అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే నల్లచట్టాలు ప్రజాస్వామికవాదులను వేటాడు తున్నప్పుడు, వరంగల్ వీధుల్లో ఒకే ఒక వ్యక్తి నోటికి నల్లగుడ్డ చుట్టుకుని ఒంటరి ఊరేగింపు తీశాడు. అతనితో అడుగులు వేయవలసినవారు అప్పటికే నిర్బంధంలో ఉన్నారు. మరికొందరు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఎవరున్నా లేకపోయినా నియంతృత్వ ప్రభుతకు నిరసన తెలియవలసిందేనని సాహసించిన ఆ వ్యక్తి కాళోజీ నారాయణరావు. మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అణగారిపోయిన తరువాత, ఎటువంటి అలజడీ లేని కాలంలో కూడా ప్రతి రాషా్ట్రవతరణ దినోత్సవాన అసెంబ్లీ ఎదుటి గన్‌పార్క్ దగ్గర నివాళు లర్పిస్తూ వచ్చిన అతి కొద్దిమందిలో కాళోజీ ఒకరు. విశ్వసించిన అంశాలపై గట్టి కట్టుబాటు, దాన్ని ప్రకటించడానికి సాహసమూ – రెండూ ఉన్న అరుదైన వ్యక్తిత్వం కనుకనే, కాళోజీని ఫ్రెంచి కవి, రచయిత లూయీ ఆరగాన్‌తో శ్రీశ్రీ పోల్చారు. అత్యంత సంక్షోభ కాలంలో కూడా ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీని వదలకుండా నిలబడ్డ రచయిత లూయీ ఆరగాన్.
కాళోజీ కవిత్వమూ రచనలూ ఆయన జీవితం నుంచి వేరు కావు కనుకనే, జీవితాచరణే ఆయన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతి అంశంలోనూ ప్రజాహితమైన వైఖరి తీసుకోవడం, న్యాయం మీద ఉద్వేగపూర్వకమైన ఆకాంక్షను ప్రకటించడం, స్వార్థరహితమైన జీవితాన్ని గడపడం- క్లుప్తంగా చెప్పవలసివస్తే ఇవీ ఆయన గుణగణాలు. మహారాష్ట్ర కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, తెలుగు సాహిత్యంలో, సమాజంలో విశేషమైన పాత్రను పోషించడం ఒక విశేషమైతే, తెలుగు భాషపై ఇతర భాషల ఆధిపత్యాన్ని, తెలుగు భాషలోని కొన్ని రీతులపై సొంతవారే ప్రదర్శించే వివక్షను ప్రతిఘటించడం మరో విశేషం. తెలంగాణ తోను, ప్రత్యేక ఉద్యమంతోను కాళోజీ అనుబంధం ఆయన వ్యక్తిత్వంలో ఒకానొక పార్శ్వం మాత్రమే. ఆయనకు తెలుగునేల నాలుగుచెరగులా మిత్రులున్నారు, ఆయన ఇష్టపడిన రచయితలు, ఆయనను ఇష్టపడిన పాఠకులు అన్నిప్రాంతాలలోను ఉన్నారు. అటు శ్రీశ్రీకి, ఇటు విశ్వనాథ సత్యనారాయణకి ఆయన సన్నిహితుడు. ప్రజాస్వామికవాదిగా ఆయన గళం విప్పని తెలుగు జిల్లా లేదు. ఆయన పోరాడని అంశం లేదు. అందుకే, ఈ రోజు రెండు తెలుగు రాషా్ట్రలలోను కాళోజీ శతజయంతిని అభిమానులు జరుపుకుంటున్నారు.
కాళోజీ తన కవిత్వాన్ని ‘గొడవ’ గానే చెప్పుకునేవారు. తన గొడవ ప్రజలందరి గొడవ అని ఆయన అనేవారు. కొంత వాడుక భాష, కొంత సరళగ్రాంథికం, కొంత లయ, కొంత ప్రాస- ఇవన్నీ కలిస్తే ఆయన కవిత. తాననుకున్నది, తాను చూసింది వెంటనే కవిత అల్లడం ఆయన అలవాటు. ఆయన కవితలు అనేకం సూక్తులుగా జనం నోట నానాయి. కబీర్ వంటి భక్తకవుల ‘దోహా’ సంప్రదాయం కాళోజీదని భారత ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన మిత్రుడు పి.వి. నరసింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎంతటి దగ్గరివారినైనా, ఎంతటి గొప్పవారినైనా నిర్మొహమాటంగా తప్పుపట్టే కాళోజీ సోదరులంటే తనకు ఎంతో భయమూ బెరుకూ అని పి.వి. అనేవారు. కాళోజీ అన్న, ఉర్దూ కవి షాద్ కాళోజీ రామేశ్వరరావు, తమ్ముడి ద్వారానూ, తాను సొంతంగానూ పరిసరాలను, సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. మిత్రుడు పి.వి. అభ్యర్థనను కాదనలేకనే కాళోజీ ‘పద్మవిభూషణ్’ గౌరవాన్ని స్వీకరించారు. ఆ పురస్కారాన్ని స్వీకరించిన తరువాత కూడా కాళోజీ ప్రజానుకూలత రవ్వంత కూడా తగ్గలేదు, ఏలికలపై విమర్శల పదునూ తగ్గలేదు.
తెలుగుసమాజానికి ఒక పెద్దదిక్కుగా, ప్రజాస్వామికవాదులందరికి అండగా వ్యవహరించిన కాళోజీ, మలిదశ తెలంగాణ ఉద్యమం బలపడే దశ వరకు సజీవులుగా ఉండి ఉంటే, విమర్శనాత్మకమైన మార్గదర్శకత్వం అందించి ఉండేవారు. ఆయన లోటు గత పన్నెండేళ్లుగా తెలుగుసమాజం అనుభవిస్తూనే ఉంది. ఆయనకు తిరుగులేని నైతికాధికారం కానీ, గౌరవం కానీ సంక్రమించడానికి కారణం కేవలం ఆయన కవి కావడం మాత్రమే కాదు, గాంధేయవాదో, ప్రజాస్వామిక వాదో కావడం మాత్రమే కాదు. ఏ సిద్ధాంతాన్ని కూడా ఆయన బేషరతుగానో, తాను రాజీపడి కానీ ఆమోదించలేదు. ‘పార్టీవ్రత్యం’ తనకు లేదని ఆయన చేసిన వ్యాఖ్య ఒకనాడు వివాదాస్పదమైనది కూడా. తాను సొంతంగా ఏది న్యాయం, ఏది ధర్మం అని భావించారో దానిని గాఢంగా, మమత్వంతో దగ్గరకు తీసుకోవడమే ఆయనలోని బలం. దేనినీ ఖాతరు చేయకపోవడం, కష్టనష్టాలను స్థితప్రజ్ఞతతో స్వీకరించడం, చిరునవ్వును కన్నీటిని ఏ తెరలూ లేకుండా ఉప్పొంగించడం- కాళోజీని పసిబాలుణ్ణి చేశాయి, ప్రజల మనిషిని చేశాయి. పుట్టుకనూ చావునూ సొంతం చేసుకుని, తక్కినదంతా దేశానికి ఇచ్చిన త్యాగశీలిని చేశాయి.
అన్యాయాన్ని, ఆగ్రహాన్ని, పోరాటాన్ని, నిర్వేదాన్ని పాడుకుంటూ సంచరించిన ప్రజాకవి కాళోజీ. తన జీవితాన్ని, స్మృతిని గొప్పస్ఫూర్తిగా మిగిల్చిపోయిన ధన్యజీవి కాళోజీ. ఆయన తన గురించి పాడుకున్న ఈ కవిత అక్షరాలా ఆయన జీవితవేదం.
‘‘అతిథివోలె వుండి వుండి
అవని విడిచి వెళ్లుతాను
…..
గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను
లోయలలో దూకి దూకి లోతులెన్నొ చూచినాను
..
నే ప్రాకని ఎత్తు లేదు
నేజారని లోతు లేదు
…
మూలజేరి మునుల వోలె మూగనోము బట్టినాను
ఈగవోలె దోమవోలె
వాగుచు తిరుగాడినాను’’ |
|