సచిన్‌ సెలబ్రిటీ పల్లె

సచిన్‌ సెలబ్రిటీ పల్లె
ఇన్నాళ్లు బ్యాటు పట్టుకుని పరుగులు తీయడమే కాదు.. ఇప్పుడు పల్లెలను దత్తతకు తీసుకుని అభివృద్ధిలోను పరుగులు పెట్టిస్తానంటున్నాడు సచిన్‌ టెండుల్కర్‌. ఆయన చేతి చలవతో నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ రూపురేఖలే మారిపోనున్నాయి. మోడల్‌స్కూల్‌, నిరంతర మంచినీటి సరఫరా, పక్కాఇళ్లు, తళతళలాడే రోడ్లు, సౌరవిద్యుత్తు, క్రీడామైదానం, బ్యాంకు ఒక్కటేమిటి? ఇవన్నీ సమకూరితే ఇదొక సెలబ్రిటీ పల్లె కావడం ఖాయం..
‘‘మన ఊరికి సచిన్‌ వస్తున్నాడు తెలుసా?’’
పుట్టంరాజుకండ్రిగకు వెళితే ఎవరు ఎదురుపడ్డా ఇదే ముచ్చట. ఊరు ఊరంతా ఉత్సాహంతో ఈ తీపి కబురును పంచుకుంటోంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు పంచాయతీ కిందికి వస్తుంది పుట్టంరాజుకండ్రిగ. ఇదొక చిన్న పల్లెటూరు. గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన మార్గం నుంచి పదహారు కిలోమీటర్లు మట్టిరోడ్డు మీద వెళితే – ఈ పల్లె వస్తుంది. పల్లెటూరంటే చెప్పేదేముంది? వీధుల్లో రోడ్లు లేవు. సగానికిపైగా ఇళ్లన్నీ శిథిలమై మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఊరి ప్రజల్లో ఎక్కువమంది నిరుపేద కూలీలు. గేదెలు, గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నవాళ్లు. ‘‘మా ఊరి మొత్తం జనాభా 443. ఇళ్ల సంఖ్య 120. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ. ఇన్నేళ్లు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. అందుకే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాం. ఇప్పుడు అందరి దృష్టి మా ఊరి మీద పడటం సంతోషకరం’’ అంటున్నారు గ్రామీణులు.
ప్రధాని పిలుపుతో..
నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక – ఆయన దృష్టి పల్లెటూళ్ల మీద పడింది. దేశంలో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతలు, డబ్బు సంపాదించుకున్న సెలబ్రిటీలు పల్లెల వైపు చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఏదో ఒక తోచిన పల్లెను దత్తతకు తీసుకుని సకలసౌకర్యాలతో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నది ఆయన కోరిక. ప్రధాని ప్రకటనకు స్పందించాడు సచిన్‌టెండుల్కర్‌. నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగను దత్తత తీసుకున్నాడాయన. దాంతో ఒక్కసారిగా ఈ పల్లెకు సెలబ్రిటీ ఇమేజ్‌ వచ్చింది. జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ చొరవతో ఊరికి మహర్దశ పట్టింది. సచిన్‌ కూడా ఎంపీ నిధులు కేటాయించారు. ఇప్పటికే నాలుగు కోట్లతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామంలోని 14 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అద్దంలా తీర్చిదిద్దారు. త్వరలో ఇక్కడొక క్రీడా మైదానం ఏర్పడనుంది. ‘‘క్రికెట్‌కు సచిన్‌ మా ఊరి పిలగాళ్లందరికీ ఆదర్శం. ఆయనే స్వయంగా మా ఊర్లో గ్రౌండ్‌ను ఏర్పాటు చేసి.. క్రీడల్లో మా పిల్లలను ప్రోత్సహించడం సంతోషకరం’’ అని చెప్పారు స్థానికులు.
ఊళ్లో ఇప్పటికే పడిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి కూడా తారురోడ్డుగా మారనుంది. చదువుకునే విద్యార్థులకైతే కొత్త పాఠశాల భవనాలు రానున్నాయి. అదీ ఆధునాతన వసతులతో – కిచెన్‌, డైనింగ్‌హాల్‌, రన్నింగ్‌ వాటర్‌, క్రీడామైదానం, పరికరాలు, మరుగుదొడ్లు, కంప్యూటర్లతోపాటు విద్యార్థులకు సైకిళ్లు కూడా అందివ్వనున్నారు. గ్రామం మొత్తం వైపై సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలను పంపారు అధికారులు. ఇందుకు సంబంధించి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సివిల్‌ ఇంజనీర్లు నమూనాలను తయారు చేశారు.
మా గ్రామంలో మంచినీటి సమస్య ప్రధానమైనది. త్వరలో 24 గంటలు నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతకంటే మాకు ఇంకేమి కావాలి? అంటున్నారు ప్రజలు. ఆర్థికలావాదేవీలకు బ్యాంకు, ఆరోగ్యకేంద్రం, పశువైద్యశాలలను సచిన్‌ నిధులతో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాతోపాటు ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్తు అందుబాటులోకి రానుంది. గ్రామంలో మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు – సాక్షరతాభారత్‌ కేంద్రం రానుంది. ‘‘ఇవన్నీ సమకూరితే మా ఊరు ఒక ఆదర్శ గ్రామంగా కావడం ఖాయం. ఆ రోజు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాం’’ అంటున్నారు జనం. వచ్చే నెల రెండో వారంలో ఈ గ్రామాన్ని సందర్శించేందుకు సచిన్‌ రానున్నారు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.