డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9
తెనాలి రామ కృష్ణ మండపం
హంపీశిదథిలాలలో భువనవిజయ మంటపానికి ఎదురుగా అరమైలు దూరం లో ఒకగు ట్టమీద నాలుగు స్తంభాల మంటపం ఒకటి ఉంది .దీన్నే తెనాలి రామలింగని మండపం లేక తెనాలి రామ మంటపం అంటారు .దీనికి రాజంతః పుర రహస్య కథ ఒకటి ఉంది .ఆరహస్యం గుప్పుమనటానికి కొంటె కోణంగి రామలింగడు ఆ మంటపం లో చేరాడు .ఆకాలం లో ఉత్తరభారతం లో బీర్బల్ ,దక్షిణాన తెనాలి రామలింగడుహాస్య చక్రవర్తులు .ఆస్థాన విద్వాంసుడు కాకముందు పెద్దనగారి వెంట తాతాచార్యుల వెంట రాయలకోలువుకు వెళ్ళేవాడు .రాయల చెవిలో పడేట్లు హాస్యోక్తులు అనటం ఆనవాయితీ .అతడికని .ఓర చూపు తో రాయలు మెచ్చేవాడు .
ఒకసారి రాయలు చిన్నా దేవితో ముచ్చటిస్తూ ముద్దుపెట్టుకోటానికిముందుకు వంగాడు .ఆవిడ ‘’చిచ్చిచ్చిచ్చో ‘’అంటూ పెద్దగా తుమ్మింది. రసాభాస అయినందుకు మనసు బాధ పడి రాయలు వెళ్ళిపోయాడు .తుమ్ము దగ్గు మొదలైన వాటిని ఆయుర్వేదం లో ‘’వేగాలు ‘’అంటారు .వాటిని ఆపలేం బలవంతంగా ఆపితే వ్యాధులొస్తాయి .పాపం రాణీ గారు ఆపుకోలేక తుమ్మేసింది. వేగ నిరోధం ఆమె తరం కాలేదు .ఈ రహస్యాన్ని పొక్కనివ్వద్దని దాసీలను ఆదేశించింది రాణి .దాసీల నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత ఉంది .ఒకదాసీ రామలింగని ఇంట్లో పని చేసే, తన కూతురికి చెబితే ఆవిడ రాజరహస్యం తెలిసినట్లు పోజు పెడితే నెమ్మదిగా రామలింగడుకూపీ లాగి తెలుసుకొన్నాడు .అందర్నీ నవ్వి౦చ టానికి అది అతడికి మంచి ఆయుధమయింది .
సంపన్న గృహస్తు అయిన రామలి౦గడు ఒక రోజు గుర్రం బండీలో గుర్రానికిఎర్రటి గుడ్డ తో మూతి బిగకట్టి ,చేత్తో పెను బెత్తం పట్టుకొని ఇంటినించి రాయలు నివసించే భవనానికి వీధులన్నీ తిరుగుతూ గుర్రాన్ని తిడుతూ కొడుతూ వెళ్ళాడు .గుర్రం మూతి అలాబిగించారేం అని దారిలో జనం అడిగితె ‘’అంతఃపుర రహస్యాలు అది చెబుతుందేమో నని మూతి బిగించానని చెప్పాడు .ఊళ్ళో అందరికీరాయల అంతఃపురం లో ఏదో రహస్యం జరిగిందని ,అదేదో తెలుసుకోవాలని కుతూహలం కలిగి గుసగుసలు పోతున్నారు. రాయల వేగులు గమనించి విషయం తెలుసుకోటానికి రామలింగని దగ్గరకు వచ్చారు .తాను చెప్పేమాటలు ఖచ్చితంగా రాయలకు వీరి ద్వారా చేరతాయని గ్రహించి ‘’ఏం లేదు నిన్న రాణి చిన్నాదేవిగారి తో రాయలవారు ఏకాంతంగా ఉండగా ఆమె గబుక్కున తుమ్మారట . నా గుర్రం చాలా చెడ్డది ఆవిషయం ఎక్కడసకిలిస్తుందో అని మూతి బిగించాను .ఏదో పద్యాలురాసి పెద్దలకు విని పించే నాకెందుకండీ ఆ రహస్యాలు ఈ గుర్రం పెద్ద గడుగ్గాయి .ఆవిషయం బయట పెడితే మా గురువులకు తెలిస్తే వాళ్ళు చీవాట్లు పెడతారు ‘’అంటూ నీళ్ళు నములుతూ చెప్పాడు .వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ వెళ్ళిపోతే ,లింగడు ఇంటికి చేరాడు
వేగులద్వారా ఈవిషయం రాయలకు తెలిసి ,అంతఃపుర రహస్యాలకు ఆయనకు చేరి ప్రచారమవటం బాధ కలిగించినా గుర్రం మూతికి గుడ్డ బిగి౦చటాన్ని నవ్వకుండా ఉండలేకపోయాడు .అయినా గట్టిగా మందలించాలని అతని ముఖం తనకు చూపవద్దని చెప్పనికి భటులద్వారా వార్త ఇంటికి పంపాడు .దీనికి విరుగుడు ఆలోచించాడు ,రెండురోజులతర్వాత కొలువుకు రాయలు వస్తే దూరంగా మూడు పెద్దనామాలు కనిపిస్తే ఆశ్చర్యపోయి దొడ్డే నాయకుడిని విచారిస్తే కనుక్కుంటానని ఇద్దరు సైనికుల్ని లింగని ఇంటికి పంపితే ,లింగడు వీపుమీదపెద్ద పంగనామాలు పెట్టుకొని కూర్చున్న సంగతి రాయలకు చెబితే పగలబడి నవ్వాడు .
రామలింగని పిల్చుకు రమ్మన్నాడు రాయలు .వాళ్ళు వెడితే ‘’నా ముఖం చూపద్దన్నారు కనుక వెనక్కునడుస్తూ వీపు చూపుతూ వస్తాను ఆలస్యమౌతుందని చెప్పండి ‘’అని చెప్పి వాళ్ళవెంట వెనక్కి నడుస్తూ మూతికట్టు గుర్రం తో సహా సభాభవనానికి వెళ్ళాడు. అందరూ నవ్వారు .’’నాకు మీ వీపు చూపక్కర్లేదు ‘’అన్నాడు రాయలు .’’మహారాజా !శత్రురాజులే మీ పరాక్రమానికి వెన్ను చూపు తుంటే సామాన్యుడిని నేను ఎంతటి వాడిని ?’’అన్నాడు .రాయలు ‘’ఓడిన శత్రువు వెన్ను చూపుతాడు. ఓటమి ఎరుగని కవి వెన్ను చూపరాదు .ముందుకు తిరగండి ‘’అన్నాడు .ముందుకు తిరగగా ద్వాదశ ఊర్ధ్వ పు౦డ్రాలతో కనిపించేసరికి సభాభవనమంతా నవ్వులే నవ్వులు .అదీ తెనాలి రాముని మంటప కథ అని రామచంద్రగారి తాతగారు ఆయనకు చెప్పారట .
సశేషం
రేపు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-20-ఉయ్యూరు