!
వాస్తవికత ఆధారంగా ఊహ చేసే ఈ కవి భక్తి కవిత్వాన్ని గానం చేస్తాడు. ప్రళయ తరంగాన్ని ఎదుర్కొంటూ ప్రయాణించే భూమికి ఒక కక్ష్య ఏర్పడగానే లక్ష్యం మారిపోతుందట. దాని సుదీర్ఘ గమనమంతా ఆత్మ భ్రమణంగా మిగిలిపోయి ఆ ప్రదక్షిణలతోనే పృధ్విపరిణతి చెందిందంటాడు కవి! అష్ట విధ భక్తులకు భిన్నంగా అస్తిత్వం పొందిన ఈ ఖగోళ భక్తికి ఏ పేరు పెట్టవచ్చో లాక్షణికులే పరిశీలించవలసి ఉంది. కదలిక తప్ప గమనం లేని చలాచలత్వాన్ని కవి ప్రకటించినపుడు కాస్మిక్ ఎనర్జీ రహస్యం కూడా ఇదేనేమో అనిపిస్తుంది.
గురజాడ, శ్రీశ్రీలలో కనిపించే కోటబుల్ లైన్స్ మాదిరే దీర్ఘాశి విజయ భాస్కర్లో కూడా కనిపిస్తాయి. సరళరేఖ ఎంత శ్రమించినా బొమ్మల్ని గీయలేదు అనినా, వంకర్లు తిరిగినపుడే ఆకారాలు ఏర్పడతాయి అనినా, కోటబుల్ లైన్స్‌గా మిగిలిపోయే వాక్యశకలాలు. మనం ఏలోకాన ఉన్న రూపాలకు నీడలమో అని సందేహించినపుడు వేమన మి«థ్యావాదం గుర్తుకొస్తుంది. దేవుడు బద్ధకస్తుడై అవతరించనందుకు అవని అంతరించి పోతుందా అని పర్యావరణం గురించి వ్యాకుల పడతాడు. మానవ పురోగమన పదఘట్టనల కిందపడి ఎంతటి ప్రకృతి జీవ సంపద నాశనమైందో అని విచారపడతాడు. భావనా ప్రపంచాలు, రసవాహినులు, శాస్త్రీయ అన్వేషణలు… వీటితో విర్రవీగి పిచ్చి ప్రేలాపనలు చేయవద్దని మనిషి పరిమితుల్ని గుర్తు చేస్తాడు. దీనినంతా కవి గాలి కబురు ద్వారా వినిపించినా గాలి గొంతుక వెనకాల మహాశూన్యం యొక్క ఆజ్ఞ ధ్వనిస్తుంది. పరిమితులను గుర్తించుకోకుండా అహంకరించే మనిషి కళ్ళను సూర్యచంద్రులతో మాడ్చేసి, అతని వంటిలో భూకంపాలు పుట్టించి, ఊపిరితిత్తులో వాయుగుండాలు నింపి శిక్షించగలననే ఆ గాలి కబురులోనే విశ్వరూపుని భీకరాట్టహాసం కూడా మనం వినగలం. మోజెస్‌కు టెన్ కమాండ్మెంట్స్ వినిపించిన దైవవాణి ఇక్కడ గుర్తుకొస్తుంది.
ఈ కవి- ప్రకృతి శక్తుల విలాసకేళీ గర్భిత ప్రహేళికను పాఠకుల ముందు ఉంచినవాడు. ముకుళితంలోని స్థితినీ, వికాసంలోని గతిని దర్శించినవాడు. బృహత్తర బ్రహ్మా ండ విభావరికి ప్రేక్షకుడైన వాడు. భూవాసిగా పడిన శిక్షను భగవంతుని కీర్తిగానానికి శిక్షణగా మలుచుకున్న సాధకుడు. ఒక లోయను మహోన్నత శిఖరంతో నింపినట్టు జగన్మాత సౌందర్యంతో, తనలోని శూన్యస్థలాలను నింపుకున్న ఖగోళ భక్తుడితడు. వేర్ రిలెటివిటి స్టాప్స్, దేర్ అద్వైతా బిగిన్స్ అన్నట్లుగా – ఇదిగో ఇక్కడ నా తల్లి ఒడిలోకి తీసుకుంటుంది అదిగో అక్కడ మృత్యువునన్ను కబళించి వేస్తోంది అంటూ స్థల కాలాతీతంగా ఆత్మారావం చేసిన తాత్వికుడితడు. మతానికీ, తాత్వికతకీ మధ్య తేడా తెలియక; ఆధ్యాత్మికతకూ ఆరెస్సెస్ మధ్య తేడా తెలియక తాత్విక దివాళాకోరుతనం తాండవిస్తున్న ఈ సాహితీ సందర్భంలో ఈ మహాశూన్యం కావ్యానికి స్వాగతం చెబుదాం. తన హృదయ పుష్కరిణిలో మునిగి ఉన్న మరిన్ని ఆలోచనా కమలాలను ఈ కవి మనముందుకు తెస్తాడని ఆశిద్దాం!
– బండి నారాయణస్వామి