సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-44
మంత్రి కుమారుల మరణ వార్తవిన్న రావణుడు కొంచెం కలవరపడినా బయట పడకుండా ,అంతకంటే వీరులు దీశాలురు నీతిమంతులు ఐన విరూపాక్ష యూపాక్ష ,దుర్ధర,ప్రఘస,భాసకర్ణుడు అనే అయిదుగురు సేనానాయులను పిలిచి ‘’మీకు తోడుగా అమేయ బలపరాక్రమ సైన్యం వెంటపెట్టుకొని ఆ కోతిపై యుద్ధం చేసి ,వాడిని ఎలాగైనా అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకు రండి .వాడి దగ్గర చాలా జాగ్రత్తగా మసలు కోవాలిమీరు .అలాగే దేశ ,కాల విరోధ౦ కాని పనిఆలోచించి చేయండి .వాడు కేవలం వానరుడు అని అనిపించటం లేదు .మహా బలంతో ఉన్న భూతం కావచ్చు .మనల్ని ఇబ్బందిపెట్ట టానికి ఇంద్రుడే వాడిని సృష్టించి మనపైకి పంపి ఉండచ్చు .మనమంతా కలిసి పూర్వం దేవ ,అసుర నాగ ,యక్ష గ౦ధర్వ ,మహర్షులను జయి౦చాం కదా .వాళ్ళే మనుకు ఈఉపద్రవం కల్పించి ఉండచ్చు .అనుమానం లేదు. కనుక ఆకోతిని పట్టుకోండి .ధీర వీర పరాక్రముడైన ఆవానరుడిని అవమానించకండి .ఇలాంటి వానరులతో నాకు పూర్వం అనుభవం ఉన్నది.
‘’హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణమహాత్మనా –రావణ స్సంవృతాకార శ్చకార మతిముత్తమాం’’
‘’కర్మ చాపి సమాదేయ౦ దేశకాల విరోధినం ‘’
‘’నావమాన్యో భవద్భిశ్చహరిర్దీర పరాక్రమః
‘’దృస్టాహి హరయః పూర్వం మయా విపుల విక్రమః ‘’
వాలి సుగ్రీవ ,మహాబలవాన్ జామ్బవాన్ ,సేనాపతి నీల ,ద్వివిద మొదలైన వానరవీరులున్నారు .కాని వారిలో ఎవరికీ ఇంతటి తేజస్సు ,పరాక్రమం ,ఆలోచన ,బలం ,ఉత్సాహం కామరూప ధారణం లేవు .ఇదేదో వానర రూప భూతమే. పట్టి తీరాల్సిందే .మీ ముందు ఇంద్రాదులే గడగడ వణుకుతారు .అయినా నీతికోవిదుడు, యుద్ధం లో జయించాలనుకోనేవాడూ చాలాజగ్రత్తగా ముందు తాను రక్షించుకోవాలి .కారణం యుద్ధం లో జయం చంచలమైనది –
‘’అం తేషాంగతిర్భీమా న తేజో న పరాక్రమః -‘’న మతి రణ బలోత్సాహౌ న రూప పరికల్పనం ‘’’’మహాత్ సత్వ మిదం జ్ఞేయం కపి రూపం వ్యవస్థితం-ప్రయత్న౦ మహదాస్థాయ క్రియతా మస్య నిగ్రహః ‘’
‘’తథాపితు నయజ్ఞేన జయమాకా౦క్షతా రణే –ఆత్మా రక్ష్యః ప్రయత్నేన యుద్ధ సిద్ధి ర్హిచంచలా ‘’అని రావణుడు చెప్పగా రెట్టించిన ఉత్సాహంతో పంచ సేనాపతులు బయల్దేరి ,బహిర్ద్వారం వద్ద ఉన్న హనుమను చూసి ,అన్నివైపుల్నించి ముట్టడించి హనుమను ఎదిరించారు .దుర్ధరుడు వాడియైన పంచబాణాలు హనుమతలపైకి వేశాడు .ఆదెబ్బలకు హనుమ ,సింహనాదం చేసి ,ఆకాశంలోకి ఎగిరాడు .దుర్ధరుడు వాడిబానణాలు వేయగా ,శరీరం పెంచి ,వేగంగా తలపడి కొండపైకి పడే పిడుగులాగా వాడి రథంపై ఒక్కసారి దూకగా ,8గుర్రాలు ,బండి నలిగి నుజ్జు నుజ్జు అయి వాడూ చచ్చాడు .
విరూపాక్ష యూపాక్షులు మహాకోపం తో,వేగంతో హనుమపైకి వచ్చారు .వాళ్ళ వేగాన్ని తగ్గించి ,భూమిపైకి దిగి ,ఒక సాల వృక్షం పెకలించి దానితో బాది ఇద్దర్నీ చంపాడు .ఇప్పటికి మూడు వికెట్లు డౌన్ .ప్రహాసుడు కోపం ఆపుకోలేక హనుమమీదకు రాగా ,భాసకర్ణుడు కూడా తోడుగా హనుమపైకి బల్లెంతో వచ్చాడు .వాడు అడ్డకత్తి,వీడుశూలం తో యుద్ధం చేశారు .వాళ్ళ దెబ్బలకు ఒళ్ళంతాగాయలై ,కోపం పెరిగి చెట్లు పాములు ,జంతువులతో ఉన్న ఒక పర్వతాన్ని పీకి వాళ్ళపై విసిరి చంపి ,మొత్తం అయిదుగురు సేనానులను హతం చేసి మిగిలిన సైన్యాన్ని రథాలతో రథాలను గుర్రాలతో గుర్రాలను ఏనుగులతో ఏనుగుల్ని యోధులతో యోధుల్ని’ఇంద్రుడు అసుర సంహారం చేసినట్లు భయంకరంగా సర్వ నాశనం చేసి కొత్త తరహా యుద్ధానికి తెర దించాడు .తన రణ కండూతికొంత తగ్గించుకొన్నాడు .-
‘’అశ్వైరశ్వాన్,గజైర్నాగా ,న్యోధైర్యోదాన్ ,రథై రథాన్-స కపి ర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్ ‘
చచ్చినమనుష్యుల జంతువుల కళేబరాలతో ,విరిగిన ఆయుధాలు రథాలముక్కలతో ఆప్రదేశం దారుణ మరుభూమిలా కనిపించింది .ఇంతమందిని చంపిన సంతృప్తి ఉన్నా ,ఇంకా చంపాల్సినవారికోసం మళ్ళీ బహిర్ద్వారం వద్దకు చేరాడు విరాట్ హనుమ .
ఇది39శ్లోకాల 46వ సర్గ
మొదట్లో రావణుడు మంత్రికొడుకుల చావుకు కలవరపాటు పడినా ,గొప్పనటుడులాగా దాన్ని బయట పడనివ్వలేదు .రాజుకు ఇది అవసరం .లేకపోతె ముందుకు వెళ్ళలేడు .ఈసారి మహా బలవంతులైన పంచ సేనానులను పంపాడు .వాళ్ళకు చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాడు .కోతిఎవరై ఉండవచ్చో అనేకరకాలుగా ఊహించి చెప్పాడు .తాను అపకారం చేసినవారు పగబట్టి పంపించినవాడేమో అనీ అనుకొన్నాడు .తర్వాత వాళ్ళను కాసేపు దువ్వి తామంతా కలిసి పూర్వం దేవాసురాదులతో చేసిన యుద్ధం గుర్తు చేసి వాళ్ళ పరక్రమాలకు కాస్త ధూపం వేసి ఉత్సాహ పరచాడు .మొదటి సారి రావణుడి నోటి వెంట రాజనీతి వాక్యాలు దొర్లాయి .ఇదొక విశేషం .యుద్ధం లో ఆత్మ రక్షణ చాలా ముఖ్యం అంటూ జయాపజయాలు మన చేతిలో లేవనే యదార్ధాన్నీ తానే చెప్పాడు. విజయం చంచలం అన్నాడు .హనుమను అనమాని౦చ వద్దని హెచ్చరించాడు కూడా .అతడిని పట్టుకొని తీసుకు రావటమే ముఖ్యం అన్నాడు .తనకు పూర్వం పరిచయమైన వానర వీరులపేర్లుకొన్ని చెప్పి స్మరించాడు .వారిలో ఎవరికీ ఈవానరానికున్నగొప్ప గుణమూ లేదని గట్టిగా చెప్పాడు .తనకు తెలుసు వాలి బలపరాక్రమాలు .అతడి చేతిలో కాటా దెబ్బ తిన్నవాడు ..కనుక గుర్తు బాగానే ఉంది.కానీ చెప్పలేదు .చెబితే అభాసు పాలే కదా.
సేనాపతులు కనుక వీరితో .యుద్ధం సరదాగానే చేశాడు భీభత్సంగా .ఇక్కడే కొత్త తరహాయుద్ధం ప్రదర్శించాడు. గుర్రాన్ని గుఱ్ఱంతో ఏనుగును ఏనుగుతో ,యోధుల్ని యోధులతో త రథాలను రథాలతో చావబాదటం ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాం. హనుమ ప్రదర్శించిన కొత్త టెక్నిక్ ఇది . చక్కగా పని చేసింది .కాసేపు ఆకాశ యుద్ధమూ చేశాడు గభాల్న రథం మీదకు దూకి ఒకసేనాని వాడి గుర్రాలతో సహా రథం నాశనం చేశాడు .ఇలా మహత్తర ధీ బలపరాక్రమాలతో పంచసేనానులకు పంచత్వం కలిగించాడు హనుమ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-20-ఉయ్యూరు
‘’