గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30
28-వచన బాణం –భట్ట బాణుడు
హర్ష వర్ధన మహారాజు ఆస్థానకవి అయిన బాణ భట్టు ఏడవ శతాబ్దానికి చెందిన వాడు .606-647అసలుకాలం గా భావిస్తారు .స్థానేశ్వర అనిపిలువబడే నేటి కనోజ్ జన్మ స్థలం .హర్షుని జీవితచరిత్రను హర్ష హరిత్రగా రాశాడు .బాణుడి ‘’కాదంబరి ‘’జగత్ ప్రసిద్ధం .’’బట్ట బాణుని ముద్దు పట్టి కాదంబరి కధలు చెప్పు చెల్మి కత్తేనాకు ‘’అని తెలుగుకవి ప్రశంసలనందుకొన్నాడు బాణుడు .సంస్కృతం లో తోలి వచన కావ్యం కాదంబరి .ఈ కదా నవలను పూర్తీ చేయకుండానే మరణిస్తే కుమారుడు భూషణ భట్టు పూర్తీ చేశాడని అంటారు బాణుడు చండికా శతకం, పార్వతి పరిణయం నాటకం రాశాడని చెబుతారు .ఈ రెండు గ్రంధాలలో ఆయన చెప్పుకొన్న విషయాల వల్లనే జీవిత చరిత్ర తెలుస్తోంది .’’ముకుట తాడితం ‘’అనే నాటకాన్ని కూడా రాశాడని చంద్రపాలుడు ,గుణ విజయ గణులు చెప్పారు .కాని అది బాణ కృతం కాదు .పార్వతీ పరిణయం వామన భట్ట బాణుడు రాశాడంటారు .కాదంబరి మాటకు నానార్దాలున్నాయి –ఆడుకోయిల ,గోరింక, మద్యం .కోయిల గానం గా పరవశాన్ని కల్గిస్తుంది .గోరింక ళా ముచ్చటగా ఉంటుంది మద్యం లా హృదయానికి కిక్కు ఇస్తుందని సరదాగా మనం అర్ధం చెప్పుకోవచ్చు .
బాణుడి తండ్రి చిత్ర భాను తల్లి రాజా దేవి .హిరణ్య బాహు నదీ తీరం లో ఈ నాటి చాప్రా జిల్లాలోని ప్రీతి కూట లో పుట్టాడు .భోజక కుటుంబం లో వాత్సాయన గోత్ర సంభవుడు .దేశ సంచారం చేస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు .హర్షుడి తమ్ముడు కృష్ణుడు ఆహ్వానం పంపితే వెళ్ళాడు .మనితర లో ఉన్న హర్ష వర్ధనుడిని కలుసు కొన్నాడు .మూకాభినయం తో , కోపాభినయం తో హర్షుని మనసును ఆకర్షించాడు .ఈ నాటి ఔరంగా బాద్ లో హాస్పురా జిల్లాలోని పీరూ గ్రామం లో బాణుడు జన్మించాడని మరోకధనం .’’బాణోచ్చిస్టమిదం జగత్ ‘’అని లోకం లో సామెత ఉంది .అంటే బాణుడు ముట్టి వదలనిదేదీ లేదు .అనగా ఉన్నదంతా బాణుడు ఎంగిలి చేసి వదిలినదే అని భావం .దీనికి ఇంగ్లీష్ లో సమానమైన ఒక లోకోక్తి ఉంది ‘’he did not leave which he did not adorn ‘.సాక్షరం వాసు దేవ దీక్షితులు ,నేతా శర్మ ,కే కృష్ణ మూర్తి బాణుని జీవిత చరిత్ర రాశారు .ఆంద్ర పండితుడు ,కవి రాంభొట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారికి ‘’అభినవ భట్ట బాణుడు ‘’అనే బిరుదునిచ్చారు .
బాణ కవితా గీర్వాణం
ఒక్క కాదంబరి తోనే బాణుడు సుప్రసిద్దుడయ్యాడు .’’కాదంబరీ రసజ్ఞానానం ఆహారోపి న రోచతే ‘’అని ఒక లోకోక్తి ప్రచారం లో ఉంది .అంటే –కాదంబరి ని చదువుతుంటే ఎవరికీ అన్నం మీద కూడా ద్రుష్టి పోదు తినటం మర్చిపోతారు. బీహార్ లోని ఔరంగా బాద్ గ్రంధాలయం లో ఇప్పటికీ కాదంబరి సంస్కృత వ్రాత ప్రతి ఉంది .హర్షుడు బాణుడికి అనేక ప్రశంసలేకాక పురస్కార సన్మానాలు కూడా చేశాడు .బాణుడివచన శైలి మహా ప్రవాహం .అలంకారమయం చేశాడు కాదంబరిని .బాణ భాష కర్ణామృతం .ప్రాస పూరితమై హ్రుదయాహ్లాదిగా ఉంటుంది .బాణుడి విధానం తరువాతికవుల పై ప్రభావం చూపింది .ఆయన ధోరణిలో పడిపోయారు .బ్రాహ్మణ భావాలు, వైదిక సంస్కృతీ ప్రతి బిమ్బించేట్లు రచనలు చేశాడు .దీనికి అసూయ పడిన కొందరు ఇతర పండితులు హర్షుడికి బాణుడిపై చాడీలు చెప్పారు .కాని బాణుడు బెదరలేదు .రాజు స్వయం గా బాణుడిని ఆహ్వానించి నిజ నిర్ధారణ చేసుకోమన్నాడు .ధైర్యం గా తన జీవిత విధానాన్ని రాజుకు పూస గుచ్చినట్లు వివరించి రాజు మనసు దోచుకొని అభిమానాన్ని మరింత పొందాడు. గౌరవాలు లభించాయి .
అద్భుత కదా మంజరి కాదంబరి. కాదంబరీ చంద్రా పీడుల ,మహా శ్వేత ,పుండరీకుల ప్రేమ కధలు జోడింప బడ్డాయి చంద్రా పీడుడు పూర్వ జన్మ లో చంద్రుడు తర్వాత జన్మలో శూద్రక రాజు .పుండరీకుడు వైశంపాయనుడు ఇంకో జన్మ లో చిలుక .కాదంబరి మహాశ్వేత లకు ఒకే జనం చెప్పాడు .అంటే నాయికల కాలం లో నాయకులూ త్రిజన్ములైనారన్నమాట .నాయిక లిద్దరూ గంధర్వ రాకుమారికలు కాదంబరి చంద్రా పీడుడిని శ్వేత పుండరీకుని ప్రేమిస్తారు .విరహాన్ని భరించలేక పుండరీకుడు హరీ మంటాడు.మహా శ్వేత ఆత్మ హత్యకు పాల్పడుతుంది .ఇంతలో ఆకాశ వాణి చెప్పిన మాట విని ప్రయత్నాన్ని మానుతుంది .సన్యాసిని యై ప్రేమికుదడి కోసం ఎదురు చూస్తూంటుంది .చంద్రా పీడుడు తన స్నేహితుడు వైశంపాయనుడి చావు విని చనిపోయి ,శూద్రక రాజు గా పుడతాడు .పుండరీకుడు వైశంపాయనుడిగా పుడతాడు .మహాశ్వేతను చూసి మనసు పారేసుకొంటాడు . వైశంపాయనుడే పుండరీకుడు అని తెలియక చిలుక గా మారమని శపిస్తుంది .చిలకను లక్ష్మీదేవి శూద్రక రాజు దగ్గరకు చేరుస్తుంది .జాబాలి ముని దయ వలన పూర్వ జన్మ తెలుసుకొన్న చిలుక శూద్రుడికి చెబుతుంది. శూద్రకుడు ప్రాణాలు వదిలి కాదంబరి చే రక్షించ బడి చంద్రా చూడుడి కళేబరం లో ప్రవేశిస్తాడు .చిలుక పున్దరీకుడవుతాడు .నాయకులిద్దరూ నాయికలను కలుసుకొని వివాహం చేసుకొని సుఖ జీవనం గడుపుతారు .ఇదీ కాదంబరి లో మొత్తం కద .
కాడంబరిలో అద్భుత సంఘటనలున్నాయి .మానవ ,గాంధర్వ ,చంద్ర లోకాలలో కద జరగటం విశేషం.టెంపో బాగా నడిపాడు. ఉత్స్డుకత తో చదివే వాళ్ళు రోమాలు నిక్క బొడుచుకొని ఆశ్చర్య భరితులౌతారు. కల్పిత కధకు మహాద్భుత వచనాన్ని జోడించి హాయిగా చదివేట్లు రాశాడు .ఈ కద కదా సరిత్సాగరం లో ‘’మకరందికోపాఖ్యానం ‘’ఆధారం అని పిస్తుంది .
అనేక కదా మిశ్రమం గా ఉన్నా ,వర్ణనలతో ప్రాధాన్యాన్ని తగ్గకుండా రాయటం బాణుడి ప్రతిభ .అనేక జన్మల కధలు తమాషా గా ఉండి కధాగమనం మహా వేగం గా సాగిపోతుంది .ఎక్కడా విసుగు రాకుండా రాశాడు బాణుడు .అందుకే వచన రచనలో బాణుడు మేటి అనిపించాడు .బాణం లాగా దూసుకు పోయేట్లు రచన చేశాడు . మధుర ,అలౌకిక ప్రేమకే విలువ నిచ్చాడు .అశ్లీలం తాకని శృంగారం వర్ణించాడు .దివ్య ప్రేమకు పట్టం కట్టాడు .కామ వాంచలను ఎక్కడా చూపలేదు బాణుడు .ప్రేమలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి ఉత్క్రుస్టత సాధించాడు .కావ్యం లోకానికి మార్గ దర్శకం గా ఉండాలన్ని సామాజిక బాధ్యతా బానునిలో ప్రస్పుటం గా గోచరిస్తుంది .
బాణుడు ఎందుకు ఇప్పటకీ అభిమాన పాత్రుడయ్యాడు?అని ప్రశ్నించుకొంటే బాణుని శైలియే అంతటిపని చేసిందని తెలుస్తుంది .పొడవైన సమాసాల జోలికి వెళ్ళకుండా హ్రస్వ సమాసాలతో కూడిన ‘’పాంచాలీ ‘’శైలిని అవలింబించాడు.అదే అతని సక్సెస్ కు లాండ్ మార్క్ అయింది .బాణుడి శబ్దజ్ఞానం చూస్తె మహాశ్చర్యమేస్తుంది .శబ్దాన్ని అర్ధం తో సంయోజనం చేసిన తీరు ముచ్చట గొల్పుతుంది . క్లిష్ట మైన విషయాన్ని అయినా సరళ సుందరం గా వర్ణించి చెప్పగల నేర్పు బాణుడిది . వక్రోక్తికి పెద్ద పీట వేశాడు బాణుడు .వట్టి వక్రోక్తి మాత్రమె కాదు శ్లేష తో అనుపానం చేసి మహా సౌందర్యాన్ని కలిగించాడు .విరోదా భాస ,పరి సంఖ్య మొదలైన శ్లేష పై ఆధార పడిఉన్న అలంకారాలను వాడి రంజకత్వం సృష్టించాడు .వక్రోక్తి తో బాటు స్వభావోక్తికీ సమాన స్థానం చూపాడు. అంటే చక్కని సమ తుల్యతను పాదుకోల్పాడు రచనలో .కుంతకుడి వక్రోక్తి స్వభావోక్తి అలంకారాన్ని ‘’ఆలం కార్యం ‘’గా భావించాడు .కాని బాణుడు స్వభావోక్తిని ఆదరించి దాని గుణాన్ని మరింత పెంచాడు ..ఇంకొక తమాషా కూడా చేశాడు బాణుడు .ప్రతి అలంకారానికి ఆధారం గా స్వభావోక్తిని తీసుకొన్నాడు .అందుకే అసంభావ్యత కనిపించదు. అదీ అతని మహిమ .వక్రోక్తికి శ్లేష ,అతిశయోక్తులే బాగా రాణిస్తాయని అప్పటిదాకా భావించిన వారికి బాణుడు చేసిన ఈ ప్రయోగం దిమ్మ తిరిగేట్లు చేసింది .సహజ భావ సంపన్నుడు బాణుడు .వస్తువును కాని దృశ్యాన్ని కాని సన్నీ వేశాన్నిఆని ఒక చిత్రం గీసినట్లు అద్భుతం గా చిత్రించి వన్నె తెచ్చాడు .
‘’నవార్దో జాతిర గ్రామ్యో శ్లేషో క్లి స్టః స్పుటో రసః –వికటాక్షర బంధశ్చ కృత్స్న మేకత్ర దుష్కరం ‘’అని బాణుడు చెప్పాడు –అంటే ‘’కొత్త అర్ధం ,అశ్లీలం కాని స్వభావోక్తి ,రస స్పోరకం .వికటమైన అక్షర బంధం ,శ్లేష వీటన్నిటి సమాహారమే నా కవిత్వం లో చూడచ్చు ‘’అన్నాడు .సంస్కృతం మీద మోజున్న వారికి బాణ రచన నవ లోకాలను చూపిస్తుంది .అనేక మంది తర్వాత కవులు బాణుని శైలిని ప్రశంసలతో ముంచెత్తారు …
‘’జాతా శిఖండినీ ప్రాక్ యదా శిఖండీ తదావ గచ్చామి –ప్రాగల్భ్య మదిక మాప్తుం వాణీ బబాణో బభూవేత్ ‘’అని గోవర్ధనాచార్యుడు బాణుడిని సరస్వతీ అవతారం గా భావించాడు ‘’అధికమైన ప్రాగాల్భ్యాన్ని సాధించటానికి శిఖండిని శిఖండిగా మారిపోయినట్లు పురుష రూపంతో అతి చమత్కారం పొందాలని వాణి వాణ(బాణ ) రూపాన్ని ధరించింది .రాజ శేఖరుడు బాణుడి శబ్ద సౌందర్యాన్ని ,సుకుమార పద విన్యాసాన్ని శ్లాఘించాడు .ఒక అజ్ఞాతకవి ‘’బాణం గుచ్చుకొంటే ఊపిరి బయటికి రానట్లే, బాణుని కాదంబరి చదివిన తర్వాత ,కవులకు వాణి నోటినుంచి బయటికి రాదు అని చమత్కరించాడు .’’శబబ్డార్ధయోః సమో గుమ్ఫః పాంచాలీ రీతి రిష్యతే –శీలా భట్టారికా వాచిబాణోక్తిషు చసాయది’’.
ధర్మ దాసు బాణుని కవిత్వం రుచిరమైన వర్ణన ,పదాలతో కలిసి రసభావ పరిపూర్ణం గా ఉంది .తరుణ అయిన నాయిక లాగా రసిక హృదయాలను దోచు కోవటానికి సమర్ధత కలిగి ఉంది అన్నాడు –‘’రుచిరస్వర వర్ణ పదార రసభావ వతీజగన్మోహన రతి –సాకిం తరుణీ నహి నహి వాణీ బాణస్య మధుర శీలస్య ‘’.మరో కవి ‘’అలంకార ,సమాస భూయిష్టమైన బాణుని కవిత్వం విధ్యారణ్యం లాంటిది .దానిలో విహరించే కవి కుంజరాల (ఏనుగుల)గండ స్థలాలను చీల్చే సింహమే బాణకవి ‘’అని ఉత్ప్రేక్షించాడు .ఎవరేమి చెప్పినా అపూర్వ మైన మౌలిక మైన భావాలతో ,పిండి ఉండలా కాకుండా బాణ కవిత్వం నవీన అర్ధ శోభితం గా ప్రకాశిస్తుంది అని చెప్పటం లో సందేహమే లేదు .కాదంబరి అనేది నవలకు పర్యాయపదం గా నిలిచింది .పీటర్సన్ ,కానే లు సంస్కృత కాదంబరిని మొదటిసారిగా వెలువరించారు .కాలే ,లేన్ ,రిడ్డింగ్గ్ లు కాదంబరిని ఆంగ్లం లో అనువదించారు . ,తెలుగులో రెంటాల గోపాల కృష్ణ మొదలైన వారు . అనువదించారు
.
మరోకవితోకలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-14-ఉయ్యూరు